Saturday, October 23, 2010

తెలుగు హంతకులు...!!



మనం తెలుగోళ్లం.. దురదృష్టవశాత్తూ "తెలుగు భాష" హంతకులను ప్రోత్సహిస్తున్న వాళ్లం. మన భావ వినిమయ సాధనాన్ని ఖండఖండాలుగా చీల్చి చెండాడుతున్న వాళ్లం. ప్రాచీన భాష హోదా దక్కించుకుని దానికి గౌరవాన్ని ఇనుమడింప చేయాల్సిన తరుణంలో.. వ్యక్తిగత కక్షలు, కార్పణ్యాలతో అమృతతుల్యమైన శబ్దం "తెలుగు"ను విషపూరితం చేస్తున్న వాళ్లం.. అందుకే మనం తెలుగు వాళ్లం. కాకుంటే ఏంటి చెప్పండి.. తెలుగు లలిత కళాతోరణం పేరులో తెలుగును తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా మనకు చీమకుట్టినట్లయినా ఉందా..? అందుకే మనం తెలుగోళ్లం.

ఆత్మాభిమానం అంటే ఏంటో రుచి చూపించిన ఎన్టీఆర్‌ అంటే తెలుగు వాళ్లకు ఎందుకో అంత కచ్చ. " ఆర్‌ యు మదరాసీ" అన్న స్థాయి నుంచి ఆర్‌ యు ఫ్రమ్‌ ఆంధ్రప్రదేశ్‌ అన్న స్థాయికి తెలుగువారి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో పెంచిన ఎన్టీఆర్‌ను.. మరేలనో.. పదే పదే అవమానిస్తున్నారు. ఇవాళ మన భాషను, కేంద్రప్రభుత్వం ప్రాచీన భాషగా గుర్తించడం వెనుక... తెలుగుకు ఎన్టీఆర్‌ కల్పించిన విస్తృత ప్రాచుర్యం విస్మరించరానిది. అలాంటి తెలుగువాడికి పదే పదే అదే పనిగా అవమానం జరుగుతోంది. మొన్నటికి మొన్న హైదరాబాద్‌లో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయానికి.. రాజీవ్‌ గాంధీ పేరును పెట్టారు. ఎన్టీఆర్‌ పేరు పెట్టండ్రోయ్‌ అని ఎన్టీఆర్‌ అభిమానులు ఎంత గొంతు చించుకు అరచినా వినలేదు. సరే గొంతెండి పోయి వాళ్లే మౌనం పాటించారు. ఈ డిమాండ్‌ సహేతుకమే అయినా.. రాజకీయ రొచ్చులో మన రాయి వేయడం ఎందుకులే అని రాజీవ్‌ పేరుకే మిగిలిన వారూ మౌనంగా ఆమోద ముద్ర వేశారు.

ఇవాళ్టికివాళ మళ్లీ ఎన్టీఆర్‌ కలల సౌధం.. మానస పుత్రిక తెలుగు లలిత కళాతోరణం పేరును రాజీవ్‌గాంధీ లలిత కళాతోరణంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులనూ జారీ చేసేసింది. ఇదెక్కడి దారుణం స్వామీ..! తెలుగు లలిత కళా తోరణం.. ఎన్టీరామారావు మానస పుత్రిక. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల నిర్వహణ కోసం 1986లో కేవలం మూడంటే మూడు నెలల్లో... దీన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు. ఐదు వేల మంది ప్రజలకు ఏకకాలంలో కూర్చుని చూసేందుకు వీలుగా దీన్ని నిర్మించారు. ఇప్పుడేమో దాన్ని ఇండోర్‌ ఆడిటోరియం గా మారుస్తారంట. సంతోషమే.. మార్చుకోండి. అందులో తెలుగు పేరును తొలగించడం ఏంటి.?

పార్లమెంటు సభ్యుడు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి గారు సొంత నిధులతో లలిత కళాతోరణాన్ని అత్యాధునిక సదుపాయాలతో తీర్చిదిద్దుతారంట.. ఆ ఖర్చు చేసినందుకు గాను, తెలుగు లలిత కళాతోరణం పేరులో తెలుగును తొలగించి రాజీవ్‌గాంధీ పేరును పెట్టాలని కోరారట. అర్థం పర్థం ఉందా..?

విశాఖ రాజకీయాల్లో ఎన్టీఆర్‌ తనయ, ప్రస్తుత కేంద్ర మంత్రి పురంధ్రీశ్వరితో తిక్కవరపు గారికి రాజకీయ విరోధం ఉంది. 35 సంవత్సరాలుగా తాను స్థిరపడిపోయిన విశాఖలో, ఎక్కడినుంచో వచ్చిన పురంధ్రీశ్వరి ఎంపీగా గెలిచి.. అక్కడి స్థానాన్ని సుస్థిర పరచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని తిక్కవరపు వారు.. తరచూ పురంధ్రీశ్వరిని రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. ఈ క్రమంలో... పురంధ్రీశ్వరిపై పైచేయి సాధించేందుకే.. సుబ్బరామిరెడ్డి గారు, తెలుగు లలిత కళాతోరణంలో తెలుగును తొలగించే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానం కలుగుతోంది.

నేతలూ దయచేసి రాజకీయాలను పక్కన పెట్టండి.. తెలుగు భాషను హతమార్చాలనుకునే వారిపై పోరాడదాం.. తెలుగును బతికించుకుందాం. కలసి రండి.

Friday, October 22, 2010

నందీశ్వరుడు.. నందమ్మగా మారాడు..!


