Saturday, December 25, 2010

విస్మయం..!!

బూటకపు ఎన్ కౌంటర్ వంటి అమానవీయమైన, చట్టవ్యతిరేకమైన లక్ష్యాన్ని చత్తీస్ గఢ్ పోలీసులు న్యాయస్థానంలోనూ సాధించగలిగారు. పౌరహక్కుల ప్రజాసంఘం నాయకుడూ, మూడు దశాబ్దాలుగా చత్తీస్ గఢ్ గిరిజనులకు వైద్య సేవలు అందిస్తున్న మానవతావాదీ డాక్టర్ వినాయక్ సేన్ కు రాయపూర్ సెషన్స్ కోర్టు శుక్రవారంనాడు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. డాక్టర్ సేన్ తో పాటు మావోయిస్టు మేధావి నారాయణ్ సన్యాల్ కూ, కోల్ కతా వ్యాపారి పీయూష్ గుహాకు కూడా యావజ్జీవ శిక్ష పడింది. డాక్టర్ సేన్ పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ చత్తీస్ గఢ్ విభాగం ప్రధానకార్యదర్శి, ఆ సంస్థకు జాతీయ స్థాయి ఉపాధ్యక్షడు. నిరుపేద గిరిజనులకు నిస్వార్థంగా సేవలందిస్తున్నందుకు డాక్టర్ సేన్ కు 2004తో రాయవెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజి పాల్ హారిసన్ అవార్డు ప్రదానం చేసింది. గ్రామీణ ప్రాంతాలలో అంకితభావంతో వైద్యం చేస్తున్నందుకు 2007లో కైతాన్ స్వర్ణ పతకం ఇచ్చి సత్కరించారు. ప్రపంచ ఆరోగ్యరంగానికి అందించిన సేవలను దృష్టిలో పెట్టుకొని 2008లో జోనథన్ మన్ అవార్డు బహుకరించారు. గ్రామీణ పేదలకు వైద్యం చేయడంలో తన అనుభవాలను తెలియజేస్తూ డాక్టర్ సేన్ రాసిన వ్యాసాలకు అంతర్జాతీయ ప్రశస్తి ఉంది. కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న ఆపరేషన్ గ్రీన్ హంట్ ను డాక్టర్ సేన్ వ్యతిరేకించిన మాట వాస్తవమే. దేశంలోనూ, విదేశాలలోనూ అనేకమంది హక్కుల కార్యకర్తలు ఈ అనాగరికమైన ఆపరేషన్ ను వ్యతిరేకిస్తున్నారు. డాక్టర్ సేన్ బూటకపు ఎన్ కౌంటర్లను ఖండించిన మాట కూడా నిజమే. ఇన్ఫార్మర్లనే అనుమానంతో అమాయక గిరిజనులను మావోయిస్టులు చంపడాన్ని సైతం డాక్టర్ సేన్ అంతే నిర్ద్వంద్వంగా ఖండించాడు. చట్టం సవ్యంగా అమలు జరగకపోతే ప్రశ్నించడమే డాక్టర్ సేన్ చేసిన నేరం. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎవరు అమానుషంగా ప్రవర్తించినా ఎత్తి చూపడమే ఆయన చేసిన తప్పిదం. భారత శిక్షాస్మృతి 120 బీ, సెక్షన్ 124 ఎ కింద నేరం రుజువైనట్టు న్యాయమూర్తి ప్రకటించారు. సెక్షన్ 124 ఎ అంటే ఏమిటంటూ 58 సంవత్సరాల డాక్టర్ సేన్ అడిగిన ప్రశ్నకు రాజద్రోహం అంటూ జస్టిస్ వర్మ సమాధానం చెప్పారు. ఈ తీర్పు ప్రజాస్వామ్యవాదులకు విస్మయం కలిగించింది. దిగ్భ్రాంతి కలిగించింది. పేదలకోసం జీవితాన్ని అంకితం చేసిన హక్కుల యోధుడు రాజద్రోహానికి పాల్పడినట్టు నిరాధారమైన సాక్ష్యాల ప్రాతిపదికగా కోర్టు ధ్రువీకరించడం, శిక్ష విధించడం భారత న్యాయవ్యవస్థకు అపకీర్తి తెస్తుందనడంలో సందేహం లేదు. రెండున్నర సంవత్సరాలుగా డాక్టర్ సేన్ పైన వచ్చిన అభియోగాలపై సెషన్స్ కోర్టు విచారణ జరుపుతున్న కాలంలో కేసు కొట్టివేయాలనీ, డాక్టర్ సేన్ ను విడుదల చేయాలని కోరుతూ దేశంలోనూ, విదేశాలలోనూ మానవహక్కుల కార్యకర్తలూ, ప్రజాస్వామ్య ప్రియులూ అనేక ప్రదర్శనలు నిర్వహించారు. ప్రజాసామ్య విలువలను కానీ, ప్రాథమిక న్యాయ సూత్రాలను కానీ పట్టించుకోకుండా చత్తీస్ గఢ్ లోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం డాక్టర్ సేన్ కు శిక్ష పడే విధంగా న్యాయస్థానంలో వాదించింది. కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏకి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధికార ప్రదినిధి, స్వయంగా సుప్రీంకోర్టు న్యాయవాది అయిన అభిషేక్ సింఘ్వీ రాయపూర్ కోర్టు తీర్పును పరోక్షంగా సమర్థిస్తూ మాట్లాడారు. మానవ హక్కుల ఉల్లంఘన విషయంలో అధికార పార్టీ, ప్రధాన ప్రతిపక్షం ఏకాభిప్రాయంతో ఉన్నట్టు డాక్టర్ సేన్ ఉదంతం మరోసారి రుజువు చేసింది. సంతకం లేని, టైపు చేసిన ఒక లేఖను కోర్టులో సాక్ష్యంగా ప్రవేశపెట్టింది ప్రాసిక్యూషన్. అది నారాయణ్ సన్యాల్ రాసిన లేఖ అనీ, దాన్ని డాక్టర్ సేన్ పీయూష్ గుహాకు అందజేసి కొరియర్ గా వ్యవహరించారనీ ప్రాసిక్యూషన్ అభియోగం. అది కూడా ప్రాసిక్యూషన్ కేసు ప్రారంభంలో పేర్కొన్న అభియోగాల జాబితాలో లేదు. తర్వాత చేర్చింది. ఒక పోలీసు అధికారి చెప్పిన సక్ష్యాన్నీ, పోలీసులు సృష్టించిన ఈ లేఖనూ ఆధారం చేసుకొని న్యాయమూర్తి జస్టిస్ బీపీ వర్మ తీర్పు చెప్పారు. 2006నాటి చత్తీస్ గఢ్ స్పెషల్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ ,1967నాటి అన్ లాఫుల్ యాక్టివిటీస్ (ప్రివెన్షన్)యాక్ట్ కింద డాక్టర్ సేన్ ను నేరస్తుడిగా నిర్థారించడం మరింత విచారకరం. ఈ రెండు భయానక చట్టాలనూ రద్దు చేయాలని పౌరహక్కుల నేతలూ, ప్రజాస్వామ్యవాదులూ చాలాకాలంగా ఘోషిస్తున్నారు.

