Wednesday, December 1, 2010

జెసీ దివాకరరెడ్డికి మంత్రి పదవి ఎందుకు రాలేదు..?

జెసి దివాకరరెడ్డికి మళ్లీ నిరాశే ఎదురైంది. వైఎస్‌ రాజశేఖరరెడ్డిని తీవ్రంగా వ్యతిరేకించే దివాకరరెడ్డి... 2009 నుంచి అమాత్య పీఠం కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. రోశయ్య హయాంలో విస్తరణ జరిగితే ఈయనకు పదవి ఖాయమన్న ప్రచారం జరిగింది. అనూహ్యంగా ఏర్పడ్డ కిరణ్‌కుమార్‌ సర్కారులోనూ జెసికి పదవి వస్తుందని.. రఘువీరా రెడ్డిని వదిలేస్తారని భావించారు. అయితే, పాపం జెసి దివాకరరెడ్డికి మళ్లీ నిరాశే ఎదురైంది. ప్రస్తుతమున్న ఎమ్మెల్యేల్లో.. అత్యధిక పర్యాయాలు అసెంబ్లీకి ఎన్నికైన రికార్డు దివాకరరెడ్డి పేరిటే ఉంది. అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి వరుసగా ఆరుసార్లు ఎన్నికయ్యారు. గతంలో పలుమార్లు మంత్రిగా కూడా పనిచేశారు. సీనియారిటీ ఎక్కువగా ఉన్న జెసి దివాకరరెడ్డికి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి పదవిని ఎందుకు ఇవ్వలేదు అన్న ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. జెసి దివాకరరెడ్డికి పదవి రాకపోవడానికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. దాన్ని చర్చించే ముందు.. చరిత్రలోకి ఓసారి తొంగి చూద్దాం.
జెసి... వైఎస్‌ వర్గానికి బలమైన శత్రువు !
ఈయన.. అనంతపురం జిల్లాలో దశాబ్దాలుగా వైఎస్‌ వర్గానికి ప్రత్యర్థిగా కొనసాగుతున్నారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి, కొన్ని ప్రత్యేక కారణాల వల్ల.. పాత శత్రుత్వాన్ని పక్కన పెట్టి జెసి దివాకరరెడ్డిని సమర్థించారు. అధిష్ఠానం తాడిపత్రి స్థానాన్ని జెసి దివాకరరెడ్డికే కేటాయించడంతో.. వైఎస్సార్ ఆత్మీయ బంధువు, అత్యంత సన్నిహితుడు కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి అలియాస్‌ సూరీడు తెలుగుదేశం పంచన చేరారు. పరిటాల రవీంద్ర చొరవతో.. ఆయన తాడిపత్రి అసెంబ్లీకి టిడిపి అభ్యర్థిగా ఎంపికయ్యాడు. దీంతో వైఎస్సార్‌, దివాకరరెడ్డి ఇద్దరికీ తాడిపత్రి ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది. తన గెలుపు కోసం దివాకరరెడ్డి వైఎస్సార్‌ మద్దతును సమీకరించుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి పీఠం దక్కే సందర్భంలో.. అనవసరంగా ఒక స్థానాన్ని చేజార్చుకోవడం ఎందుకు అన్న దృష్టితో వైఎస్సార్‌ దివాకరరెడ్డికి మద్దతుగా నిలిచారు. స్నేహితుడు సూరీడు ఓటమికి కృషి చేశారు.
అయినా తొలి మంత్రిమండలిలో చోటు..
2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించగానే.. ముఖ్యమంత్రి అయిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి, తనకు ఆత్మీయుడిగా మారిన రఘువీరారెడ్డితో పాటు.. జెసి దివాకరరెడ్డికీ.. మంత్రి వర్గంలో.. చోటు కల్పించారు. అయితే.. ఆ తర్వాతి క్రమంలో.. జెసి దివాకరరెడ్డి, ఆయన సోదరుడు ప్రభాకరరెడ్డిల ప్రవర్తన, కాంగ్రెస్‌ పార్టీలో వివాదస్పదమైంది. వైఎస్‌ అనుచరగణాన్ని అణచివేసేందుకు జెసి దివాకరరెడ్డి ప్రయత్నించారు. ముఖ్యంగా.. అనంతపురం పార్లమెంటు సభ్యుడు వెంకటరామిరెడ్డి, రఘువీరారెడ్డిలను బాగా వేధించారు. చాలాకాలం, రఘువీరారెడ్డి, దివాకరరెడ్డిలు ఎడముఖం, పెడముఖంగా ఉన్నారు.