ప్రకృతితో మమేకమయ్యే సంప్రదాయాలు భలే విచిత్రంగా ఉంటాయి... అనుభవించే వారికి మాత్రం అంతులేని ఆనందాన్ని కలిగిస్తాయి. పంచభూతాల్లో అతి కీలకమైన నీటితోనే బతుకును ముడివేసుకున్న మత్స్యకారుల ఆచార వ్యవహారాలు.. ఇలాంటివే. వీరి సంప్రదాయాలను బయటి నుంచి చూసే వారికి భలే ఆసక్తిని కలిగిస్తాయి.
ఆంధ్రా-ఒరిస్సా బెస్తల వేలుపు నందమ్మ
సముద్రం తప్ప మరో గమ్యం తెలియని.. జలధే తప్ప మరో జీవన మర్మం ఎరుగని మత్స్యకారులు ఆచరించే సంప్రదాయాల్లో కీలకమైనది నందమ్మ ఉత్సవం. మహేశ్వరుని వాహనం నంది.. మత్స్యకారుల ఉత్సవాల్లో నందమ్మగా మారిపోయాడు. నంది పుంలింగమైతే.. గోవు స్త్రీ లింగం కావాలి. కానీ ఇవేవీ వీరికి పట్టవు. పార్వతీ పరమేశ్వరులను మోసుకు వచ్చే నందీశ్వరుని ఉత్సవ విగ్రహాన్ని మత్స్యకారులు నందమ్మగా పూజిస్తారు. ఒరిస్సా, ఆంధ్ర ప్రదేశ్‌లలోని మత్స్యకారులు ఈ పండుగను అత్యంత వేడుకగా జరుపుకుంటారు.
పదకొండు రోజుల పండుగ
మత్స్యకారులు ఈ నందమ్మ ఉత్సవాలను పదకొండు రోజుల పాటు జరుపుకుంటారు. పండుగ పదకొండు రోజులూ తమకు తోచిన రీతిలో ఉమా మహేశ్వరులను పూజిస్తారు. చివరి రోజున నందీశ్వరుడి విగ్రహంపై, పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారు. ఆదిదంపతుల ఉత్సవమూర్తులను గూడెం నడిబొడ్డున ప్రతిష్ఠించుకుని విశిష్ట పూజలు జరుపుతారు. ఆరోజున నిరాహారులై.. సముద్రపు అలలతో ఆటలాడి.. సంద్రపు నీటిలో స్నానమాడి.. ప్రకృతితో మమేకమై సంబరాన్ని విభిన్నంగా జరుపుకుంటారు.
అక్కడ ముగింపు.. ఇక్కడ శ్రీకారం :
ఒరిస్సాలో కార్తీక మాసానికి ముందు వచ్చే పౌర్ణమి రోజుతో ఈ నందమ్మ ఉత్సవాలు ముగుస్తాయి. ఆంధ్రప్రదేశ్‌ సముద్ర తీరం వెంబడి ఉన్న మత్స్యకారులు ఈ పౌర్ణమి రోజుతో మొదలు పెట్టి పదకొండు రోజులు పండుగ చేసుకుంటారు. ఈ పౌర్ణమిని గౌరీ పౌర్ణమిగా భావిస్తారు. వేడుకల చివరి రోజున అంటే పదకొండో రోజున నందమ్మను (నందీశ్వరుని) సముద్రంలో నిమజ్జనం చేస్తారు. అంతటితో ఉత్సవం పరిసమాప్తమవుతుంది.
వృతికి ఆటవిడుపు :
కోస్తా తీరం వెంబడి ఉన్న 60 వేల దాకా మత్స్యకారులు ఈ పండుగను అత్యంత సంబరంగా జరుపుకుంటారు. నిత్యం చేపల వేటలోనే నిమగ్నమయ్యే వీరు.. నందమ్మ పండుగ నాడు మాత్రం ఆటవిడుపుగా గడుపుతారు. పిన్నా పెద్దా, ఆడా మగా భేదం లేకుండా, ఆడీపాడీ, ఉత్సాహంగా సంబరం చేసుకుంటారు. చివరి రోజున నిష్టగా ఉపవాసం ఉండి భక్తి భావంతో సముద్ర స్నానాలు చేస్తే.. అవివాహితలకు పెళ్లిళ్లు అవుతాయని, సంసారంలో సుఖశాంతులు వెల్లి విరుస్తాయని మత్స్యకారులు నమ్ముతారు. ఈ నమ్మకాల వెనుక వాస్తవాలను వెతకడం కన్నా.. విభిన్నంగా, ఎవరికీ ఇబ్బంది కలిగించని రీతిలో ఉన్న వీరి ఆచారాన్ని మనమూ మనస్ఫూర్తిగా ఆస్వాదిద్దాం.

Wednesday, October 20, 2010

ప్రశిష్యుడి నుంచి సమాధి దాకా...

భాషా పదకోశం భలే చిత్రమైంది. శోధిస్తూ పోతే.. కొత్త కొత్త అర్థాలు ఎన్నింటినో అందిస్తూ ఉంటుంది. అర్థ శోధనలో ఎక్కడో ప్రారంభించి మరెక్కడికో చేరుకుంటుంటాము. శిష్య ప్రశిష్యులు అనే పదాలకు అర్థాన్ని రూఢీ చేసుకుందామని శబ్దరత్నాకరాన్ని ఆశ్రయించా. ఇక చూస్కోండి.. అక్కడ మొదలై.. ఎక్కడెక్కడికి వెళ్లి ఆగిందో..!

ప్రశిష్యుడంటే..?
ప్రశిష్యుడు అన్న పదమే శబ్దరత్నాకరంలో లేదు. సరే శిష్యుడు పదాన్ని వెతికా!

శిక్షింపబడే వాడే శిష్యుడట
శిష్యుడు అంటే విద్య కొరకు దగ్గర చేరి సేవచేయుచూ శిక్షింపబడు వాడు అని అర్థం ఉంది.
ఈ శిక్షింపబడడం ఏంటి..? పాపం శిష్యుడు చేసిన నేరం ఏంటి..? సరే..శిక్షింపబడువాడు అంటే..?
శిక్ష అన్న పదానికి అర్థాన్ని శోధించా.
శిక్ష అంటే షడంగములలో ఒకటి లేదా విద్యాభ్యాసం అని శబ్దరత్నాకరం వివరించింది. పనిలో పనిగా
శిక్షితుడు అంటే శిక్షింపబడిన వాడు లేదా నేర్పరి అని,
శిక్షించు అంటే శిక్ష (విద్యాభ్యాసం) చేయు అనీ అర్థాలనిచ్చింది.

షడంగాలా..? అవేంటో..?
శిక్ష అంటే షడంగాలలో ఒకటి అని ఓ అర్థం తెలిసింది కదా..! మరి ఆ ఆరు అంగాలేంటో..?
షడంగములు : శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జోతిషం, కల్పం
హమ్మయ్య షడంగాలు తెలిశాయి..! మరి శిక్షను ఆరు అంగాలలో ఒకటి అన్నారు కదా..?

