Friday, December 31, 2010
నాటకీయ రాజకీయాలు
తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమాలలో విద్యార్థులపైన పెట్టిన కేసులు ఉపసంహరించడానికి ఇంత డ్రామా అవసరమా? కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు నిరాహారదీక్ష చేయడం విడ్డూరం కాదా? హాస్యాస్పదం కాదా? సొంత ప్రభుత్వాల నిర్ణయాలను ప్రభావితం చేయడానికి వీధిపోరాటాలు చేయవలసి వస్తే ఇక పార్టీ వేదికలెందుకు? చర్చలూ, సమాలోచనలకు అర్థం ఏముంటుంది? కింది నుంచి పైకీ, పై నుంచి కిందికీ అభిప్రాయాలనూ, నిర్ణయాలనూ తెలుసుకునే పార్టీ వ్యవస్థ ప్రయోజనం ఏమిటి?
ఏమాటకు ఆ మాటే చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీలో మేధావిగా పరిగణించే రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే కేశవరావు నిజం చెప్పేశారు.
‘డిసెంబరు 9న, ఆ తర్వాత డిసెంబరు 23న కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనలతో విద్యార్థులను పురిగొల్పింది మేమే. వాళ్ళంతా రోడ్లపైకి వచ్చేలా చేసింది మేమే. వారిపై కేసులు నమోదు కావడానికి కారకులమూ మేమే. కాబట్టి కేసులను ఎత్తివేయించాల్సిన బాధ్యత కూడా మాదే’ అంటూ మంగళవారం మధ్యాహ్నం నిరాహార దీక్ష విరమించిన అనంతరం సెలవిచ్చారు. శభాష్. అన్నీ మేమేనని చెప్పుకోవడంలో అత్యుక్తి ఉన్నదేమో కానీ బాధ్యతను గుర్తెరగడంలో పొరపాటు లేదు. తెలంగాణ ఉద్యమ నాయకుడిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఎప్పటికప్పుడు బలపర్చుతున్నదీ మేమే అని కూడా కేకే చెప్పినా ఓకే అనవలసి వస్తుంది. అటు కేంద్ర ప్రభుత్వంపైనా, ఇటు రాష్ట్ర ప్రభుత్వంపైనా సమయం సందర్భం వచ్చినప్పుడల్లా ఒత్తిడి తేవడానికి ఉద్యమాలు చేయడమో, చేస్తామంటూ హెచ్చరించడమో తమ కర్తవ్యంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భావిస్తూ వచ్చారు. డిసెంబర్ 9న చిదంబరం ప్రకటన వెనుక కూడా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల పాత్ర, వారు అందించిన సమాచారం ప్రభావం ఎంతో కొంత ఉన్నదనే చెప్పుకోవాలి. ఆ తర్వాత ఘట్టంలో చెల్లియొ చెల్లకో అంటూ రాయబారం పద్యాలు చదివే వంతు సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులకు వచ్చింది. వారు సైతం తమ పాత్రను రసవత్తరంగా పోషించి రక్తికట్టించారు. సెప్టెంబర్ 17 తెలంగాణ వ్యవస్థాపక దినోత్సవం జరపాలన్నా, జరపరాదన్నా, సబ్ ఇన్ స్పెక్టర్ల పరీక్ష వాయిదా వేయాలన్నా, విద్యార్థులపైన కేసులు ఎత్తివేయాలన్నా తెలంగాణ ఉద్యమకారులతో పాటు సొంత సర్కార్ పైన ఒత్తిడి తెచ్చే బాధ్యత తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీలే నిర్వహిస్తున్నారు. టీఆర్ ఎస్ ఎజెండాను అమలు చేయడంలో శక్తివంచన లేకుండా చేయూత ఇస్తున్నారు.
‘మా ఎంపీలు నిరాహార దీక్ష ప్రారంభిస్తే మంచిదే కదా అనుకున్నాం. నాలుగు రోజులు దీక్ష కొనసాగిస్తే ఉద్యమం కాంగ్రెస్ చేతుల్లోకి వస్తుందని ఆశించాం. చివరికి మా వాళ్ళు కేసీఆర్ ని మరోసారి హీరోని చేశారు’ అంటూ పేరు బటయపెట్టడం ఇష్టం లేని ఒక కాంగ్రెస్ నాయకుడు వ్యాఖ్యానించాడు. అరకొర దీక్షలతో ఉద్యమం చేతిలోకి వస్తుందా? కొన్ని మాసాల కిందట అమరవీరుల సంస్మరణ అంటూ రెండు జిల్లాలలో జాతర జరిపి అర్ధంతరంగా ముగించిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు నిలకడగా ఉద్యమం చేసే కుదురు కానీ ఓపిక కానీ ఉన్నాయా? అయినా టీవీ న్యూస్ చానళ్ళు డజనుకు పైగా ఉండగా, ప్రకటనలతో భూకంపం సృష్టించే అవకాశం ఉండగా పర్యటనలూ, దీక్షలూ ఎందుకు దండగ!
మంగళవారం నాటి నాటకీయ పరిణామాలనే పరిశీలిస్తే కాంగ్రెస్ పార్టీ ఆత్మవంచనకూ, పరవంచనకూ ఎంతగా పాల్పడుతున్నదో, సెల్ఫ్ గోల్ ఎట్లా కొట్టుకుంటున్నదో ఇట్టే అర్థం అవుతుంది. ఒక వైపు ఎంపీలు నిరాహరదీక్ష రెండో రోజున కొనసాగిస్తుంటే మరో వైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గాంధీభవన్ లో సేవాదళ్ వేడుకలలో కాలక్షేపం చేశారు. మంత్రుల బృందం సచివాలయానికీ, దీక్షా శిబిరానికీ మధ్య తిరుగుతున్నారు. రైతులకు నష్ట పరిహారం పెంచాలంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాడు అదే చోట నిరాహారదీక్ష చేసినా మంత్రులు ఆయనను చూడటానికి అయిదు రోజుల దాకా వెళ్ళలేదు. కాంగ్రెస్ ఎంపీల చేత దీక్ష విరమింపజేయడానికి కొందరు మంత్రులు కాలికి బలపం కట్టుకొని తిరిగారు. దీక్షాశిబిరం దగ్గరికి కేసీఆర్, కోదండరామ్ లు వస్తున్నట్టు ఉదయం పదిగంటలకే తెలుసు. కేసీ ఆర్ వచ్చి ఘాటైన ఉపన్యాసం దంచి, కాంగ్రెస్ ఎంపీలను అభినందించి, శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోకపోతే పార్లమెంటు సభ్యత్వాలకు రాజీనామా చేయాలంటూ హెచ్చరించి వెళ్ళిపోయిన తర్వాత కానీ మంత్రులు జానారెడ్డి, సబితా రెడ్డి శుభవార్త మోసుకొని రాలేదు. కేసీఆర్ ప్రసంగిస్తుంటే కాంగ్రెస్ ఎంపీలందరూ బుద్ధిమంతుల్లాగా చేతులు కట్టుకొని నిలబడ్డారు. కేసుల ఎత్తివేత నిర్ణయాన్ని ప్రకటించవలసింది హోంమంత్రి హోదాలో సబితా ఇంద్రారెడ్డి. మరి జానారెడ్డి పాత్ర ఏమిటి? ఆయన ఎందుకు వచ్చారు? తెలంగాణకి చెందిన సీనియర్ మంత్రిగానా? ముఖ్యమంత్రి ప్రతినిధిగానా? విద్యార్థులపై కేసులు ఎత్తివేయించడంలో తన పాత్ర కూడా ఉన్నదని చాటుకోవడానికి కేసీఆర్ తో పాటు జానారెడ్డికి కూడా ఎంపీలు అవకాశం ఇచ్చారు.
అంతటితో నిరాహారదీక్ష అంకం ముగిసింది. మరో అంకానికి తెరలేవనుంది. డిసెంబరు తొమ్మిదో తేదీన దేశీయాంగ మంత్రి చిదంబరం తెలంగాణ ఏర్పాటు గురించి ప్రకటన చేయడానికి ముందూ, ఆ తర్వాతా పోటీ రాజకీయాలతో, రాజీనామాస్త్రాలతో, రాజీనామా బెదిరింపులతో, వీధిప్రదర్శనలతో, పోలీసు బలగాల మోహరింపులతో, నిరాహార దీక్షలతో, గుండెలదిరే ప్రసంగాలతో, పరీక్షల వాయిదాలతో, బంద్ లతో, బహిరంగసభలతో, ఎడతెగని ఉత్కంఠతో, అంతులేని ఉద్రిక్తతతో, వందలాది విద్యార్థుల, యువతీయువకుల ఆత్మహత్యలతో రాష్ట్ర ప్రజల జీవితాలు అస్తవ్యస్తమైనాయి. కొన్ని గంటలలో శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించనున్న ఈ దశలోనైనా అశాంతి రగలకుండా నిరోధించే ప్రయత్నం జరుగుతోందా? ప్రతిపక్షానికి చెందిన నాయకులు ఉద్యమం చేసినా, స్వపక్షానికి చెందిన నాయకులు వీధులలో ప్రదర్శనలు నిర్వహించినా నిమ్మకు నీరెక్కినట్టు కాంగ్రెస్ అధినాయకత్వం ఉపేక్షించడం వ్యూహం అనిపించుకుంటుందా? ఎత్తుగడ అవుతుందా? అసమర్థత అవుతుందా?
ఇంతకాలం ప్రధాని మన్మోహన్ సింగ్ మాత్రమే అసమర్థుడనే ప్రచారం జరిగింది. మానవేతిహాసంలో కనీవినీ అవినీతిని అనుమతించిన అపకీర్తిని కూడా ఆయన ఇటీవల మూటకట్టుకున్నాడు. అది సరే. మరి సోనియాంధీ సంగతి ఏమిటి? కాంగ్రెస్ వాదులు దేవతగా కొలిచే సోనియా ఏమి చేస్తున్నారు? భావి ప్రధానిగా మొన్న ఏఐసీసీ సమావేశంలో చిదంబరం, దిగ్విజయ్ సింగ్ వంటి మేధావులు కీర్తించిన రాహుల్ గాంధీ ఏమి చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీకి మిగిలిన ఒకే ఒక కంచుకోట ధ్వంసమైపోతుంటే అమ్మాకొడుకూ చేస్తున్న నిర్వాకం ఏమిటి? అమ్మ మౌనం వ్యూహాత్మకమా? అశక్తతకూ, ఊగిసలాటకూ నిదర్శనమా? చిదంబరం చిద్విలాసం ఆంతర్యం ఏమిటి? కిరణ్ కుమార్ రెడ్డి మనోగతం ఏమిటి? గవర్నర్ నరసింహన్ పాత్ర ఏమిటి? శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పిస్తున్న తరుణంలో ఈ ఆరుగురూ కీలకమైన భూమికను పోషించవలసి ఉంటుంది. నివేదిక సమర్పించిన తర్వాత తీసుకోవలసిన నిర్ణయాల గురించీ, నిర్ణయాలు అమలు చేయడానికి తీసుకోవలసిన చర్యల గురించి ఇప్పటికే ఆలోచించి ఉండాలి. లేకపోతే తక్షణం ఆ పని చేయాలి. ఏమి ఆలోచించి నిర్ణయించారో కానీ భారీగా భద్రతాదళాలను రాష్ట్రంలోకి రప్పించడం ప్రజలలో అభద్రతాభావాన్ని పెంచింది. అధిష్ఠానం అసమర్థత కారణంగా రాష్ట్ర ప్రజల జీవితాలను మరోసారి సంక్షోభానికి గురి చేయడం క్షమించరాని నేరం అవుతుంది. ఇంతవరకూ సాగిన అశాంతికీ, అనిశ్చితికీ, అరాచకానికీ బాధ్యత చాలావరకూ కేంద్ర ప్రభుత్వానిదే. జరగబోయే మంచిచెడులకు సైతం కేంద్రమే బాధ్యత వహించాలి. ఇతర పార్టీలను కానీ నాయకులను కానీ నిందించడం వల్ల ప్రయోజనం లేదు. సోనియాగాంధీ స్వయంగా చొరవ తీసుకొని నిర్ణయాత్మకంగా వ్యవహరించవలసిన సందర్భం ఇది. ఇంకా నాన్చకుండా ఏదో ఒక నిర్ణయం తీసుకొని అందరి సహకారంతో అమలు జరిపి అశాంతికి అస్కారం లేని వాతావరణం కల్పించవలసిన సమయమిది. ఇప్పటికీ మౌనంగా ఉంటే లేదా డోలాయమాన స్థితి కొనసాగిస్తే, కమిటీలతో తాత్సారం చేయాలని ప్రయత్నిస్తే ప్రజలకు తీరని ద్రోహం చేసినట్టు అవుతుంది. కాంగ్రెస్ పార్టీకి సైతం ఎనలేని అపకారం చేసినట్టు అవుతుంది. చెట్టు ఎక్కి మొదలు నరుక్కున్న చందం అవుతుంది..
(ఈ వ్యాసం శ్రీరామచంద్రమూర్తి గారు హెచ్ఎంటీవీ సంపాదకీయం "హంసధ్వని" కోసం 29-12-2010న రాశారు. శ్రీ మూర్తిగారి ఇటీవలి వ్యాసాలు మరిన్ని చూడాలనుకుంటే.. www.hmtvhamsadhwani.blogspot.com ని క్లిక్ చేయండి. - విజయ్, జర్నో ముచ్చట్లు - www.journomucchatlu.blogspot.com)
Thursday, December 30, 2010
హై క్యా నామ్ ఆప్ కా..?
ఇంతకీ ఫ్లాష్‌బ్యాక్ ఏంటంటే.. నేను ఐదో తరగతి చదువుతున్నప్పడు ట్యూషన్‌కి వెళ్లేవాళ్లం. అప్పుడు నేను, మా ఈశ్వర్, చిన్నలచ్చి, వరాలు, కృష్ణవేణి ఆ ట్యూషన్ మేట్స్‌మి. ఓరోజు ట్యూషన్ మాస్టారు ఇంగ్లీషులో ప్రశ్నలు వేసి సమాధానాలు రాబడుతున్నారు. కృష్ణవేణిని లేపి.. వాటీజ్ యువర్ నేమ్ అని అడిగారు. ఆ అమ్మాయి ఠపీమని.. మైనేమ్ ఈజ్ కృష్ణవేణి అని సమాధానం చెప్పింది. ఆ వెంటనే (అసలు తెలుగులోనే దద్దూగాడైన) మా ఈశ్వర్ని లేపి.. వాటీజ్ యువర్ నేమ్ అని అడిగారు. క్షణం కూడా ఆలోచించకుండా.. మా వాడు మైనేమ్ ఈజ్ కృష్ణవేణి అని సమాధానం చెప్పేశాడు. (బహుశా దేశ తొలి ప్రధాని ఎవరు అన్న ప్రశ్నకు ఒకే సమాధానం ఉంటుందే అలా అనుకున్నట్టున్నాడు పాపం) ఇక ట్యూషన్ మొత్తం నవ్వులు విరబూశాయి. అప్పటినుంచి, ఇప్పటివరకూ మా ఈశ్వర్ని కలవగానే ఆ ఘట్టం నా స్మృతి పథంలో మెదులుతుంది. అప్రయత్నంగా వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్న ప్రశ్న నోటినుంచి వచ్చేస్తుంది. మావాడు ఇప్పటికీ తేలిగ్గా నవ్వేస్తూ మై నేమ్ ఈజ్ కృష్ణవేణి అనే సమాధానం చెబుతాడు.
ఇదే క్రమంలో నాకు మరో బంధువు వేంకటేశ్వర్లు. ఈయన నాకు మామయ్య వరుస అవుతాడు. వయసులో ఆట్టే అంతరం లేదు. తను హిందీలో పరమ పూర్. ఒక్క అక్షరం ముక్కా అర్థమై చావదు అని హిందీని, హిందీ మాస్టార్ని తెగ తిట్టిపోసేవాడు. అట్లాంటివాడు.. పరీక్షల్ని భలే గమ్మత్తుగా ఫేస్ చేసేవాడు. ప్రశ్నని వెనక నుంచి ముందుకి.. అందులోని పదాలనే అటు ఇటు తిప్పి సమాధానాలు రాసి వచ్చేవాడు. ఆ క్రమంలో నాకు బాగా గుర్తుండి పోయిన మా మామయ్య "ప్రశ్న-సమాధానం" ఇది :
ఆప్కా నామ్ క్యా హై..?
హై క్యా నామ్ ఆప్కా..?
మా ఎమ్మిగనూరులో ముస్లింల భాష భలే సరదాగా ఉంటుంది. మా బషీర్ బావ.. తన కొడుకుతో ఎట్లా మాట్లాడుతుండేవాడో ఓసారి పరిశీలించండి :
క్యారే ఉస్ సే పూఛ్కే ఆయా క్యా.. ..? (ఏరా వాడిని అడిగి వచ్చావా..?)
ఆ పూచా ( ఆ అడిగా..? )
క్యా పూచా..?
అన్నా దుడ్లియ్యల్లంట అని పూచా.. (దుడ్లు అంటే డబ్బు)
ఉన్ క్యా బోలా..? (వాడేమన్నాడు..?)
రేపిస్తాను బోలా..?
అరే మాకీ... ధబానా నై.. (అరే నీయ... దబాయించొద్దా..?)
దబాయా... (దబాయించినా..)
క్యా దబాయా... (ఏమి దబాయించినావ్)
లేదన్నా మానాయన తిడతాడు.. ఈ ఫొద్దే ఇయ్యల్లంట బోలా..!
ఫిర్ ఓ క్యా బోలా..?
లేదప్పా ఉంటే ఇయ్యనా..? బుధవారమిస్తానని చెప్పు బోల్కే బోలా..
అరే మాకీ.. పైసా వసూల్ కర్నే నై ఆతారే తుమ్కో.. షరమ్నై.. కైసా జీతాకీ కైసా మర్తాకీ... ఛల్
ఎందుకో ఈ మధ్య తరచూ ఇట్లాంటి ఘటనలు పదే పదే గుర్తొస్తున్నాయి. ఇవిఆనందాన్ని కలిగించడంతో పాటు గుండెనూ బరువెక్కిస్తాయి. జన్మభూమిని, ఆత్మీయులనే కాదు అంతులేని ఆనందాన్ని అక్కడే వదిలి, ఉద్యోగం కోసం ఊరూరూ తిరుగుతూ పోతున్నాను. మళ్లీ నేను పుట్టినూరికి శాశ్వతంగా ఎప్పుడు వెళతానో ఏంటో..? మా అబ్బాయి జీవితం ఓ దారికొచ్చాక.. ఆ ఊళ్లో స్థిరనివాసం గురించిన ప్రయత్నాలు చేయాలి.
Tuesday, December 28, 2010
నిందించాల్సిందీ.. నిలేయాల్సింది.. ఎవరిని..?

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత ఎంపీలు ఒక్కతాటిపైకి వచ్చి నిరాహార దీక్షకు కూర్చోగానే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో విద్యార్థులపై ఉన్న కేసులన్నింటి ఎత్తివేయాలని నిర్ణయించింది. ఇదే అంశంపై అసెంబ్లీలో... అన్ని పార్టీలు నెత్తీ నోరు బాదుకున్నా కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు స్పందించలేదు. చివరికి తమ పార్టీ ఎంపీలే నిరాహార దీక్షకు కూర్చునే సరికి.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఎంపీల దీక్షలు 28 గంటలు సాగాయో లేదో ప్రభుత్వంలో తీవ్రమైన కదలిక వచ్చింది. పది పదిహేను సార్లు దఫదఫాలుగా చర్చోపచర్చలు సాగించి.. ఈ నిర్ణయం తీసుకుంది. మంత్రులు జానారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలను పంపి.. సర్కారు నిర్ణయాన్ని తెలిపి ఎంపీలతో దీక్షలు విరమింప చేసింది.
మరి రాష్ట్ర విభజన అంశంపై వీరు ఎందుకు ఇలాంటి దీక్షలకు కూర్చోరు..?
ఓ వెర్రి నవ్వు నవ్వి.. పక్కకు తప్పుకోబోయేలోగా.. అటువైపు ఛాంబర్ దగ్గరున్న సీమాంధ్ర మిత్రుల గుసగుసలు వినిపించాయి..? ఏంటా అని ఆరా తీస్తే.. వారూ కాంగ్రెస్ ఎంపీల దీక్షలు.. ప్రభుత్వ స్పందన మీదే మాట్లాడుతున్నారు. టిఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావుకు ఆ మాత్రం తెలియకుండా ఎలా ఉంటుంది..? అన్నది వారి ప్రశ్న. కాంగ్రెస్ ఎంపీలు 24 గంటలు రోడ్డుమీద కూర్చోగానే, ప్రభుత్వం స్పందించింది. దీన్ని బట్టి ఎవరిపై ఒత్తిడి తెస్తే పనవుతుందో అర్థమవుతోంది. కాంగ్రెస్ నాయకులు తలచుకుంటే.. ఏదైనా సాధించుకురాగలరు. పంతం పడితే వారికి అసాధ్యమన్నది లేదు అన్నది ఇవాళ్టి దీక్షలతో అర్థమై పోయింది. మరి అంతటి శక్తిమంతమైన కాంగ్రెస్ వాళ్లని వదిలేసి.. కెసిఆర్‌గారు, చంద్రబాబునాయుడిని, తెలుగుదేశం పార్టీ నాయకుల్నే ఎందుకు పనిగట్టుకుని తిడుతుంటారు..? అన్నది సీమాంధ్ర మిత్రులు సంధించిన ప్రశ్న.
