Saturday, December 25, 2010

కేరళ భీష్ముడు పరమపదించారు..

తిరువనంతపురంలో గురువారంనాడు శాశ్వతంగా కన్నుమూసిన కన్నోత్ కరుణాకరణ్ మరార్ కేరళ రాజకీయ కురుక్షేత్రంలో భీష్మాచార్యుడు. అఘటనఘటనాసమర్థుడు. సంకీర్ణ రాజకీయాల రూపశిల్పి. కమ్మూనిస్టు వ్యతిరేక రాజకీయాలకు సారథి. ముఠా రాజకీయం వల్ల కాంగ్రెస్ పార్టీకి లాభమే కానీ నష్టం కాదని విశ్వసించిన రాజకీయ మల్లయోధుడు. అన్నింటికీ మించి పాములపర్తి వేంటక నరసింహారావు అనే ఒక తెలుగు మేధావిని ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టి అయిదేళ్ళూ నిలబెట్టిన అపర చాణక్యుడు.
తొంభై మూడు సంవత్సరాల నిండు జీవితం గడిపి పండులాగా రాలిపోయిన కరుణాకరణ్ ను కేరళ రాజకీయవాదులు ‘లీడర్’ అని పిలుస్తారు. అవును. అక్షరాలా కరుణాకరణ్ పదహారణాల లీడరే. ముందుండి పార్టీని నడిపించినవాడే. నిరంతరం పోరాడుతూ, పడుతూ లేస్తూ, దెబ్బలు కొడుతూ దెబ్బలు తింటూ, కలబడుతూ ముందుకు సాగినవాడే. నాలుగు తరాల నెహ్రూ-గాంధీ వంశానికి చెందిన అధినాయకులతో కలసి పని చేసిన పాతతరం నేతలలో బహుశా కరుణాకరణ్ చివరివాడు కావచ్చు. జవాహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్, సోనియాల నాయకత్వంలో కాంగ్రెస్ నాయకుడిగా కరుణాకరణ్ పార్టీకి సేవలందించారు. ఇందిరాగాంధీతో ఆయన అనుబంధం బలమైనది. 2005లో సోనియాతో విభేదాల కారణంగా కాంగ్రెస్ ని వీడి సొంత కుంపటి పెట్టుకోవలసి అవసరం వచ్చినప్పుడు కూడా తన పార్టీకి ఇందిరమ్మపేరే పెట్టుకున్నాడు. ఆత్యయిక పరిస్థితి కారణంగా ఇందిర అప్రతిష్ఠపాలైన సందర్భంలో 1977లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఘనవిజయం సాధించిన ఘనత కరుణాకరణ్ ది. కేరళ అసెంబ్లీలోని మొత్తం 140 శాసనసభ స్థానాలలో 111 స్థానాలను గెలుచుకోవడమే కాకుండా ఉన్న ఇరవై లోక్ సభ స్థానాలనూ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొని చరిత్ర సృష్టించింది. ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీని చీల్చిన రెండు సందర్భాలలోనూ కరుణాకరణ్ ఆమె వెంటే ఉన్నాడు. 1991లో రాజీవ్ హత్య కారణంగా కాంగ్రెస్ లో ఏర్పడిన గందరగోళ పరిస్థితిని చక్కదిద్దిన సీనియర్ నాయకుడు కరుణాకరణ్. అర్జున్ సింగ్, శరద్ పవార్, ప్రణబ్ ముఖర్జీ వంటి హేమాహేమీలను కాదని పీవీ నరసింహారావును ప్రధానిగా చేసేందుకు సోనియాను ఒప్పించి, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసిన నాయకుడు కరుణాకరణ్. పీవీని ప్రధాని గద్దెపైన కూర్చోబెట్టడమే కాకుండా పీవీ ప్రభుత్వంపైన అవిశ్వాసతీర్మానంపై జరిగిన ఓటింగ్ లో ప్రభుత్వం కూలకుండా కాపాడిన కీర్తీ, అపకీర్తీ కూడా కరుణాకరణ్ దే. అవిశ్వాసతీర్మానాన్ని ఓడించి ప్రభుత్వాన్ని అయిదేళ్ళూ నడపడంలో సహకరించినందుకూ, ఆర్థిక సంస్కరణల అమలుకు పీపీ సర్కార్ లో పరిశ్రమల మంత్రిగా ఉంటూ దోహదం చేసినందుకూ కీర్తి దక్కింది. ప్రభుత్వాన్ని రక్షించేందుకు ఢిల్లీ వీధులలో జీపులో బూటాసింగ్ తో కలిసి తిరుగుతూ జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన పార్లమెంటు సభ్యులను నగదు చెల్లించి కొనుగోలు చేయడంలో పాలుపంచుకున్నందుకు కరుణాకరణ్ అపకీర్తి మూటగట్టుకోవలసి వచ్చింది.
