Monday, November 29, 2010

శాండీ.. వుయ్‌ లవ్‌ యు

ఈ బేబీ మా శాండీ.. మే 11వ తేదీ (మా అబ్బాయి బర్త్‌డే) నుంచి మా జీవితాల్లో ఓ సభ్యురాలైంది. కాకర్‌ స్పానియల్‌ (cocker spanial) జాతికి చెందిన ఈ శాండీ దినచర్యపై సరదాగా ఓ ఫోటో పీచర్‌ :
నిద్ర :
మస్తుగా నిద్రపోతుంది. స్థలం అక్కడా ఇక్కడా అని చూడదు. దానికోసం ఓ గూడు ఏర్పాటు చేసినా.. బండలమీద పడుకునేందుకే ప్రాధాన్యతనిస్తుంది.
మెలకువ : నిద్రనుంచి లేవగానే ఎక్సర్‌సైజ్‌ చేయాలంటుంది.మమ్మల్ని రాచి రంపాన పెడుతుంది. తనే, ఓ ప్లాస్టిక్‌ బోన్‌ నోటితో కరచుకు వచ్చి దాన్ని విసరండి.. నేను తీసుకు వస్తాను.. అన్నట్లు సైగలు చేస్తుంది. శాండీ బాధ భరించలేక ప్లాస్టిక్‌ బోన్‌ను దాచామనుకోండి.. వాటర్‌ బాటిల్‌, లేదా కర్ర ముక్క ఏది పడితే దాన్ని కరుస్తూ.. ఆడుకుంటూ నానా సందడీ చేస్తుంది.
స్నానం : హమ్మయ్య ఎక్సర్‌సైజ్‌ అయిందా..? ఇంకేముంది..? స్నానానికి రెడీ. (రోజూ కాదు లెండి.. వారానికి ఓసారి మాత్రమే). మొదట్లో భలే గొడవ చేసేది గానీ.. ఇప్పుడిప్పుడే "శాండీ... రా కన్నా" అనగానే.. బుద్ధిగా వచ్చి కూర్చుంటుంది. కిమ్మనకుండా షాంపూ స్నానం చేయించుకుంటుంది. (అయితే దాన్ని తుడిచేప్పుడు ఉంటుంది మా అవస్థ..? చెప్పొద్దు లెండి.. ఆ టవల్స్‌ని నోటితో కరచుకుని పరుగులు పెడుతుంది.. ఒక పట్టాన చేతికి చిక్కదు.. భలే ఆటాడిస్తుంది.)

భోజనం : కాస్త శుభ్రం అయిందిగా.. ఇక ఇప్పుడు, తర్వాతి ఐటెమ్‌.. తిండి. మా శాండీ తిండిపోతు కాదు గానీ.. బాగానే తింటుంది. మొదట్లో దానంతటదే తినేది. ఈ మధ్యలో.. నా చేత్తో పెడితే గానీ, పెడిగ్రీ తినడం లేదు. అన్నం మాత్రం తనిష్టం వచ్చినప్పుడు కొంచెం కొంచెంగా తింటుంది. (శాకాహారాన్ని ఓ మోస్తరుగా తింటుంది.. మాంసాహారం చేసినరోజున.. తన హడావుడి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తన అరుపులు విని.. ఓహో వీళ్లింట్లో ఇవాళ మాంసాహారం వండినట్లున్నారు కామోసు అని చుట్టుపక్కల వాళ్లు అనుకుంటారంటే నమ్మండి)
నిద్ర : కాసేపు అటూ ఇటూ తచ్చాడుతుంది. తినగానే.. బయటికి వెళ్లి కాలకృత్యాలు తీర్చుకుంటుంది. ఇంకేముంది... మళ్లీ సుఖాసనాన్ని సిద్ధం చేసుకుంటుంది. భుక్తాయాసం కాబోలు.. మా శాండీకి సోఫా సెట్‌ అయితే గానీ ఆనదు. ఎవరైనా ఏమైనా అంటారేమోనని అటూ ఇటూ కాస్త చూస్తుంది. ఈ టైమ్‌లో ఎక్కడ లేని అమాయకత్వాన్నీ ముఖంలోకి తెస్తుంది. పాపం పోనీలే అని మేమంతా అనుకునేలా చేస్తుంది. ఇంకేముందీ.. మా ముఖాల్లోని ప్రసన్నతనే.. గ్రీన్‌సిగ్నల్‌గా భావించి.. సుఖంగా నిద్ర చేస్తుంది.

ఆటా పాటా : ఇక సాయంత్రమైందనుకోండి.. మా అబ్బాయి వికాస్‌ స్కూలు నుంచి రాగానే.. మళ్లీ ఆటాడుదాం రమ్మంటుంది. వాడితో కాసేపు ఆడుకుంటుంది. మా ఆవిడ పూజగదిలో పూజ చేస్తుంటే బుద్ధిగా ఓ పక్కన ఉండి గమనిస్తుంటుంది. తర్వాత, అగరుబత్తులు పెట్టేందుకు బయటకు వెళితే తనూ తోడు వెళుతుంది. (ఉదయం ఉతికిన దుస్తులు ఆరేసేందుకూ తనే మా ఆవిడకు తోడు). ఇక నేను రాత్రి ఏ సమయానికి ఇంటికి వచ్చిన నాతోనూ అదే తంతు. అర్ధరాత్రయినా కాసేపు ఆడించిన తర్వాతే నిద్ర పోతుంది. రాత్రి మాత్రం మా బెడ్డే తన శయనాసనం. తెల్లవారుజామున లేచి మళ్లీ బండలపై పడుకుంటుంది. మా శాండీ లేకుండా ఇన్ని రోజులు ఎలా గడిపామా అన్న ప్రశ్న ఈ మధ్య తరచూ మా మదిని తొలుస్తోంది.

గమనిక : స్నానం తప్ప మిగతావన్నీ దినచర్యలో భాగమే.

1 comment:

  1. విజయ్ గారు,

    ఇకపై మీరు ఇలాంటి పోస్ట్ రాసేటప్పుడు, ముందే తెలియజేస్తే మా అబ్బాయి దగ్గర లేనప్పుడు చదువుతాను. సాకేత్ ( మా పుత్రరత్నం) చూస్తుండగా, మీ బ్లాగ్ ఒపెన్ చేసాను. వాడికి ఈ పోస్ట్, శాండీ తెగ నచ్చేశాయి. ఇప్పుడు తనకు కూడా ఒక పెట్ కావాలని నన్ను వేపుకు తినేస్తున్నాడు.
    పోస్ట్ అదుర్స్


    ~Sasidhar Sangaraju
    www.sasidharsangaraju.blogspot.com

    ReplyDelete