ఒక అక్షరంతో ప్రారంభమయ్యే పదాలు ఎన్నో ఉంటాయి. ఉదాహరణకి, "రౌ" అనే అక్షరంతో ప్రారంభమయ్యే పదాలు.. రౌతు, రౌద్రము, రౌద్రి... ఇలా, ఓ 13 దాకా ఉన్నాయి. అయితే.. ఒక అక్షరంతో ప్రారంభమయ్యే పదం ఒకే ఒక్కటి ఉంటుందా...? ఉంటే అలాంటి పదాలు ఎన్ని ఉంటాయి..? అని ఈ మధ్య సరదాగా ఓ ఆలోచన వచ్చింది. కాస్త ఓపిక తెచ్చుకుని నిఘంటువును పరిశోధిస్తే.. అట్లాంటి పదాలు అచ్చంగా 72 పదాలు తేలాయి. ఈ పదాల తొలి అక్షరంతో మరే పదమూ లేదు. అదీ వీటి విశిష్టత. వీటి అర్థాలూ చాలా విశిష్టంగా ఉన్నాయి. వీటిని మనం రోజువారీ రాతలో గానీ, మాటల్లోగానీ వాడక పోవచ్చు. కానీ, సరదాగా... ఓ సారి ఈ పదాలను, వాటి అర్థాలను పరిశీలించండి. ( వీటిలో కనీసం ఓ రెండు పదాలనైనా రోజువారీ రాతల్లో వాడేందుకు ప్రయత్నిస్తే ఒకింత సంతోషిస్తా.)
క్లో : క్లోమము = కడుపులో ఓ పక్కనుండెడి ఎర్రని మాంసం
క్వి : క్విట్రెంటు = మాన్యముల మీద వచ్చే అల్పమైన పన్ను
క్ష్ణు : క్ష్ణుతము = వాడిగా చేసినది
క్ష్వి : క్ష్వింక = ఎర్రని ముఖం కల కోతి
ఖ్యా : ఖ్యాతి/ఖ్యాతము = ప్రసిద్ధి, వాసి
గ్ల : గ్లహము = జూదంలోని పందెము
గ్లౌ : గ్లౌ = చంద్రుడు
ఛో : ఛోటిక = చోటిక
ఝీ : ఝీరుక = ఈలపురుగు, ఝిల్లి, తుడిచే వస్త్రము
టూ : టూకి = సంగ్రహము
ఠీ : ఠీవి = వైభవము
ఠే : ఠేవ = అంగీకారము, విధము
ఠో : ఠోలా = తెగ, సమూహము
డూ : డూయు : దూయు యొక్క రూపాంతరం
డై : డైరీ = డైలీ, దినచర్య
డౌ : డౌలు = డవులు, మదింపు, రీతి
డ్రె : డ్రెస్సరు = సహాయ వైద్యుడు
ఢో : ఢోలము = డోలు
త్ర్యూ : త్ర్యూషణం = సొంటి, పిప్పిలి మిరియాలు
త్వా : త్వాదృశము = నీవంటిది
త్స : త్సరువు = కత్తి పిడి
ద్యా : ద్యావాపృథవులు = మిన్ను మన్ను
ద్యూ : ద్యూతము = జూదము
ద్రి : ద్రిండు = దిండు యొక్క రూపాంతరము
ద్రూ : ద్రూణము = ఎర్రతేలు
ద్రొ : ద్రొబ్బు = పడద్రోయు = పడవేయు
ద్రౌ : ద్రౌణికము = పొలము
ద్వ్య : ద్వ్యష్టము = తామ్రము, రాగి
ధ్యే : ధ్యేయము : ధ్యాతవ్యము, ధ్యానింప తగినది
న్యూ : న్యూనము = తక్కువైనది, నిందింప తగినది
ప్రై : ప్రైషణము = ప్రేషణము = మర్దనము, క్లేశము, ఉన్మాదము
ప్లా : ప్లాక్షము = రావిచెట్టు పండు
ప్లో : ప్లోషము = కాల్చుట, ప్రోషము
ఫీ : ఫీజు = రుసుము
ఫ్లా : ఫ్లానెలు = ఉన్నివస్త్రము
ఫ్సా : ఫ్సాతము = భక్షింప తగినది (తినదగ్గది)
బ్లా : బ్లాంకెటు = బనాతు పచ్చడము (బనాతు=ఉన్నిబట్ట, పచ్చడము = దుప్పటి)
భ్రౌ : భ్రౌషము = తను చేయాల్సిన పని నుండి వైదొలగడము
మ్లి : మ్లిష్టము = స్పష్టం కానిది, వాడినది
యొ : యొక్క = శేష షష్ఠి యందు వచ్చే ప్రత్యయము
ఱై : ఱైక = ఱవిక
వో : వోఢ = తేరు గడపు వాడు, మోపరి
వ్రై : వ్రైహేయము : వ్రీహి పంట పెట్టదగిన పొలము (వ్రీహి : వడ్లు)
శొ : శొంఠి = శుంఠికి గ్రామ్య రూపము
శ్చ్యో : శ్చ్యోతము = జలాది ధార, కాఱుట
శ్యో : శ్యోనాకము = దుండిగము చెట్టు
శ్రి : శ్రితుడు = ఆశ్రితుడు, సేవితుడు
శ్రై : శ్రైష్ఠ్యము = శ్రేష్ఠత్వము, మేలిమి
శ్లి : శ్లిష్టము = శ్లేషతో కూడినది
శ్లీ : శ్లీలము = సంపదగలది
శ్లో : శ్లోకము = సంస్కృత పద్యం, కీర్తి
షు : షురువు = ఆరంభం
షో : షోడశము = పదహారు
స్టా : స్టాంపు = ముద్ర వేసిన కాగితము
స్టీ : స్టీమరు = పొగబండి
స్టే : స్టేషన్ = ఉండు చోటు
స్తి : స్తిమితము = కదలనిది, తడిసినది
స్తూ : స్తూపము = మట్టి మొదలగు వాని దిబ్బ
స్తై : స్తైన్యము = దొంగతనము
స్త్రై : స్త్రైణము = స్త్రీ స్వభావము, స్త్రీ సంబంధమైనది
స్థై : స్థైర్యము = స్థిరత్వము, జాపత్రి
స్నై : స్నైగ్ధ్యము = స్నిగ్ధ భావము, స్నేహము
స్ప్ర : స్ప్రష్ట = తపింప చేయు రోగము
స్ఫీ : స్ఫీతము = అధికమైనది
స్ఫే : స్ఫేష్ఠము =మిక్కిలి, అధికమైనది
స్మే : స్మేరము = కొంచెం నవ్వునది (చిరు మందహాసి), వికసించినది
స్లే : స్లేటు = రాతి పలక
స్వి : స్విన్నము = స్వేదం (చెమట) తో కూడినది
హ్రా : హ్రాదిని = వజ్రాయుధం, ఏరు, మెఱపు
హ్రి : హ్రిణీయ = సిగ్గు, రోత
హ్రే : హ్రేష = హేష, గుర్రం సకిలింత
హ్లా : హ్లాదనం = సంతోషించుట, సంతోషం
sir
ReplyDeleteడైరీ
డ్రెస్సరు
ivi Telugu padalani nammuthunnara meeru
Naaku mimmalni tappu pattalani e koshana kooda ledu ani athma sakhiga cheppagalanu.
Thappuga raaste kshaminchandi.
యొ :యొnarchu also there
ReplyDeleteIf i am not wrong