పాతతరం వారికి రాజన్ అనే కోజికోడ్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి అదృశ్యం కేసు గుర్తు ఉంటుంది. ఆత్యయిక పరిస్థితిలో రాజన్ ను పోలీసులు అపహరించి, హింసించి, చంపివేశారన్న ఆరోపణలు దేశాన్ని అట్టుడిగించినప్పుడు కేరళ హోంమంత్రిగా కరుణాకరణ్ ఉన్నాడు. ఈ కేసులో న్యాయస్థానం చేసిన వ్యాఖ్యల కారణంగా పదవి కోల్పోయాడు. 1977లో ప్రమాణం చేసిన తర్వాత నెలరోజులకే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. కరుణాకరణ్ రాజకీయ జీవితానికి మచ్చ తెచ్చిన మరో ఉదంతం కుమారుడు మురళీథరన్ ను ముఖ్యమంత్రి చేయాలన్న ఆరాటం. పార్లమెంటు సభ్యుడిగా, ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా చేయగలిగాడు కానీ ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టలేకపోయాడు. ఈ కారణంగానే తన కుడిభుజంలాగా రాజకీయాలలో ఎదిగిన ఏకే ఆంటోనీతో తలబడవలసి వచ్చింది. ఊమెన్ చాందీ, వయలార్ రవి వంటి శిష్యులను దూరం చేసుకోవలసి వచ్చింది. ఈ కారణంగానే సోనియాతో విభేదించవలసి వచ్చింది. అందుకే కాంగ్రెస్ పార్టీ నుంచి నిష్క్రమించి ఇందిరా కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీని నెలకొల్పవలసి వచ్చింది. తాత్కాలిక ఆగ్రహావేశాలతో సొంత పార్టీ పెట్టినప్పటికీ తాను జీవితాంతం కాంగ్రెస్ వాదినేనని కరుణాకరణ్ కు తెలుసు. కాంగ్రెస్ వాదిగానే ఏడుసార్లు కేరళ శాసనసభకు ఎన్నికైనాడు. నాలుగు విడతల కేరళ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. రెండు సార్లు లోక్ సభకూ, మూడు పర్యాయాలు రాజ్యసభకూ ఎన్నికైనాడు. 1967లో కేరళ శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి మూడే మూడు స్థానాలు ఉండేవి. ఈ సంఖ్యను 1970నాటికి ముప్పయ్ కి పెంచడంలో కరుణాకరణ్ ది ప్రధాన పాత్ర. 1977లో కమ్మూనిస్టు కూటమికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకత్వంలో యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ ను ఏర్పాడు చేసిన నాయకుడు కరుణాకరణ్. 1970 నుంచి కేరళలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర రాయాలంటే కరుణాకరణ్ కు పెద్ద అధ్యాయమే కేటాయించాలి. ఆయన జీవితం కాంగ్రెస్ తో పెనవేసుకుపోయింది. అందుకే కుమార్తె పద్మజతో కలిసి చివరికి కాంగ్రెస్ పార్టీకి తిరిగి వచ్చాడు.
కరుణాకరణ్ అనేక యుద్ధముల ఆరియు తేరిన వృద్ధమూర్తి. మనసు చెప్పిననట్టు నడిచిన రాజకీయవేత్త. ఎన్ని సమస్యలు గుండెల్లో సుడులు తిరుగుతున్నా చిరునవ్వు చెదరని ప్రశాంత వదనుడు. కమ్మూనిస్టులతో వీధిపోరాటాలు చేసిన కాంగ్రెస్ యోధుడు. రాజీవ్ హత్య ఫలితంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సంక్షోభం నెలకొన్నప్పుడు తోటి దక్షిణాది నాయకుడిని ప్రధానమంత్రిగా నిలబెట్టి చరిత్ర సృష్టించిన కింగ్ మేకర్. కరుణాకరణ్ మరణంతో కేరళ రాజకీయరంగం అద్భతమైన ప్రతిభాపాటవాలు కలిగిన ఒక పాతతరం నాయకుడిని కోల్పోయింది. భారత రాజకీయ రంగం నుంచి దక్షిణాదికి చెందిన ఒక అతిరధుడు నిష్క్రమించాడు.

