జగన్మోహన్‌రెడ్డి కడప పార్లమెంటు సభ్యత్వానికి, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసేశారు. తన నిర్ణయానికి కారణాలేంటన్నది ఆయనే తన ఐదు పేజీల బహిరంగ లేఖలో రాశారు.
జగన్ బహిరంగ లేఖలోని కీలకాంశాలు :
- పదవుల ఆశ చూపి కుటుంబంలో చిచ్చు రేపారు
- తనను బయటకు పంపేందుకు సాక్షి కథనాన్ని బూతద్దంలో చూపారు
- తనను ఒంటరిని చేయాలని విశ్వప్రయత్నాలు చేశారు.
- ఓదార్పు యాత్రపై అనవసర రాజకీయ రాద్దాంతం చేశారు
- వైఎస్సార్ ఫోటోలను ఉద్దేశపూర్వకంగానే సభల్లో పెట్టలేదు
- తనకు, తల్లి విజయమ్మకు అపాయింట్‌మెంట్ విషయంలో నెల్లాళ్లు వేచిచూసేలా చేశారు
- చిన్నాన్నవివేకానందరెడ్డికి, చిరంజీవికి.. మేడం సోనియా.. క్షణాల్లో ఎలా అపాయింట్‌మెంట్ ఇచ్చారు..?
- వైఎస్సార్ మృతిపై కంటితుడుపు దర్యాప్తు చేయించారు.
ఈ అన్ని కారణాల వల్ల తాను మనస్తాపానికి గురై రాజీనామా చేసినట్లు జగన్ ప్రకటించారు. ఆయన బాటలోనే వైఎస్సార్ సతీమణి, జగన్ తల్లి విజయలక్ష్మి, పులివెందుల శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు.
జగన్ రాజీనామా తర్వాత రాష్ట్రంలో రాజకీయాలు ఏఏ మలుపులు తిరిగే అవకాశం ఉంది..? ఏ ఏ పార్టీకి ఎలాంటి ఫలితాలను ఇవ్వనుంది..?
జగన్ వ్యూహమేంటి..?
ప్రస్తుతం తల్లితో కలసి.. జగన్మోహన్‌రెడ్డి పదవులకు రాజీనమా చేసినా.. తన అనుచర ఎమ్మెల్యేలను రాజీనామా చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇది వ్యూహాత్మకమేనని అర్థమవుతోంది. ఇప్పటికిప్పుడు తన అనుచరులను రాజీనామా చేయిస్తే.. కేవలం 20 లోపు ఎమ్మెల్యేలే బయటికి వస్తారు. దీని వల్ల జగన్ సాధించేది గానీ.. అధిష్ఠానం మెడలు వంచే అవకాశం గానీ ఉండదు. జగన్ వెంట ఎంతమంది ఉన్నారో అన్న ఊహాగానాల చర్చను సజీవంగా ఉంచుతూనే... మరికొంత మంది ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకునేందుకు.. జగన్ శిబిరం ప్రయత్నిస్తుందన్న భావన కలుగుతోంది.
చిరు పైనే గురి..?
జగన్ శిబిరం తక్షణ గురి ప్రజారాజ్యం పార్టీ పైనే ఉంటుందన్నది తేలిగ్గా అర్థమవుతుంది. ఇప్పటికే.. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి దంపతులు.. జగన్ కుటుంబంతో వియ్యమందారు. వీరికి ప్రజారాజ్యంలో కొనసాగడం కన్నా.. జగన్‌తో అనుబంధాన్ని కొనసాగించడమే కీలకంగా మారుతుంది. వీరికి ఉన్న ఇమేజ్ దృష్ట్యా.. ప్రజారాజ్యం పార్టీలో మరికొంత మంది ఎమ్మెల్యేలు.. వీరి వెంట వచ్చే అవకాశాలను తోసిపుచ్చలేము. ఈలెక్కన చూస్తే.. జగన్ శిబిరం గట్టిగా ప్రయత్నిస్తే.. ప్రజారాజ్యం పార్టీలో చీలిక వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. తాను పార్టీ స్థాపించే లోపే.. (టిడిపి, పిఆర్పీల చీలికతో) తన బలాన్ని గణనీయంగా పెంచుకోవాలన్నదే జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. అదే జరిగితే.. కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం అన్వేషించక తప్పదు.
