Saturday, December 11, 2010

ఏమిటో.. అంతా కొత్తగా ఉంది!

ఇవాళ నా పుట్టిన రోజు.. అయితే ఏంటంట..? నీవేమైనా దేశ్‌కీ నేతానా..? ఏమైనా సాధించావా..? అని అడక్కండి ప్లీజ్‌. అట్లాంటి ఘనుడినేమీ కాను గానీ.. ఇవాళ నా పుట్టిన రోజు అని గుర్తుకొచ్చిన తీరు చాలా కొత్తగా ఉంది. ఆ ఫీలింగ్స్‌ని సాటి బ్లాగర్లతో పంచుకోవాలన్నదే నా ఉద్దేశం.

1992 నుంచి దాదాపుగా ప్రతి సంవత్సరం నేను అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నాను. ప్రతి సంవత్సరమూ నా పుట్టినరోజు (డిసెంబర్‌ 11)న నేను మాలధారణతోనే ఉంటాను. ఆఫీసు పని, స్వామి పూజలు, అడపా దడపా.. పడి పూజలు.. ఇలా రొటీన్‌గా సాగిపోయే నాకు.. నా పుట్టిన రోజు ఆట్టే గుర్తుండేది కాదు. ఎప్పుడైనా శ్రీమతో.. మా తమ్ముళ్లో గుర్తు చేస్తే ఓహో ఇవాళ్టితో నాకు ఇన్ని సంవత్సరాలు పూర్తయ్యాయా..? అనుకుంటూ ఉండేవాడ్ని.

ఈ సంవత్సరం కూడా నేను అయ్యప్ప దీక్షలో ఉన్నాను. పైన చెప్పిన రీతిలో ఆఫీసు పని, దైనందిన పూజలు ఇదే హడావుడితో ఉన్నా. ఈరోజూ అదే మాదిరిగా తల్లవారగానే.. చన్నీళ్ల స్నానం చేసి.. చందన, విబూది ధారణ చేసి.. స్వామి పూజకు సిద్ధమవుతున్నాను. ఇంతలో డివిడి ప్లేయర్‌ నుంచి హ్యాపీ బర్త్‌డే టు యూ.. అంటూ సంగీతం వినిపించింది. అయ్యప్ప పాటల బదులు ఇదేంటా అని ఆశ్చర్యపడేలోగా మా అబ్బాయి వచ్చి.. నాకు పుట్టిన రోజు శుభాకాంక్షలను అందజేశాడు. విస్తుపోతూనే మావాడి శుభకామనలను ఆస్వాదించాను.

అంతలో.. డాడీ ఇది నీకోసం అంటూ ఓ ర్యాపర్‌ ఇచ్చాడు. మరింత ఆశ్చర్యంతో దాన్ని ఓపెన్‌ చేసి చూస్తే.. అప్పుడెప్పుడో మావాడిని షాపుకి తీసుకెళ్లినప్పుడు.. నేను ఆసక్తిగా పరిశీలించిన ఇంకుపెన్ను ఉంది. ఆరోజు.. ఆపెన్ను నాకు నచ్చినా.. ఏదో కారణంతో దాన్ని కొనడాన్ని వాయిదా వేశాను. దాన్ని గుర్తుంచుకుని మా అబ్బాయి.. నేను ముచ్చటపడిన పెన్నునే కొని నాకు ప్రెజెంట్‌ చేశాడు. దాంతోపాటే.. ఓ గాగుల్‌నీ ప్రెజెంట్‌ చేశాడు. నేను బైక్‌లో వెళ్లేటప్పుడు కళ్ల వెంబడి నీరు కారుతూ.. దుమ్ము కళ్లలో పడుతూ.. అవస్థలు పడుతున్నానని ఎప్పుడు గ్రహించాడో మరి, నా కోసం గాగుల్‌ కొన్నాడు. పెన్నూ, గాగుల్‌, గ్రీటింగ్‌ కార్డులు, హ్యాపీబర్త్‌డే వాయిస్‌ సిడి ల కోసం.. తను భద్రంగా దాచుకున్న పాకెట్‌ మనీని ఈ రకంగా ఖర్చుచేశాడని తర్వాత మా శ్రీమతి చెప్పింది.

పిల్లలు ఎదుగుతుంటే.. తల్లిదండ్రులు ఆనందిస్తారు. కానీ పిల్లాడు తండ్రి అవసరాలను, అవస్థలను కనిపెట్టి.. వాటిని తీర్చాలని పద్నాలుగేళ్ల వయసుకే.. ప్రయత్నిస్తే.. ఆ తండ్రి ఆనందం ఎలా ఉంటుంది చెప్పండి..? అది కూడా నేను తరచూ మరచి పోయే జన్మదినాన్ని గుర్తు చేసి.. నన్ను ఈరకంగా గౌరవించిన మా అబ్బాయిని చూస్తే.. నాకు ఎనలేని ఆనందం కలుగుతోంది. నిజం.. మాటల్లో చెప్పలేని... అనిర్వచనీయమైన అనందాన్ని అనుభవిస్తున్నాను నేను. అందుకే.. నాకివాళ ఏమిటో అంతా కొత్తగా ఉంది.

8 comments:

  1. Really touching. Congrats to your son.
    ...and, many more happy returns of the day...

    ReplyDelete
  2. మీ బాబు కి అభినందనలు ఇలాగే ఎప్పుడు తను మిమ్మల్ని ఎప్పుడు పుత్రోత్చాహం లో ముంచేయాలని కోరుకుంటున్నా ! మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు !

    ReplyDelete
  3. చాలా సంతోషం. మీకు శుభాకాంక్షలు, బాబుకి అభినందనలు.

    ReplyDelete
  4. Very Touching. మీబాబు అలవాట్లు, పద్దతులు చూస్తుంటే ముచ్చటేస్తుందండి, మీగురించి ఆలోచించి ఇలాంటి గిఫ్ట్స్ ఇవ్వడం అభినందనీయం, తనకు నా ఆశీస్సులు. మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

    ReplyDelete
  5. బాబాయ్...
    నిన్న నిన్ను కలిసినా...ఈ పోస్టు చూడని కారణంగా...నువ్వు నాకు చెప్పనందువల్ల నీ బర్త్ డే అని తెలియదు. మొత్తానికి హ్యాపీ బర్త్ డే--బిలేటేడ్. నీ పుత్రుడు నీకు ఇచ్చిన బహుమతి, దానికి నువ్వు ఇచ్చిన అక్షర రూపం బాగున్నాయి. మీ వాడిని ఒక సారి తీసుకొస్తే...చాక్లెట్ కొనిచ్చి నీ గురించి చెబుతా...
    రాము
    apmediakaburlu.blogspot.com

    ReplyDelete
  6. విజయ్ గారు,
    హ్యాపీ బర్త్ డే (బిలేటెడ్). Please convey our best wishes to Vikas for his thoughtful gifts.

    ~Sasidhar
    www.sasidharsangaraju.blogspot.com

    ReplyDelete
  7. మిత్రులారా.. మీ శుభాకాంక్షలకు మన:పూర్వక ధన్యవాదాలు. కచ్చితంగా మీ అందరి శుభకామనలను మా అబ్బాయికి అందజేస్తాను. నా ఆనందంలో పాలు పంచుకున్న మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు.
    విజయ్

    ReplyDelete