ఎవరి వాదన వారిది..? ఎవరి ప్రశ్నలు వారివి..? వీటికి విక్రమార్కుడు కూడా సమాధానం చెప్పలేడేమో. ఇంతకీ ఈ ఎపిసోడ్స్‌లో నిందించాల్సిందీ.. నిలేయాల్సింది ఎవరిని..? ఏమో..! కాలమే చెప్పాలి.
Sunday, December 26, 2010
ఈ జగన్నాటకం పరమార్థమేంటో..!
పులి
మంత్రి పదవిని పొందాక జగన్‌తో సయోధ్య కోసం.. అసలు ఏ పరిస్థితుల్లో మంత్రి పదవిని తీసుకోవాల్సి వచ్చిందో వివరించేందుకు వివేకానందరెడ్డి ప్రయత్నించినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే.. జగన్ గానీ, ఆయన వర్గం గానీ బాబాయిని దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. జగన్ ఇంటికి వచ్చినప్పుడు నిరసనలు కూడా వ్యక్తం చేశారు. ఈ దశలో.. వివేకా కడప మార్క్ ఆవేశంతో మీసాలు మెలేయడం కూడా ఇంకా స్మృతిపథం నుంచి తొలగిపోలేదు.
దీనికి తోడు.. మొన్న పులివెందులలో.. జగన్‌కి వ్యతిరేకంగా వివేకానందరెడ్డి వర్గం పంపిణీ చేసిన కరపత్రాలు వారి మధ్య దూరాన్ని బాగా దూరం చేశాయి. పదవీ లాలసతో బాబాయిని బలి చేయలేదా..? అసలు కుటుంబాన్ని చీల్చింది ఎవరు..? కాంగ్రెస్ అధిష్ఠానం ఓదార్పు యాత్రను ఎప్పుడు వద్దని చెప్పింది..? మందీ మార్బలంతో జైత్రయాత్రలా చేసినప్పుడు కాదా..? అని ఆ కరపత్రంలో జగన్‌ను లక్ష్యంగా చేసుకుని తిట్టిపోశారు. ఇదంతా వివేకా అనుమతితోనే సాగిందని ప్రచారం సాగింది.
అయితే.. ఉన్నట్టుండి సీన్ మారింది. క్రిస్మస్ సందర్భంగా.. బాబాయ్-అబ్బాయ్ లు ఇద్దరూ కలిసి పోయారు.

ఇదంతా విన్న తర్వాత.. బాబాయ్-అబ్బాయ్ లది జగన్నాటకమా? అధిష్ఠానాన్ని పూర్తిగా దూరం చేసుకోకుండా, ఓ మార్గం ఉండేలా వేసిన ఓ ఎత్తుగడా..? అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో.. క్రిస్మస్ సందర్భంగా తాను అన్న మాటలపై వివేకా హడావుడిగా వివరణ కూడా ఇచ్చుకున్నారు. తాను కాంగ్రెస్ అధిష్ఠానానికి, ముఖ్యంగా సోనియా గాంధీకి వీరవిధేయుడినని.. అనుమానాలను నివృత్తిచేసేందుకే దీన్ని చెబుతున్నానని వివేకా చెప్పారు.
మొత్తానికి పులివెందుల వేదికపై " బాబాయ్-అబ్బాయ్" ల "శత్రుత్వాలు.. ఆత్మీయతానుబంధాలు" ఓ మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాను చూస్తున్న ఫీల్‌ని ఇస్తోంది. వీరిద్దరి మధ్య బంధాలు..అనుబంధాలు మరెన్ని మలుపులు తిరుగుతాయో.. ఎలాంటి క్లైమాక్స్‌కు చేరతాయో.. కాలమే చెప్పాలి.
Saturday, December 25, 2010
గ్లౌ అంటే చంద్రుడు...క్ష్వింక అంటే ఎర్రమూతి కోతి
క్లో : క్లోమము = కడుపులో ఓ పక్కనుండెడి ఎర్రని మాంసం
క్వి : క్విట్రెంటు = మాన్యముల మీద వచ్చే అల్పమైన పన్ను
క్ష్ణు : క్ష్ణుతము = వాడిగా చేసినది
క్ష్వి : క్ష్వింక = ఎర్రని ముఖం కల కోతి
ఖ్యా : ఖ్యాతి/ఖ్యాతము = ప్రసిద్ధి, వాసి
గ్ల : గ్లహము = జూదంలోని పందెము
గ్లౌ : గ్లౌ = చంద్రుడు
ఛో : ఛోటిక = చోటిక
ఝీ : ఝీరుక = ఈలపురుగు, ఝిల్లి, తుడిచే వస్త్రము
టూ : టూకి = సంగ్రహము
ఠీ : ఠీవి = వైభవము
ఠే : ఠేవ = అంగీకారము, విధము
ఠో : ఠోలా = తెగ, సమూహము
డూ : డూయు : దూయు యొక్క రూపాంతరం
డై : డైరీ = డైలీ, దినచర్య
డౌ : డౌలు = డవులు, మదింపు, రీతి
డ్రె : డ్రెస్సరు = సహాయ వైద్యుడు
ఢో : ఢోలము = డోలు
త్ర్యూ : త్ర్యూషణం = సొంటి, పిప్పిలి మిరియాలు
త్వా : త్వాదృశము = నీవంటిది
త్స : త్సరువు = కత్తి పిడి
ద్యా : ద్యావాపృథవులు = మిన్ను మన్ను
ద్యూ : ద్యూతము = జూదము
ద్రి : ద్రిండు = దిండు యొక్క రూపాంతరము
ద్రూ : ద్రూణము = ఎర్రతేలు
ద్రొ : ద్రొబ్బు = పడద్రోయు = పడవేయు
ద్రౌ : ద్రౌణికము = పొలము
ద్వ్య : ద్వ్యష్టము = తామ్రము, రాగి
ధ్యే : ధ్యేయము : ధ్యాతవ్యము, ధ్యానింప తగినది
న్యూ : న్యూనము = తక్కువైనది, నిందింప తగినది
ప్రై : ప్రైషణము = ప్రేషణము = మర్దనము, క్లేశము, ఉన్మాదము
ప్లా : ప్లాక్షము = రావిచెట్టు పండు
ప్లో : ప్లోషము = కాల్చుట, ప్రోషము
ఫీ : ఫీజు = రుసుము
ఫ్లా : ఫ్లానెలు = ఉన్నివస్త్రము
ఫ్సా : ఫ్సాతము = భక్షింప తగినది (తినదగ్గది)
బ్లా : బ్లాంకెటు = బనాతు పచ్చడము (బనాతు=ఉన్నిబట్ట, పచ్చడము = దుప్పటి)
భ్రౌ : భ్రౌషము = తను చేయాల్సిన పని నుండి వైదొలగడము
మ్లి : మ్లిష్టము = స్పష్టం కానిది, వాడినది
యొ : యొక్క = శేష షష్ఠి యందు వచ్చే ప్రత్యయము
ఱై : ఱైక = ఱవిక
వో : వోఢ = తేరు గడపు వాడు, మోపరి
వ్రై : వ్రైహేయము : వ్రీహి పంట పెట్టదగిన పొలము (వ్రీహి : వడ్లు)
శొ : శొంఠి = శుంఠికి గ్రామ్య రూపము
శ్చ్యో : శ్చ్యోతము = జలాది ధార, కాఱుట
శ్యో : శ్యోనాకము = దుండిగము చెట్టు
శ్రి : శ్రితుడు = ఆశ్రితుడు, సేవితుడు
శ్రై : శ్రైష్ఠ్యము = శ్రేష్ఠత్వము, మేలిమి
శ్లి : శ్లిష్టము = శ్లేషతో కూడినది
శ్లీ : శ్లీలము = సంపదగలది
శ్లో : శ్లోకము = సంస్కృత పద్యం, కీర్తి
షు : షురువు = ఆరంభం
షో : షోడశము = పదహారు
స్టా : స్టాంపు = ముద్ర వేసిన కాగితము
స్టీ : స్టీమరు = పొగబండి
స్టే : స్టేషన్ = ఉండు చోటు
స్తి : స్తిమితము = కదలనిది, తడిసినది
స్తూ : స్తూపము = మట్టి మొదలగు వాని దిబ్బ
స్తై : స్తైన్యము = దొంగతనము
స్త్రై : స్త్రైణము = స్త్రీ స్వభావము, స్త్రీ సంబంధమైనది
స్థై : స్థైర్యము = స్థిరత్వము, జాపత్రి
స్నై : స్నైగ్ధ్యము = స్నిగ్ధ భావము, స్నేహము
స్ప్ర : స్ప్రష్ట = తపింప చేయు రోగము
స్ఫీ : స్ఫీతము = అధికమైనది
స్ఫే : స్ఫేష్ఠము =మిక్కిలి, అధికమైనది
స్మే : స్మేరము = కొంచెం నవ్వునది (చిరు మందహాసి), వికసించినది
స్లే : స్లేటు = రాతి పలక
స్వి : స్విన్నము = స్వేదం (చెమట) తో కూడినది
హ్రా : హ్రాదిని = వజ్రాయుధం, ఏరు, మెఱపు
హ్రి : హ్రిణీయ = సిగ్గు, రోత
హ్రే : హ్రేష = హేష, గుర్రం సకిలింత
హ్లా : హ్లాదనం = సంతోషించుట, సంతోషం
విస్మయం..!!

ఆపరేషన్ గ్రీన్ హంట్ తాలూకు ప్రభావం రాజ్యంలోని అన్ని వర్గాలపైనా పడుతున్నదనడానికి నిదర్శనంగా జస్టిస్ వర్మ తన తీర్పులో ప్రస్తావించిన అంశాలను పేర్కొనవచ్చు. ఉగ్రవాదులూ, మావోయిస్టులూ విచక్షణరహితంగా పోలీసులనూ, సాయుధ బలగాలనూ, అమాయక గిరిజనులనూ చంపుతూ దేశం అంతటా భయాన్నీ, బీభత్సాన్ని, అవ్యవస్థనూ వ్యాపింపజేస్తున్న కారణంగా నిందితులను ఉపేక్షించరాదంటూ జస్టిస్ వర్మ వ్యాఖ్యానించారు. డాక్టర్ సేన్ కు ఉన్నత న్యాయస్థానం రెండేళ్లుగా బెయిలు మంజూరు చేయడానికి నిరాకరించడం సైతం ఈ మానసిక స్థితికి అద్దం పడుతోంది.