( hmtvలో సందర్భానుసారం వివిధ రాజకీయ, వర్తమాన అంశాలపై.. "హంసధ్వని" పేరిట సంపాదకీయాలు ప్రసారం అవుతుంటాయి. వాటని hmtv చీఫ్‌ ఎడిటర్‌ శ్రీ కె.రామచంద్రమూర్తి గారు రాస్తున్నారు. శ్రీ మూర్తిగారు.. ఉదయం, వార్త, ఆంధ్రజ్యోతి దినపత్రికలకు అత్యంత విజయవంతమైన ఎడిటర్‌గా పనిచేశారు. సంపాదకీయాలతో పాటు.. విశిష్ట సందర్భాల్లో ప్రత్యేక వ్యాసాలూ రాసేవారు. hmtv ఛానల్‌ చీఫ్‌ ఎడిటర్‌ అయ్యాక శ్రీ మూర్తిగారు పని ఒత్తిడిలో రాయడం బాగా తగ్గించారు. ఇటీవల.. అన్ని ఒత్తిడులనూ అధిగమిస్తూ.. వర్తమాన అంశాలపై "హంసధ్వని" పేరిట hmtvలో సంపాదకీయాలు రాస్తున్నారు. శ్రీ మూర్తిగారి వ్యాసాలు వర్తమాన పాత్రికేయులకు, తెలుగు భాషపై మక్కువ గలవారికి, విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకుందాం అనుకునే వారికీ.. ఎంతో ఉపయుక్తంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం ఛానల్‌ వీక్షకులకు మాత్రమే కాకుండా.. బ్లాగర్లందరికీ వివిధ అంశాలపై సమగ్ర అవగాహన కలిగిస్తే సమంజసంగా ఉంటుందనే ఉద్దేశంతో.. hmtv హంసధ్వని కోసం రాసే వ్యాసాలను నా బ్లాగులో వాడుకునేందుకు శ్రీ మూర్తిగారి అనుమతిని కోరాను. తను రాసిన వ్యాసాలను నా బ్లాగులో వాడుకునేందుకు అనుమతించినందుకు శ్రీ రామచంద్రమూర్తిగారికి విశిష్ట కృతజ్ఞతలు తెలియచేస్తన్నాను. ఇకపై శ్రీ మూర్తిగారు రాసే హంసధ్వని సంపాదకీయాలు.. ఈ బ్లాగులోనూ ప్రచురితమవుతాయి. శ్రీ మూర్తిగారు ఇటీవల రాసిన మరిన్ని వ్యాసాలను నేరుగా చూడాలనుకునే వారు.. www.hmtvhamsadhwani.blogspot.com లో ప్రవేశించవచ్చు. విజయకుమార్‌ )

1 comment:

  1. విజయ్ గారు,

    హంసధ్వని బ్లాగ్ ను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. మీ బ్లాగ్ ద్వారా హంసధ్వని ఆర్టికల్స్ రెగ్యులర్ గా చదువుతాను. కరుణాకరన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. ఆయన చేసిన సేవలు నిజంగా మరువరానివి.
    ~శశిధర్
    www.sasidharsangaraju.blogspot.com

    ReplyDelete