ఆపరేషన్ గ్రీన్ హంట్ తాలూకు ప్రభావం రాజ్యంలోని అన్ని వర్గాలపైనా పడుతున్నదనడానికి నిదర్శనంగా జస్టిస్ వర్మ తన తీర్పులో ప్రస్తావించిన అంశాలను పేర్కొనవచ్చు. ఉగ్రవాదులూ, మావోయిస్టులూ విచక్షణరహితంగా పోలీసులనూ, సాయుధ బలగాలనూ, అమాయక గిరిజనులనూ చంపుతూ దేశం అంతటా భయాన్నీ, బీభత్సాన్ని, అవ్యవస్థనూ వ్యాపింపజేస్తున్న కారణంగా నిందితులను ఉపేక్షించరాదంటూ జస్టిస్ వర్మ వ్యాఖ్యానించారు. డాక్టర్ సేన్ కు ఉన్నత న్యాయస్థానం రెండేళ్లుగా బెయిలు మంజూరు చేయడానికి నిరాకరించడం సైతం ఈ మానసిక స్థితికి అద్దం పడుతోంది.

ఎన్ కౌంటర్ జగినట్టు ప్రజలను నమ్మించడానికి పోలీసులు సర్వసాధారణంగా ఎటువంటి పనులు చేస్తారో ప్రజలకు మూడున్నర దశాబ్దాలుగా తెలిసిందే. డాక్టర్ సేన్ రాజద్రోహానికి ఒడిగట్టాడని న్యాయస్థానాన్ని ఒప్పించేందుకు దాదాపుగా అటువంటి పనులే చేయడం విశేషం. పోలీసులు సాక్ష్యాధారాలను సృష్టించారనీ, కీలకమైన సాక్షులు ఎదురు తిరిగేట్టు చేశారనీ, దొంగ పత్రాలను సృష్టించారనే ఆరోపణలు అనేకం వచ్చాయి. డాక్టర్ సేన్ భార్య ప్రొఫెసర్ ఇలీనా సేన్ ఢిల్లీలోని ఇండియన్ సోషల్ ఇన్ స్టిట్యూట్(ఐఎస్ఐ) లో పని చేస్తున్న ఒక వైద్యుడికి ఇంటర్నెట్ లో మెయిల్ పంపితే పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్ ఐకి మెయిల్ పంపినట్టు అన్వయించడం, ఐఎస్ఐతో డాక్టర్ సేన్ కు సంబంధాలు ఉన్నట్టు నిర్థారించడం ఏ రకమైన న్యాయమో తెలియదు. అదే విధంగా అమెరికా శ్వేతభవనంలో నివసిస్తున్న వ్యక్తిని చింపాంజీగా అభివర్ణించడాన్ని కూడా న్యాయస్థానం నేరంగా పరిగణించింది. చింపాంజీ అన్నది ఉగ్రవాదుల సంకేతభాష అంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసిన వాదనను న్యాయమూర్తి జస్టిస్ బీపీ వర్మ అంగీకరించడం విడ్డూరం.

మావోయిస్టులతో కలిసి డాక్టర్ సేన్ రాజద్రోహానికి పాల్పడుతున్నారని నిరూపించడానికి మావోయిస్టు నాయకుడిగా ముద్రవేసిన నారాయణ్ సన్యాల్ తో సేన్ కు సంబంధాలు ఉన్నాయని ప్రాసిక్యూషన్ వాదించింది. రాయపూర్ జైలులో 2006 నుంచీ ఖైదీగా ఉన్న నారాయణ్ సన్యాల్ ను కలుసుకోవడాన్ని మావోయిస్టులకు సహాయం చేయడంగా పరిగణించడంలో అర్థం లేదు. పౌరహక్కుల నేతగా డాక్టర్ సేన్ సన్యాల్ ను జైలులో కలుసుకున్న ప్రతిసారీ వారిద్దరూ అధికారుల సమక్షంలోనే మాట్లాడుకున్నారు. రహస్య సమాలోచన జరిపింది లేదు. ఈ సంగతి జైలు అధికారులే స్వయంగా కోర్టులో చెప్పారు. పోలీసు కేసులో పసలేదని డిఫెన్స్ లాయరు చేసిన వాదనను న్యాయమూర్తి పట్టించుకోలేదు.