ఎన్ కౌంటర్ జగినట్టు ప్రజలను నమ్మించడానికి పోలీసులు సర్వసాధారణంగా ఎటువంటి పనులు చేస్తారో ప్రజలకు మూడున్నర దశాబ్దాలుగా తెలిసిందే. డాక్టర్ సేన్ రాజద్రోహానికి ఒడిగట్టాడని న్యాయస్థానాన్ని ఒప్పించేందుకు దాదాపుగా అటువంటి పనులే చేయడం విశేషం. పోలీసులు సాక్ష్యాధారాలను సృష్టించారనీ, కీలకమైన సాక్షులు ఎదురు తిరిగేట్టు చేశారనీ, దొంగ పత్రాలను సృష్టించారనే ఆరోపణలు అనేకం వచ్చాయి. డాక్టర్ సేన్ భార్య ప్రొఫెసర్ ఇలీనా సేన్ ఢిల్లీలోని ఇండియన్ సోషల్ ఇన్ స్టిట్యూట్(ఐఎస్ఐ) లో పని చేస్తున్న ఒక వైద్యుడికి ఇంటర్నెట్ లో మెయిల్ పంపితే పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ ఐకి మెయిల్ పంపినట్టు అన్వయించడం, ఐఎస్ఐతో డాక్టర్ సేన్ కు సంబంధాలు ఉన్నట్టు నిర్థారించడం ఏ రకమైన న్యాయమో తెలియదు. అదే విధంగా అమెరికా శ్వేతభవనంలో నివసిస్తున్న వ్యక్తిని చింపాంజీగా అభివర్ణించడాన్ని కూడా న్యాయస్థానం నేరంగా పరిగణించింది. చింపాంజీ అన్నది ఉగ్రవాదుల సంకేతభాష అంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసిన వాదనను న్యాయమూర్తి జస్టిస్ బీపీ వర్మ అంగీకరించడం విడ్డూరం.
మావోయిస్టులతో కలిసి డాక్టర్ సేన్ రాజద్రోహానికి పాల్పడుతున్నారని నిరూపించడానికి మావోయిస్టు నాయకుడిగా ముద్రవేసిన నారాయణ్ సన్యాల్ తో సేన్ కు సంబంధాలు ఉన్నాయని ప్రాసిక్యూషన్ వాదించింది. రాయపూర్ జైలులో 2006 నుంచీ ఖైదీగా ఉన్న నారాయణ్ సన్యాల్ ను కలుసుకోవడాన్ని మావోయిస్టులకు సహాయం చేయడంగా పరిగణించడంలో అర్థం లేదు. పౌరహక్కుల నేతగా డాక్టర్ సేన్ సన్యాల్ ను జైలులో కలుసుకున్న ప్రతిసారీ వారిద్దరూ అధికారుల సమక్షంలోనే మాట్లాడుకున్నారు. రహస్య సమాలోచన జరిపింది లేదు. ఈ సంగతి జైలు అధికారులే స్వయంగా కోర్టులో చెప్పారు. పోలీసు కేసులో పసలేదని డిఫెన్స్ లాయరు చేసిన వాదనను న్యాయమూర్తి పట్టించుకోలేదు.
చత్తీస్ గఢ్ ప్రజలకు వైద్య సేవలు అందడం లేదనీ, మావోయిస్టులకూ, పోలీసులకూ మధ్య జరుగుతున్న పోరాటం కారణంగా వైద్యులు అక్కడ నివాసం ఏర్పరచుకొని పేదలకు వైద్యం చేయడానికి సిద్ధంగా లేరనీ ప్రముఖ రచయిత్రి అరుంధతీరాయ్ కొన్ని మాసాల కిందట మావోయిస్టులతో కలిసి నడిచిన తర్వాత వెల్లడించారు. పేద గిరిజనులను ప్రభుత్వాలు పట్టించుకోవు. పట్టించుకున్న మానవతావాదులను సహించలేవు. వేలమంది మరణానికి కారకులైన భోపాల్ కార్బయిడ్ సంస్థ అధికారులకు 1984లో రెండుమూడేళ్లు శిక్ష విధించిన న్యాయవ్యవస్థ పేద గరిజనులకోసం పరితపించిన హక్కుల నేతకు యావజ్జీవ కారాగార శిక్ష విధించడం ఎటువంటి మానసిక స్థితిని సూచిస్తున్నదంటూ అరుంధతి అడిగిన ప్రశ్నకు సమాజం సమాధానం చెప్పుకోవాలి. ఎటువంటి రాజ్య స్వభావాన్ని ఈ తీర్పు వెల్లడిస్తున్నదో తెలుసుకోవాలి. వెంటనే ఉన్నత న్యాయస్థానానికి అప్పీలు చేసుకోవడానికి వ్యవధి లేకుండా హైకోర్టు సెలవలు ప్రారంభం కాబోయే సమయంలో తీర్పు వెలువరించడంలోని ఆంతర్యాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రజాస్వామ్య ప్రియులందరూ డాక్టర్ సేన్ కు సంఘీభావం ప్రకటించవలసిన సందర్భం ఇది. చత్తీస్ గఢ్ సర్కార్, పోలీసులు చేస్తున్న బూటకపు వాదనలను ఖండించవలసిన సమయమిది. డాక్టర్ సేన్ వంటి మానవతావాదికి కోర్టు జైలు శిక్ష విధించిన పక్షంలో మావోయిస్టులూ, పోలీసుల మధ్య సంఘర్షణ జరుగుతున్న ప్రాంతాలలో వైద్య సహాయం లేక రాలిపోతున్న గిరిజనులను రక్షించడానికి ఏ వైద్యుడూ ముందుకు రాడు. రాక్షస చట్టాలనూ, హక్కుల ఉల్లంఘననూ ప్రశ్రించడం కారాగారవాసానికి దారి తీస్తుందంటే ప్రభుత్వాల, పోలీసుల అరాచకలను ప్రశ్నించే సాహసం ఎవ్వరూ చేయరు. పాలకుల నిరంకుశ ధోరణులకూ, అప్రజాస్వామిక విధానాలకూ అడ్డూఅదుపూ లేకుండా పోతాయి. పౌరులు కోరుకునే చట్టపాలన చట్టుబండలైపోతుంది.
(ఈ వ్యాసాన్ని hmtv చీఫ్ ఎడిటర్ శ్రీ రామచంద్రమూర్తి గారు "హంసధ్వని" సంపాదకీయం కోసం రాశారు. శ్రీ మూర్తి గారి ఇతర "హంసధ్వని " వ్యాసాల కోసం www.hmtvhamsadhwani.blogspot.com
కేరళ భీష్ముడు పరమపదించారు..

తొంభై మూడు సంవత్సరాల నిండు జీవితం గడిపి పండులాగా రాలిపోయిన కరుణాకరణ్ ను కేరళ రాజకీయవాదులు ‘లీడర్’ అని పిలుస్తారు. అవును. అక్షరాలా కరుణాకరణ్ పదహారణాల లీడరే. ముందుండి పార్టీని నడిపించినవాడే. నిరంతరం పోరాడుతూ, పడుతూ లేస్తూ, దెబ్బలు కొడుతూ దెబ్బలు తింటూ, కలబడుతూ ముందుకు సాగినవాడే. నాలుగు తరాల నెహ్రూ-గాంధీ వంశానికి చెందిన అధినాయకులతో కలసి పని చేసిన పాతతరం నేతలలో బహుశా కరుణాకరణ్ చివరివాడు కావచ్చు. జవాహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్, సోనియాల నాయకత్వంలో కాంగ్రెస్ నాయకుడిగా కరుణాకరణ్ పార్టీకి సేవలందించారు. ఇందిరాగాంధీతో ఆయన అనుబంధం బలమైనది. 2005లో సోనియాతో విభేదాల కారణంగా కాంగ్రెస్ ని వీడి సొంత కుంపటి పెట్టుకోవలసి అవసరం వచ్చినప్పుడు కూడా తన పార్టీకి ఇందిరమ్మపేరే పెట్టుకున్నాడు. ఆత్యయిక పరిస్థితి కారణంగా ఇందిర అప్రతిష్ఠపాలైన సందర్భంలో 1977లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఘనవిజయం సాధించిన ఘనత కరుణాకరణ్ ది. కేరళ అసెంబ్లీలోని మొత్తం 140 శాసనసభ స్థానాలలో 111 స్థానాలను గెలుచుకోవడమే కాకుండా ఉన్న ఇరవై లోక్ సభ స్థానాలనూ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీని చీల్చిన రెండు సందర్భాలలోనూ కరుణాకరణ్ ఆమె వెంటే ఉన్నాడు. 1991లో రాజీవ్ హత్య కారణంగా కాంగ్రెస్ లో ఏర్పడిన గందరగోళ పరిస్థితిని చక్కదిద్దిన సీనియర్ నాయకుడు కరుణాకరణ్. అర్జున్ సింగ్, శరద్ పవార్, ప్రణబ్ ముఖర్జీ వంటి హేమాహేమీలను కాదని పీవీ నరసింహారావును ప్రధానిగా చేసేందుకు సోనియాను ఒప్పించి, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసిన నాయకుడు కరుణాకరణ్. పీవీని ప్రధాని గద్దెపైన కూర్చోబెట్టడమే కాకుండా పీవీ ప్రభుత్వంపైన అవిశ్వాసతీర్మానంపై జరిగిన ఓటింగ్ లో ప్రభుత్వం కూలకుండా కాపాడిన కీర్తీ, అపకీర్తీ కూడా కరుణాకరణ్ దే. అవిశ్వాసతీర్మానాన్ని ఓడించి ప్రభుత్వాన్ని అయిదేళ్ళూ నడపడంలో సహకరించినందుకూ, ఆర్థిక సంస్కరణల అమలుకు పీపీ సర్కార్ లో పరిశ్రమల మంత్రిగా ఉంటూ దోహదం చేసినందుకూ కీర్తి దక్కింది. ప్రభుత్వాన్ని రక్షించేందుకు ఢిల్లీ వీధులలో జీపులో బూటాసింగ్ తో కలిసి తిరుగుతూ జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన పార్లమెంటు సభ్యులను నగదు చెల్లించి కొనుగోలు చేయడంలో పాలుపంచుకున్నందుకు కరుణాకరణ్ అపకీర్తి మూటగట్టుకోవలసి వచ్చింది.
