Saturday, December 11, 2010

లడ్డులో బోల్టు గోవిందా..!

అదేం ఖర్మో...! టిటిడి పదే పదే అదే తప్పులు చేసుకుంటూ పోతోంది. శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. తిరుమలేశుని భక్తులకు.. స్వామి దర్శనం ఎంత పుణ్యప్రదమో.. శ్రీవారి లడ్డూ ప్రసాదమూ అంతే పవిత్రం. తిరుమల పుణ్యక్షేత్రపు వేలుపు శ్రీవేంకటేశుడు.. దర్శన మాత్రాన్నే.... అనంత కోటి జన్మల పాపాలను హరిస్తాడట. దానికి శ్రీవారిలడ్డూ ప్రసాద సేవనమూ జోడైతే.. భవిష్యత్తులో అనంత కోటి జన్మలకు సరిపడా పుణ్యం వస్తుందట. శ్రీవారి భక్తుల దృష్టిలో లడ్డూకు ఉన్న విశిష్టత అటువంటిది.
అయితే.. టిటిడి అధికారుల నిర్లక్ష్యం పుణ్యమా అని ఈ లడ్డూ ప్రసాదం తరచూ వివాదాల్లో చిక్కుకుంటోంది. నాణ్యత, పరిమాణాల విషయంలో ఇప్పటికే శ్రీవారి లడ్డూపై వివాదాలున్నాయి. తాజాగా ఇప్పుడు.. స్వామి ప్రసాదంలో.. అడ్డదిడ్డమైన వస్తువులు వస్తుండడం భక్తులను నిశ్చేష్టులను చేస్తోంది.
మచిలీపట్నానికి చెందిన ఓ కుటుంబం ప్రత్యేక దర్శనం టికెట్‌కు ఇచ్చిన రెండు లడ్లను తినేందుకు ప్రయత్నించగా.. అందులో ఒకటిన్నర ఇంచు సైజులో ఉన్న బోల్టు కనిపించింది. దీంతో వాళ్లు హతాశులయ్యారు. టిటిడి సిబ్బంది నిర్లక్ష్యానికి దిగ్భ్రాంతి చెందారు.
టిటిడి సిబ్బంది.. భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని.. ఇట్లాంటివి పునరావృతం కాకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టిటిడి అధికారులు వీరి ఆవేదనను ఏమేరకు పరిగణలోకి తీసుకుంటారో... ఇలాంటివి మళ్లీ జరక్కుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.

1 comment:

  1. laddullo iron content ni koodaa kaluputhunnaamani TTD-E sanghatana dwaaraa manaki chebuthondemo..sir

    ReplyDelete