Monday, October 18, 2010

అర్థం తెలుసుకుని వాడదాం...!!

తెలుగు జర్నలిజంలో భాషకు చాలా ప్రాముఖ్యత ఉంది. అర్థం తెలీకుండా పదాలను వాడితే.. చెప్పదలచుకున్న భావంలో స్పష్టత రాకపోవచ్చు. పైగా కొన్నిసార్లు దురర్థమూ రావచ్చు. అందుకే రోజువారీ‌ వాడే కొన్ని తెలుగు పదాల సరైన రూపాలు వాటి అర్థాలను ఓసారి చూద్దాం.

బీభత్సం
(ఈ పదంలో రెండో అక్షరం మహాప్రాణం.. దానికే ఝట ఉంటుంది)
ఈ పదానికి అసహ్యమైనది అని అర్థం. బీభత్సుడు చేసేది బీభత్సం. బీభత్సుడు అంటే అర్జునుడు.. అర్జునుడు తన పాటవాన్నిప్రదర్శించాక.. (యుద్ధ) ఫలితం జీర్ణించుకోలేనిదిగా ఉంటుంది. ఓ రకమైన అసహ్యాన్ని కలిగిస్తుందట. అందుకే కాబోలు, నిఘంటుకారులు బీభత్సం అన్న పదానికి అసహ్యమైనది అన్న అర్థమిచ్చారు.

అధిష్ఠానం :
(అధి+స్థానం = అధిష్ఠానం :: స్థానంలో మహాప్రాణం (థ) సంధిలో (ఠ) ఒత్తుగా మారుతుంది.
అధి అన్న ఉపసర్గకు పైన, ఎగువన అన్న అర్థం ఉంది. స్థానం అంటే కూర్చునే చోటు లేదా స్థలం.
అధిష్ఠానం అంటే ఎగువన (గద్దెపై) కూర్చునేవారు అని అర్థం.
నాయకత్వం అన్న విస్తృత అర్థంలో అధిష్ఠానం అన్న పదాన్ని వాడుతున్నాం.

వివక్షత :
వక్.. అంటే మాట.
వ్యక్తులు లేదా వర్గాలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు.. మాటల్లో భేదం చూపిన సందర్భాల్లో వివక్షత అన్న పదం వాడతారు.

విచక్షణ :
చక్షు: అంటే కళ్లు.
వ్యక్తులు లేదా వర్గాలను చూసే చూపులో తేడా ఉన్నప్పుడు విచక్షణ అన్న పదం వాడతారు.

ప్రదానం
(రెండో అక్షరం అల్ప ప్రాణం.. ఝట ఉండదు)
దానం అంటే ఇవ్వడం, త్యాగం అన్న అర్థాలు ఉన్నాయి. ఏదైనా (సర్టిఫికెట్లు, అవార్డులు మొ...) ఇచ్చేటప్పుడు ప్రదానం అన్న పదాన్ని వాడతారు.
ప్రధానం
(రెండో అక్షరం మహాప్రాణం.. ఝట ఉంటుంది)
ముఖ్యమైనది అన్న అర్థంలో ఈ పదాన్ని వాడతారు.

అనుమానం : శంక
అవమానం : శీలానికి భంగం (శీలం అంటే గుణం అన్నది విస్తృతార్థం)

అసువులు :
(అశువులు కాదు) : ఊపిరులు, ప్రాణాలు
అస్రువు లేదా అశ్రువు :
కంటి నుంచి వచ్చే నీటి బిందువు
అంతస్తు : మేడ పై భాగం, పరువు
అంతస్థ : రహస్యంగా ఇచ్చే లంచం
అగాధం : చాలా లోతైన ("ధ" పొట్టలో చుక్క ఉండదు)
అంతర్ధానం : కనుమరుగు కావడం (అంతర్ధ : మరుగు)
అపప్రథ :
చెడ్డపేరు (ప్రథ అంటే పేరు, ప్రఖ్యాతి అని అర్థం, వ్యతిరేక అర్థాన్నిచ్చే ‘అప’ అనే ఉపసర్గను వాడడం వల్ల అపప్రథ అన్న పదానికి చెడ్డపేరు అని అర్థం వచ్చింది. )
ఉత్థాన పతనాలు : పడుతూ లేస్తూ ఉన్న సందర్భాల్లో దీన్ని వాడతాం.
(ఉత్థానం : లేవడం, పతనం : పడడం)
అధమము : అవధ్యము, తక్కువైనది
(వధ్యము : చంప తగినది .... అవధ్యము అంటే చంపకూడనిది)
ఊర్ధ్వము : పొడవైనది, మీదిది, పై భాగానిది
అధో : కిందిది
అర్థి : వేడువాడు.
అభ్యర్థి : (అభి+అర్థి) :
(‘అభి’ అంటే ఎదురుగా ఉండి ‘అర్థి’ అంటే వేడువాడు అని అర్థం) : ఏదైనా కోరువాడు అన్న అర్థంలో వాడుతున్నాం.
ప్రత్యర్థి :
(ప్రతి+అర్థి) : (ప్రతి అంటే సమానంగా, అర్థి అంటే వేడువాడు.. అంటే తనకు సమానంగా వేడుతూ.. తన అవకాశాన్ని దెబ్బతీసే వాడు కాబట్టి, అతడిని పోటీదారు అంటాం. ఆ అర్థంలోనే ప్రత్యర్థి అని వాడుతున్నారు. ప్రత్యర్థి అన్న పదాన్ని శత్రువు అన్న అర్థంలో వాడుతున్నాం.)

4 comments:

  1. ఇయ్యాల్టి ఇలేకరులు ఈ మీ మాట ఇంటే మంచిదే మారాజా!

    ReplyDelete
  2. ఎవరు వింటారండీ ఇవన్నీ..సగం మంది విలేఖరులకి పదాలు పలకడమే తెలీదు. ఈ మధ్య నేను తరచుగా వింటున్నా,"భీబత్సం" అనే పదాన్ని. SUPER అని చెప్పడానికి వాడుతున్నారు. "భీబత్సమయిన హిట్" ఇలా వాడుతున్నారు.లైవ్ రిపోర్టింగులు ఎక్కువయిపోయాకా తెలుగు చచ్చిపోతోంది.

    ReplyDelete
  3. డియర్‌ రిషీ,
    మీ వ్యాఖ్యానానికి ధన్యవాదాలు. కాస్త సానుకూల దృష్టితో వేచి చూద్దాం! కనీసం ఒక్కరైనా దీన్ని ఆచరించక పోతారా..? వాళ్ల ద్వారా మిగిలిన వారికి ఈ మత్తు సోకకుండా ఉంటుందా..? చూద్దాం..! ఏ విజయానికైనా తొలి అడుగే కదా ముఖ్యం..!! మీ వ్యాఖ్యానానికి మరోసారి ధన్యవాదాలు.

    విజయ్

    ReplyDelete
  4. పంచె కడితే పప్పు వండడం వచ్చీసినట్లే అన్నది నాటి అగ్రహారం సామెత..
    కానీ ఇప్పుడు పెన్ను పట్టడమే కాదు... తెలుగు అక్షరాలు పూర్తిగా రాని వాళ్ళు కూడా విలేఖరులై... ఆపి లెఖ్ఖరులై ...
    సంపదనే ద్యేయంగా మార్చేసారు...అయినా మీ ప్రయత్నం అభినందనీయం... ఊరోజు కాకపొతే ఓ రోజైన వాడతాడు... ఆ పదాలని.

    gopal

    ReplyDelete