తెరాస పై అందరి దృష్టి.. :
చిరంజీవి పార్టీని చీల్చితే జగన్ శిబిరం బలం మరికొంత పెరుగుతుంది. తద్వారా.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఉనికి ప్రశ్నార్థకమవుతుంది. ఆ పరిస్థితి రాకుండా.. కాంగ్రెస్ అధినాయకత్వం తెలంగాన రాష్ట్ర సమితి వైపు చూసే అవకాశాలూ కొట్టి పారేయలేము. అవసరమైతే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానన్న కెసిఆర్ మాటలు ఈ సందర్భంగా ఓ సారి గుర్తు చేసుకోవాలి. ఆయన ఏ సందర్భంలో ఆ మాటలు అన్నా.. కాంగ్రెస్ పార్టీకి, ప్రస్తుత పరిస్థితుల్లో కెసిఆర్ అప్పటి మాటలు టానిక్‌లా పనిచేస్తాయనడంలో సందేహం లేదు. తెరాసతో 2004 ఎన్నికల నాటి మైత్రినే పునరుద్ధరించేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం ప్రయత్నించే అవకాశాన్నీ కొట్టిపారేయలేము.
అయితే కెసిఆర్.. ఈసారి అంత తేలిగ్గా కాంగ్రెస్‌కు మచ్చిక అవుతారని భావించలేము. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు తోడ్పాటునందిస్తానన్న ఒక్క ప్రకటనకే.. తెలంగాణలో కెసిఆర్‌పై తీవ్రస్థాయి వ్యతిరేకత వ్యక్తమైంది. తెలంగాణ ఉద్యమం ఇప్పుడు ఆయన చేతుల్లో లేదని.. ప్రజల చేతుల్లోకి వెళ్లిపోయిందని.. తెరాస నేతలే చెబుతున్న మాటలను ఇక్కడ గుర్తు చేసుకోవాలి. కెసిఆర్ స్వతంత్రించి కాంగ్రెస్‌తో దోస్తీ కడితే.. ఆయనకు, ఆయన పార్టీకి తెలంగాణలో పుట్టగతులుండవు. అందుకే, కాంగ్రెస్ అధిష్ఠానంతో తెలంగాణ ప్రక్రియకు సంబంధించి నిర్దిష్టమైన ప్రకటన చేయించి, ఆతర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించే అవకాశం ఉంది.
రాష్ట్రపతి పాలన..?
అయితే.. కాంగ్రెస్ అధినాయకత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రకటనను వెలువరించే సాహసం చేస్తుందా..? ప్రకటన చేసినా.. రాష్ట్రాన్ని చీల్చినా.. తెలంగాణలో, పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉంటుంది. తెరాస లేదా తెలంగాణ పార్టీల దయాదాక్షిణ్యాల మీదే కాంగ్రెస్ ఆధార పడాల్సి ఉంటుంది. ఇక్కడి నాయకత్వం బలహీన పడే అవకాశం ఉంది. తద్వారా పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడొచ్చు. మరోవైపు.. సీమాంధ్ర ప్రాంతంలోనూ పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. జగన్ ఓవైపు, బలమైన తెలుగుదేశం మరో వైపు అక్కడ పోటీ పడతాయి. కాంగ్రెస్ పార్టీకి అక్కడ అవకాశాలు అంత తేలిగ్గా ఏమీ ఉండవు. అంటే ఏకకాలంలో.. రెండు ప్రాంతాల్లోనూ పార్టీ గల్లంతయ్యే అవకాశం ఉంది. అందుకే.. అన్ని ఊహాగానాలను, ఆశావహులందరి విశ్వాసాలను దెబ్బతీస్తూ.. రాష్ట్రపతి పాలన విధించే అవకాశాన్నీ పార్టీ పరిశీలిస్తుంటుంది. నమ్మకస్తుడైన గవర్నర్ నరసింహన్ ద్వారా.. తెలంగాణ సహా.. అన్ని పరిస్థితులను చక్కదిద్దాక, కాంగ్రెస్ పార్టీ, మళ్లీ ఎన్నికలకు వెళుతుందన్న ప్రచారమూ జరుగుతుంది. ఇదీ రాష్ట్రంలో కొనసాగుతున్న చర్చోపచర్చల సారాంశం. నిజ పరిణామాలు ఎలా ఉండబోతాయో.. వేచిచూడక తప్పదు.
భూమా వాళ్ళకి అంత ఇమేజ్ ఉందా?
ReplyDeleteజగన్ ఇమేజ్‌కన్నా ఎక్కువా?
అయినా ఇమేజ్‌కే పార్టీ మారిపోతారా?