Tuesday, October 19, 2010

ఈనాడులో... "ఐదు వాక్యాల" వార్తలో ఐదు తప్పులు..!

జర్నలిస్టు మిత్రులు ఇటీవల రాస్తున్న వార్తలు పరిశీలిస్తే.. ముఖ్యమైన ప్రాంతాల గురించిన కనీస అవగాహన ఉండడం లేదన్న విషయం అర్థమవుతుంది. జర్నలిస్టులు అన్ని ప్రాంతాలనూ సందర్శించి ఉంటారనుకోవడం అవివేకమే. అయితే.. ఉన్నచోటు నుంచే వివిధ ప్రాంతాల పేర్లు (సరైన రూపం), అక్కడి సంప్రదాయాలు తెలుసుకుని ఉండాలి. దీంతోపాటే.. ఇటీవల మార్పులు జరిగిన ప్రధాన నగరాల పేర్లనూ గమనంలోకి తీసుకోవాలి. లేకుంటే.. ప్రసారం లేదా ప్రచురణ తర్వాత.. ఆ వార్తను చూసిన వాళ్లు, రాసిన వాళ్ల అజ్ఞానాన్ని చూసి నవ్వుకుంటారు. తద్వారా, పత్రిక లేదా ఛానెల్‌ పరువు కూడా పోతుంది.

ఉదాహరణకు, ఈరోజు (19-10-2010) ఈనాడు దినపత్రిక మెయిన్‌ ఎడిషన్‌ మూడో పేజీలో ఓ సింగిల్‌ కాలమ్‌ వార్త వచ్చింది. ఇందులో ఐదంటే ఐదే వాక్యాలున్నాయి. అందులో అయ్యప్ప భక్తులకు సంబంధించిన సమాచారం ఉంది. ఆ వార్త చదివిన అయ్యప్ప భక్తులు కచ్చితంగా ఇది అవగాహన లేని వారు రాసిన వార్త అని తేలిగ్గా అర్థం చేసుకుంటారు.


పై వార్తలో...

మేల్‌శాంతి కి బదులుగా మేలశాంతి అని
ట్రావెన్‌కోర్‌ దేవస్వం బదులుగా త్రవాన్కోర్ దేవశ్వం అనీ రాశారు.
అలాగే, మాలికాపురం బదులుగా మలికప్పురం అని రాశారు.
మేలశాంతిగా పిలిచే ఈ స్థానం కోసం అని రాశారు. మేల్‌శాంతి అంటే ప్రధాన అర్చకుడు అని అర్థం. అది పదవి.. స్థానం కాదు.
మరో వాక్యంలో... "వ్యవహరిస్తారని నిర్వాహకులు తెలిపారు" అని రాశారు.. ఇక్కడ నిర్వహణకు సంబంధించిన అంశం ఎందుకొచ్చిందో అర్థం కాదు. పైగా ఎవరు ఏమి నిర్వహిస్తున్నారో మరి రాసినవారికే తెలియాలి.

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు స్థాయిలో ప్రసిద్ధి చెందిన ట్రావెన్‌కోర్‌ దేవస్వం (దేవస్థానం) బోర్డును తప్పుగా రాయడం, శబరిమల ప్రధాన అర్చకుల నియామకానికి సంబంధించిన విధి విధానాలు, ఎంపిక తీరు తెలియక పోవడం, వల్ల ఈ తప్పు దొర్లిందన్నది అర్థమై పోతోంది. కేవలం ఐదు వాక్యాల వార్తలో.. ప్రతి వాక్యంలోనూ ఇన్ని తప్పులు రావడానికి, రాసినవారి అవగాహన లోపమే కారణమన్నది నా భావన. అయితే ఇంఛార్జి గారూ దీన్ని చూసీ చూడనట్లు వదిలేయడం సమంజసమనిపించడం లేదు.

ముంబైని బొంబాయిగాను, చెన్నైని మద్రాసుగాను, గౌహతిని గువాహటిగాను నేటికీ రాస్తున్న ప్రముఖులు ఉన్నారు. సీనియర్లు కాస్త జోక్యం చేసుకుని ఇట్లాంటి తప్పులను ఎప్పటికప్పుడు సరిచేస్తూ పోతే... యంగ్‌ టాలెంట్స్‌ నేర్చుకుంటూ వస్తారు. ఏమంటారూ..?

9 comments:

  1. neti juniors rapati seniors.........

    ReplyDelete
  2. గువాహతి అనే పేరే కరెక్ట్. మనవాళ్లు తెలియక గౌహతి అని వ్రాస్తారు.

    ReplyDelete
  3. మిత్రమా పవన్..

