రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రులు ఉండరన్నది జగమెరిగిన సత్యం. ఇది చాలా సార్లు నిరూపితమైన వాస్తవం. పరస్పరం కత్తులు దూసుకున్న నేతలు కూడా.. వైరాలను పక్కన పెట్టి కావలించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో ఈ ట్రెండ్ ఎక్కువగా కనిపిస్తోంది. ( మిగతా ప్రాంతాల్లో ఈ ట్రెండ్ లేదని కాదు... అయితే ప్రస్తుత సందర్భం రాయలసీమది కాబట్టి.. కాస్త స్ట్రెస్ చేశానంతే)
పులివెందుల రాజకీయం భలే వింతగా అనిపిస్తోంది. బాబాయ్ వివేకానందరెడ్డి, అబ్బాయి జగన్మోహన్‌రెడ్డిల వ్యవహార శైలి.. వారినడుమ ఫ్యామిలీ సెంటిమెంట్స్ బాగా రక్తి కట్టిస్తున్నాయి. చాలాకాలంగా.. నివురు గప్పిన నిప్పులా ఉన్న బాబాయ్-అబ్బాయిల విభేదాలు.. జగన్ రాజీనామాతో బయటపడ్డాయని అందరూ భావించారు. జగన్ పార్టీ పెట్టినా.. తాను అతని వెంట వెళ్లనని, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని వైఎస్ వివేకానందరెడ్డి ప్రకటించారు. అధిష్ఠానం అండదండలతో మంత్రి పదవినీ కొట్టేశారు. పైగా కీలకమైన వ్యవసాయ శాఖను పొందారు.
మంత్రి పదవిని పొందాక జగన్‌తో సయోధ్య కోసం.. అసలు ఏ పరిస్థితుల్లో మంత్రి పదవిని తీసుకోవాల్సి వచ్చిందో వివరించేందుకు వివేకానందరెడ్డి ప్రయత్నించినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే.. జగన్ గానీ, ఆయన వర్గం గానీ బాబాయిని దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. జగన్ ఇంటికి వచ్చినప్పుడు నిరసనలు కూడా వ్యక్తం చేశారు. ఈ దశలో.. వివేకా కడప మార్క్ ఆవేశంతో మీసాలు మెలేయడం కూడా ఇంకా స్మృతిపథం నుంచి తొలగిపోలేదు.
దీనికి తోడు.. మొన్న పులివెందులలో.. జగన్‌కి వ్యతిరేకంగా వివేకానందరెడ్డి వర్గం పంపిణీ చేసిన కరపత్రాలు వారి మధ్య దూరాన్ని బాగా దూరం చేశాయి. పదవీ లాలసతో బాబాయిని బలి చేయలేదా..? అసలు కుటుంబాన్ని చీల్చింది ఎవరు..? కాంగ్రెస్ అధిష్ఠానం ఓదార్పు యాత్రను ఎప్పుడు వద్దని చెప్పింది..? మందీ మార్బలంతో జైత్రయాత్రలా చేసినప్పుడు కాదా..? అని ఆ కరపత్రంలో జగన్‌ను లక్ష్యంగా చేసుకుని తిట్టిపోశారు. ఇదంతా వివేకా అనుమతితోనే సాగిందని ప్రచారం సాగింది.
అయితే.. ఉన్నట్టుండి సీన్ మారింది. క్రిస్మస్ సందర్భంగా.. బాబాయ్-అబ్బాయ్ లు ఇద్దరూ కలిసి పోయారు. ఆప్యాయతానురాగాలను పంచుకున్నారు. ఉమ్మడిగా క్రిస్మస్ కేక్ కట్ చేసి పరస్పరం తినిపించుకున్నారు. పైగా.. బాబాయ్ మరింత ముందుకు వెళ్లి.. కాంగ్రెస్ వాళ్లు జగన్‌ను తిడుతుంటే అసలు తట్టుకోలేక పోతున్నానని, ఎంతో బాధేస్తోందని కలవరపడిపోయారు. తాను జగన్ వెంట వెళ్లకపోవడంపై కుటుంబంలో అసంతృప్తి ఉంది అని చెప్పుకొచ్చారు.
ఇదంతా విన్న తర్వాత.. బాబాయ్-అబ్బాయ్ లది జగన్నాటకమా? అధిష్ఠానాన్ని పూర్తిగా దూరం చేసుకోకుండా, ఓ మార్గం ఉండేలా వేసిన ఓ ఎత్తుగడా..? అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీంతో.. క్రిస్మస్ సందర్భంగా తాను అన్న మాటలపై వివేకా హడావుడిగా వివరణ కూడా ఇచ్చుకున్నారు. తాను కాంగ్రెస్ అధిష్ఠానానికి, ముఖ్యంగా సోనియా గాంధీకి వీరవిధేయుడినని.. అనుమానాలను నివృత్తిచేసేందుకే దీన్ని చెబుతున్నానని వివేకా చెప్పారు.
మొత్తానికి పులివెందుల వేదికపై " బాబాయ్-అబ్బాయ్" ల "శత్రుత్వాలు.. ఆత్మీయతానుబంధాలు" ఓ మంచి ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాను చూస్తున్న ఫీల్‌ని ఇస్తోంది. వీరిద్దరి మధ్య బంధాలు..అనుబంధాలు మరెన్ని మలుపులు తిరుగుతాయో.. ఎలాంటి క్లైమాక్స్‌కు చేరతాయో.. కాలమే చెప్పాలి.
ఈ మలుపు కాంగీ వద్దా ?లేక జగ్గు పార్టీ వద్దా?
ReplyDeleteవిజయ్ గారు,
ReplyDeleteమీ పోస్ట్ బాగుంది. ఇది నిజంగా నాటకమే. నా లెక్క కరెక్ట్ అయితే, రాబోయే ఉపఎన్నికల ఫలితాలు కూడా లోపాయకారీ ఒప్పందాలమీదే ఆధారపడి ఉంటాయి. ఎవరో చెప్పినట్లు, మొత్తానికి ఓటర్లు అమాయకులు.
~శశిధర్ సంగరాజు.
www.sasidharsangaraju.blogspot.com