Saturday, August 28, 2010

గురుదేవా మన్నించు..

ఉస్మానియా విశ్వవిద్యాలయం.. మరో సంచలన ఘటనతో పతాక వార్తల్లోకి వచ్చింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కన్నా సమున్నతుడంటూ ప్రాజ్ఞులు ప్రస్తుతించిన గురువు.. ఈ సరస్వతీ ప్రాంగణంలో.. అతి నీచాతినీచమైన అవమానానికి గురయ్యాడు. విద్యార్థుల చేతిలో చావు దెబ్బలు తిని.. ఘోర పరాభవానికి గురయ్యాడు.

విశ్వవిద్యాలయం నిర్వహించిన బిఇడి పరీక్ష సమాధాన పత్రాలు దిద్దేందుకు సీమాంధ్ర ప్రాంతపు అధ్యాపకులు రావడం.. ఇక్కడి విద్యార్థులకు రుచించలేదు. వారు దిద్దితే మార్కులు సరిగ్గా రావని, ఫెయిల్ అయిపోతామన్నది దాడి చేసిన విద్యార్థుల బెంగ. తెలంగాణ ప్రాంత అధ్యాపకులే తమ పరీక్ష సమాధాన పత్రాలు దిద్దాలన్నది వారి డిమాండ్. అందుకే.. పరీక్ష పత్రాలు దిద్దేందుకు వచ్చిన సీమాంధ్ర అధ్యాపకులను తరిమి తరిమి కొట్టారు. వీడియో క్లిప్పింగులు చూస్తే.. ఒకరిద్దరు విద్యార్థులు అధ్యాపకులపై చెప్పులతోనూ దాడి చేసినట్లూ కనిపించింది. (పాపం శమించుగాక..)

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో ఉస్మానియా విద్యార్థుల పాత్రను ఏమాత్రం తక్కువ చేయలేము. వారి అంకిత భావాన్నీ శంకించలేము. రాష్ట్ర సాధన కోసం వాళ్లు ఎంచుకున్న మార్గాన్నీ ప్రశ్నించలేము. అక్కడక్కడా కొన్ని హింసాత్మక ఘటనలు జరిగినా.. విద్యార్థుల్లో ఆమాత్రం ఆవేశం సహజమేనని అంతా అనుకున్నారు.

తెలంగాణ రాష్ట్రం రాదేమోనన్న బెంగతోనో, ఎవరో అడ్డుపడుతున్నారనో, మరెవరో ఓడిపోతే ఆత్మబలిదానం చేసుకుంటామనో.. రకరకాల కారణాలతో తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకోవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేక పోయారు. మళ్లీ ఇప్పుడు అలాంటి స్వాగతించలేని ఘటనకు ఉస్మానియా విద్యా ప్రాంగణం వేదిక కావడం బాధాకరంగా ఉంది. ఏకంగా అధ్యాపకులపైనే విద్యార్థులు దాడికి ప్రయత్నించడాన్ని సభ్యసమాజం ఏమాత్రం ఆమోదించదు.

విద్యార్థులకు సీమాంధ్ర అధ్యాపకులపై అనుమానం కలగొచ్చు... గతంలో ఒకటి రెండు ఘటనలు వారి అనుమానాలను
బలోపేతం చేసేలా ఉండవచ్చు. అయితే, అందరినీ ఒకే గాటన కట్టడం ఏమి న్యాయం. సహజంగా ఏ అధ్యాపకుడూ విద్యార్థుల జీవితాలతో ఆటలాడతానుకోవడంలో అంత హేతుబద్ధత కనిపించదు. ఒకవేళ ఒకరిద్దరు అధ్యాపకులు విద్యార్థులను ఫెయిల్ చేశారనుకున్నా.. రీ వాల్యుయేషన్ ప్రక్రియ ఉండనే ఉంది కదా..! అందులో తప్పు బయటపెట్టి, బాధ్యులను గుర్తించడం, శిక్ష పడేటట్లు చేయడం పెద్ద కష్టమేమీ కాదే. కేవలం ఒకరిద్దరి మీద అనుమానంతో, ఒక ప్రాంతానికి చెందిన అధ్యాపకులందరినీ ఇంతలా అవమానించడం అంత మంచిది కాదు.

తెలంగాణ ప్రాంతంలో పుట్టి పెరిగిన బిడ్డలు ఆత్మాభిమానంతో పాటు.. అతిథి మర్యాదలు చేయడంలో మర్యాదరామన్నలే. మరి ఆ స్ఫూర్తి ఏమైంది..?

విద్యార్థులు ఉద్యమ ఉధృతికి రకరకాల వ్యూహాలు రచించ వచ్చు.. ఏలికల తలలు వంచి లక్ష్యాన్ని సాధించ వచ్చు. అయితే ఇలాంటి ఘటనలకు పాల్పడడం వల్ల, ఉభయ ప్రాంతాల సోదరుల మధ్య అనవసర వైషమ్యాలు పెరుగుతాయి. ఇది ఎవరికీ మంచిది కాదు. అందుకే విద్యార్థులారా.. కాస్త నెమ్మదించండి.. ఆలోచించండి.. ఉద్యమ వ్యూహాన్ని సరిచూసుకోండి. లక్ష్యం దిశగా అడుగులు వేయండి.