అంగమంటే..?
అంగం అంటే అందం, విధం, అవయవం, ఉపాయం, దేహం, అప్రధానం అన్నది నిఘంటు వివరణ.
సరి సరి.. అంగాలు ఆరు విధాలన్నమాట అనుకునేలోపే.. అయ్యయ్యో.. అదేంటి..? ఇంకా ఉన్నాయి ఈ కింద చూడండి అని మరిన్ని అంగాలను ప్రస్తావించింది శబ్దరత్నాకరం.
చతురంగాలు : రథం, గజం, తురగము, పదాతి
అంగపంచకం : ఉపాయం, సహాయం, దేశకాల విభజనం, అపదకు ప్రతిక్రియ, కార్య సిద్ధి
పంచాంగములు : తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం,
సప్తాంగాలు : స్వామి, అమాత్యుడు, సుహృత్తు, కోశము, రాష్ట్రము, దుర్గము, బలము
అష్టాంగాలు : యమము, నియమము, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధ్యానం, ధారణ, మననం, సమాధి

ఓర్నాయనో..! ప్రశిష్యుడిని శోధించడం ప్రారంభిస్తే.. అది సమాధి దాకా తీసుకు వెళ్లింది. ఇంకా ముందుకు వెళితే మరెక్కడికి తీసుకెళుతుందో..!! ఏదైతేనేం.. ప్రశిష్యుడంటే.. శిష్యుడికి శిష్యుడు అన్న అర్థాన్ని రూఢీ చేసుకుని.. ఈ పద శోధనను ఆపేస్తున్నా. ఇక్కడ ప్రస్తావించిన పదాల అర్థ వివరాల సంగతి.. భవిష్యత్తులో సందర్భాన్ని బట్టి చూద్దాం. అంతవరకూ ఉంటానే..!

Tuesday, October 19, 2010

ఈనాడులో... "ఐదు వాక్యాల" వార్తలో ఐదు తప్పులు..!

జర్నలిస్టు మిత్రులు ఇటీవల రాస్తున్న వార్తలు పరిశీలిస్తే.. ముఖ్యమైన ప్రాంతాల గురించిన కనీస అవగాహన ఉండడం లేదన్న విషయం అర్థమవుతుంది. జర్నలిస్టులు అన్ని ప్రాంతాలనూ సందర్శించి ఉంటారనుకోవడం అవివేకమే. అయితే.. ఉన్నచోటు నుంచే వివిధ ప్రాంతాల పేర్లు (సరైన రూపం), అక్కడి సంప్రదాయాలు తెలుసుకుని ఉండాలి. దీంతోపాటే.. ఇటీవల మార్పులు జరిగిన ప్రధాన నగరాల పేర్లనూ గమనంలోకి తీసుకోవాలి. లేకుంటే.. ప్రసారం లేదా ప్రచురణ తర్వాత.. ఆ వార్తను చూసిన వాళ్లు, రాసిన వాళ్ల అజ్ఞానాన్ని చూసి నవ్వుకుంటారు. తద్వారా, పత్రిక లేదా ఛానెల్‌ పరువు కూడా పోతుంది.

ఉదాహరణకు, ఈరోజు (19-10-2010) ఈనాడు దినపత్రిక మెయిన్‌ ఎడిషన్‌ మూడో పేజీలో ఓ సింగిల్‌ కాలమ్‌ వార్త వచ్చింది. ఇందులో ఐదంటే ఐదే వాక్యాలున్నాయి. అందులో అయ్యప్ప భక్తులకు సంబంధించిన సమాచారం ఉంది. ఆ వార్త చదివిన అయ్యప్ప భక్తులు కచ్చితంగా ఇది అవగాహన లేని వారు రాసిన వార్త అని తేలిగ్గా అర్థం చేసుకుంటారు.


పై వార్తలో...

మేల్‌శాంతి కి బదులుగా మేలశాంతి అని
ట్రావెన్‌కోర్‌ దేవస్వం బదులుగా త్రవాన్కోర్ దేవశ్వం అనీ రాశారు.
అలాగే, మాలికాపురం బదులుగా మలికప్పురం అని రాశారు.
మేలశాంతిగా పిలిచే ఈ స్థానం కోసం అని రాశారు. మేల్‌శాంతి అంటే ప్రధాన అర్చకుడు అని అర్థం. అది పదవి.. స్థానం కాదు.
మరో వాక్యంలో... "వ్యవహరిస్తారని నిర్వాహకులు తెలిపారు" అని రాశారు.. ఇక్కడ నిర్వహణకు సంబంధించిన అంశం ఎందుకొచ్చిందో అర్థం కాదు. పైగా ఎవరు ఏమి నిర్వహిస్తున్నారో మరి రాసినవారికే తెలియాలి.

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు స్థాయిలో ప్రసిద్ధి చెందిన ట్రావెన్‌కోర్‌ దేవస్వం (దేవస్థానం) బోర్డును తప్పుగా రాయడం, శబరిమల ప్రధాన అర్చకుల నియామకానికి సంబంధించిన విధి విధానాలు, ఎంపిక తీరు తెలియక పోవడం, వల్ల ఈ తప్పు దొర్లిందన్నది అర్థమై పోతోంది. కేవలం ఐదు వాక్యాల వార్తలో.. ప్రతి వాక్యంలోనూ ఇన్ని తప్పులు రావడానికి, రాసినవారి అవగాహన లోపమే కారణమన్నది నా భావన. అయితే ఇంఛార్జి గారూ దీన్ని చూసీ చూడనట్లు వదిలేయడం సమంజసమనిపించడం లేదు.

ముంబైని బొంబాయిగాను, చెన్నైని మద్రాసుగాను, గౌహతిని గువాహటిగాను నేటికీ రాస్తున్న ప్రముఖులు ఉన్నారు. సీనియర్లు కాస్త జోక్యం చేసుకుని ఇట్లాంటి తప్పులను ఎప్పటికప్పుడు సరిచేస్తూ పోతే... యంగ్‌ టాలెంట్స్‌ నేర్చుకుంటూ వస్తారు. ఏమంటారూ..?

