గడచిన రెండు రోజులుగా రాష్ట్ర రాజధానిలో జరిగిన పరిణామాలు పరిశీలించిన కొందరు ఆఫీసు మిత్రులు చిత్రవిచిత్రమైన చర్చలు సాగిస్తున్నారు. ముందుగా తెలంగాణ ప్రాంతానికి చెందిన మిత్రుల వాదన వినిపిస్తా.. కాంగ్రెస్ తెలంగాణ ప్రాంత ఎంపీలు దీక్షలు చేయడం.. దానికి రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల్లో స్పందించడం చూసి.. తెలంగాణ మిత్రులు సంధించిన ప్రశ్న ఏంటంటే... తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇదే తరహాలో రాష్ట్ర విభజన కోసం ఎందుకు దీక్ష చేయరు..?
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత ఎంపీలు ఒక్కతాటిపైకి వచ్చి నిరాహార దీక్షకు కూర్చోగానే రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో విద్యార్థులపై ఉన్న కేసులన్నింటి ఎత్తివేయాలని నిర్ణయించింది. ఇదే అంశంపై అసెంబ్లీలో... అన్ని పార్టీలు నెత్తీ నోరు బాదుకున్నా కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు స్పందించలేదు. చివరికి తమ పార్టీ ఎంపీలే నిరాహార దీక్షకు కూర్చునే సరికి.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఎంపీల దీక్షలు 28 గంటలు సాగాయో లేదో ప్రభుత్వంలో తీవ్రమైన కదలిక వచ్చింది. పది పదిహేను సార్లు దఫదఫాలుగా చర్చోపచర్చలు సాగించి.. ఈ నిర్ణయం తీసుకుంది. మంత్రులు జానారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలను పంపి.. సర్కారు నిర్ణయాన్ని తెలిపి ఎంపీలతో దీక్షలు విరమింప చేసింది.
మరి రాష్ట్ర విభజన అంశంపై వీరు ఎందుకు ఇలాంటి దీక్షలకు కూర్చోరు..?
ఓ వెర్రి నవ్వు నవ్వి.. పక్కకు తప్పుకోబోయేలోగా.. అటువైపు ఛాంబర్ దగ్గరున్న సీమాంధ్ర మిత్రుల గుసగుసలు వినిపించాయి..? ఏంటా అని ఆరా తీస్తే.. వారూ కాంగ్రెస్ ఎంపీల దీక్షలు.. ప్రభుత్వ స్పందన మీదే మాట్లాడుతున్నారు. టిఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావుకు ఆ మాత్రం తెలియకుండా ఎలా ఉంటుంది..? అన్నది వారి ప్రశ్న. కాంగ్రెస్ ఎంపీలు 24 గంటలు రోడ్డుమీద కూర్చోగానే, ప్రభుత్వం స్పందించింది. దీన్ని బట్టి ఎవరిపై ఒత్తిడి తెస్తే పనవుతుందో అర్థమవుతోంది. కాంగ్రెస్ నాయకులు తలచుకుంటే.. ఏదైనా సాధించుకురాగలరు. పంతం పడితే వారికి అసాధ్యమన్నది లేదు అన్నది ఇవాళ్టి దీక్షలతో అర్థమై పోయింది. మరి అంతటి శక్తిమంతమైన కాంగ్రెస్ వాళ్లని వదిలేసి.. కెసిఆర్‌గారు, చంద్రబాబునాయుడిని, తెలుగుదేశం పార్టీ నాయకుల్నే ఎందుకు పనిగట్టుకుని తిడుతుంటారు..? అన్నది సీమాంధ్ర మిత్రులు సంధించిన ప్రశ్న.
ఎవరి వాదన వారిది..? ఎవరి ప్రశ్నలు వారివి..? వీటికి విక్రమార్కుడు కూడా సమాధానం చెప్పలేడేమో. ఇంతకీ ఈ ఎపిసోడ్స్‌లో నిందించాల్సిందీ.. నిలేయాల్సింది ఎవరిని..? ఏమో..! కాలమే చెప్పాలి.
విజయ్ గారు,
ReplyDeleteదొంగలు, దొంగలు కలసి ఊర్లు పంచుకున్నట్లు వీళ్ళంతా ఒకటే. మధ్యలో నష్టపోయేది సామాన్య ప్రజానీకమే. అన్ని సమస్యలకు సమాధానం ఓటరే చెప్పాలి.
~శశిధర్ సంగరాజు
www.sasidharsangaraju.blogspot.com