పాతతరం వారికి రాజన్ అనే కోజికోడ్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి అదృశ్యం కేసు గుర్తు ఉంటుంది. ఆత్యయిక పరిస్థితిలో రాజన్ ను పోలీసులు అపహరించి, హింసించి, చంపివేశారన్న ఆరోపణలు దేశాన్ని అట్టుడిగించినప్పుడు కేరళ హోంమంత్రిగా కరుణాకరణ్ ఉన్నాడు. ఈ కేసులో న్యాయస్థానం చేసిన వ్యాఖ్యల కారణంగా పదవి కోల్పోయాడు. 1977లో ప్రమాణం చేసిన తర్వాత నెలరోజులకే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. కరుణాకరణ్ రాజకీయ జీవితానికి మచ్చ తెచ్చిన మరో ఉదంతం కుమారుడు మురళీథరన్ ను ముఖ్యమంత్రి చేయాలన్న ఆరాటం. పార్లమెంటు సభ్యుడిగా, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా చేయగలిగాడు కానీ ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టలేకపోయాడు. ఈ కారణంగానే తన కుడిభుజంలాగా రాజకీయాలలో ఎదిగిన ఏకే ఆంటోనీతో తలబడవలసి వచ్చింది. ఊమెన్ చాందీ, వయలార్ రవి వంటి శిష్యులను దూరం చేసుకోవలసి వచ్చింది. ఈ కారణంగానే సోనియాతో విభేదించవలసి వచ్చింది. అందుకే కాంగ్రెస్ పార్టీ నుంచి నిష్క్రమించి ఇందిరా కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీని నెలకొల్పవలసి వచ్చింది. తాత్కాలిక ఆగ్రహావేశాలతో సొంత పార్టీ పెట్టినప్పటికీ తాను జీవితాంతం కాంగ్రెస్ వాదినేనని కరుణాకరణ్ కు తెలుసు. కాంగ్రెస్ వాదిగానే ఏడుసార్లు కేరళ శాసనసభకు ఎన్నికైనాడు. నాలుగు విడతల కేరళ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. రెండు సార్లు లోక్ సభకూ, మూడు పర్యాయాలు రాజ్యసభకూ ఎన్నికైనాడు. 1967లో కేరళ శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి మూడే మూడు స్థానాలు ఉండేవి. ఈ సంఖ్యను 1970నాటికి ముప్పయ్ కి పెంచడంలో కరుణాకరణ్ ది ప్రధాన పాత్ర. 1977లో కమ్మూనిస్టు కూటమికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకత్వంలో యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ ను ఏర్పాడు చేసిన నాయకుడు కరుణాకరణ్. 1970 నుంచి కేరళలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర రాయాలంటే కరుణాకరణ్ కు పెద్ద అధ్యాయమే కేటాయించాలి. ఆయన జీవితం కాంగ్రెస్ తో పెనవేసుకుపోయింది. అందుకే కుమార్తె పద్మజతో కలిసి చివరికి కాంగ్రెస్ పార్టీకి తిరిగి వచ్చాడు.
కరుణాకరణ్ అనేక యుద్ధముల ఆరియు తేరిన వృద్ధమూర్తి. మనసు చెప్పిననట్టు నడిచిన రాజకీయవేత్త. ఎన్ని సమస్యలు గుండెల్లో సుడులు తిరుగుతున్నా చిరునవ్వు చెదరని ప్రశాంత వదనుడు. కమ్మూనిస్టులతో వీధిపోరాటాలు చేసిన కాంగ్రెస్ యోధుడు. రాజీవ్ హత్య ఫలితంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సంక్షోభం నెలకొన్నప్పుడు తోటి దక్షిణాది నాయకుడిని ప్రధానమంత్రిగా నిలబెట్టి చరిత్ర సృష్టించిన కింగ్ మేకర్. కరుణాకరణ్ మరణంతో కేరళ రాజకీయరంగం అద్భతమైన ప్రతిభాపాటవాలు కలిగిన ఒక పాతతరం నాయకుడిని కోల్పోయింది. భారత రాజకీయ రంగం నుంచి దక్షిణాదికి చెందిన ఒక అతిరధుడు నిష్క్రమించాడు.
(

Wednesday, December 22, 2010
ముఖ్యమంత్రి మాట తీరు అభ్యంతరకరం
" రైతు బాంధవుడిని అని ప్రజల దృష్టికి మీరు తీసుకు వెళ్లాలనుకున్నారు.. అది నెరవేరింది.. ఇక దీక్ష విరమించండి" అంటూ చాలా చులకన భావంతో, వెటకారంగా మాట్లాడారు కిరణ్‌కుమార్. పైగా.. అప్పట్లో మేము కూడా దీక్షలు చేస్తే చంద్రబాబు ఒక్క ప్రతినిధినీ మావద్దకు పంపలేదు అని సమర్థించుకోజూశారు. ఇది చాలా అభ్యంతరకరం. రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు.. ఆరు రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తున్నారు. పైగా ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించి, షుగర్, పొటాషియం, సోడియం లెవెల్స్ అన్నీ గణనీయంగా తగ్గిపోయాయి. పల్స్ రేట్ పడిపోయింది. చంద్రబాబు ఆరోగ్యం క్షణక్షణానికీ క్షీణించి, ఇక ఏ క్షణాన్నైనా గుండెపోటు వచ్చే అవకాశం లేకపోలేదు.. అని వైద్యులు ఆందోళనకర వాస్తవాన్ని చెబుతున్నపుడు కిరణ్‌కుమార్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సహేతుకంగా లేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయన రాజకీయ పరిణితి ఏపాటిదో తేటతెల్లం చేస్తోంది.
ఇట్లాంటి సందర్భాల్లో.. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు.... వ్యక్తిగత కక్షలతో కన్నా.. మానవత్వంతో ఆలోచించాలి. భేషజానికి, పంతాలు.. పట్టింపులకూ పోరాదు. ప్రధాన విపక్ష నేత ఎలాంటి వారైనా.. ఆయన దీక్షను విరమింపచేసే ప్రయత్నాన్ని చిత్తశుద్ధితో చేయాలి. ఆరురోజులుగా చంద్రబాబు దీక్షలో ఉంటే.. ఇతర ప్రతిపక్షాల ఒత్తిడి మేరకు, ఏదో మొక్కుబడిగా డిఎల్ రవీంద్రారెడ్డి నేతృత్వంలోని మంత్రులను చంద్రబాబు వద్దకు పంపారు. వాళ్లు కూడా నిర్దిష్టమైన ప్రతిపాదనతో వెళ్లకుండా.. కేవలం దీక్ష విరమించండి అని విజ్ఞప్తి చేసి వచ్చేశారు. పైగా.. అక్కడినుంచి వచ్చాక, చంద్రబాబు దీక్ష విరమిస్తే.. అఖిలపక్షం వేసే విషయాన్ని ఆలోచిస్తామని అన్నారు. ఇది మరీ దారుణం.
అసలు ముఖ్యమంత్రి పదవి చేపట్టేప్పుడు ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు చేసిన ప్రమాణాన్ని ఓసారి గుర్తు చేసుకుంటే బావుంటుంది. పక్షపాతం గానీ, రాగద్వేషాలు గానీ లేకుండా అందరికీ న్యాయం చేస్తానని వారు దైవసాక్షిగా ప్రమాణం చేశారు. అయితే.. ముఖ్యమంత్రి, ఆయన సహచర మంత్రుల మాటలు,.. తీరు చూస్తుంటే.. చంద్రబాబుకు ఏదో ఒకటి అయితే.. తలనొప్పి పోతుంది అన్న భావన కనిపిస్తోంది. (పాపం శమించుగాక) ఇది చాలా అభ్యంతరకరం. ప్రజాసమస్యలపై దీక్ష చేస్తున్న వ్యక్తి సామాన్యుడు కాడు.. జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన ప్రముఖుడు. అట్లాంటి వ్యక్తి, రైతుజన హితమే ధ్యేయంగా దీక్ష చేపడితే.. దాని తీవ్రతను గుర్తించి రైతుల సమస్యలు పరిష్కరించకుండా.. చంద్రబాబును శత్రుభావనతో చూడడం కిరణ్‌కుమార్‌కి సమంజసం కాదు. ఇది కచ్చితంగా ఆయన బాధ్యతరాహిత్యాన్నే చాటుతోంది. ఇది ఏమాత్రం క్షంతవ్యం కాదు. రోజుకి కనీసం ఐదుగురికి తక్కువ కాకుండా.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే రాష్ట్రంలో రైతన్నల్లో ఏమాత్రం దైన్యం గూడుకట్టుకుందో అర్థమవుతుంది. ఈ దశలో.. ప్రభుత్వం భేషజాలకు పోకుండా.. తక్షణమే స్పందించి, రైతులకు మెరుగైన ప్యాకేజీని ప్రకటించి, చంద్రబాబు దీక్షను విరమింప చేయాలి. ఇది అత్యావశ్యకం. అనివార్యం. కిరణ్ పిర్రగిల్లి జోలపాడే కుర్రకారు తీరును మాని.. ముఖ్యమంత్రి స్థాయిలో హూందాగా ఆలోచిస్తే బావుంటుంది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు దీక్షను విరమింపచేసేలా రైతుహిత ప్రణాళికతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అది ఇవాళ రేపట్లో నెరవేరుతుందని ఆశిస్తున్నాను. వేచి చూద్దాం.
Monday, December 20, 2010
ఊబకాయుడు అంటే నపుంసకుడు..!
ఊబ అంటే నపుంసకుడు అని అర్థం.
కాయం అంటే శరీరం అని అర్థం.
అంటే ఊబకాయం అన్న పదానికి నపుంసకుడి శరీరం అని అర్థం చెప్పుకోవాల్సి ఉంటుంది.
బహుశా దీన్ని ఉబ్బర కాయం అని చెప్పాలనుకుని.. ఊబకాయంగా స్థిరపరిచారేమో పాపం.
ఉబ్బర అంటే ఉబ్బుట లేదా అతిశయం అని అర్థాలున్నాయి.
బాగా లావుగా ఉబ్బుతున్న వ్యక్తిని ఉబ్బర దేహుడనో.. ఉబ్బర కాయుడనో అనొచ్చు. అంతేకానీ, ఊబకాయం అన్నది సరైన పదం కాదు. ఓ రకంగా ఇది నిందార్థకం (తిట్టు) అని చెప్పొచ్చు.
ఇట్లాంటిదే బొబ్బట్లు అనే పదం కూడా.
నిజానికి ఈ పదం సరైన రూపం.. "ఒబ్బట్లు" అంటుంది శబ్దరత్నాకరం
ఒబ్బట్లు = ఒమ్ము + అట్లు
ఒమ్ము అంటే బలుపు, స్థూలము అని అర్థం (స్థూలము అంటే బలిసినది అని అర్థం)
అట్టు అంటే దోసె లేదా పెనంపై కాల్చి వండే పిండిపదార్థము అని అర్థం చెప్పుకోవచ్చు (అట్టు అంటే ఆపూప విశేషం అంటుంది శబ్దరత్నాకరం)
బొబ్బ అంటే పొక్కు, సింహనాదము, పెద్ద అరుపు అని అర్థం... మరి వీటితో అట్లు ఎలా వేయగలిగారో అర్థం కాదు.
బహుశా బొబ్బ అంటే చర్మం కాలగానే ఉబ్బుతుంది కదా.. ఆ రకంగా ఉబ్బే అట్టు అన్న భావంలో దీన్ని బొబ్బట్టుగా స్థిరపరిచారేమో..
దీని అసలు రూపమైతే.. ఒబ్బట్టు. ఎలా ప్రయోగించినా మీ ఇష్టం.
నిమిషం అంటే 60 సెకన్లు కాదు..!?
తెలుగు నిఘంటువు ప్రకారం నిమిషం అంటే అర్థం వేరే ఉంది. అసలు తెలుగు కాలమానమే కాస్త ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఓసారి పరికించండి.
అహోరాత్రము.. అంటే రేయింబవళ్లు అని అర్థం చెప్పుకుంటాం.
కానీ శబ్దరత్నాకరం ప్రకారం ఈ పదానికి వేరే అర్థం ఉంది.
