Wednesday, February 9, 2011

ఇకనైనా తొక్కిసలాటలు, చావులు ఆగితే బావుణ్ణు

శబరిమల అయ్యప్ప స్వామి జ్యోతి మానవ చర్యేనని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం స్పష్టం చేసింది. దీని ద్వారా.. అయ్యప్ప జ్యోతిపై తలెత్తిన వివాదాన్ని ముగించే ప్రయత్నం చేసింది. శబరిమలలో ఏదైనా విషాద ఘటన జరిగినప్పుడు మాత్రమే ఇలాంటి చర్చలు మొదలవుతుండడాన్ని బట్టి చూస్తే... ఓ గీత కింద మరో పెద్ద గీత గీయడం అన్న సూత్రం అర్థమవుతుంది.

జనవరి 14వ తేదీ సాయంత్రం.. పులిమేడు లోయలో తొక్కిసలాట జరిగి 102 మంది అయ్యప్ప స్వామి భక్తులు అసువులు బాశారు. దీంతో.. దాదాపు పుష్కరకాలం తర్వాత.. మళ్లీ మకరజ్యోతిపై చర్చ ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం జనవరి 14వ తేదీన శబరిమలలో కనిపించే మకర జ్యోతి దైవిక అద్భుతమా..? మానవ కల్పితమా అన్న అంశంపై విస్తృత చర్చ సాగింది. పులిమేడు తొక్కిసలాట ఘటనపై తీవ్రంగా స్పందించిన కేరళ రాష్ట్ర హైకోర్టు.. మకరజ్యోతిపై వాస్తవాలను వెల్లడించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పులిమేడు తొక్కిసలాటపై కేరళ డిజిపి, అటవీ అధికారులు, ట్రావెన్‌కోర్‌ దేవస్థానం అధికారులు విడివిడిగా హైకోర్టుకు నివేదికను సమర్పించారు.


ఈ సందర్భంగా.. కోర్టులో వాదనలు వినిపించిన ట్రావెన్‌కోర్‌ దేవస్థానం న్యాయవాది.. మకరజ్యోతి దైవిక అద్భుతమన్నది భక్తుల భావన అని, అది దివ్యతార, దైవికమైనదేనని అంటూనే.. దీనిపై దేవస్థానం ఎన్నడూ అనుకూల ప్రచారం చేసుకోలేదని వాదించారు. ఈ వాదనను తీవ్రంగా పరిగణించిన హైకోర్టు ధర్మాసనం.. మకరజ్యోతిపై వాస్తవాలను వెల్లడించాలంటూ.. ట్రావెన్‌కోర్‌ దేవస్థానాన్ని ఆదేశించింది.

ఈలోపే.. కేరళకు చెందిన కొందరు ఔత్సాహికులు, మకరజ్యోతి కనిపించే పొన్నంబలమేడు వెళ్లి వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చారు. వండిపెరియార్‌ మార్గంలో.. ఇడత్తోట వద్దనుంచి డైవర్ట్‌ అయితే.. సుమారు 80 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే.. పులిమేడు వస్తుంది. ఈ గిరిపై, స్వర్ణమందిరం ఉందని.. అయ్యప్ప స్వామి.. సర్వదేవ సంసేవితుడై.. ఇక్కడ కొలువు దీరారని, ఇది దేవతలు సంచరించే పొన్నంబలమేడు అన్నది భక్తుల విశ్వాసం. ఇక్కడికి నరమానవులు ఎవరూ వెళ్లలేరని... తెగించి ఎవరైనా వెళ్లినా.. తిరిగి రాలేరన్నది
భక్తుల నమ్మకం. అయితే.. ఈ మార్గంలో ఇటీవలే కొంతమంది వ్యక్తులు సంచరించిన ఆనవాళ్లను ఔత్సాహికులు బయటపెట్టారు. అక్కడ జ్యోతిని వెలిగించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దిమ్మెను గుర్తించారు. అంతేకాదు.. తాజాగా అక్కడ కర్పూరాన్ని వెలిగించిన దాఖలాలనూ బాహ్య ప్రపంచానికి చాటారు. అక్కడినుంచి శబరిమల అయ్యప్పస్వామి ఆలయం ఎలా కనిపిస్తుందో కూడా కళ్లకు కట్టినట్లుగా దృశ్యరూపకంగా వెల్లడించారు.

