Friday, October 15, 2010

పెద్దల పండుగ ఇలా...

హైందవ సంస్కృతిలో పండుగలకు ఎంతో విశిష్టత ఉంది. వివిధ మతాలు, కులాలకు చెందిన వారు, విభిన్నమైన వేడుకలను వివిధ రూపాల్లో జరుపుకుంటూ తమ భక్తిని చాటుకుంటుంటారు. వాటిలో పితృదేవతలకు జరిపే వేడుక చాలా భిన్నంగా ఉంటుంది. చాలా చోట్ల 'పెద్దల పండుగ'గా చెప్పుకునే ఈ పండుగ చాలా విచిత్రంగా ఉంటుంది.



ఏడాదికి ఒకసారి, ఆశ్వయుజ మాసం ప్రారంభ సూచికగా వచ్చే అమావాస్య రోజును మహాలయ అమావాస్యగా చెబుతారు. చాతుర్వర్ణాలలో ఒకరైన శూద్రులకు ఈ మహాలయ అమావాస్య చాలా ముఖ్యమైంది. ఈ అమావాస్యను పెద్దల అమావాస్య అని, ఆరోజు చేసుకునే వేడుకను పెద్దల పండుగ అనీ అంటారు. భాద్రపద మాసంలో కృష్ణపక్షాన్ని మహాలయ పక్షమని, పక్షం చివర్లో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అనీ అంటారు. చనిపోయిన తమ పెద్దల ఆత్మలకు శాంతిని కలిగించేందుకు శూద్రవర్ణాల వారు.. మహాలయ అమావాస్య రోజున చేసే పూజా కార్యక్రమమే ఈ పెద్దల పండుగ.
అలంకరణ తీరు :
ఆరోజున ఉదయానికల్లా వీలైనంతలో ఇంటిని శుభ్రం చేసుకుంటారు. ఓపిక ఉన్నవారు, ఆరోజు పచ్చి గంగైనా ముట్టుకోకుండా రాత్రి వరకూ ఉపవాసం చేస్తారు. సాయంత్రం వేళ.. (ఊరి వెలుపల ఉన్న) ఎర్రమట్టిని తెచ్చి, దాన్ని నీటితో కలిపి ముద్దగా చేస్తారు. ఇంట్లో ఓ గోడచాటుగా అనువైన చోట ఆ ఎర్రమట్టి ముద్దతో నేలను అలుకుతారు. ఆ తర్వాత దానిపై జొన్న పిండి, కుంకుమలతో ముగ్గు వేస్తారు. ఆ ముగ్గుపై భాగంలో.. శుభ్రం చేసిన ఓ పీటను ఉంచి.. దాన్ని కొత్త వస్త్రంతో కప్పుతారు. అనంతరం అలంకరించిన ఆపీట పైన, ఓ రెండు, మూడు గుప్పిళ్ల బియ్యం రాసిగా పోస్తారు. ఆ బియ్యం కుప్పను సరిచేసి, దానిపై కలశం (నీటితో నిండుగా నింపిన చెంబు) ఉంచుతారు. దాన్ని విబూది, కుంకుమలతో అలంకరిస్తారు. ఆతర్వాత, దాని వెనుక గోడకు ఆనించి కొత్తగా కొన్న దుస్తులను ఉంచుతారు.


