Thursday, October 14, 2010

మేరా భారత్‌ మహాన్..


నాకివాళ చాలా గర్వంగా ఉంది.. చెప్పలేనంత ఆనందంగా ఉంది.. ఈ అనుభూతిని వర్ణించడానికి మాటలు రావడం లేదు.. నాదేశం.. నన్ను గన్న నా దేశ పతాకం.. ప్రపంచ క్రీడా యవనికపై సగర్వంగా రెపరెపలాడింది. కామన్వెల్త్‌ క్రీడాంగణంలో.. మున్నెన్నడూ లేని రీతిలో పతకాల సెంచరీ సాధించింది. పతకాల పట్టికలో.. రెండో స్థానంలో సగర్వంగా నిలిచింది.

ఎన్నెన్నో అవినీతి ఆరోపణలు.. కూలిన నిర్మాణాలు.. మనదేశానికి విదేశీ ఆటగాళ్లు రారేమోనన్న అనుమానాలు..! ఇలా ఒకటా రెండా..? జరుగుతున్న పరిణామాలు... కామన్వెల్త్‌ క్రీడలు సజావుగా సాగుతాయన్న నమ్మకాన్ని ఎవ్వరిలోనూ కలిగించలేక పోయాయి. రాజకీయాల రొచ్చులో కూరుకుపోయిన వారు మసకబారేలా చేసిన ప్రతిష్టను.. మన ఆటగాళ్లు స్వచ్ఛమైన గంగాజలంతో పునీతం చేశారు. దేశ ప్రతిష్టకు శాశ్వత యశస్సును సముపార్జించి పెట్టారు.

కామన్వెల్త్‌ క్రీడలు అట్టహాసంగా ప్రారంభమైనా.. ఎవ్వరికీ భారత క్రీడాకారుల పాటవంపై నమ్మకం లేదు. రోజురోజుకీ పతకాల సంఖ్య పెరుగుతూ పోతుంటే.. ప్రపంచానికి దిమ్మతిరిగే దిగ్భ్రమ. తొలి స్వర్ణం వచ్చినపుడు.. ఏదో గాలి వాటం అనుకున్నారు. మలి స్వర్ణం.. ఆ తర్వాతి స్వర్ణం.. మధ్యలో రజత, కాంశ్య పతకాలు భారత్‌ పట్టికలో చేరుతుంటే.. మనదేశ పౌరులూ అవాక్కయ్యారు. మన జాతీయ క్రీడ హాకీ స్వర్ణాన్ని సాధించలేక మనల్ని నిరాశ పరిచినా.. మన హైదరాబాదీ సైనా నెహ్వాల్‌ "బంగారు" కొండగా మురిపించింది. ఈ అమ్మాయి తను స్వర్ణం సాధించడమే కాదు.. దేశ ప్రతిష్టను ఓ మెట్టు పెంచింది. సైనా స్వర్ణం కారణంగా.. పతకాల పట్టికలో భారత దేశం రెండో స్థానంలో నిలిచింది. (మన హైదరాబాదీ గగన్‌నారంగ్‌ మూడు స్వర్ణాల బోణీని విస్మరించరాదు సుమా..)

క్రీడలు ముగిసే సమయానికి 38 స్వర్ణాలు, 27 రజతాలు, 36 కాంస్య పతకాలు మెడలో ధరించిన భరత మాత.. వాటిని సంపాదించి పెట్టిన తన సంతానాన్ని చూసి మురిసి పోతోంది. అంతేనా.. ప్రపంచ దేశాల ముందు సగర్వంగా నిలుచుంది.

అందుకే మేరా భారత్‌ మహాన్‌..

1 comment:

  1. విజయ్ గారు,
    మీరు రాసింది అక్షరాలా నిజం. ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం.
    కానీ, మరి మన వాళ్ళు ఒలంపిక్స్ లో ఎందుకు ఈ స్థాయి లో రాణించలేక పోతున్నారు? పోనీ, పోటీ ఎక్కువగా ఉందనుకున్నా, మరీ ఒకటి, రెండు స్వర్ణాలు కాకుండా, పతకాల పట్టిక లో ఇంకొంచెం ముందుకు వెళితే బాగుంటుందేమో!

    ఏమైనా, కామన్వెల్త్ క్రీడల్లో మన ఆటగాళ్ళ ప్రతిభ హర్షణీయం.

    ReplyDelete