Monday, December 20, 2010

ఊబకాయుడు అంటే నపుంసకుడు..!

కొన్ని పదాలు పూర్తి భిన్నమైన అర్థాన్ని ఎలా సంతరించుకుంటాయో ఎంత గింజుకున్నా అర్థం కాదు. అట్లాంటిదే ఊబకాయం అనే పదానికి అర్థం. ఊబకాయుడు అంటే లావుపాటి మనిషి అని అర్థం చెప్పుకుంటున్నాం. కానీ.. నిఘంటు అర్థాలు వేరుగా ఉన్నాయి.

ఊబ అంటే నపుంసకుడు అని అర్థం.
కాయం అంటే శరీరం అని అర్థం.
అంటే ఊబకాయం అన్న పదానికి నపుంసకుడి శరీరం అని అర్థం చెప్పుకోవాల్సి ఉంటుంది.

బహుశా దీన్ని ఉబ్బర కాయం అని చెప్పాలనుకుని.. ఊబకాయంగా స్థిరపరిచారేమో పాపం.
ఉబ్బర అంటే ఉబ్బుట లేదా అతిశయం అని అర్థాలున్నాయి.
బాగా లావుగా ఉబ్బుతున్న వ్యక్తిని ఉబ్బర దేహుడనో.. ఉబ్బర కాయుడనో అనొచ్చు. అంతేకానీ, ఊబకాయం అన్నది సరైన పదం కాదు. ఓ రకంగా ఇది నిందార్థకం (తిట్టు) అని చెప్పొచ్చు.

ఇట్లాంటిదే బొబ్బట్లు అనే పదం కూడా.
నిజానికి ఈ పదం సరైన రూపం.. "ఒబ్బట్లు" అంటుంది శబ్దరత్నాకరం
ఒబ్బట్లు = ఒమ్ము + అట్లు
ఒమ్ము అంటే బలుపు, స్థూలము అని అర్థం (స్థూలము అంటే బలిసినది అని అర్థం)
అట్టు అంటే దోసె లేదా పెనంపై కాల్చి వండే పిండిపదార్థము అని అర్థం చెప్పుకోవచ్చు (అట్టు అంటే ఆపూప విశేషం అంటుంది శబ్దరత్నాకరం)

బొబ్బ అంటే పొక్కు, సింహనాదము, పెద్ద అరుపు అని అర్థం... మరి వీటితో అట్లు ఎలా వేయగలిగారో అర్థం కాదు.
బహుశా బొబ్బ అంటే చర్మం కాలగానే ఉబ్బుతుంది కదా.. ఆ రకంగా ఉబ్బే అట్టు అన్న భావంలో దీన్ని బొబ్బట్టుగా స్థిరపరిచారేమో..
దీని అసలు రూపమైతే.. ఒబ్బట్టు. ఎలా ప్రయోగించినా మీ ఇష్టం.

1 comment:

  1. విజయ్ గారూ,
    ఊబకాయం అంటే, ఈ అర్థం ఉన్నట్లు ఇంతవరకూ నాకు తెలియదు.
    తెలియజెప్పినందుకు ధన్యవాదాలు.

    ~శశిధర్

    www.sasidharsangaraju.blogspot.com

    ReplyDelete