Wednesday, August 1, 2012

భయం గుప్పిట్లో...



పుణెలో ఈ సాయంత్రం ఏడున్నర నుంచి ఎనిమిదింపావు మధ్యలో నాలుగు చోట్ల బాంబు  పేలుళ్లు సంభవించాయి. చిదంబరం స్థానంలో హోంమంత్రిగా నియమితులైన సుశీల్ కుమార్ షిండేకి ఈ పేలుళ్లు సవాలేనని భావించవచ్చు. నిజానికి ఆయనీ సాయంత్రం నగరంలో ఓ బహుమతుల ప్రదానోత్సవంలో పాల్గొనాల్సి ఉంది. ఈ పేలుళ్ల దెబ్బకు ఆయన తన పర్యటనను ఆఖరు క్షణాల్లో రద్దు చేసుకున్నారు. నగరంలో గుండెకాయ లాంటి జంగ్లీ మహరాజ్ రోడ్డులో ఈ పేలుళ్లు జరిగాయి. మహారాష్ట్రనే కాదు.. యావద్దేశాన్నీ ఈ పేలుళ్లు కలవర పరిచాయి. పేలుళ్ల నేపథ్యంలో.. మన రాష్ట్రంలో అన్ని ముందస్తు జాగ్రత్తలూ తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోలీసు శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఏమో ఈ ఘటనలు చూస్తుంటే.. ప్రజలను భయాందోళనలకు గురి చేయాలన్న ఉగ్రవాదుల లక్ష్యం నెరవేరినట్లే కనిపిస్తోంది.

శివయ్య లాలింపు




మొన్నీ మధ్య తమిళనాడు వెళ్లాను అక్కడ చాలా గుళ్లూ గోపురాలు తిరిగాను. ఇందులో భాగంగా.. అగస్త్య మహాముని తపస్సు చేసిన ప్రదేశం.. తిరుమెచ్చూరు వెళ్లాను  ఇది చెన్నైకి ఓ 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి లలితాంబిక ఆలయంలో శిల్ప సంపదను దగ్గరనుంచి పరిశీలించే అవకాశం దొరికింది. శివుడు పార్వతీ దేవిని లాలిస్తూ.. వేడుకుంటున్నట్లుగా ఇక్కడి గుడి గోడలపై చెక్కిన "క్షేత్ర పురాణేశ్వర" శిల్పం, ఆహా ఎంతటి దేవదేవుడికైనా భార్య అలక తీర్చేందుకు పాట్లు తప్పవు కదా అనిపించింది. ఇంకో విచిత్రమేంటంటే.. శిల్పానికి ఎడమ వైపు నుంచి చూస్తే పార్వతీదేవి కళ్లు ఆగ్రహంతో ఉన్నట్లుగాను, కుడివైపు నుంచి చూస్తే ప్రసన్నంగానూ కనిపిస్తుంది. వేల సంవత్సరాల క్రితపు శిల్పుల ప్రావీణ్యతకు ఈ శిల్పాలు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.