2009 నాటికి మారిన పరిస్థితులు
2004_09 కాలంలో.. జెసి బ్రదర్స్‌ జిల్లాకు చెందిన ఇతర రాజకీయ ప్రముఖుల విషయంలో చాలా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారన్న వాదన ఉంది. ముఖ్యంగా రాజకీయ ఎత్తుగడల్లో దిట్టగా పేరున్న అనంత వెంకటరామిరెడ్డిని కూడా 2009 ఎన్నికల్లో జెసి బ్రదర్స్‌ బాగా ఇబ్బందులు పెట్టారు. వెంకటరామిరెడ్డికి ఎంపీ టికెట్‌ రాకుండా ఈ సోదరులు విశ్వప్రయత్నాలు చేశారు. వరుసకు మామయ్యే తనకు ఇలా ఇబ్బందులు పెడుతుంటూ మౌనంగా భరించిన వెంకటరామిరెడ్డి.. ఆపసోపాలు పడి.. అనంతపురం పార్లమెంట్‌కు కాంగ్రెస్‌ అభ్యర్థిగా టికెట్‌ తెచ్చుకున్నారు. అక్కడితో వదిలేయని జెసి సోదరులు.. ముఖ్యంగా ప్రభాకరరెడ్డి, వెంకటరామిరెడ్డిని ఓడించేందుకు విందు రాజకీయాలు... పరోక్ష కుట్రలు చేశారు. అయితే.. వెంకటరామిరెడ్డి వ్యూహాత్మక ఎత్తుగడల కారణంగా.. జెసి సోదరుల పన్నాగాలు ఫలించలేదు. వెంకటరామిరెడ్డి గెలిచారు. రఘువీరారెడ్డి విషయంలోనూ జెసి సోదరులు ఇదే ధోరణిని అనుసరించారు. దీంతో.. ఎన్నికలు పూర్తి కాగానే.. జెసి బాధితులందరూ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వద్ద ఒత్తిడి తెచ్చారు. సహజంగానే, దివాకరరెడ్డి వర్గాన్ని ప్రత్యర్థిగా చూసే రాజశేఖరరెడ్డి, 2009లో ఏర్పాటు చేసిన తన కొత్త మంత్రి వర్గంలో.. జెసికి చోటు కల్పించలేదు.
వైఎస్‌ మృతితో చిగురించిన ఆశలు :
నిరుత్సాహానికి గురైన దివాకరరెడ్డి, రాజశేఖరరెడ్డి అనూహ్యంగా మరణించడంతో.. మళ్లీ మంత్రి పదవిపై ఆశలను పెంచుకున్నారు. రోశయ్య హయాంలోనే మంత్రి అవుతానని నమ్మారు. ఆమేరకు భారీ ఎత్తున పైరవీలు చేసుకున్నారు. జగన్‌ వర్గాన్ని అభిశంసిస్తూ.. అధిష్ఠానం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. అయితే.. రోశయ్యకు ఉద్వాసన పలికి, కాంగ్రెస్‌ అధిష్ఠానం కిరణ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా నియమించడంతో.. దివాకరరెడ్డి శిబిరం మార్చారు. ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేసుకున్నారు. రఘువీరారెడ్డికి చెక్‌పెట్టి, తనకు స్థానం ఖరారు చేయించుకున్నారు. అయితే.. రాత్రికి రాత్రి పరిస్థితి మారిపోయింది. అనంత వెంకటరామిరెడ్డి లాబీయింగ్‌ బాగా ఫలించడంతో.. దివాకరరెడ్డికి పదవి మరోమారు దూరమైనట్లు చెబుతున్నారు. దీనికి తోడు, పొరుగున ఉండే కడప జిల్లాలో.. ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన డి.ఎల్‌.రవీంద్రారెడ్డి, వైఎస్‌ వివేకానందరెడ్డిలకు చోటు కల్పించాల్సి రావడం కూడా.. దివాకర్‌రెడ్డి పదవికి చేటు తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

No comments:

Post a Comment