అహోరాత్రము అంటే 30 ముహూర్తాల కాలము
ముహూర్తం అంటే.. 12 క్షణముల కాలము లేదా రెండు గడియల కాలము
క్షణము అంటే.. ఘటికలో ఆరవ వంతు సమయం
ఘటిక అంటే.. 24 నిమిషముల కాలం
నిమిషం అంటే.. రెప్ప వేయునంతటి కాలం (రెప్పపాటు కాలం) అని అర్థం.
అహోరాత్రము అంటే.. 1,440 సార్లు రెప్ప కొట్టడం అని అర్థం.
నిమిషం అనగానే 60 సెకన్లు అని, అహోరాత్రము అంటే రేయింబవళ్లు అనీ ఠకీమని చెప్పేస్తాం. కానీ ఈ పదాలకు శబ్దరత్నాకరం ఏ అర్థాలనిచ్చిందో.. చూశారా!
అన్నట్టు.. దేవతలని అనిమిషులు అని కూడా అంటారు. అంటే రెప్ప వేయని వారు అని అర్థం.
నీళ్లలో ఈదే చేప రెప్ప వేయలేదు కాబట్టి.. దాన్ని అనిమిషము అంటారు. మిగిలిన వారిని నిమిషులు అంటారు.
వేగవంతమైన జీవన గమనంలో సాగిపోతున్న ఈ తరానికి చేపని అనిమిషము లేదా ఝషము అని.. దేవతల్ని అనిమిషులు అని అంటే ఎంతమందికి అర్థమవుతుంది చెప్పండి.
మన సంస్కృతితో పాటు.. తెలుగు భాష విశిష్టతకూ కాలదోషం పడుతోందేమోనని తరచూ తొలుస్తుంటుంది.. అయినా చేసేదేముంది.. చెప్పండి? అప్పుడప్పుడూ ఇలా గుర్తు చేసుకుంటూ పోవడమే..!
భశుం..
Friday, December 17, 2010
చంద్రబాబు ఇంట్లో సెంటిమెంట్ సీన్స్
దృశ్యం 1 :
తెలుగుదేశం అధినేత చంద్రబాబు తన రాజకీయ జీవితంలోనే తొలిసారిగా.. నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్నారు. రైతు వ్యతిరేకి అన్న ముద్రను శాశ్వతంగా చెరిపేసుకోవాలన్నది చంద్రబాబు అంతరంగంగా కనిపిస్తోంది. ఈ దీక్ష ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కదిలించాలని, రైతులకు భారీగా నష్టపరిహారం ఇప్పించాలన్నది చంద్రబాబు ఆలోచన.
తెలుగింటి సంప్రదాయం.. నారావారి ఇంట వెల్లివిరిసింది. నిరవధిక నిరాహార దీక్షకు సిద్ధమై వెళుతున్న భర్త చంద్రబాబుకు.. భువనేశ్వరీ దేవి, వీరతిలకం దిద్ది.. హారతులు పట్టి.. సాగనంపారు. మామయ్య బాటకు అవాంతరం ఎదురుకాకుండా.. చంద్రబాబు కోడలు బ్రాహ్మణి పక్కనే శుభశకునంలా నిలిచారు.
దృశ్యం 3 :
నవ్వడమే పాపం అన్నట్లుండే చంద్రబాబు... ఉదయం మనస్ఫూర్తిగా నవ్వారు. సతీమణి భువనేశ్వరి వీరతిలకం దిద్ది, హారతి పడుతున్న వేళ.. మదిలో మరి ఏమి మెదిలిందో కానీ.. తృప్తిగా నవ్వారు.
ఈ మూడు దృశ్యాలూ.. అన్ని తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారం అయ్యాయి. చంద్రబాబు ఇంట ఇవాళ పండిన ఫ్యామిలీ సెంటిమెంట్... వైఎస్సార్ బతికున్న రోజుల్లో ఆయనకు, విజయమ్మ హారతి పట్టిన దృశ్యాలను ప్రతివారికీ గుర్తుకు తెచ్చి ఉంటాయి. నారావారి ఇంట కొత్తగా కనిపించిన భువనేశ్వరి సెంటిమెంట్ చంద్రబాబుకు ఏమేరకు కలిసొస్తుందో.. చూడాలి మరి.
Saturday, December 11, 2010
ఏమిటో.. అంతా కొత్తగా ఉంది!
1992 నుంచి దాదాపుగా ప్రతి సంవత్సరం నేను అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నాను. ప్రతి సంవత్సరమూ నా పుట్టినరోజు (డిసెంబర్ 11)న నేను మాలధారణతోనే ఉంటాను. ఆఫీసు పని, స్వామి పూజలు, అడపా దడపా.. పడి పూజలు.. ఇలా రొటీన్‌గా సాగిపోయే నాకు.. నా పుట్టిన రోజు ఆట్టే గుర్తుండేది కాదు. ఎప్పుడైనా శ్రీమతో.. మా తమ్ముళ్లో గుర్తు చేస్తే ఓహో ఇవాళ్టితో నాకు ఇన్ని సంవత్సరాలు పూర్తయ్యాయా..? అనుకుంటూ ఉండేవాడ్ని.
ఈ సంవత్సరం కూడా నేను అయ్యప్ప దీక్షలో ఉన్నాను. పైన చెప్పిన రీతిలో ఆఫీసు పని, దైనందిన పూజలు ఇదే హడావుడితో ఉన్నా. ఈరోజూ అదే మాదిరిగా తల్లవారగానే.. చన్నీళ్ల స్నానం చేసి.. చందన, విబూది ధారణ చేసి.. స్వామి పూజకు సిద్ధమవుతున్నాను. ఇంతలో డివిడి ప్లేయర్ నుంచి హ్యాపీ బర్త్‌డే టు యూ.. అంటూ సంగీతం వినిపించింది. అయ్యప్ప పాటల బదులు ఇదేంటా అని ఆశ్చర్యపడేలోగా మా అబ్బాయి వచ్చి.. నాకు పుట్టిన రోజు శుభాకాంక్షలను అందజేశాడు. విస్తుపోతూనే మావాడి శుభకామనలను ఆస్వాదించాను.
అంతలో.. డాడీ ఇది నీకోసం అంటూ ఓ ర్యాపర్ ఇచ్చాడు. మరింత ఆశ్చర్యంతో దాన్ని ఓపెన్ చేసి చూస్తే.. అప్పుడెప్పుడో మావాడిని షాపుకి తీసుకెళ్లినప్పుడు.. నేను ఆసక్తిగా పరిశీలించిన ఇంకుపెన్ను ఉంది. ఆరోజు.. ఆపెన్ను నాకు నచ్చినా.. ఏదో కారణంతో దాన్ని కొనడాన్ని వాయిదా వేశాను. దాన్ని గుర్తుంచుకుని మా అబ్బాయి.. నేను ముచ్చటపడిన పెన్నునే కొని నాకు ప్రెజెంట్ చేశాడు. దాంతోపాటే.. ఓ గాగుల్నీ ప్రెజెంట్ చేశాడు. నేను బైక్‌లో వెళ్లేటప్పుడు కళ్ల వెంబడి నీరు కారుతూ.. దుమ్ము కళ్లలో పడుతూ.. అవస్థలు పడుతున్నానని ఎప్పుడు గ్రహించాడో మరి, నా కోసం గాగుల్ కొన్నాడు. పెన్నూ, గాగుల్, గ్రీటింగ్ కార్డులు, హ్యాపీబర్త్‌డే వాయిస్ సిడి ల కోసం.. తను భద్రంగా దాచుకున్న పాకెట్ మనీని ఈ రకంగా ఖర్చుచేశాడని తర్వాత మా శ్రీమతి చెప్పింది.
పిల్లలు ఎదుగుతుంటే.. తల్లిదండ్రులు ఆనందిస్తారు. కానీ పిల్లాడు తండ్రి అవసరాలను, అవస్థలను కనిపెట్టి.. వాటిని తీర్చాలని పద్నాలుగేళ్ల వయసుకే.. ప్రయత్నిస్తే.. ఆ తండ్రి ఆనందం ఎలా ఉంటుంది చెప్పండి..? అది కూడా నేను తరచూ మరచి పోయే జన్మదినాన్ని గుర్తు చేసి.. నన్ను ఈరకంగా గౌరవించిన మా అబ్బాయిని చూస్తే.. నాకు ఎనలేని ఆనందం కలుగుతోంది. నిజం.. మాటల్లో చెప్పలేని... అనిర్వచనీయమైన అనందాన్ని అనుభవిస్తున్నాను నేను. అందుకే.. నాకివాళ ఏమిటో అంతా కొత్తగా ఉంది.
లడ్డులో బోల్టు గోవిందా..!

అయితే.. టిటిడి అధికారుల నిర్లక్ష్యం పుణ్యమా అని ఈ లడ్డూ ప్రసాదం తరచూ వివాదాల్లో చిక్కుకుంటోంది. నాణ్యత, పరిమాణాల విషయంలో ఇప్పటికే శ్రీవారి లడ్డూపై వివాదాలున్నాయి. తాజాగా ఇప్పుడు.. స్వామి ప్రసాదంలో.. అడ్డదిడ్డమైన వస్తువులు వస్తుండడం భక్తులను నిశ్చేష్టులను చేస్తోంది.
మచిలీపట్నానికి చెందిన ఓ కుటుంబం ప్రత్యేక దర్శనం టికెట్‌కు ఇచ్చిన రెండు లడ్లను తినేందుకు ప్రయత్నించగా.. అందులో ఒకటిన్నర ఇంచు సైజులో ఉన్న బోల్టు కనిపించింది. దీంతో వాళ్లు హతాశులయ్యారు. టిటిడి సిబ్బంది నిర్లక్ష్యానికి దిగ్భ్రాంతి చెందారు.
టిటిడి సిబ్బంది.. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని.. ఇట్లాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టిటిడి అధికారులు వీరి ఆవేదనను ఏమేరకు పరిగణలోకి తీసుకుంటారో... ఇలాంటివి మళ్లీ జరక్కుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.
Saturday, December 4, 2010
సింహిక ఎవరో తెలుసా...?

ఈ ఉదయం అయ్యప్ప వ్రతదీక్షా మాల ధరించాను. ఆనవాయితీ ప్రకారం.. ఆధ్యాత్మిక రచనలు చదువుదామని, ఇంట్లోని పుస్తకాలు చూస్తుంటే.. శ్రీమద్వాల్మీకి రామాయణంలోని అతి పవిత్రమైన సుందరకాండము కనిపించింది. చదువుతుంటే.. ఈ పవిత్ర ఘట్టం విశేషాలను, ఇందులో వచ్చే పాత్రలను బ్లాగు ద్వారా నలుగురితో పంచుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది. దాని ఫలితమే ఈ పోస్టు. ఇవాళ మొదటి సర్గము పూర్తి చేశాను ఇందులో హనుమంతుడు సముద్రాన్ని దాటడం, దారిలో మైనాకుడి స్వాగతం, సురసను జయించడం, సింహికను హతమార్చడం ప్రధానంగా ఉన్నాయి. ఈ సర్గములో వచ్చిన పాత్రలు.. వాటి వివరాలు :
ఆంజనేయుడు :
అంజన కుమారుడు. అంజన వానర స్త్రీ. ఈమె కుంజరుడనే వానరుడి కుమార్తె. కేసరి అనే వానర యోధుడి భార్య. ప్రభాస తీర్థంలో మునులను బాధిస్తున్న శంఖశబలాలనే ఏనుగులను సంహరిస్తాడు. భరద్వాజుడు మెచ్చుకుని ఇతడికి కేసరి

సందర్భం : సుందరకాండ యావత్తూ ఆంజనేయుడి వీరోచిత సుందర విజయ గాథే.