అంతేకాదు.. వన్యమృగాలు దాహం తీర్చుకునే ఓ చిన్నపాటి మడుగునూ వారు ఆ ప్రాంతంలో గుర్తించారు. మకరజ్యోతిని వెలిగించే దిమ్మకు కేవలం 50 మీటర్ల దూరంలోనే ఈ మడుగు ఉంది. అంతేనా.. మకరజ్యోతిని వెలిగించే సమయంలో అన్యులు ఎవరూ అటువైపు రాకుండా కొండపై నిర్మించిన సెక్యూరిటీ పోస్ట్‌ కూడా వీరి పరిశోధనలో బట్టబయలైంది.

అసలు మకరజ్యోతిపై చర్చ మొదలు కావడం ఇదే ప్రథమం కాదు. గతంలో కూడా ఇలాంటి చర్చ సాగింది. అప్పట్లో కేరళ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలోనే మకరజ్యోతి మానవ కల్పితమని ప్రకటించింది. అయితే.. అయ్యప్ప భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకుని.. ఈ ప్రకటనకు విస్తృత ప్రచారం రాకుండా జాగ్రత్తలు తీసుకుంది. పర్యటకరంగం పరంగా వచ్చే ఆదాయం కోసం కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని అప్పట్లో అణగతొక్కేసింది. కానీ.. శబరిమల ఆలయ అర్చకుడి మనవడు రాహుల్‌ ఈశ్వర్‌ మాత్రం దీన్ని మానవ కల్పితంగా ఎన్నడో ప్రకటించారు.

"‌మకరజ్యోతి పొన్నంబలమేడు కొండపైభాగంలో కనిపించే నక్షత్రం. మకర విళక్కు పొన్నంబల మేడులో ఆనూచానంగా కొనసాగించే సంప్రదాయం. ఈ ఆలయాన్ని పరశురాముడు నిర్మించారన్నది ప్రతీతి. ఈ ప్రాంతంలోని ఆదివాసీలు.. ఆకాశంలో మకర నక్షత్రం కనిపించగానే.. దాన్ని దైవికంగా భావించి, కర్పూరంతో హారతి ఇవ్వడం ప్రాచీన కాలం నుంచి వస్తోన్న ఆనవాయితీ. ఇలా మూడు సార్లు హారతి ఇవ్వడం ఆచారం. పొన్నంబలమేడులో ఆదివాసీలు వెలిగించే ఆ హారతులు శబరిమలలో కనిపించగానే.. ఇక్కడి అయ్యప్ప ఆలయంలో పూజావిధులు జరుగుతాయన్నది చరిత్ర. పరిణామ క్రమంలో.. ఆధునికత వచ్చిన క్రమంలో.. ఆదివాసీలు అక్కడినుంచి వలస వెళ్లినా.. ఆ ఆచారాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు" అంటూ రాహుల్‌ ఈశ్వర్‌ విస్పష్టంగా ప్రకటించారు.