చత్తీస్ గఢ్ ప్రజలకు వైద్య సేవలు అందడం లేదనీ, మావోయిస్టులకూ, పోలీసులకూ మధ్య జరుగుతున్న పోరాటం కారణంగా వైద్యులు అక్కడ నివాసం ఏర్పరచుకొని పేదలకు వైద్యం చేయడానికి సిద్ధంగా లేరనీ ప్రముఖ రచయిత్రి అరుంధతీరాయ్ కొన్ని మాసాల కిందట మావోయిస్టులతో కలిసి నడిచిన తర్వాత వెల్లడించారు. పేద గిరిజనులను ప్రభుత్వాలు పట్టించుకోవు. పట్టించుకున్న మానవతావాదులను సహించలేవు. వేలమంది మరణానికి కారకులైన భోపాల్ కార్బయిడ్ సంస్థ అధికారులకు 1984లో రెండుమూడేళ్లు శిక్ష విధించిన న్యాయవ్యవస్థ పేద గరిజనులకోసం పరితపించిన హక్కుల నేతకు యావజ్జీవ కారాగార శిక్ష విధించడం ఎటువంటి మానసిక స్థితిని సూచిస్తున్నదంటూ అరుంధతి అడిగిన ప్రశ్నకు సమాజం సమాధానం చెప్పుకోవాలి. ఎటువంటి రాజ్య స్వభావాన్ని ఈ తీర్పు వెల్లడిస్తున్నదో తెలుసుకోవాలి. వెంటనే ఉన్నత న్యాయస్థానానికి అప్పీలు చేసుకోవడానికి వ్యవధి లేకుండా హైకోర్టు సెలవలు ప్రారంభం కాబోయే సమయంలో తీర్పు వెలువరించడంలోని ఆంతర్యాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ప్రజాస్వామ్య ప్రియులందరూ డాక్టర్ సేన్ కు సంఘీభావం ప్రకటించవలసిన సందర్భం ఇది. చత్తీస్ గఢ్ సర్కార్, పోలీసులు చేస్తున్న బూటకపు వాదనలను ఖండించవలసిన సమయమిది. డాక్టర్ సేన్ వంటి మానవతావాదికి కోర్టు జైలు శిక్ష విధించిన పక్షంలో మావోయిస్టులూ, పోలీసుల మధ్య సంఘర్షణ జరుగుతున్న ప్రాంతాలలో వైద్య సహాయం లేక రాలిపోతున్న గిరిజనులను రక్షించడానికి ఏ వైద్యుడూ ముందుకు రాడు. రాక్షస చట్టాలనూ, హక్కుల ఉల్లంఘననూ ప్రశ్రించడం కారాగారవాసానికి దారి తీస్తుందంటే ప్రభుత్వాల, పోలీసుల అరాచకలను ప్రశ్నించే సాహసం ఎవ్వరూ చేయరు. పాలకుల నిరంకుశ ధోరణులకూ, అప్రజాస్వామిక విధానాలకూ అడ్డూఅదుపూ లేకుండా పోతాయి. పౌరులు కోరుకునే చట్టపాలన చట్టుబండలైపోతుంది.

(ఈ వ్యాసాన్ని hmtv చీఫ్‌ ఎడిటర్‌ శ్రీ రామచంద్రమూర్తి గారు "హంసధ్వని" సంపాదకీయం కోసం రాశారు. శ్రీ మూర్తి గారి ఇతర "హంసధ్వని " వ్యాసాల కోసం www.hmtvhamsadhwani.blogspot.com

చూడవచ్చు. - విజయ్‌

1 comment:

  1. టైపు చేసిన ఉత్తరాలను కోర్టు సాక్ష్యంగా స్వీకరించిందని చదివి ఆశ్చర్యపోయాను. గిరిజన సంక్షేమంకోసం పాటుపడే మరో మానవతావాది జైలు పాలవడం దారుణం.
    మరిన్ని హంసధ్వని వ్యాసాలు మాకు పరిచయం చెయ్యగలరు.

    ~శశిధర్
    www.sasidharsangaraju.blogspot.com

    ReplyDelete