Saturday, October 23, 2010

తెలుగు హంతకులు...!!



మనం తెలుగోళ్లం.. దురదృష్టవశాత్తూ "తెలుగు భాష" హంతకులను ప్రోత్సహిస్తున్న వాళ్లం. మన భావ వినిమయ సాధనాన్ని ఖండఖండాలుగా చీల్చి చెండాడుతున్న వాళ్లం. ప్రాచీన భాష హోదా దక్కించుకుని దానికి గౌరవాన్ని ఇనుమడింప చేయాల్సిన తరుణంలో.. వ్యక్తిగత కక్షలు, కార్పణ్యాలతో అమృతతుల్యమైన శబ్దం "తెలుగు"ను విషపూరితం చేస్తున్న వాళ్లం.. అందుకే మనం తెలుగు వాళ్లం. కాకుంటే ఏంటి చెప్పండి.. తెలుగు లలిత కళాతోరణం పేరులో తెలుగును తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా మనకు చీమకుట్టినట్లయినా ఉందా..? అందుకే మనం తెలుగోళ్లం.

ఆత్మాభిమానం అంటే ఏంటో రుచి చూపించిన ఎన్టీఆర్‌ అంటే తెలుగు వాళ్లకు ఎందుకో అంత కచ్చ. " ఆర్‌ యు మదరాసీ" అన్న స్థాయి నుంచి ఆర్‌ యు ఫ్రమ్‌ ఆంధ్రప్రదేశ్‌ అన్న స్థాయికి తెలుగువారి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో పెంచిన ఎన్టీఆర్‌ను.. మరేలనో.. పదే పదే అవమానిస్తున్నారు. ఇవాళ మన భాషను, కేంద్రప్రభుత్వం ప్రాచీన భాషగా గుర్తించడం వెనుక... తెలుగుకు ఎన్టీఆర్‌ కల్పించిన విస్తృత ప్రాచుర్యం విస్మరించరానిది. అలాంటి తెలుగువాడికి పదే పదే అదే పనిగా అవమానం జరుగుతోంది. మొన్నటికి మొన్న హైదరాబాద్‌లో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయానికి.. రాజీవ్‌ గాంధీ పేరును పెట్టారు. ఎన్టీఆర్‌ పేరు పెట్టండ్రోయ్‌ అని ఎన్టీఆర్‌ అభిమానులు ఎంత గొంతు చించుకు అరచినా వినలేదు. సరే గొంతెండి పోయి వాళ్లే మౌనం పాటించారు. ఈ డిమాండ్‌ సహేతుకమే అయినా.. రాజకీయ రొచ్చులో మన రాయి వేయడం ఎందుకులే అని రాజీవ్‌ పేరుకే మిగిలిన వారూ మౌనంగా ఆమోద ముద్ర వేశారు.

ఇవాళ్టికివాళ మళ్లీ ఎన్టీఆర్‌ కలల సౌధం.. మానస పుత్రిక తెలుగు లలిత కళాతోరణం పేరును రాజీవ్‌గాంధీ లలిత కళాతోరణంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులనూ జారీ చేసేసింది. ఇదెక్కడి దారుణం స్వామీ..! తెలుగు లలిత కళా తోరణం.. ఎన్టీరామారావు మానస పుత్రిక. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల నిర్వహణ కోసం 1986లో కేవలం మూడంటే మూడు నెలల్లో... దీన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు. ఐదు వేల మంది ప్రజలకు ఏకకాలంలో కూర్చుని చూసేందుకు వీలుగా దీన్ని నిర్మించారు. ఇప్పుడేమో దాన్ని ఇండోర్‌ ఆడిటోరియం గా మారుస్తారంట. సంతోషమే.. మార్చుకోండి. అందులో తెలుగు పేరును తొలగించడం ఏంటి.?

పార్లమెంటు సభ్యుడు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి గారు సొంత నిధులతో లలిత కళాతోరణాన్ని అత్యాధునిక సదుపాయాలతో తీర్చిదిద్దుతారంట.. ఆ ఖర్చు చేసినందుకు గాను, తెలుగు లలిత కళాతోరణం పేరులో తెలుగును తొలగించి రాజీవ్‌గాంధీ పేరును పెట్టాలని కోరారట. అర్థం పర్థం ఉందా..?

విశాఖ రాజకీయాల్లో ఎన్టీఆర్‌ తనయ, ప్రస్తుత కేంద్ర మంత్రి పురంధ్రీశ్వరితో తిక్కవరపు గారికి రాజకీయ విరోధం ఉంది. 35 సంవత్సరాలుగా తాను స్థిరపడిపోయిన విశాఖలో, ఎక్కడినుంచో వచ్చిన పురంధ్రీశ్వరి ఎంపీగా గెలిచి.. అక్కడి స్థానాన్ని సుస్థిర పరచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని తిక్కవరపు వారు.. తరచూ పురంధ్రీశ్వరిని రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. ఈ క్రమంలో... పురంధ్రీశ్వరిపై పైచేయి సాధించేందుకే.. సుబ్బరామిరెడ్డి గారు, తెలుగు లలిత కళాతోరణంలో తెలుగును తొలగించే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానం కలుగుతోంది.

నేతలూ దయచేసి రాజకీయాలను పక్కన పెట్టండి.. తెలుగు భాషను హతమార్చాలనుకునే వారిపై పోరాడదాం.. తెలుగును బతికించుకుందాం. కలసి రండి.

5 comments:

  1. rameshsssbd said...
    ఘొరమైనవిషయం. మరి ఈ ప్రభుత్వానికి అన్ని విధాలా ఫాల్స్ నిర్ణాయాలు తొ ఉన్నది అనె తెలుపుటకు ఈ విషయం ఒక్కటి చాలు."తెలుగుతల్లి లలితకళాతొరణం" అంటె బాగుంటదా లెక "రాజీవ్ గాంధి లలితకళాతొరణం" అంటె విలువ వుంటదా? మరీ మన అస్థిత్వాన్ని ఆత్మహత్యకన్నా ఘొరమైన వాటికి బలిపెడుతున్నారు. పొని ఈ నిర్ణయం వెనుక వున్న ఇబ్బందులు ఇవి అని అన్నా తెలుపరు.
    October 23, 2010 12.20

    ReplyDelete
  2. ఇవన్ని ఎందుకుగాని అంధ్రప్రదెశ్ పేరునే రాజీవ్ ప్రదేశ్ అని గాని లేక ఇందిర ప్రదేశ్ అని గాని మర్చేస్తే బాగుంటుందేమో!

    సిగ్గుండాలి..

    ReplyDelete
  3. చూస్తూ ఉంటాం.... ఓటనే ఆయుధం ఒకటి ఉంది కదా... సమయం వచ్చినపుడు దాంతో ఒక్కటిస్తాం దిమ్మ తిరిగేలా...

    ReplyDelete
  4. ఇంతకన్నా అవమానం మరోటి లేదు. ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ రాష్ట్రంలో ఇంకెవరి గుర్తులనూ మిగల్చదేమో. అన్నింటా ఇందిరా, రాజీవ్ ల భజనే.
    ఇలా అయితే ఆంధ్రప్రదేశ్ అస్థిత్వం మిగలదు. మనం ఉద్యమించాలి.
    కనీసం బ్లాగుల్లోనైనా ఈ దారుణాన్ని ఎండగట్టండి.
    ~ శశిధర్

    ReplyDelete
  5. telugu jathi spandanaki tikka kudirindi.....tala tikka nirnayalu venakki teesukunnaru.

    ReplyDelete