Monday, October 18, 2010

అర్థం తెలుసుకుని వాడదాం...!!

తెలుగు జర్నలిజంలో భాషకు చాలా ప్రాముఖ్యత ఉంది. అర్థం తెలీకుండా పదాలను వాడితే.. చెప్పదలచుకున్న భావంలో స్పష్టత రాకపోవచ్చు. పైగా కొన్నిసార్లు దురర్థమూ రావచ్చు. అందుకే రోజువారీ‌ వాడే కొన్ని తెలుగు పదాల సరైన రూపాలు వాటి అర్థాలను ఓసారి చూద్దాం.

బీభత్సం
(ఈ పదంలో రెండో అక్షరం మహాప్రాణం.. దానికే ఝట ఉంటుంది)
ఈ పదానికి అసహ్యమైనది అని అర్థం. బీభత్సుడు చేసేది బీభత్సం. బీభత్సుడు అంటే అర్జునుడు.. అర్జునుడు తన పాటవాన్నిప్రదర్శించాక.. (యుద్ధ) ఫలితం జీర్ణించుకోలేనిదిగా ఉంటుంది. ఓ రకమైన అసహ్యాన్ని కలిగిస్తుందట. అందుకే కాబోలు, నిఘంటుకారులు బీభత్సం అన్న పదానికి అసహ్యమైనది అన్న అర్థమిచ్చారు.

అధిష్ఠానం :
(అధి+స్థానం = అధిష్ఠానం :: స్థానంలో మహాప్రాణం (థ) సంధిలో (ఠ) ఒత్తుగా మారుతుంది.
అధి అన్న ఉపసర్గకు పైన, ఎగువన అన్న అర్థం ఉంది. స్థానం అంటే కూర్చునే చోటు లేదా స్థలం.
అధిష్ఠానం అంటే ఎగువన (గద్దెపై) కూర్చునేవారు అని అర్థం.
నాయకత్వం అన్న విస్తృత అర్థంలో అధిష్ఠానం అన్న పదాన్ని వాడుతున్నాం.

వివక్షత :
వక్.. అంటే మాట.
వ్యక్తులు లేదా వర్గాలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు.. మాటల్లో భేదం చూపిన సందర్భాల్లో వివక్షత అన్న పదం వాడతారు.

విచక్షణ :
చక్షు: అంటే కళ్లు.
వ్యక్తులు లేదా వర్గాలను చూసే చూపులో తేడా ఉన్నప్పుడు విచక్షణ అన్న పదం వాడతారు.

ప్రదానం
(రెండో అక్షరం అల్ప ప్రాణం.. ఝట ఉండదు)
దానం అంటే ఇవ్వడం, త్యాగం అన్న అర్థాలు ఉన్నాయి. ఏదైనా (సర్టిఫికెట్లు, అవార్డులు మొ...) ఇచ్చేటప్పుడు ప్రదానం అన్న పదాన్ని వాడతారు.
ప్రధానం
(రెండో అక్షరం మహాప్రాణం.. ఝట ఉంటుంది)
ముఖ్యమైనది అన్న అర్థంలో ఈ పదాన్ని వాడతారు.

అనుమానం : శంక
అవమానం : శీలానికి భంగం (శీలం అంటే గుణం అన్నది విస్తృతార్థం)

అసువులు :
(అశువులు కాదు) : ఊపిరులు, ప్రాణాలు
అస్రువు లేదా అశ్రువు :
కంటి నుంచి వచ్చే నీటి బిందువు
అంతస్తు : మేడ పై భాగం, పరువు
అంతస్థ : రహస్యంగా ఇచ్చే లంచం
అగాధం : చాలా లోతైన ("ధ" పొట్టలో చుక్క ఉండదు)
అంతర్ధానం : కనుమరుగు కావడం (అంతర్ధ : మరుగు)
అపప్రథ :
చెడ్డపేరు (ప్రథ అంటే పేరు, ప్రఖ్యాతి అని అర్థం, వ్యతిరేక అర్థాన్నిచ్చే ‘అప’ అనే ఉపసర్గను వాడడం వల్ల అపప్రథ అన్న పదానికి చెడ్డపేరు అని అర్థం వచ్చింది. )
ఉత్థాన పతనాలు : పడుతూ లేస్తూ ఉన్న సందర్భాల్లో దీన్ని వాడతాం.
(ఉత్థానం : లేవడం, పతనం : పడడం)
అధమము : అవధ్యము, తక్కువైనది
(వధ్యము : చంప తగినది .... అవధ్యము అంటే చంపకూడనిది)
ఊర్ధ్వము : పొడవైనది, మీదిది, పై భాగానిది
అధో : కిందిది
అర్థి : వేడువాడు.
అభ్యర్థి : (అభి+అర్థి) :
(‘అభి’ అంటే ఎదురుగా ఉండి ‘అర్థి’ అంటే వేడువాడు అని అర్థం) : ఏదైనా కోరువాడు అన్న అర్థంలో వాడుతున్నాం.
ప్రత్యర్థి :
(ప్రతి+అర్థి) : (ప్రతి అంటే సమానంగా, అర్థి అంటే వేడువాడు.. అంటే తనకు సమానంగా వేడుతూ.. తన అవకాశాన్ని దెబ్బతీసే వాడు కాబట్టి, అతడిని పోటీదారు అంటాం. ఆ అర్థంలోనే ప్రత్యర్థి అని వాడుతున్నారు. ప్రత్యర్థి అన్న పదాన్ని శత్రువు అన్న అర్థంలో వాడుతున్నాం.)

Sunday, October 17, 2010

విజయదశమి శుభాకాంక్షలు

మిత్రులారా..
మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ..

D : Dhana dhanyadi (ధనధాన్యది)
A : Ashtaiswaryalanu (అష్టైశ్వర్యాలను)
S : Samruddhigaa (సమృద్ధిగా)
A : Aaa (ఆ...)
R : Raakhsasaantaki (రాక్షసాంతకి)
A : Andinchaalani (అందించాలని)

మనస్ఫూర్తిగా కోరుకుంటూ
విజయ దశమి శుభాకాంక్షలు

Friday, October 15, 2010

పెద్దల పండుగ ఇలా...

