Monday, December 20, 2010

నిమిషం అంటే 60 సెకన్లు కాదు..!?

నిమిషం అంటే 60 సెకన్ల కాలమేనా..? ఆంగ్ల కాల మానం ప్రకారం అది సరైనదే కావచ్చు కానీ.
తెలుగు నిఘంటువు ప్రకారం నిమిషం అంటే అర్థం వేరే ఉంది. అసలు తెలుగు కాలమానమే కాస్త ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఓసారి పరికించండి.

అహోరాత్రము.. అంటే రేయింబవళ్లు అని అర్థం చెప్పుకుంటాం.
కానీ శబ్దరత్నాకరం ప్రకారం ఈ పదానికి వేరే అర్థం ఉంది.

అహోరాత్రము అంటే 30 ముహూర్తాల కాలము
ముహూర్తం అంటే.. 12 క్షణముల కాలము లేదా రెండు గడియల కాలము
క్షణము అంటే.. ఘటికలో ఆరవ వంతు సమయం
ఘటిక అంటే.. 24 నిమిషముల కాలం
నిమిషం అంటే.. రెప్ప వేయునంతటి కాలం (రెప్పపాటు కాలం) అని అర్థం.

అహోరాత్రము అంటే.. 1,440 సార్లు రెప్ప కొట్టడం అని అర్థం.

నిమిషం అనగానే 60 సెకన్లు అని, అహోరాత్రము అంటే రేయింబవళ్లు అనీ ఠకీమని చెప్పేస్తాం. కానీ ఈ పదాలకు శబ్దరత్నాకరం ఏ అర్థాలనిచ్చిందో.. చూశారా!

అన్నట్టు.. దేవతలని అనిమిషులు అని కూడా అంటారు. అంటే రెప్ప వేయని వారు అని అర్థం.
నీళ్లలో ఈదే చేప రెప్ప వేయలేదు కాబట్టి.. దాన్ని అనిమిషము అంటారు. మిగిలిన వారిని నిమిషులు అంటారు.

వేగవంతమైన జీవన గమనంలో సాగిపోతున్న ఈ తరానికి చేపని అనిమిషము లేదా ఝషము అని.. దేవతల్ని అనిమిషులు అని అంటే ఎంతమందికి అర్థమవుతుంది చెప్పండి.
మన సంస్కృతితో పాటు.. తెలుగు భాష విశిష్టతకూ కాలదోషం పడుతోందేమోనని తరచూ తొలుస్తుంటుంది.. అయినా చేసేదేముంది.. చెప్పండి? అప్పుడప్పుడూ ఇలా గుర్తు చేసుకుంటూ పోవడమే..!
భశుం..

1 comment:

  1. విజయ్ గారు,

    నిమిషానికి అరవై సెకన్ల లెక్క తెల్లదొరలది కదా? తప్పైతే సరిచెయ్యగలరు.
    కొత్తవిషయాలు తెలియజెప్పినందుకు ధన్యవాదాలు.


    ఇంతకూ, భశుం...టైపింగ్ మిస్టేకా? లేకపోతే ఏదైనా కొత్త అర్థంలో రాశారా?


    ~శశిధర్
    www.sasidharsangaraju.blogspot.com

    ReplyDelete