    ఇది but-బట్,‌ put-పుట్‌ లాంటి సంబంధం. పైగా పదుగురాడు మాట పాడియై ధరజెల్లు అన్న ఆర్యోక్తి గౌహతి విషయంలోనూ పనిచేస్తుంది. వోక్స్‌ వాగన్‌ సంస్థను ఫ్రెంచి వారు ఫోక్స్‌ వాగన్‌ అని ఉచ్ఛరిస్తారు. మనం అలా అనలేము కదా. మనం వోక్స్ వాగన్‌ అనే అంటాము. ఇపుడు మనం ఫోక్స్‌వాగన్‌ అని పలికితే మనవాళ్లే విచిత్రంగా చూస్తారు. కాయిన్‌ అయిపోయిన పదాన్ని సాధ్యమైనంత వరకు అర్థభేదం లేకుండా వాడడం తప్పు కాదనుకుంటా. ఏమంటారూ...?

    రిగార్స్డ్
    విజయ్‌

    ReplyDelete
  4. జర్మన్ భాషలో v ని "ఫ" గా ఉచ్చరిస్తారు. అందుచేత జర్మన్‌లో దానిని "ఫోల్క్‌స్ వాగేన్" అని పిలుస్తారు. ఆంగ్లంలో మాత్రం అది "వోక్‌స్ వేగన్". మీరు charles ని తెలుగువాళ్ళు (తప్పుగా) చార్లెస్ అని అంటారని, అలాగే కంటిన్యూ అయిపోదాం అన్నట్లుంది.

    ReplyDelete
  5. మిత్రమా కేకే,

    తప్పులు కొనసాగిద్దామన్నది నా భావన కాదు. స్థిరపడిపోయిన పదాలను అర్థ భేదం లేనప్పుడు.. మనవాళ్లకు సులువుగా అర్థమవుతున్నపుడు అలాగే వాడితే తప్పు కాదు అన్నదే నా ఉద్దేశం. కాంట్రాక్టర్‌ అన్న పదానికి గుత్తేదారు అని ఈనాడు కాయిన్‌ చేసిన కొత్తలో అంతా విచిత్రంగా మాట్లాడుకున్నారు. ఇప్పుడిప్పుడే అందరమూ ఆ తెలుగు పదానికి అలవాటు పడుతున్నాం. మరి గుత్తేదారు అన్న పదం సృష్టించడానికి ముందు వరకూ, కాంట్రాక్టర్‌ అని మనం వాడడం తప్పంటారా..? ఏదేమైనా, ప్రయత్నపూర్వకంగా, సరైన రూపాన్ని మనవాళ్లందరికీ అలవాటు చేసేవరకూ.. యథాతథ రూపాలను కొనసాగిస్తే తప్పు కాదన్నదే నా అభిప్రాయం.

    విజయ్‌

    ReplyDelete
  6. 'స్థానం' అనే పదానికి 'ప్రదేశం' అనే కాక 'పదవి' అనే అర్ధమూ ఉంది. ఈనాడు వాళ్లు ఆ రెండో అర్ధంలో వాడి ఉంటారు.

    ReplyDelete
  7. విజయ్ గారు,

    మీరు రాసింది నిజం. అలవాటైన పదాలను, అర్ధభేదం లేకపోతే వాడడంలో తప్పులేదనేదే నా అభిప్రాయం కూడా. బహుశా, ఈనాడు వార్తలో ఇంఛార్జ్ గమనించకపోవడం ముఖ్యమైన విషయంగా కనిపిస్తోంది. అయినా, 3 వ పేజీలో 5 లైన్ల వార్తను కూడా అంత పరిశీలనగా చదివితే ఎలాగండి. బూదరాజు గారిని గుర్తుకు తెస్తున్నారు.

    ~ శశిధర్ సంగరాజు.

    ReplyDelete
  8. డియర్‌ శశీ,
    ఆ వార్త లక్షలాది మంది అయ్యప్ప స్వామి భక్తులకు సంబంధించినది. కచ్చితంగా అయ్యప్ప దీక్ష తీసుకునే వారందరినీ ఆ వార్త ఆకర్షిస్తుంది. జనవరి 20వ తేదీ దాకా శబరిమలకు సంబంధించి ఏ వార్త వేసినా అయ్యప్ప భక్తులు కచ్చితంగా చదువుతారు. అసలు ఆ వార్త వేసిన ఉద్దేశం కూడా అయ్యప్ప భక్తులను దృష్టిలో ఉంచుకునేనన్నది నా అభిప్రాయం. మరి అంతమంది చదివే వార్తను వేసేటపుడు జాగ్రత్తగా ఉంటే బావుండేదన్నదే తప్ప కోడిగుడ్డుకు ఈకలు పీకడం నా ఉద్దేశం కాదు.
    విజయ్‌

    ReplyDelete
  9. సాధారణంగా ఈనాడు పేపర్లో పప్పు తచ్చులు తక్కువగానే వుంటాయి.అయినా మీ అభిప్రాయం తో ఏకీభవించవలసిందే మిత్రమా!

    ReplyDelete