మకర సంక్రమణం రోజున ఆకాశంలో దేదీప్యమానంగా కనిపించేది నక్షత్రమేనని.. సూర్యుడు ధనూరాసి నుంచి సంక్రమించేటప్పుడు ఆ నక్షత్రానికి జరిపే హారతి పూజే మకరజ్యోతి అని ఆయన విస్పష్టంగా ప్రకటించారు. అటు హేతువాదులదీ ఇదే వాదన. మకర నక్షత్రం వాస్తవం.. సూర్యుడు ధనూరాసి నుంచి మకర రాసిలోకి ప్రవేశించేటప్పుడు.. ఓ నక్షత్రం కొండ పైభాగంలో దేదీప్యమానంగా వెలుగుతూ కనిపిస్తుందని.. ఆతర్వాతి రోజుల్లోనూ దాన్ని నేరుగా చూడొచ్చని వీరు వాదిస్తున్నారు.
కరజ్యోతి వాస్తవికతపై దాదాపు రెండు దశాబ్దాల క్రితం కూడా విస్తృతంగా చర్చ సాగింది. అప్పట్లో సాక్షాత్తూ ఆరాష్ట్ర ముఖ్యమంత్రే మకరజ్యోతి మానవకల్పితమని కేరళ అసెంబ్లీలో ప్రకటించారు. అయితే.. ఇవేవీ భక్తుల్లో విశ్వాసాన్ని దెబ్బతీయలేక పోయాయి. ఈ చర్చ గురించి తెలియని వాళ్లే కాదు... తెలిసిన వాళ్లు కూడా శబరిమల జ్యోతి దర్శనానికి వెళ్లడం మానలేదు. పైగా.. ఏటేటా మకరజ్యోతి దర్శనానికి శబరిమల వెళ్లే వారి సంఖ్య ఇంతింతలుగా పెరుగుతూ వస్తోంది. కాబట్టి.. ఇప్పుడు ఏదో ప్రమాదం కారణంగా మొదలైన చర్చ కూడా తమ విశ్వాసాన్ని పెద్దగా దెబ్బతీయ బోదని అయ్యప్ప భక్తులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. కేరళ హైకోర్టుకు.. ట్రావెన్‌కోర్‌ దేవస్థానం తెలిపిన మకరజ్యోతి వాస్తవం భక్తుల మనోభావాలపై పెద్దగా ప్రభావం చూపక పోవచ్చన్న భావనే సర్వత్రా వ్యక్తమవుతోంది. చూడాలి మరి.
(కేరళకు చెందిన టీవీ ఛానల్‌ ప్రసారం చేసిన మకరజ్యోతి మర్మం వార్తా కథనాన్ని చూడాలనుకుంటే..
www.youtube.com/watch?v=d50EiaQYSzQ క్లిక్‌ చేయండి)

Thursday, February 3, 2011

కలుగులోని దొంగలందరూ బయటకు వస్తారా...?

స్వతంత్ర భారతంలో అతిపెద్ద అవినీతి కుంభకోణం. లక్షా డెబ్బయ్ ఆరు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రాకుండా పోయిన వైనం. ఎప్పటికైనా నిజం నిగ్గు తేలుతుందా? దొంగలు దొరుకుతారా? దొంగలందరూ దొరుకుతారా? దొంగసోమ్ము మొత్తం దొరుకుతుందా? అసలు దొంగలు ఎవరు? లబ్ధిదారులు ఎవరు?