హైందవ సంస్కృతిలో పండుగలకు ఎంతో విశిష్టత ఉంది. వివిధ మతాలు, కులాలకు చెందిన వారు, విభిన్నమైన వేడుకలను వివిధ రూపాల్లో జరుపుకుంటూ తమ భక్తిని చాటుకుంటుంటారు. వాటిలో పితృదేవతలకు జరిపే వేడుక చాలా భిన్నంగా ఉంటుంది. చాలా చోట్ల 'పెద్దల పండుగ'గా చెప్పుకునే ఈ పండుగ చాలా విచిత్రంగా ఉంటుంది.



ఏడాదికి ఒకసారి, ఆశ్వయుజ మాసం ప్రారంభ సూచికగా వచ్చే అమావాస్య రోజును మహాలయ అమావాస్యగా చెబుతారు. చాతుర్వర్ణాలలో ఒకరైన శూద్రులకు ఈ మహాలయ అమావాస్య చాలా ముఖ్యమైంది. ఈ అమావాస్యను పెద్దల అమావాస్య అని, ఆరోజు చేసుకునే వేడుకను పెద్దల పండుగ అనీ అంటారు. భాద్రపద మాసంలో కృష్ణపక్షాన్ని మహాలయ పక్షమని, పక్షం చివర్లో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అనీ అంటారు. చనిపోయిన తమ పెద్దల ఆత్మలకు శాంతిని కలిగించేందుకు శూద్రవర్ణాల వారు.. మహాలయ అమావాస్య రోజున చేసే పూజా కార్యక్రమమే ఈ పెద్దల పండుగ.
అలంకరణ తీరు :
ఆరోజున ఉదయానికల్లా వీలైనంతలో ఇంటిని శుభ్రం చేసుకుంటారు. ఓపిక ఉన్నవారు, ఆరోజు పచ్చి గంగైనా ముట్టుకోకుండా రాత్రి వరకూ ఉపవాసం చేస్తారు. సాయంత్రం వేళ.. (ఊరి వెలుపల ఉన్న) ఎర్రమట్టిని తెచ్చి, దాన్ని నీటితో కలిపి ముద్దగా చేస్తారు. ఇంట్లో ఓ గోడచాటుగా అనువైన చోట ఆ ఎర్రమట్టి ముద్దతో నేలను అలుకుతారు. ఆ తర్వాత దానిపై జొన్న పిండి, కుంకుమలతో ముగ్గు వేస్తారు. ఆ ముగ్గుపై భాగంలో.. శుభ్రం చేసిన ఓ పీటను ఉంచి.. దాన్ని కొత్త వస్త్రంతో కప్పుతారు. అనంతరం అలంకరించిన ఆపీట పైన, ఓ రెండు, మూడు గుప్పిళ్ల బియ్యం రాసిగా పోస్తారు. ఆ బియ్యం కుప్పను సరిచేసి, దానిపై కలశం (నీటితో నిండుగా నింపిన చెంబు) ఉంచుతారు. దాన్ని విబూది, కుంకుమలతో అలంకరిస్తారు. ఆతర్వాత, దాని వెనుక గోడకు ఆనించి కొత్తగా కొన్న దుస్తులను ఉంచుతారు.


భలే వింతైన నైవేద్యం :
పైరకంగా పూజాస్థలాన్ని అలంకరించిన తర్వాత, కలశానికి రెండువైపులా దీపపు ప్రమిదలు ఉంచి వెలిగిస్తారు. అనంతరం, అంతకు ముందే వండి సిద్ధం చేసుకున్న నైవేద్యాన్ని.. పీట ఉంచగా మిగిలిన ముగ్గులో ఉంచుతారు. నైవేద్యమంటే మరేమో అనుకునేరు.. మద్యమాంసాలే! పొట్టేలును కసాయి కోసిన తర్వాత, దాని తల, కాళ్లను నిప్పులపై కాల్పిస్తారు. ఆ మాంసంతో పాటు, పొట్టేలు మెదడు, పేగులు, గుండె, కాలేయము తదితర భాగాలను వండుతారు. పొట్టేలును కోసినప్పుడు వచ్చిన రక్తంతో ప్రత్యేకంగా ఓ పచ్చడిని రూపొందిస్తారు. ఈ రకంగా వండిన వంటలను, మద్యం సీసా, పూర్వీకుల సంతృప్తి కోసం బీడీ, సిగరెట్‌ ఇలా కాదేది నైవేద్యానికి అనర్హం అన్నట్లుగా (చనిపోయిన) పెద్దలకు నివేదిస్తారు.
గోవిందుడి నామమే మంత్రం :
ఈ నైవేద్యం సమర్పించేటప్పుడు.. ఏడుకొండల వాడి నామ స్మరణే వీరికి మంత్రాలు. షోడశోపచారాలూ గోవిందుని నామస్మరణతో సరి. దీపం వెలిగించి, అగరుబత్తులు అంటించి.. సాంబ్రాణి పొగ రేపి.. ఇంట్లో ఓ రకమైన ఆధ్యాత్మక భావనను తెస్తారు. పూజ చివరలో, పత్తితో చేసిన బొడ్డువత్తితో మంగళహారతి ఇస్తారు. ఇప్పుడు కూడా గోవిందుని నామస్మరణే హారతి పాట. అందరూ ఆ హారతిని స్వీకరించాక, విస్తట్లో నైవేద్యంగా ఉంచిన పదార్థాలన్నింటినీ కొద్దికొద్దిగా తీసుకుని హారతి మంటపై.. వేస్తారు. అది ఆరిపోకుండా, నైవేద్యంగా ఉంచిన మద్యాన్ని ఆ మంటపై పోస్తారు. అది ఎంత భగభగ మంటే.. పితృదేవతలు అంత శాంతించినట్లుగా భావిస్తారు.
తర్వాత.... పూజ జరిపించిన ఇంటి పెద్ద... పెద్దలకు నమస్కరించిన ప్రతివారికీ నుదుటన నిలువుగా కుంకుమ తిలకం దిద్ది, విస్తరిలో పెద్దలకు నైవేద్యంగా పెట్టిన తినుబండారాలను కొద్దిగా తీసి ప్రసాదంగా ఇస్తారు. అది తిన్నాక, వారికి తీర్థంగా, బెల్లం పానకాన్ని అందిస్తారు. అయినవారికి, మద్యాన్ని కూడా తీర్థంగా ఓ గ్లాసులో పోసి ఇస్తారు. ఇలా ఇంట్లోని వారు, బంధుమిత్రులు ఈ పూజలు చేసి.. చనిపోయిన వారి ఆత్మశాంతికి సాంబ్రాణి ధూపాన్ని సమర్పిస్తారు. పూజ మొత్తం అయిపోయాక, చేసుకున్న వంటకాలను, మందు తాగుతూ.. తింటారు. అంతా అయ్యాక, పడుకునే ముందు... పూజలో వినియోగించిన దుస్తులను తలగడ కింద ఉంచుకుని నిద్రిస్తారు. ఇలా చేస్తే తమని అమితంగా ప్రేమించే పితృపితామహుల్లో ఒకరు కలలోకి వస్తారట.