అమ్మకు సర్వనామమే తెలుగు..

తెలుగు.. ఈ పదం వినగానే, అమ్మచేతి గోరుముద్ద తిన్న చిన్ననాటి ఆనందం.. చెప్పిన మాట వినలేదని వీపున బాజా మోగించిన అమ్మ చేతి తాడనం.. తమ్ముడికి లాలనగా ఉగ్గాముదం పట్టిస్తున్న అమ్మ చెంగును, చాటుగా చేసుకుని ఆసక్తిగా చూసిన జ్ఞాపకం.. అ... అమ్మ, ఆ.. ఆవు అంటూ సాగించిన అభ్యాసం.. ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రతి తరగతిలోనూ 80కి పైగా మార్కులు సంపాదిస్తూ.. దాన్నే ఆనవాయితీగా మార్చుకున్న నన్ను చూసి తెలుగు మాస్టారు మధుసూదన్ రెడ్డి గారు శభాష్ అంటూ మెచ్చుకున్నప్పుడు నాలోని గర్వం.. ఇలా ఒకటేమిటి ఎన్నో ఎన్నెన్నో గుర్తులు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

ఒక్క పదం నాలో ఇన్ని భావాలకు, ఉద్వేగాలకు కారణమవుతోందా..? ఆ పదం వింటే అమ్మ గుర్తుకు రావడం ఏంటి..? చిన్ననాటి విశేషాలన్నీ బుర్రలో గిర్రున తిరగడమేంటి..?

అవును.. ఆ పదానికి నాకు విడదీయరాని బంధం.. అమ్మకు నాకు ఉన్న కమ్మని అనుబంధం.. అందుకే అంటాను.. అమ్మకు సర్వనామమే ఆ పదం. అందుకే తెలుగు అన్న మూడక్షరాల ఆ పదం నాకు మాతృభాష అయింది. నాతోనే రోజురోజుకీ పెరుగుతూ వస్తోంది.

రేపు (ఆగస్టు 29వ తేదీ) తెలుగు భాషా దినోత్సవం అనగానే, నా మదిలో మెదిలిన అందమైన అనుభూతిని తెలిపేదే ఈ అక్షరమాలిక.

ఇక్కడ ఓ రెండు ముచ్చట్లు :

నేను పనిచేస్తున్న టీవీలో... వార్తల ముఖ్యాంశాల (News Headlines)కు తోక పదాలు లేదా పదబంధాలు (టెయిల్ ట్యాగ్) రాయడం ఆనవాయితీ. ఆ తోకపదాలు అచ్చమైన తెలుగులో ఉండాలన్నది నా భావన. అందుకే వీలైనంత వరకూ తెలుగు పదాలు లేదా పదబంధాలు రాస్తుంటాను. అయితే ఒక సహచరోద్యోగి వచ్చి.. ఆ పదాలు ఎవరికి అర్థమవుతాయి..? చక్కగా అందరికీ అర్థమయ్యేలా వాడుక భాష (అతడి ఉద్దేశంలో ఆంగ్ల పదాలు) రాయొచ్చు కదా అన్నాడు. ఎవరికీ అర్థం కావు అని తెలుగు పదాలను రాయడం మానేస్తే ఇక తెలుగు భాష చచ్చిపోదా..? మనం తెలుగు వాళ్లమైనందుకు అమ్మభాషను చంపేద్దామా అంటూ నిలదీసేసరికి అతను మౌనంగా వెళ్లిపోయాడు. (ఈ ఘటన తర్వాత ఏదైనా తెలుగు పదాలకు అర్థం తెలియకుంటే నాదగ్గరికే వస్తున్నాడనుకోండి..)

అందుకే నా బృందంలో పనిచేసే ప్రతివారికీ తెలుగు భాషలో తెలిసిన ప్రతీ పదాన్ని అర్థరహితంగా వాడొద్దని, అర్థం తెలిసుంటేనే వాడండి అని చెపుతుంటాను. ఒకవేళ వాడాలనుకున్న ఏ పదానికైనా అర్థం తెలియకుంటే సీనియర్ల నుంచి తెలుసుకోండి.. లేదా డిక్షనరీని చూసి అర్థం తెలుసుకుని వాడండి అని చెపుతాను. ఆ విధంగానైనా వర్తమాన జర్నలిస్టులకు తెలుగు భాష అలవాటవుతుందన్నది నా నమ్మకం.

పోతే (ఎవరు పోతే అని ప్రశ్నించకండి మహా ప్రభూ..), రాజధాని హైదరాబాద్ లో రేపు (29-08-2010) తెలుగును సుసంపన్నం చేసేందుకు ఓ చిరు ప్రయత్నం జరుగుతోంది. "తెలుగు బాట" పేరిట పాదయాత్ర జరగబోతోంది. ఉదయం ఎనిమిది గంటలకు సచివాలయం దగ్గరున్న తెలుగుతల్లి విగ్రహం నుంచి బయలుదేరి తొమ్మిది గంటలకు పీవీ జ్ఞానభూమి దాకా ఈ యాత్ర సాగుతుంది. రండి మనందరం ఈ అడుగుల్లో అడుగు కలుపుదాం.. మన అమ్మభాష తెలుగును సుసంపన్నం చేసుకుందాం.