Tuesday, November 30, 2010

బాబాయి దూరమవడం.. జగన్‌ స్వయంకృతం....!


బాబాయి అబ్బాయి రాజకీయంగా విడిపోయారు. కాంగ్రెస్‌ వంచకి అని అబ్బాయి విమర్శిస్తుంటే.. అబ్బే అదేం కాదు.. పార్టీ ది బెస్ట్‌ అని బాబాయి వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. ఇడుపులపాయలో బాబాయి అబ్బాయి మధ్య సయోధ్య కుదురుతుందని.. ఇద్దరూ కలిసి పోతారని అందరూ భావించారు. వివేకానందరెడ్డి కుటుంబానికే ప్రాధాన్యతనిస్తారని ఊహించారు. అయితే.. వివేకానందరెడ్డి, అన్న వైఎస్సార్‌ గారి కుటుంబం కన్నా, కాంగ్రెస్‌ కుటుంబమే ముఖ్యం అని తెగేసి చెప్పారు.

ఇప్పుడు బాబాయి-అబ్బాయి విడిపోవడానికి కాంగ్రెస్‌ అధిష్ఠానమే కారణమా..? కొన్నేళ్లుగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే.. ఈ ప్రశ్నకు సమాధానం తేలిగ్గా దొరుకుతుంది.

2003వ సంవత్సరం వరకూ.. జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర రాజకీయాలకు పూర్తి దూరంగా ఉన్నారు. తండ్రి చాటు బిడ్డగా.. పవర్‌ ప్రాజెక్టు యజమానిగా.. కొనసాగారు. అయితే.. 2004లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే.. జగన్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని విశ్వప్రయత్నాలు చేశారు. తండ్రి ఆశీస్సులతో ఏకంగా పార్లమెంటులోకే ప్రవేశించాలని ఉవ్విళ్లూరారు. తనయుడిపై మమకారంతో.. వైఎస్సార్‌ కూడా జగన్‌ ఉత్సాహాన్ని కాదనలేక పోయారు. తనయుడి కోసం తమ్ముడినే బలిపశువును చేయాలని చూశారు. దీంతో మనస్తాపానికి గురైన వివేకానందరెడ్డి, ఎంపీ స్థానాన్ని వదులుకుని రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని అప్పట్లో అలక వహించారు. వైఎస్‌ఆర్‌, ఆయన తనయుడు జగన్‌ దీన్ని ఆమోదించినట్లే కనిపించింది. అయితే.. ఈ రచ్చ పార్టీకి ఇబ్బందికరంగా మారడంతో.. పార్టీ అధిష్ఠానదేవత సోనియాగాంధీ, జోక్యం చేసుకున్నారు. దీంతో, వివేకా రాజీనామా, జగన్‌ రాజకీయ రంగ ప్రవేశం అంశాలు అప్పటికి నిలిచిపోయాయి. ఈ ఘట్టం నుంచే జగన్‌.. బాబాయి వివేకా అంటే గుర్రుగా ఉంటున్నారన్న వార్తలున్నాయి.

2004 ఎన్నికల్లో పంతం నెగ్గించుకోలేక పోయినా.. 2009 ఎన్నికల్లో జగన్మోహన్‌రెడ్డి వివేకానందరెడ్డిని రాజకీయంగా నియంత్రించడంలో సఫలమయ్యారు. బాబాయి వివేకా ప్రాతినిథ్యం వహించిన కడప పార్లమెంటరీ స్థానం నుంచి జగన్ పోటీ చేసి గెలిచారు. దురదృష్టవశాత్తూ వైఎస్సార్‌ చనిపోయాక, పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని కూడా వివేకా ఆశించినట్లు వార్తలు వచ్చాయి. అయితే అప్పుడూ ఆయన మనోభీష్టం నెరవేరలేదు. నానా అవస్థలూ పడి.. ఎమ్మెల్సీ పదవిని సంపాదించుకోగలిగారు.

జగన్‌మోహనరెడ్డి ఆగస్టు నెల్లో.. కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని ధిక్కరిస్తూ.. రెండో విడత ఓదార్పు యాత్ర తలపెట్టినప్పుడు కూడా వివేకానందరెడ్డి విభేదించారు. తాను సోనియాకు విధేయుడినంటూ ఓ లేఖనూ రాశారు.

తాజాగా, రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మార్చే ఘట్టంలోనూ.. వివేకానందరెడ్డి, అన్నగారి అబ్బాయి జగన్‌ని విభేదించారు. అధిష్ఠానం ఆధిపత్యాన్ని అంగీకరించారు. పైగా తనకు మంత్రి పదవి కావాలని ఆయన విన్నవించుకున్నారు. ఈ క్రమంలో.. వివేకాకు మంత్రి పదవి ఖాయమన్న వార్తలు వచ్చాయి.

దీంతో అలిగి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన జగన్‌తో ఈ ఉదయం వివేకా విడిగా భేటీ అయ్యారు. వీరి భేటీ కేవలం రెండు నిమిషాలకే పరిమితమైంది. హాల్‌లోకి వెళ్లీ వెళ్లగానే.. జగన్‌ బాబాయిపై ఆగ్రహం వ్యక్తం చేశారని.. దీంతో మనస్తాపానికి గురైన వివేకా.. జగన్‌కు దూరంగా కాంగ్రెస్‌ పార్టీలోనే ఉండాలని నిర్ణయించుకున్నారని వదంతులు వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవ నిజానిజాలెంతోగానీ.. వివేకానందరెడ్డి, జగన్‌ను కాదని, కాంగ్రెస్‌ అధిష్ఠానంతోటే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. దాదాపు ఆరేడేళ్లుగా బాబాయి-అబ్బాయిల మధ్య కొనసాగుతున్నస్పర్థల నేపథ్యాన్ని.. అధిష్ఠానం, చక్కగా వినియోగించుకున్నట్లు స్పష్టమవుతోంది. వివేకా దూరం కావడం జగన్‌కు కాస్త చికాకు కలిగించే అంశమే.

No comments:

Post a Comment