విద్యాధరులు : ఉపదేవతలు. పూలమాలలు కట్టడం వీరి పని. సర్పయాగానికి ఇంద్రుడి వెంట వెళతారు.
సందర్భం : ఆంజనేయుడు సముద్రాన్ని లంఘించేందుకు తన శరీరాన్ని పెంచుతున్న సందర్భంలో వీరి ప్రస్తావన వస్తుంది.

రెక్కలు తెగకుండానే మైనాకుడు సముద్రం గర్భంలో దాక్కుంటాడు. మైనాకుడు.. ఇష్టారీతిగా పైకి, కిందకి, పక్కలకు ఇలా ఎటు కావాలంటే అటు పెరిగిపోగల శక్తిమంతుడు.
సందర్భం : తన మీదుగా ఎగురుతున్న ఆంజనేయుడు.. కాసేపు విశ్రమించేందుకు వీలుగా, మైనాకుడిని పెరగమని సముద్రుడు కోరతాడు. తనను గర్భంలో ఉంచుకుని, ఇంద్రుడినుంచి కాపాడుతున్న, సాగరుడి సూచనను మైనాకుడు పాటిస్తాడు. ఆంజనేయుడు మైనాకుడిపై స్వల్వ వ్యవధి విశ్రమిస్తాడు. రాముడి పని మీద వెళుతున్న ఆంజనేయుడికి ఈరీతిగా సేవ చేసిన మైనాకుడికి ఇంద్రుడు అభయాన్నిస్తాడు.

సందర్భం : మైనాకుడి మీదనుంచి తిరిగి లంఘించిన ఆంజనేయుడి బలపరాక్రమాలను మళ్లీ తెలుసుకోవాలనే ఉద్దేశంతో.... దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు సురసాదేవిని పంపుతారు. ఆమె, అతి భయంకరమైన రూపంతో.. ఆంజనేయుడిని అడ్డగిస్తుంది. ముందుకు సాగాలంటే తన నోట్లోకి దూరి బయటకు వెళ్లాలని షరతు పెడుతుంది. ఆంజనేయుడు ఆమె నోట్లోకి ప్రవేశించి, తన దేహాన్ని అంతకంతకూ పెంచుతూ వెళతాడు. దానికి తగ్గట్లుగానే ఆమె కూడా తన నోటిని పెంచుతూ పోతుంటుంది. ఉన్నట్టుండి ఆంజనేయుడు సూక్ష్మరూపాన్ని ధరించి, ఒక్క ఉదుటన బయటకు వెళ్లిపోతాడు. ఆరకంగా దేవతల పరీక్షను సమర్థంగా ఎదుర్కొంటాడు.


సందర్భం : సముద్రంపై నుంచి ఎగురుతున్న ఆంజనేయుడిని చూసి.. సింహిక తనకు మహాజంతువు ఆహారంగా లభించిందని భావించి, ఆంజనేయుడి నీడను లాక్కొని వెళుతుంది. దీంతో ఆంజనేయుడి శక్తి కాస్త తగ్గుతుంది. విషయాన్ని గమనించిన ఆంజనేయుడు తన శరీరాన్ని ఇంతలింతలుగా పెంచుతాడు. దానికి తగ్గట్లే నీడ కూడా పెరుగుతుంది. దాంతో, సింహిక కూడా నోటిని బాగా తెరవాల్సి వస్తుంది. ఆంజనేయుడు హఠాత్తుగా ఆమె నోట్లోకి ప్రవేశించి.. చీల్చి చెండాడుతాడు.
గమనిక : తెలుగు భాషలో తప్పొప్పుల పట్టికను www.journomucchatlu.blogspot.com లో నేరుగా చూడొచ్చు
Wednesday, December 1, 2010
కన్నడ భాష ఎంతో సులువు..
కన్నడ | తెలుగు | అర్థం |
అకస్మాత్(వాగి) | అకస్మాత్తు(గా) : | ఉన్నట్టుండి |
ఆకస్మిక(వాగి) | ఆకస్మికం(గా) | ఉన్నట్టుండి |
అకారణ(వాగి) | అకారణం(గా) | కారణం లేకుండా |
అకృత్య | అకృత్య(ము) | చేయకూడని పని |
అక్కర | అక్కర | ప్రేమ, ఉపయోగం |
ఇక్కట్టు | ఇక్కట్టు | కష్టం, ఇబ్బంది |
ఇగరు | ఇగురు | ఆవిరగు |
ఇచ్ఛానుసార | ఇచ్ఛారీతిగా | ఇష్టానుసారంగా |
ఇట్టిగె | ఇటిక | బంకమట్టితో చేసి కాల్చిన రాయి |
ఇత్యాది | ఇత్యాది | మొదలైన |
ఉల్లాస | ఉల్లాసము | సంతోషము, ప్రకాశము |
ఉంగర | ఉంగరం | చేతి వేలి ఆభరణము, అంగుళీయకము |
ఉగ్ర | ఉగ్రం | (తీవ్ర కోపం) |
ఉచ్చరణె | ఉచ్చారణ | (పలుకు) |
ఉజ్జ | ఉజ్జా(యింపు) | సుమారు, ఊహించు |
రుజు | రుజు (వు) | సాక్ష్యము, దృష్టాంతము |
రుణ | రుణం | అప్పు |
రుచి | రుచి | చవి, ఇచ్చ, |
రుషభ | వృషభం | ఎద్దు |
రుద్రభూమి | రుద్రభూమి | శ్మశానం, వల్ల కాడు |
ఎక్కరిసు | వెక్కిరించు | వికార చేష్టలు చేయు |
ఎగరు | ఎగురు | ఎగురుట |
ఎత్తగడె | ఎత్తుగడ | ఉపాయము, యత్నము |
ఎమకె/ఎమికె | ఎముక | ఎముక, అస్థి |
ఎసరు | ఎసరు | వంట కోసం కాగబెట్టిన నీరు |
తెలుగులో : కాస్త మనసు పెట్టి ప్రయత్నిస్తే.. కన్నడ భాషను తెలుగంత సులువుగా నేర్చుకోవచ్చు.
కన్నడలో : స్వల్పష్టు మనసు మాడి ప్రయత్నిసిదరె, కన్నడ భాషన్ను తెలుగంతె సులభవాగి కలియబహుదు.
జెసీ దివాకరరెడ్డికి మంత్రి పదవి ఎందుకు రాలేదు..?

జెసి... వైఎస్ వర్గానికి బలమైన శత్రువు !
ఈయన.. అనంతపురం జిల్లాలో దశాబ్దాలుగా వైఎస్ వర్గానికి ప్రత్యర్థిగా కొనసాగుతున్నారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి, కొన్ని ప్రత్యేక కారణాల వల్ల.. పాత శత్రుత్వాన్ని పక్కన పెట్టి జెసి దివాకరరెడ్డిని సమర్థించారు. అధిష్ఠానం తాడిపత్రి స్థానాన్ని జెసి దివాకరరెడ్డికే కేటాయించడంతో.. వైఎస్సార్ ఆత్మీయ బంధువు, అత్యంత సన్నిహితుడు కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి అలియాస్ సూరీడు తెలుగుదేశం పంచన చేరారు. పరిటాల రవీంద్ర చొరవతో.. ఆయన తాడిపత్రి అసెంబ్లీకి టిడిపి అభ్యర్థిగా ఎంపికయ్యాడు. దీంతో వైఎస్సార్, దివాకరరెడ్డి ఇద్దరికీ తాడిపత్రి ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది. తన గెలుపు కోసం దివాకరరెడ్డి వైఎస్సార్ మద్దతును సమీకరించుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి పీఠం దక్కే సందర్భంలో.. అనవసరంగా ఒక స్థానాన్ని చేజార్చుకోవడం ఎందుకు అన్న దృష్టితో వైఎస్సార్ దివాకరరెడ్డికి మద్దతుగా నిలిచారు. స్నేహితుడు సూరీడు ఓటమికి కృషి చేశారు.
అయినా తొలి మంత్రిమండలిలో చోటు..
2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగానే.. ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖరరెడ్డి, తనకు ఆత్మీయుడిగా మారిన రఘువీరారెడ్డితో పాటు.. జెసి దివాకరరెడ్డికీ.. మంత్రి వర్గంలో.. చోటు కల్పించారు. అయితే.. ఆ తర్వాతి క్రమంలో.. జెసి దివాకరరెడ్డి, ఆయన సోదరుడు ప్రభాకరరెడ్డిల ప్రవర్తన, కాంగ్రెస్ పార్టీలో వివాదస్పదమైంది. వైఎస్ అనుచరగణాన్ని అణచివేసేందుకు జెసి దివాకరరెడ్డి ప్రయత్నించారు. ముఖ్యంగా.. అనంతపురం పార్లమెంటు సభ్యుడు వెంకటరామిరెడ్డి, రఘువీరారెడ్డిలను బాగా వేధించారు. చాలాకాలం, రఘువీరారెడ్డి, దివాకరరెడ్డిలు ఎడముఖం, పెడముఖంగా ఉన్నారు.
2009 నాటికి మారిన పరిస్థితులు
2004_09 కాలంలో.. జెసి బ్రదర్స్ జిల్లాకు చెందిన ఇతర రాజకీయ ప్రముఖుల విషయంలో చాలా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారన్న వాదన ఉంది. ముఖ్యంగా రాజకీయ ఎత్తుగడల్లో దిట్టగా పేరున్న అనంత వెంకటరామిరెడ్డిని కూడా 2009 ఎన్నికల్లో జెసి బ్రదర్స్ బాగా ఇబ్బందులు పెట్టారు. వెంకటరామిరెడ్డికి ఎంపీ టికెట్ రాకుండా ఈ సోదరులు విశ్వప్రయత్నాలు చేశారు. వరుసకు మామయ్యే తనకు ఇలా ఇబ్బందులు పెడుతుంటూ మౌనంగా భరించిన వెంకటరామిరెడ్డి.. ఆపసోపాలు పడి.. అనంతపురం పార్లమెంట్‌కు కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ తెచ్చుకున్నారు. అక్కడితో వదిలేయని జెసి సోదరులు.. ముఖ్యంగా ప్రభాకరరెడ్డి, వెంకటరామిరెడ్డిని ఓడించేందుకు విందు రాజకీయాలు... పరోక్ష కుట్రలు చేశారు. అయితే.. వెంకటరామిరెడ్డి వ్యూహాత్మక ఎత్తుగడల కారణంగా.. జెసి సోదరుల పన్నాగాలు ఫలించలేదు. వెంకటరామిరెడ్డి గెలిచారు. రఘువీరారెడ్డి విషయంలోనూ జెసి సోదరులు ఇదే ధోరణిని అనుసరించారు. దీంతో.. ఎన్నికలు పూర్తి కాగానే.. జెసి బాధితులందరూ వైఎస్ రాజశేఖరరెడ్డి వద్ద ఒత్తిడి తెచ్చారు. సహజంగానే, దివాకరరెడ్డి వర్గాన్ని ప్రత్యర్థిగా చూసే రాజశేఖరరెడ్డి, 2009లో ఏర్పాటు చేసిన తన కొత్త మంత్రి వర్గంలో.. జెసికి చోటు కల్పించలేదు.
