Saturday, November 27, 2010

జాతి అంటే..?

తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది.. అంటూ ఘంటసాల మధురంగా ఆలపించిన పాట (తల్లా పెళ్లామా సినిమాలోది అనుకుంటా) విన్నా. ఈ పాట ఇంతకు ముందు కూడా చాలా సార్లు విన్నా. ఎప్పట్లాగానే మనసుకు ఆనందాన్ని కలిగించింది. అయితే ఈసారి ఆనందంతో పాటే.. ఓ అనుమానాన్నీ కలిగించింది. తెలుగు జాతి మనది అన్న వాక్యంలో... జాతి అంటే.. ఏంటి? అన్నది ఆ అనుమానం. సాధారణంగా జాతి అన్న పదం వినగానే.. ఒక వర్ణ సమూహం అన్న విస్తృతార్థం తెలుస్తుంది. కానీ జాతి అన్న పదాన్ని కచ్చితంగా నిర్వచిద్దామనుకుంటే.. కాస్త అయోమయంగా అనిపించింది. ఇంకేముందీ.. ఛలో శబ్దరత్నాకరం.
జాతి అంటే..
కులము, పుట్టుక, సామాన్యం, అర్థాలంకారం, పద్యభేదం, పొయ్యి, జాజికాయ అని అర్థాలున్నాయి.
పురుష జాతులు నాలుగట.
(1) భద్రుడు,
(2) దత్తుడు
(3) కూచిమారుడు
(4) పాంచాలుడు
స్త్రీ జాతులు కూడా నాలుగేనట.
(1) పద్మిని
(2) హస్తిని
(3) శంఖిని
(4) చిత్రిణి
జాతకుడు అంటే పుట్టినవాడు,
జాతము అంటే సమూహం
జాతవేదుడు అంటే అగ్నిదేవుడు
జాతాపత్య అంటే బాలింత అన్న అర్థాలూ ఉన్నాయి.
బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలని చాతుర్వర్ణాలని అంటారు. వాటి అర్థాలను పరిశీలిస్తే..
(1) బ్రహ్మ : బ్రాహ్మణుడు, పరమాత్మ
(2) క్షత్రియ : రాచవాడు, రాజు
(3) వైశ్య : కోమటివాడు, ఆర్యుడు
(4) శూద్రుడు : 4వ జాతి వాడు
శూద్రుడు అంటే 4వ జాతి వాడు అన్నారు. మరి అందులోకి ఎవరెవరు వస్తారు..?
వ్యావహారికుడు : మంత్రి
గోరక్షక : ఆవులు కాసేవాడు
శిల్పక : శిల్పి. ( ఈ శిల్పి శిలలను చెక్కే వాడు కాదు. ఈ కోవలో ఏడుగురు శిల్పులు ఉన్నారు. వారు.... వడ్లంగి, సాలె, మంగలి, చాకలి, ముచ్చి. (ముచ్చి అంటే చిత్రకారుడు)
పంచాణ : శిల్పి (శిలలను శిల్పాలుగా మలిచేవాడు)
కుంభకార : కులాలుడు, కుమ్మరి
తంతువాయి : సాలెవాడు (తంతునాభము అన్నా తంతువాయము అన్నా సాలెపురుగు అని అర్థం. తంతువాయము నుంచి తంతువాయి వచ్చింది.)
క్షౌరక : మంగలి
రజక : చాకలి
వస్త్రఛేదక : దుస్తులు కత్తిరించే వాడు (దర్జీ)
చర్మకార : మాదిగ
తిలఘాత : గాండ్లవాడు (తిలలు అంటు నువ్వులు ఘాత అంటే నలిపడం అని అర్థం. నువ్వుల్ని నలిపి నూనె తీసే వృత్తి వారు గాండ్లవారు)
లుబ్ధుడు : బోయవాడు
మాతంగుడు : మాదిగ
చండాల : మాలవాడు
ఈండ్ర : ఈడిగ వారు (ఈండ్ర అంటే తాటి చెట్టును గీచి జీవించే వారు అని అర్థం. ఈండ్రము అంటే పీడనం, ఈండ్రించడం అంటే పీడించడం అని కూడా అర్థం ఉంది. అంటే వీరు పీడించే వారు అని దురర్థానికి రాకండి)
కసాయి : కటిక వాడు (కటిక అంటే మాంసం అమ్మేవాడు అని అర్థం. పొరపాటున కటికి అని రాసేరు.. కటికి అంటే ఎక్కువ, కఠినం అనిఅర్థం. కటికి చీకటి అంటే ఎక్కువ చీకటి లేదా చిక్కటి చీకటి అని అర్థం)
అంతవసాయి అంటే మంగలి, మాల అన్న అర్థాలూ ఉన్నాయి.

2 comments:

  1. eppatiki vadultundi sir manaki ee duula... 2010 lo unnam inkekkadi jatulu....

    ReplyDelete
  2. ప్రేమిక గారూ..

    ఈ పోస్ట్‌ వేసిన ఉద్దేశం.. జాతి భేదాలను పెంచడానికో.. వాటిని ఎత్తి చూపడానికో కాదు. ఓ సందేహ నివృత్తి కోసం.. డిక్షనరీని ఆశ్రయిస్తే, ఎలాంటి అర్థాలు తెలుసుకోవచ్చో వివరించడానికే తప్ప ఎలాంటి దురుద్దేశం లేదు. గమనించగలరు.

    విజయ్

    ReplyDelete