Thursday, December 30, 2010

హై క్యా నామ్‌ ఆప్‌ కా..?

మా సొంతూరు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు. మా ఊరికి ఎప్పుడు వెళ్లినా.. తేరుబజార్‌లో మా ఈశ్వరయ్య (వరుసకు బాబాయి.. కానీ వయసులో నాకన్నా ఓ రెండేళ్లే పెద్ద) కనిపించగానే ఓ చిరునవ్వు నవ్వుతాడు.. నేను వెంటనే "వాట్‌ ఈజ్‌ యువర్‌ నేమ్‌?" అని అడుగుతాను. ఆయన చెప్పే సమాధానంతో బిగ్గరగా నవ్వి అన్ని టెన్షన్లూ పోగొట్టుకుంటాను.

ఇంతకీ ఫ్లాష్‌బ్యాక్‌ ఏంటంటే.. నేను ఐదో తరగతి చదువుతున్నప్పడు ట్యూషన్‌కి వెళ్లేవాళ్లం. అప్పుడు నేను, మా ఈశ్వర్‌, చిన్నలచ్చి, వరాలు, కృష్ణవేణి ఆ ట్యూషన్‌ మేట్స్‌మి. ఓరోజు ట్యూషన్‌ మాస్టారు ఇంగ్లీషులో ప్రశ్నలు వేసి సమాధానాలు రాబడుతున్నారు. కృష్ణవేణిని లేపి.. వాటీజ్‌ యువర్‌ నేమ్‌ అని అడిగారు. ఆ అమ్మాయి ఠపీమని.. మైనేమ్‌ ఈజ్‌ కృష్ణవేణి అని సమాధానం చెప్పింది. ఆ వెంటనే (అసలు తెలుగులోనే దద్దూగాడైన) మా ఈశ్వర్‌ని లేపి.. వాటీజ్‌ యువర్‌ నేమ్‌ అని అడిగారు. క్షణం కూడా ఆలోచించకుండా.. మా వాడు మైనేమ్‌ ఈజ్‌ కృష్ణవేణి అని సమాధానం చెప్పేశాడు. (బహుశా దేశ తొలి ప్రధాని ఎవరు అన్న ప్రశ్నకు ఒకే సమాధానం ఉంటుందే అలా అనుకున్నట్టున్నాడు పాపం) ఇక ట్యూషన్‌ మొత్తం నవ్వులు విరబూశాయి. అప్పటినుంచి, ఇప్పటివరకూ మా ఈశ్వర్‌ని కలవగానే ఆ ఘట్టం నా స్మృతి పథంలో మెదులుతుంది. అప్రయత్నంగా వాట్‌ ఈజ్‌ యువర్‌ నేమ్‌ అన్న ప్రశ్న నోటినుంచి వచ్చేస్తుంది. మావాడు ఇప్పటికీ తేలిగ్గా నవ్వేస్తూ మై నేమ్‌ ఈజ్‌ కృష్ణవేణి అనే సమాధానం చెబుతాడు.

ఇదే క్రమంలో నాకు మరో బంధువు వేంకటేశ్వర్లు. ఈయన నాకు మామయ్య వరుస అవుతాడు. వయసులో ఆట్టే అంతరం లేదు. తను హిందీలో పరమ పూర్‌. ఒక్క అక్షరం ముక్కా అర్థమై చావదు అని హిందీని, హిందీ మాస్టార్‌ని తెగ తిట్టిపోసేవాడు. అట్లాంటివాడు.. పరీక్షల్ని భలే గమ్మత్తుగా ఫేస్‌ చేసేవాడు. ప్రశ్నని వెనక నుంచి ముందుకి.. అందులోని పదాలనే అటు ఇటు తిప్పి సమాధానాలు రాసి వచ్చేవాడు. ఆ క్రమంలో నాకు బాగా గుర్తుండి పోయిన మా మామయ్య "ప్రశ్న-సమాధానం" ఇది :

ఆప్‌కా నామ్‌ క్యా హై..?
హై క్యా నామ్‌ ఆప్‌కా..?

మా ఎమ్మిగనూరులో ముస్లింల భాష భలే సరదాగా ఉంటుంది. మా బషీర్‌ బావ.. తన కొడుకుతో ఎట్లా మాట్లాడుతుండేవాడో ఓసారి పరిశీలించండి :

క్యారే ఉస్‌ సే పూఛ్‌కే ఆయా క్యా.. ..? (ఏరా వాడిని అడిగి వచ్చావా..?)
ఆ పూచా ( ఆ అడిగా..? )
క్యా పూచా..?
అన్నా దుడ్లియ్యల్లంట అని పూచా.. (దుడ్లు అంటే డబ్బు)
ఉన్‌ క్యా బోలా..? (వాడేమన్నాడు..?)
రేపిస్తాను బోలా..?
అరే మాకీ... ధబానా నై.. (అరే నీయ... దబాయించొద్దా..?)
దబాయా... (దబాయించినా..)
క్యా దబాయా... (ఏమి దబాయించినావ్‌)
లేదన్నా మానాయన తిడతాడు.. ఈ ఫొద్దే ఇయ్యల్లంట బోలా..!
ఫిర్‌ ఓ క్యా బోలా..?
లేదప్పా ఉంటే ఇయ్యనా..? బుధవారమిస్తానని చెప్పు బోల్‌కే బోలా..
అరే మాకీ.. పైసా వసూల్ కర్నే నై ఆతారే తుమ్‌కో.. షరమ్‌నై.. కైసా జీతాకీ కైసా మర్‌తాకీ... ఛల్‌

ఎందుకో ఈ మధ్య తరచూ ఇట్లాంటి ఘటనలు పదే పదే గుర్తొస్తున్నాయి. ఇవిఆనందాన్ని కలిగించడంతో పాటు గుండెనూ బరువెక్కిస్తాయి. జన్మభూమిని, ఆత్మీయులనే కాదు అంతులేని ఆనందాన్ని అక్కడే వదిలి, ఉద్యోగం కోసం ఊరూరూ తిరుగుతూ పోతున్నాను. మళ్లీ నేను పుట్టినూరికి శాశ్వతంగా ఎప్పుడు వెళతానో ఏంటో..? మా అబ్బాయి జీవితం ఓ దారికొచ్చాక.. ఆ ఊళ్లో స్థిరనివాసం గురించిన ప్రయత్నాలు చేయాలి.

2 comments:

  1. బావుంది విజయకుమార్ గారూ,
    ఇలాంటివి తల్చుకుని చిరునవ్వునవ్వుకోనివారుంటారా?

    ReplyDelete
  2. విజయ్ గారు,
    మీ పోస్ట్ చూసి నిజంగా నవ్వాపుకోలేక పోతున్నాను. కడపలో ముస్లిమ్ మిత్రుల సంభాషణలు దాదాపు ఇలాగే ఉంటాయి. Thanks a lot for reminding me the old days.

    ~Sasidhar
    www.sasidharsangaraju.blogspot.com

    ReplyDelete