ఎందుకీ తంతు..?
ప్రాచీన కాలంలో శూద్రులు కేవలం వృత్తి పనులకు మాత్రమే పరిమితమయ్యే వారు. అక్షరజ్ఞానం ఈ వర్ణం వారిలో చాలా తక్కువగా ఉండేది. అందుకే.. ఇతర మూడు వర్ణాల వారి మాదిరగా వీరికి తిథి, వార, నక్షత్ర, గ్రహ సంచార గతుల గురించి తెలిసేది కాదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాల వారు, తమకు తెలిసిన రీతిగా, పితృదేవతల మృతిని బట్టి.. నిర్దిష్ట కాలంలోగా తద్దినాలు పెట్టేవారు. అయితే, అప్పట్లో నిరక్షరాస్యులు, నిరుపేదలు అయిన శూద్రులకు ఈ రీతిగా తిథి, నక్షత్రాలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కో సమయంలో తద్దినం పెట్టడం కుదిరేది కాదు. అందుకే.. అందరికీ కలిపి ఒకేరోజున పెట్టే తద్దినం తంతే.. ఈ పెద్దల అమావాస్య.
మహాలయము అంటే.. గొప్ప వినాశము అని అర్థం. భౌతికంగా నాశమైన తమ పెద్దలను ఆరోజున స్మరించుకుంటూ.. శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే.. ఏడాది వరకూ వారు సంతోషంగా ఉంటారన్నది నమ్మకం. స్కాంద పురాణం నాగర ఖండంలో ఈ ప్రస్తవన ఉందని చెబుతారు. ఏ ప్రస్తావన ఎలా ఉన్నా... శూద్రులు తమదైన శైలిలో.. ఏడాదికొక్కమారు, మద్య మాంసాదులతో చేసుకునే విందే.. ఈ పండుగ.
ఇంత వివరణాత్మక రచన అవసరమా..? ఏమో..! మంచో చెడో.. సంప్రదాయాలు ఇలా ఉన్నాయి.. వాటిని ఇలా పాటిస్తారు.. అని తలచుకోవడం సమంజసంగా ఉంటుందన్నదే నా భావన. ఇందులో ఎలాంటి దురుద్దేశమూ లేదు సుమా!

Thursday, October 14, 2010

మేరా భారత్‌ మహాన్..


నాకివాళ చాలా గర్వంగా ఉంది.. చెప్పలేనంత ఆనందంగా ఉంది.. ఈ అనుభూతిని వర్ణించడానికి మాటలు రావడం లేదు.. నాదేశం.. నన్ను గన్న నా దేశ పతాకం.. ప్రపంచ క్రీడా యవనికపై సగర్వంగా రెపరెపలాడింది. కామన్వెల్త్‌ క్రీడాంగణంలో.. మున్నెన్నడూ లేని రీతిలో పతకాల సెంచరీ సాధించింది. పతకాల పట్టికలో.. రెండో స్థానంలో సగర్వంగా నిలిచింది.

ఎన్నెన్నో అవినీతి ఆరోపణలు.. కూలిన నిర్మాణాలు.. మనదేశానికి విదేశీ ఆటగాళ్లు రారేమోనన్న అనుమానాలు..! ఇలా ఒకటా రెండా..? జరుగుతున్న పరిణామాలు... కామన్వెల్త్‌ క్రీడలు సజావుగా సాగుతాయన్న నమ్మకాన్ని ఎవ్వరిలోనూ కలిగించలేక పోయాయి. రాజకీయాల రొచ్చులో కూరుకుపోయిన వారు మసకబారేలా చేసిన ప్రతిష్టను.. మన ఆటగాళ్లు స్వచ్ఛమైన గంగాజలంతో పునీతం చేశారు. దేశ ప్రతిష్టకు శాశ్వత యశస్సును సముపార్జించి పెట్టారు.

కామన్వెల్త్‌ క్రీడలు అట్టహాసంగా ప్రారంభమైనా.. ఎవ్వరికీ భారత క్రీడాకారుల పాటవంపై నమ్మకం లేదు. రోజురోజుకీ పతకాల సంఖ్య పెరుగుతూ పోతుంటే.. ప్రపంచానికి దిమ్మతిరిగే దిగ్భ్రమ. తొలి స్వర్ణం వచ్చినపుడు.. ఏదో గాలి వాటం అనుకున్నారు. మలి స్వర్ణం.. ఆ తర్వాతి స్వర్ణం.. మధ్యలో రజత, కాంశ్య పతకాలు భారత్‌ పట్టికలో చేరుతుంటే.. మనదేశ పౌరులూ అవాక్కయ్యారు. మన జాతీయ క్రీడ హాకీ స్వర్ణాన్ని సాధించలేక మనల్ని నిరాశ పరిచినా.. మన హైదరాబాదీ సైనా నెహ్వాల్‌ "బంగారు" కొండగా మురిపించింది. ఈ అమ్మాయి తను స్వర్ణం సాధించడమే కాదు.. దేశ ప్రతిష్టను ఓ మెట్టు పెంచింది. సైనా స్వర్ణం కారణంగా.. పతకాల పట్టికలో భారత దేశం రెండో స్థానంలో నిలిచింది. (మన హైదరాబాదీ గగన్‌నారంగ్‌ మూడు స్వర్ణాల బోణీని విస్మరించరాదు సుమా..)