వైఎస్ మృతితో చిగురించిన ఆశలు :
నిరుత్సాహానికి గురైన దివాకరరెడ్డి, రాజశేఖరరెడ్డి అనూహ్యంగా మరణించడంతో.. మళ్లీ మంత్రి పదవిపై ఆశలను పెంచుకున్నారు. రోశయ్య హయాంలోనే మంత్రి అవుతానని నమ్మారు. ఆమేరకు భారీ ఎత్తున పైరవీలు చేసుకున్నారు. జగన్ వర్గాన్ని అభిశంసిస్తూ.. అధిష్ఠానం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. అయితే.. రోశయ్యకు ఉద్వాసన పలికి, కాంగ్రెస్ అధిష్ఠానం కిరణ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించడంతో.. దివాకరరెడ్డి శిబిరం మార్చారు. ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేసుకున్నారు. రఘువీరారెడ్డికి చెక్‌పెట్టి, తనకు స్థానం ఖరారు చేయించుకున్నారు. అయితే.. రాత్రికి రాత్రి పరిస్థితి మారిపోయింది. అనంత వెంకటరామిరెడ్డి లాబీయింగ్ బాగా ఫలించడంతో.. దివాకరరెడ్డికి పదవి మరోమారు దూరమైనట్లు చెబుతున్నారు. దీనికి తోడు, పొరుగున ఉండే కడప జిల్లాలో.. ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన డి.ఎల్.రవీంద్రారెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డిలకు చోటు కల్పించాల్సి రావడం కూడా.. దివాకర్‌రెడ్డి పదవికి చేటు తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
Tuesday, November 30, 2010
ఓ రమేషూ..! ఓహో సురేషూ..!! రహస్యం తెలుసుకో..!!!
ఉదాహరణకు రమేష్ ని తీసుకుందాం. ఈ పదాన్ని విడదీస్తే..
రమ + ఈష్ = రమేష్.
రమ అంటే లక్ష్మీ దేవి,
ఈష్ లేదా ఈష అంటే నాగటి యేడికోల (నాగలి కోల) అని అర్థం
రమేష్‌కి పూర్తిగా అర్థం చెప్పాలంటే.. లక్ష్మీదేవి నాగలి కోల అని చెప్పుకోవాల్సి ఉంటుంది.
లక్ష్మీదేవికి, నాగలి కోలకి ఏమిటి సంబంధం చెప్పండి...?
అందుకే.. ఈ పదాన్ని రమేశ్ అని రాయాలి.
రమ + ఈశు(డు) = రమేశుడు
రమ అంటే లక్ష్మీదేవి.
ఈశుడు అంటే శివుడు, భర్త, రాజు అని అర్థాలున్నాయి.
రమ+ఈశుడు = రమేశుడు... అంటే లక్ష్మీదేవి భర్త ... విష్ణువు అని అర్థం
అలాగే సురేశు (దేవతలకు రాజు), మహేశు (మహి(భూమికి) రాజు), దుర్గేశు (దుర్గకు భర్త), తదితర పదాలను ష్.. తో కాకుండా శ్ తో రాస్తేనే అర్థవంతంగా ఉంటాయి.
అక్షయ కుమార్ :
ఈ పేరు చూస్తే మనకి ఎంతో అందంగా కనిపిస్తుంది కదూ... ఇంతకీ ఈ పేరు తొలి యజమాని ఎవరో తెలుసా..? లంకాధిపతి రావణుడి కుమారుడు ఈ పేరు తొలి యజమాని. భారత కథ ప్రకారం అక్షయకుమారుడు రావణాసురుడి కుమారుడు. లంకకు వచ్చిన హనుమంతుడిని బంధించేందుకు వెళ్లి, హనుమ చేతిలో మరణిస్తాడు. ఈ సందర్భంలో అక్షయకుమారుడి ప్రస్తావన వస్తుంది.
మరి మన బాలీవుడ్ అక్షయకుమార్కి ఈ కథ తెలిస్తే.. ఎలా పీలవుతాడో..!
సరదాగా గమనిస్తే ఇట్లాంటి గమ్మత్తులు పుష్కలంగా దొరుకుతాయి. తర్వాతి పోస్టులో మళ్లీ ఇట్లాంటి మరిన్ని పదాలు అర్థాలతో కలుద్దాం. బై బై
బై బై
బాబాయి దూరమవడం.. జగన్ స్వయంకృతం....!
బాబాయి అబ్బాయి రాజకీయంగా విడిపోయారు. కాంగ్రెస్ వంచకి అని అబ్బాయి విమర్శిస్తుంటే.. అబ్బే అదేం కాదు.. పార్టీ ది బెస్ట్ అని బాబాయి వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఇడుపులపాయలో బాబాయి అబ్బాయి మధ్య సయోధ్య కుదురుతుందని.. ఇద్దరూ కలిసి పోతారని అందరూ భావించారు. వివేకానందరెడ్డి కుటుంబానికే ప్రాధాన్యతనిస్తారని ఊహించారు. అయితే.. వివేకానందరెడ్డి, అన్న వైఎస్సార్ గారి కుటుంబం కన్నా, కాంగ్రెస్ కుటుంబమే ముఖ్యం అని తెగేసి చెప్పారు.
ఇప్పుడు బాబాయి-అబ్బాయి విడిపోవడానికి కాంగ్రెస్ అధిష్ఠానమే కారణమా..? కొన్నేళ్లుగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే.. ఈ ప్రశ్నకు సమాధానం తేలిగ్గా దొరుకుతుంది.
2003వ సంవత్సరం వరకూ.. జగన్మోహన్రెడ్డి రాష్ట్ర రాజకీయాలకు పూర్తి దూరంగా ఉన్నారు. తండ్రి చాటు బిడ్డగా.. పవర్ ప్రాజెక్టు యజమానిగా.. కొనసాగారు. అయితే.. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే.. జగన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని విశ్వప్రయత్నాలు చేశారు. తండ్రి ఆశీస్సులతో ఏకంగా పార్లమెంటులోకే ప్రవేశించాలని ఉవ్విళ్లూరారు. తనయుడిపై మమకారంతో.. వైఎస్సార్ కూడా జగన్ ఉత్సాహాన్ని కాదనలేక పోయారు. తనయుడి కోసం తమ్ముడినే బలిపశువును చేయాలని చూశారు. దీంతో మనస్తాపానికి గురైన వివేకానందరెడ్డి, ఎంపీ స్థానాన్ని వదులుకుని రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని అప్పట్లో అలక వహించారు. వైఎస్ఆర్, ఆయన తనయుడు జగన్ దీన్ని ఆమోదించినట్లే కనిపించింది. అయితే.. ఈ రచ్చ పార్టీకి ఇబ్బందికరంగా మారడంతో.. పార్టీ అధిష్ఠానదేవత సోనియాగాంధీ, జోక్యం చేసుకున్నారు. దీంతో, వివేకా రాజీనామా, జగన్ రాజకీయ రంగ ప్రవేశం అంశాలు అప్పటికి నిలిచిపోయాయి. ఈ ఘట్టం నుంచే జగన్.. బాబాయి వివేకా అంటే గుర్రుగా ఉంటున్నారన్న వార్తలున్నాయి.
2004 ఎన్నికల్లో పంతం నెగ్గించుకోలేక పోయినా.. 2009 ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డి వివేకానందరెడ్డిని రాజకీయంగా నియంత్రించడంలో సఫలమయ్యారు. బాబాయి వివేకా ప్రాతినిథ్యం వహించిన కడప పార్లమెంటరీ స్థానం నుంచి జగన్ పోటీ చేసి గెలిచారు. దురదృష్టవశాత్తూ వైఎస్సార్ చనిపోయాక, పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని కూడా వివేకా ఆశించినట్లు వార్తలు వచ్చాయి. అయితే అప్పుడూ ఆయన మనోభీష్టం నెరవేరలేదు. నానా అవస్థలూ పడి.. ఎమ్మెల్సీ పదవిని సంపాదించుకోగలిగారు.
జగన్మోహనరెడ్డి ఆగస్టు నెల్లో.. కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ధిక్కరిస్తూ.. రెండో విడత ఓదార్పు యాత్ర తలపెట్టినప్పుడు కూడా వివేకానందరెడ్డి విభేదించారు. తాను సోనియాకు విధేయుడినంటూ ఓ లేఖనూ రాశారు.
తాజాగా, రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మార్చే ఘట్టంలోనూ.. వివేకానందరెడ్డి, అన్నగారి అబ్బాయి జగన్‌ని విభేదించారు. అధిష్ఠానం ఆధిపత్యాన్ని అంగీకరించారు. పైగా తనకు మంత్రి పదవి కావాలని ఆయన విన్నవించుకున్నారు. ఈ క్రమంలో.. వివేకాకు మంత్రి పదవి ఖాయమన్న వార్తలు వచ్చాయి.
దీంతో అలిగి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జగన్‌తో ఈ ఉదయం వివేకా విడిగా భేటీ అయ్యారు. వీరి భేటీ కేవలం రెండు నిమిషాలకే పరిమితమైంది. హాల్లోకి వెళ్లీ వెళ్లగానే.. జగన్ బాబాయిపై ఆగ్రహం వ్యక్తం చేశారని.. దీంతో మనస్తాపానికి గురైన వివేకా.. జగన్‌కు దూరంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలని నిర్ణయించుకున్నారని వదంతులు వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవ నిజానిజాలెంతోగానీ.. వివేకానందరెడ్డి, జగన్‌ను కాదని, కాంగ్రెస్ అధిష్ఠానంతోటే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. దాదాపు ఆరేడేళ్లుగా బాబాయి-అబ్బాయిల మధ్య కొనసాగుతున్నస్పర్థల నేపథ్యాన్ని.. అధిష్ఠానం, చక్కగా వినియోగించుకున్నట్లు స్పష్టమవుతోంది. వివేకా దూరం కావడం జగన్‌కు కాస్త చికాకు కలిగించే అంశమే.