ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మాట తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది. ప్రతిపక్షాలపై.. ముఖ్యంగా చంద్రబాబునాయుడుపై.. ఆయన వ్యక్తిగత కక్ష ధోరణినే అవలంబిస్తున్నట్లు అనిపిస్తోంది. ఆయనలో వద్దన్నా చంద్రబాబునాయుడుపై అక్కసు బయటకు వస్తోంది. ఇవాళ మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో "ఆస్తుల పంపిణీ" కార్యక్రమంలో.. చంద్రబాబుపై మళ్లీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
" రైతు బాంధవుడిని అని ప్రజల దృష్టికి మీరు తీసుకు వెళ్లాలనుకున్నారు.. అది నెరవేరింది.. ఇక దీక్ష విరమించండి" అంటూ చాలా చులకన భావంతో, వెటకారంగా మాట్లాడారు కిరణ్‌కుమార్. పైగా.. అప్పట్లో మేము కూడా దీక్షలు చేస్తే చంద్రబాబు ఒక్క ప్రతినిధినీ మావద్దకు పంపలేదు అని సమర్థించుకోజూశారు. ఇది చాలా అభ్యంతరకరం. రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు.. ఆరు రోజుల పాటు నిరాహార దీక్ష చేస్తున్నారు. పైగా ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించి, షుగర్, పొటాషియం, సోడియం లెవెల్స్ అన్నీ గణనీయంగా తగ్గిపోయాయి. పల్స్ రేట్ పడిపోయింది. చంద్రబాబు ఆరోగ్యం క్షణక్షణానికీ క్షీణించి, ఇక ఏ క్షణాన్నైనా గుండెపోటు వచ్చే అవకాశం లేకపోలేదు.. అని వైద్యులు ఆందోళనకర వాస్తవాన్ని చెబుతున్నపుడు కిరణ్‌కుమార్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సహేతుకంగా లేదు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆయన రాజకీయ పరిణితి ఏపాటిదో తేటతెల్లం చేస్తోంది.
ఇట్లాంటి సందర్భాల్లో.. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు.... వ్యక్తిగత కక్షలతో కన్నా.. మానవత్వంతో ఆలోచించాలి. భేషజానికి, పంతాలు.. పట్టింపులకూ పోరాదు. ప్రధాన విపక్ష నేత ఎలాంటి వారైనా.. ఆయన దీక్షను విరమింపచేసే ప్రయత్నాన్ని చిత్తశుద్ధితో చేయాలి. ఆరురోజులుగా చంద్రబాబు దీక్షలో ఉంటే.. ఇతర ప్రతిపక్షాల ఒత్తిడి మేరకు, ఏదో మొక్కుబడిగా డిఎల్ రవీంద్రారెడ్డి నేతృత్వంలోని మంత్రులను చంద్రబాబు వద్దకు పంపారు. వాళ్లు కూడా నిర్దిష్టమైన ప్రతిపాదనతో వెళ్లకుండా.. కేవలం దీక్ష విరమించండి అని విజ్ఞప్తి చేసి వచ్చేశారు. పైగా.. అక్కడినుంచి వచ్చాక, చంద్రబాబు దీక్ష విరమిస్తే.. అఖిలపక్షం వేసే విషయాన్ని ఆలోచిస్తామని అన్నారు. ఇది మరీ దారుణం.
అసలు ముఖ్యమంత్రి పదవి చేపట్టేప్పుడు ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు చేసిన ప్రమాణాన్ని ఓసారి గుర్తు చేసుకుంటే బావుంటుంది. పక్షపాతం గానీ, రాగద్వేషాలు గానీ లేకుండా అందరికీ న్యాయం చేస్తానని వారు దైవసాక్షిగా ప్రమాణం చేశారు. అయితే.. ముఖ్యమంత్రి, ఆయన సహచర మంత్రుల మాటలు,.. తీరు చూస్తుంటే.. చంద్రబాబుకు ఏదో ఒకటి అయితే.. తలనొప్పి పోతుంది అన్న భావన కనిపిస్తోంది. (పాపం శమించుగాక) ఇది చాలా అభ్యంతరకరం. ప్రజాసమస్యలపై దీక్ష చేస్తున్న వ్యక్తి సామాన్యుడు కాడు.. జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన ప్రముఖుడు. అట్లాంటి వ్యక్తి, రైతుజన హితమే ధ్యేయంగా దీక్ష చేపడితే.. దాని తీవ్రతను గుర్తించి రైతుల సమస్యలు పరిష్కరించకుండా.. చంద్రబాబును శత్రుభావనతో చూడడం కిరణ్‌కుమార్‌కి సమంజసం కాదు. ఇది కచ్చితంగా ఆయన బాధ్యతరాహిత్యాన్నే చాటుతోంది. ఇది ఏమాత్రం క్షంతవ్యం కాదు. రోజుకి కనీసం ఐదుగురికి తక్కువ కాకుండా.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే రాష్ట్రంలో రైతన్నల్లో ఏమాత్రం దైన్యం గూడుకట్టుకుందో అర్థమవుతుంది. ఈ దశలో.. ప్రభుత్వం భేషజాలకు పోకుండా.. తక్షణమే స్పందించి, రైతులకు మెరుగైన ప్యాకేజీని ప్రకటించి, చంద్రబాబు దీక్షను విరమింప చేయాలి. ఇది అత్యావశ్యకం. అనివార్యం. కిరణ్ పిర్రగిల్లి జోలపాడే కుర్రకారు తీరును మాని.. ముఖ్యమంత్రి స్థాయిలో హూందాగా ఆలోచిస్తే బావుంటుంది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు దీక్షను విరమింపచేసేలా రైతుహిత ప్రణాళికతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అది ఇవాళ రేపట్లో నెరవేరుతుందని ఆశిస్తున్నాను. వేచి చూద్దాం.
చంద్ర బాబు మా నాయ్న కు పోటీ క్యాండిడేట్ను పెట్టి ఓడించినాడు..ఆ కక్ష ఇప్పుడు తీర్చుకోవటానికి అవకాశం వస్తే వదులుకొంటానా--కిరణ్ కుమార్ రెడ్డి
ReplyDeleteనిజం చెప్పారు ! ఒక ముఖ్యమంత్రి స్తాయి లో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇలా ప్రవరించటం ఆత్యంత హేయం , దారుణం !
ReplyDeleteస్పీకర్‍గా ఆయన చేసిన నిర్వాకం చూసాంకదా!ముఖ్యమంత్రిగా అంతకన్నా భిన్నంగా ప్రవర్తిస్తాడని ఎలా అనుకుంటారు?
ReplyDeleteదీన్నే నడమంత్రపు సిరి అంటారు. మంత్రిగా కూడా పనిచెయ్యని వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తే, కళ్ళకు అహంకారపు పొరలు కమ్మేస్తాయి.
ReplyDelete~శశిధర్ సంగరాజు.
www.sasidharsangaraju.blogspot.com