అవినీతిని అంతం చేయాలన్న అంకితభావంతోనే టెలికాం మాజీ మంత్రి రాజాను సీబీఐ అరెస్టు చేసిందని అనుకోవాలా? ప్రధాని కార్యాలయం నుంచి అందిన సంకేతాల మేరకే వ్యవహరించిందని భావించాలా? కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేకుండా సీబీఐ ఇటువంటి విషయంలో స్వతంత్రంగా వ్యవహరిస్తున్నదని నమ్మగలమా? మూడు విడతల ప్రశ్నించినా, ఢిల్లీలో, తమిళనాడులో అనేక విడతల సోదాలు చేసినా దర్యాప్తు అంగుళం ముందుకు కదలలేదు ఎందుకని? సోనియాగాంధీ, కరుణానిధి మధ్య ఢిల్లీలో సమాలోచన జరిగే వరకూ రాజాను అరెస్టు చేయకుండా సీబీఐ చేతులు కట్టుకొని ఉన్నది ఎందుకని? తమిళనాడులో, మరి నాలుగు రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరగబోతున్న కారణంగానే, ప్రతిపక్షాలు పార్లమెంటు సంయుక్త సంఘం-జేపీసీ- నియామకంకోసం పట్టుపడుతున్న కారణంగానే, ప్రతిపక్షాలు పార్లమెంటును స్తంభింపజేసిన కారణంగానే రాజా అరెస్టు ఒక ఎత్తుగడగా జరిగిందా? ఇది కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకుంటున్న నష్టనివారణ చర్యలలో భాగమేనా?
బుధవారంనాడు రాజానూ, టెలీకం మాజీ కార్యదర్శి సిద్దార్థ బెహురానూ, ఐఆర్ ఎస్ అధికారి ఆర్కే చందోలియానూ సీబీఐ అరెస్టు చేసినట్టు వచ్చిన వార్త ఇప్పటికే ప్రజలను వేధిస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోగా అనేక కొత్త ప్రశ్నలను లేవనెత్తింది.
రెండవ తరం వాయుతరంగాల-టూజీ స్ప్రెక్ట్రమ్- కుంభకోణంలో మరికొంత మంది పాత్రధారులను అరెస్టు చేయవచ్చు. ప్రశ్నించవచ్చు. క్రిమినల్ కేసులు పెట్టవచ్చు. వారికి జైలు శిక్ష సైతం పడవచ్చు. అనంతరం వారు సుఖరామ్ లాగా బెయిలు సంపాదించుకొని సుఖంగా జీవితం గడపవచ్చు. మరి సూత్రధారుల పాత్ర ఏమిటి? ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాని మన్మోహన్ సింగ్ పాత్ర ఏమిటి? రాజాను బలిపశువును చేసినంత మాత్రాన మన్మోహన్ సింగ్ కు ఈ కుంభకోణంలో ప్రమేయం లేకుండా పోతుందా? యూపీఏ అధ్యక్షురాలి హోదాలో ఏడేళ్ళుగా చక్రం తప్పుతున్న సోనియాగాంధీకి నైతిక బాధ్యత లేకుండా పోతుందా?
ఈ కుంభకోణంలో దోషులను పట్టుకోవాలనీ, జేపీసీని నియమించాలనీ ఉద్ఘోషిస్తున్నవారందరూ అవినీతికి అతీతులు కాకపోవచ్చు. ఎన్ డీ ఏ హయాంలో జరిగిన అవినీతిని కూడా వెలికి తీయడానికి ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. ఎన్ డీ ఏ పాలనలోనూ కుంభకోణం జరిగింది కనుక రాజా మార్కు కుంభకోణంపైన దర్యాప్తు జరగాలని కోరే నైతిక హక్కు ఎన్ డీ ఏ నాయకులకు లేదని వాదించడం వితండ వాదం అవుతుంది. టెలికాం మంత్రిత్వ శాఖ అత్యంత కీలకమైనదని మన్మోహన్ సింగ్ కూ, సోనియాకూ తెలుసు. రాజా కంటే ముందు ఈ శాఖను నిర్వహించినవారికి అవినీతి మరకలు అంటినట్టు అందరికీ తెలుసు. పీవీ నరసింహారావు మంత్రిమండలిలో టెలికాం శాఖ నిర్వహించిన సుఖరామ్ పైన సీబీఐ 1996లో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసింది. ఢిల్లీలో, హిమాచల్ ప్రదేశ్ లో ఆయన నివాసాలపైన సీబీఐ దాడులు జరిపింది. 