భలే వింతైన నైవేద్యం :
పైరకంగా పూజాస్థలాన్ని అలంకరించిన తర్వాత, కలశానికి రెండువైపులా దీపపు ప్రమిదలు ఉంచి వెలిగిస్తారు. అనంతరం, అంతకు ముందే వండి సిద్ధం చేసుకున్న నైవేద్యాన్ని.. పీట ఉంచగా మిగిలిన ముగ్గులో ఉంచుతారు. నైవేద్యమంటే మరేమో అనుకునేరు.. మద్యమాంసాలే! పొట్టేలును కసాయి కోసిన తర్వాత, దాని తల, కాళ్లను నిప్పులపై కాల్పిస్తారు. ఆ మాంసంతో పాటు, పొట్టేలు మెదడు, పేగులు, గుండె, కాలేయము తదితర భాగాలను వండుతారు. పొట్టేలును కోసినప్పుడు వచ్చిన రక్తంతో ప్రత్యేకంగా ఓ పచ్చడిని రూపొందిస్తారు. ఈ రకంగా వండిన వంటలను, మద్యం సీసా, పూర్వీకుల సంతృప్తి కోసం బీడీ, సిగరెట్‌ ఇలా కాదేది నైవేద్యానికి అనర్హం అన్నట్లుగా (చనిపోయిన) పెద్దలకు నివేదిస్తారు.
గోవిందుడి నామమే మంత్రం :
ఈ నైవేద్యం సమర్పించేటప్పుడు.. ఏడుకొండల వాడి నామ స్మరణే వీరికి మంత్రాలు. షోడశోపచారాలూ గోవిందుని నామస్మరణతో సరి. దీపం వెలిగించి, అగరుబత్తులు అంటించి.. సాంబ్రాణి పొగ రేపి.. ఇంట్లో ఓ రకమైన ఆధ్యాత్మక భావనను తెస్తారు. పూజ చివరలో, పత్తితో చేసిన బొడ్డువత్తితో మంగళహారతి ఇస్తారు. ఇప్పుడు కూడా గోవిందుని నామస్మరణే హారతి పాట. అందరూ ఆ హారతిని స్వీకరించాక, విస్తట్లో నైవేద్యంగా ఉంచిన పదార్థాలన్నింటినీ కొద్దికొద్దిగా తీసుకుని హారతి మంటపై.. వేస్తారు. అది ఆరిపోకుండా, నైవేద్యంగా ఉంచిన మద్యాన్ని ఆ మంటపై పోస్తారు. అది ఎంత భగభగ మంటే.. పితృదేవతలు అంత శాంతించినట్లుగా భావిస్తారు.
తర్వాత.... పూజ జరిపించిన ఇంటి పెద్ద... పెద్దలకు నమస్కరించిన ప్రతివారికీ నుదుటన నిలువుగా కుంకుమ తిలకం దిద్ది, విస్తరిలో పెద్దలకు నైవేద్యంగా పెట్టిన తినుబండారాలను కొద్దిగా తీసి ప్రసాదంగా ఇస్తారు. అది తిన్నాక, వారికి తీర్థంగా, బెల్లం పానకాన్ని అందిస్తారు. అయినవారికి, మద్యాన్ని కూడా తీర్థంగా ఓ గ్లాసులో పోసి ఇస్తారు. ఇలా ఇంట్లోని వారు, బంధుమిత్రులు ఈ పూజలు చేసి.. చనిపోయిన వారి ఆత్మశాంతికి సాంబ్రాణి ధూపాన్ని సమర్పిస్తారు. పూజ మొత్తం అయిపోయాక, చేసుకున్న వంటకాలను, మందు తాగుతూ.. తింటారు. అంతా అయ్యాక, పడుకునే ముందు... పూజలో వినియోగించిన దుస్తులను తలగడ కింద ఉంచుకుని నిద్రిస్తారు. ఇలా చేస్తే తమని అమితంగా ప్రేమించే పితృపితామహుల్లో ఒకరు కలలోకి వస్తారట.


ఎందుకీ తంతు..?
ప్రాచీన కాలంలో శూద్రులు కేవలం వృత్తి పనులకు మాత్రమే పరిమితమయ్యే వారు. అక్షరజ్ఞానం ఈ వర్ణం వారిలో చాలా తక్కువగా ఉండేది. అందుకే.. ఇతర మూడు వర్ణాల వారి మాదిరగా వీరికి తిథి, వార, నక్షత్ర, గ్రహ సంచార గతుల గురించి తెలిసేది కాదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాల వారు, తమకు తెలిసిన రీతిగా, పితృదేవతల మృతిని బట్టి.. నిర్దిష్ట కాలంలోగా తద్దినాలు పెట్టేవారు. అయితే, అప్పట్లో నిరక్షరాస్యులు, నిరుపేదలు అయిన శూద్రులకు ఈ రీతిగా తిథి, నక్షత్రాలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కో సమయంలో తద్దినం పెట్టడం కుదిరేది కాదు. అందుకే.. అందరికీ కలిపి ఒకేరోజున పెట్టే తద్దినం తంతే.. ఈ పెద్దల అమావాస్య.
మహాలయము అంటే.. గొప్ప వినాశము అని అర్థం. భౌతికంగా నాశమైన తమ పెద్దలను ఆరోజున స్మరించుకుంటూ.. శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే.. ఏడాది వరకూ వారు సంతోషంగా ఉంటారన్నది నమ్మకం. స్కాంద పురాణం నాగర ఖండంలో ఈ ప్రస్తవన ఉందని చెబుతారు. ఏ ప్రస్తావన ఎలా ఉన్నా... శూద్రులు తమదైన శైలిలో.. ఏడాదికొక్కమారు, మద్య మాంసాదులతో చేసుకునే విందే.. ఈ పండుగ.
ఇంత వివరణాత్మక రచన అవసరమా..? ఏమో..! మంచో చెడో.. సంప్రదాయాలు ఇలా ఉన్నాయి.. వాటిని ఇలా పాటిస్తారు.. అని తలచుకోవడం సమంజసంగా ఉంటుందన్నదే నా భావన. ఇందులో ఎలాంటి దురుద్దేశమూ లేదు సుమా!

No comments:

Post a Comment