క్రీడలు ముగిసే సమయానికి 38 స్వర్ణాలు, 27 రజతాలు, 36 కాంస్య పతకాలు మెడలో ధరించిన భరత మాత.. వాటిని సంపాదించి పెట్టిన తన సంతానాన్ని చూసి మురిసి పోతోంది. అంతేనా.. ప్రపంచ దేశాల ముందు సగర్వంగా నిలుచుంది.

అందుకే మేరా భారత్‌ మహాన్‌..

Tuesday, October 5, 2010

బొడ్డెమ్మను విస్మరించారెందుకో...!


తెలంగాణ సంస్కృతి.. ఈ ప్రాంత విశిష్ట పర్వం.. అనగానే వెంటనే గుర్తొచ్చేది బతుకమ్మ. విదేశీ నాగరికత మోజులో బతుకమ్మను అంతా మరచిపోతున్నారనుకుంటుండగా.. పరిస్థితిలో కొద్దిగా మార్పు వచ్చింది. ఈ సంబరం ఓ రెండేళ్ల నుంచి కొత్త ఊపిరి పోసుకుంటోంది. అయితే.. బతుకమ్మ వేడుకలు శ్రీకారం చుట్టుకునే ముందే.. నిమజ్జనమయ్యే మరో అమ్మవారు బొడ్డెమ్మ. మరెందుకో ఆ అమ్మవారికి మీడియాలో అంతగా ప్రాధాన్యత దక్కడం లేదు.

బొడ్డెమ్మ పూర్తిగా అవివాహిత యువతుల వేడుక. ఇది కూడా తొమ్మిదిరోజుల పండుగ. భాద్రపద మాసం బహుళ పంచమి రోజున బొడ్డెమ్మ ఉత్సవం ప్రారంభమవుతుంది. మహాలయ అమావాస్యకు ముందు రోజున వేడుక ముగుస్తుంది. అచ్చంగా బతుకమ్మ తరహాలోనే.. బొడ్డెమ్మనూ రంగురంగుల పూలతో రూపొందిస్తారు. సాయంత్రం వేళల్లో బొడ్డెమ్మను.. ఓ చోట ప్రతిష్ఠించి, దాని చుట్టూ పాటలు పాడుతూ తిరుగుతారు. పెళ్లీడుకొచ్చిన యువతులు మాత్రమే ఈ సంబరాన్ని జరుపుకుంటారు. ఇందులో పెళ్లయిన మహిళలెవరూ పాల్గొనరు. ఈ ఏడు కన్నెలుగా బొడ్డెమ్మను పూజిస్తున్నాం.. పై ఏడు వివాహితులుగా బతుకమ్మకు జోతలిడుతాం అంటూ అవివాహితులు మురిపెంగా చెబుతారు.

బొడ్డెమ్మ ఎవరు అంటే.. స్థానికంగా భిన్న కథనాలు వినిపిస్తాయి. కాకతీయుల నాటి నుంచీ బతుకమ్మకన్నా ముందే.. బొడ్డెమ్మను పూజించేవారని చెబుతారు. బొడ్డెమ్మ, బతుకమ్మ ఇద్దరూ అక్క చెల్లెళ్లని ఓ కథనం.. భూస్వాముల వేధింపులకు బలవన్మరణం పొందిన తల్లీబిడ్డలంటూ మరో కథనం ప్రచారంలో ఉంది.

ఈ కథల గురించి పక్కన పెడితే.. తెలంగాణలోని మారుమూలనున్న... ఈ ప్రాంత సంస్కృతి ఇంకా మిగిలి ఉన్న కొన్ని పల్లెల్లో.. బొడ్డెమ్మను ఇవాళ (05-10-2010) నిమజ్జనం చేశారు. రేపు మహాలయ అమావాస్య. ఎల్లుండి నుంచి బతుకమ్మ సంబురాలు మొదలవుతాయి. ఏదేమైనా.. ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బొడ్డెమ్మకు బతుకమ్మ స్థాయిలో ప్రాచుర్యం దక్కక పోవడం ఒకింత బాధాకరం.

Sunday, October 3, 2010

మా అబ్బాయి ప్యారడీ రాశాడోచ్...

శనివారం ఉదయం.. దైనందిన కార్యక్రమంలో భాగంగా.. "ఈనాడు" పత్రికను చదివి పక్కన పెట్టేశాను. తర్వాత మా అబ్బాయి వికాస్‌ (తను పదో తరగతి చదువుతున్నాడు) ఈనాడు పత్రికను అందుకున్నాడు. అందులో "ఈతరం" స్లిప్‌ పేజీలో పవన్‌ కల్యాణ్ గురించిన చిలిపి బయోడేటా చదివి.. దాని స్ఫూర్తితో ఓ ప్యారడీ రాశాడు. కాస్త జంకుతూనే నా చేతికి ఇచ్చాడు. డ్యాడీ.. ఇదెలా ఉందో కాస్త చూసి చెప్పు అని బెరుకు బెరుగ్గా ఇచ్చాడు. (బహుశా అందులో ఏదైనా తప్పులు వెతుకుతాననో.. భాష విషయంలో తప్పు పడతాననో భయపడ్డట్లున్నాడు) చూశాక బాగానే ఉందనిపించింది. ఒకరిద్దరు స్నేహితులకు చూపితే, ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అందుకే దీనికి నాకున్న కొద్దిపాటి సర్కిల్‌లో.. కొంత ప్రాచుర్యం కల్పిస్తే బావుంటుందనిపించి, దీన్ని బ్లాగ్‌లో పెడుతున్నా.

సచ్చినోడి చిలిపి బయోడేటా
పేరు : టెండూల్కర్
ముద్దుపేరు : సచ్చినోడు
ఇష్టమైన డ్రింక్‌ : బూస్ట్
మూడుంటే : ముంబై ఇండియన్‌
మరవనిది : క్రికెట్
వీలైతే.... : లెక్కలేనన్ని మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌లు
కుదిరితే... : పది వరల్డ్‌ కప్పులు
ఎక్కువగా చూసేది : అవార్డులు, రివార్డులు
ఫిలాసఫీ : ఇండియన్‌గా ఆడాలి...! ముంబై ఇండియన్‌గా ఆడించాలి..!!

