Tuesday, October 5, 2010
బొడ్డెమ్మను విస్మరించారెందుకో...!
తెలంగాణ సంస్కృతి.. ఈ ప్రాంత విశిష్ట పర్వం.. అనగానే వెంటనే గుర్తొచ్చేది బతుకమ్మ. విదేశీ నాగరికత మోజులో బతుకమ్మను అంతా మరచిపోతున్నారనుకుంటుండగా.. పరిస్థితిలో కొద్దిగా మార్పు వచ్చింది. ఈ సంబరం ఓ రెండేళ్ల నుంచి కొత్త ఊపిరి పోసుకుంటోంది. అయితే.. బతుకమ్మ వేడుకలు శ్రీకారం చుట్టుకునే ముందే.. నిమజ్జనమయ్యే మరో అమ్మవారు బొడ్డెమ్మ. మరెందుకో ఆ అమ్మవారికి మీడియాలో అంతగా ప్రాధాన్యత దక్కడం లేదు.
బొడ్డెమ్మ పూర్తిగా అవివాహిత యువతుల వేడుక. ఇది కూడా తొమ్మిదిరోజుల పండుగ. భాద్రపద మాసం బహుళ పంచమి రోజున బొడ్డెమ్మ ఉత్సవం ప్రారంభమవుతుంది. మహాలయ అమావాస్యకు ముందు రోజున వేడుక ముగుస్తుంది. అచ్చంగా బతుకమ్మ తరహాలోనే.. బొడ్డెమ్మనూ రంగురంగుల పూలతో రూపొందిస్తారు. సాయంత్రం వేళల్లో బొడ్డెమ్మను.. ఓ చోట ప్రతిష్ఠించి, దాని చుట్టూ పాటలు పాడుతూ తిరుగుతారు. పెళ్లీడుకొచ్చిన యువతులు మాత్రమే ఈ సంబరాన్ని జరుపుకుంటారు. ఇందులో పెళ్లయిన మహిళలెవరూ పాల్గొనరు. ఈ ఏడు కన్నెలుగా బొడ్డెమ్మను పూజిస్తున్నాం.. పై ఏడు వివాహితులుగా బతుకమ్మకు జోతలిడుతాం అంటూ అవివాహితులు మురిపెంగా చెబుతారు.
బొడ్డెమ్మ ఎవరు అంటే.. స్థానికంగా భిన్న కథనాలు వినిపిస్తాయి. కాకతీయుల నాటి నుంచీ బతుకమ్మకన్నా ముందే.. బొడ్డెమ్మను పూజించేవారని చెబుతారు. బొడ్డెమ్మ, బతుకమ్మ ఇద్దరూ అక్క చెల్లెళ్లని ఓ కథనం.. భూస్వాముల వేధింపులకు బలవన్మరణం పొందిన తల్లీబిడ్డలంటూ మరో కథనం ప్రచారంలో ఉంది.
ఈ కథల గురించి పక్కన పెడితే.. తెలంగాణలోని మారుమూలనున్న... ఈ ప్రాంత సంస్కృతి ఇంకా మిగిలి ఉన్న కొన్ని పల్లెల్లో.. బొడ్డెమ్మను ఇవాళ (05-10-2010) నిమజ్జనం చేశారు. రేపు మహాలయ అమావాస్య. ఎల్లుండి నుంచి బతుకమ్మ సంబురాలు మొదలవుతాయి. ఏదేమైనా.. ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బొడ్డెమ్మకు బతుకమ్మ స్థాయిలో ప్రాచుర్యం దక్కక పోవడం ఒకింత బాధాకరం.
Subscribe to:
Post Comments (Atom)
/బొడ్డెమ్మకు బతుకమ్మ స్థాయిలో ప్రాచుర్యం దక్కక పోవడం ఒకింత బాధాకరం. /
ReplyDeleteనిజమే. ప్రాచుర్యం లేకుంటే సాంప్రదాయాలు ఎలా నిలుస్తాయి? పత్రికల్లో బొడ్డెమ్మ, బ్రతుకమ్మ, తక్కిన ప్రాంతాల గ్రామదేవతలకు తగిన ప్రకటనలు ప్రచురించాలి. మంచి విషయం లేవనెత్తారు.