ఇది ప్రపంచానికి అంత ప్రధానమైన విషయం కాక పోవచ్చు. కానీ, మా అబ్బాయి ఓ ప్యారడీ రాయడం అందులోనూ తెలుగు భాషలో రాయడం నాకు అలవిమాలినంత ఆనందాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే.. నా తరంతోనే తెలుగు అంతరించి పోతుందేమోనన్న భయానికి, ఆంగ్లమాధ్యమంలో విద్యను అభ్యసిస్తోన్న నా తర్వాతి తరం ఇస్తున్న భరోసాలా ఈ ప్యారడీ అనిపించింది. అందుకే, దీనికి నేనింత ప్రాధాన్యతనిస్తున్నాను... గర్విస్తున్నాను.

Friday, October 1, 2010

నేర్చుకోవాల్సింది ఎంతుందో..!


ఒక్కోసారి ఏదైనా పదానికి అర్థం తెలుసుకుందామని ప్రయత్నించేటప్పుడు.. ఆ శోధన ఎక్కడెక్కడికో వెళుతుంటుంది. మొన్నీమధ్య వాగ్దానం (వాగ్ధానం కాదు) అన్న పదం మీద కాస్త శ్రద్ధ పెట్టాను. వాక్కును దానం చేయడం ఏంటి..? అసలు దానాల్లో ఈ వాక్కు ఎలా చేరింది..? అసలు దానాలు ఎన్ని రకాలు..? ఇలా ఆలోచిస్తే.. భలే సమాధానాలు దొరికాయి.

వాగ్దానం (వాగ్ధానం కాదు) = అంటే వాక్కును దానం చేయడం అని వివరణ
వాక్కు అంటే పలుకు అని అర్థం. (వాక్కు మూల రూపం వాకు)
పలుకును దానం చేయడం వాగ్దానం. దీన్ని 'మాట ఇవ్వడం' అన్న అర్థంలో వాడొచ్చు.
వాగ్దానం చేశారు అనే బదులు 'మాటిచ్చారు' అని రాస్తే సరిపోతుంది.

దానం అంటే ఇవ్వడం :
ఆదానం అంటే పుచ్చుకోవడం

ఇక దానాలు ఎన్ని రకాలు..? అంటే దశదానాలు, షోడశ దానాలు ఉన్నాయని శబ్దరత్నాకరం వివరిస్తుంది అవేంటో ఓసారి చూద్దాం.
దశ (10) దానాలు :
1.గోదానం (= ఆవులను దానం ఇవ్వడం)
2.భూదానం, (= భూమిని దానంగా ఇవ్వడం)
3.తిల దానం, (= నువ్వుల దానం)
4.హిరణ్యదానం, (బంగారం దానం)
5.ఆజ్య దానం, (= నెయ్యి దానం)
6.వస్త్ర దానం, (= దుస్తుల దానం)
7.ధాన్య దానం, (= ధాన్యం దానం)
8.గుడ దానం, (= బెల్లం దానం)
9.రౌప్య దానం (= రౌప్యం అంటే రూప్యం. అంటే బంగారు లేదా వెండితో చేసిన నాణ్యం. స్థూలంగా దీన్ని ధనదానం అనవచ్చు)
10.లవణ దానం (= ఉప్పు దానం) (లవణాలు మళ్లీ మూడు రకాలు వాటి గురించి కింద వివరణ ఉంది.)
షోడశ (16) దానాలు :
1. గోదానం (= ఆవుల దానం)
2. భూదానం, (= భూమి దానం)
3. తిలదానం (=నువ్వుల దానం)
4.హిరణ్యదానం (=బంగారు దానం)
5.రత్నదానం (= రత్నాల దానం)
6.విద్యాదానం (= విద్య దానం)
7.కన్యాదానం (= అమ్మాయినిచ్చి పెళ్లి చేయడం)
8.దాసీదానం (= దాసీ జనాన్ని దానంగా ఇవ్వడం) (దాసి అంటే డబ్బిచ్చి కొన్న సేవకుడు/సేవకురాలు)
9.శయ్యాదానం (= పడకను దానంగా ఇవ్వడం)
10.గృహదానం (= ఇంటిని దానంగా ఇవ్వడం)
11.అగ్రహారదానం, (= పల్లెటూళ్లను దానంగా ఇవ్వడం)
12.రథదానం (= రథాన్ని దానం)
13.గజదానం (= ఏనుగులను దానం చేయడం)
14.అశ్వదానం, (= గుర్రాలను దానం చేయడం)
15.ఛాగదానం, (= జున్నుపాలు లేదా మజ్జిగ ను దానం చేయడం)
16 మహిషీదానం (= ఎనుము(గేదె)లను దానం ఇవ్వడం)

త్రిలవణాలు :

* లవణాలు మూడు రకాలు (త్రిలవణాలు) అని తెలుసుకున్నాం కదా. అవేంటో తెలుసుకుందాం.
1. సైంధవ లవణం
దీన్ని ఇందుప్పు అని అంటారు. ఇందుడు అంటే చంద్రుడు అని అర్థం. అంటే చంద్రుడిలా తెల్లగా ఉండే ఉప్పును సైంధవ లవణం అని చెప్పుకోవచ్చు.
2. బిడము
దీన్ని అట్టుప్పు అంటారు. (అట్టు+ఉప్పు). అట్టు అంటే ఆపూప విశేషం అంటుంది శబ్దరత్నాకరం. ఆపూపం అంటే పిండివంట. కాబట్టి పిండివంటల్లో వాడే ఉప్పును బిడము అని చెబుతారు.
3. రుచకము
దీన్ని సౌవర్చల లవణం అని అంటారు. ఇది ఒక దినుసు ఉప్పు అంటుంది శబ్దరత్నాకరం.

ఒక్క పదం గురించి శోధన మొదలు పెడితే.. ఎన్ని విషయాలు తెలిశాయో చూశారా..? అందుకే ప్రతి పదానికీ సరైన అర్థం కోసం వెతకాలి.. కొత్తకొత్త విశేషాలు తెలుసుకోవాలి. వాటిని సమర్థవంతంగా ప్రయోగించాలి. అప్పుడే భాష విస్తరిస్తుంది. ఏమంటారూ..!