3.62 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకుంది. పదమూడేళ్ళ విచారణ తర్వాత 2009లో సుఖ్ రామ్ కు మూడేళ్ళ కఠిన కారాగార శిక్ష విధించారు. నెల రోజులు జైలులో గడిపి బెయిలు సంపాదించుకున్నారు. టెలిఫోన్ కంపెనీలకు లాభాలు సంపాదించిపెట్టడానికి వీలుగా లైసెన్సింగ్ పద్ధతికి స్వస్తి చెప్పడం ద్వారా అవినీతికి ఎన్ డీ ఏ సర్కార్ తలుపులు తెరిచింది. ఈ పద్ధతిని వ్యతిరేకించిన జగ్ మోహన్ మంత్రి పదవి నుంచి వైదొలగవలసి వచ్చింది. జస్వంత్ సింగ్ నాయకత్వంలోని కమిటీ సిఫార్సు మేరకు 1999 జూలైలో లైసెన్స్ పద్ధతికి స్వస్తి పలికారు. ఈ కారణంగా దేశ ఖజానాకు యాభై వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఆరోపించారు. భారతీయ జనతా పార్టీలో నిధులు సేకరించే నేర్పరిగా పేరున్న ప్రమోద్ మహాజన్ రిలయన్స్ సంస్థకు లాభం కలిగే విధంగా ట్రాయ్ సిఫార్సులను తుంగలో తొక్కారు. దీని వల్ల అప్పటి లెక్కల ప్రకారం పదకొండు వందల కోట్ల రూపాయల నష్టం దేశ ఖజానాకు వచ్చిందని అంచనా. ఇటువంటి కీలకమైన, అవినీతికి ఆస్కారం పుష్కలంగా ఉన్న శాఖను ఎవరికి అప్పగించాలి? నీతి, నిజాయితీలను నిజజీవితంలో పాటించే వ్యక్తి చేతుల్లో ఈ శాఖ బాధ్యతలు పెట్టాలి. రాజాకు కానీ డిఎంకే కి చెందిన మంత్రులకు కానీ అటువంటి మంచి పేరు లేదని ప్రధానికి తెలియదా? సంకీర్ణ పితలాటకం వల్ల కరుణానిధి పట్టుదల వల్ల రాజాకే టెలికాం మంత్రిత్వ శాఖను అప్పగించవలసి వస్తే ఆ శాఖ పని తీరుపైన నిరంతరం నిఘా ఉంచవలసిన బాధ్యత ప్రధానికి లేదా? 2007 నుంచి 2008 వరకూ ప్రధానికీ, రాజాకీ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను పరిశీలిస్తే రాజా చేస్తున్నది ఏమిటో ప్రధానికి తెలుసనే అనుకోవలసి వస్తుంది. రాజా అవలంబిస్తున్న పద్ధతిపై మొదట్లో వివరణ కోరిన ప్రధాని అనంతరం ఆ పద్ధతిని ఆమోదించారనే అభిప్రాయం కలుగుతుంది. కుంభకోణం జరుగుతున్నట్టు పయనీర్ పత్రికలో పరిశోధనాత్మక వార్తలు పుంఖానుపుంఖంగా వచ్చినా, సెంట్రల్ విజలెన్స్ కమిషన్ హెచ్చరించినా, కాగ్ నివేదిక తూర్పారపట్టినా ప్రధాని చలించలేదు. సుప్రీంకోర్టు తలంటిన తర్వాతనైనా వెంటనే స్పందించలేదు. అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రభుత్వ సుస్థిరతను పణం పెట్టడానికి సంకోచించని మన్మోహన్ సింగ్ అవినీతి రాజాపై చర్య తీసుకోవడానికి మీనమేషాలు లెక్కించారు. సోనియా సాధ్యమైనంత వరకూ మౌనం పాటిస్తే, మన్మోహన్ సందర్భం వచ్చిన ప్రతిసారీ రాజాను వెనకేసుకొని వచ్చారు. రాజా అక్రమం చేయలేదంటూ కితాబు ఇస్తూ వచ్చారు. సుప్రీంకోర్టు ఒకటికి రెండు సార్లు చురకలు వేయడం ప్రారంభించిన తర్వాత, ప్రతిపక్షాలు పార్లమెంటును స్తంభింపజేసి రాజీ లేని పోరాటం సాగించిన అనంతరమే యూపీ ఏ సర్కార్ లో చురుకు పుట్టింది. మూడేళ్ళ కిందటే కుంభకోణం జరుగుతున్నట్టు సమాచారం ఉన్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టు ప్రధాని వ్యవహరించారు. ప్రతిష్ఠాత్మకమైన, బలమైన ప్రధాని కార్యాలయానికి అన్ని మంత్రిత్వ శాఖలలో ఏమి జరుగుతున్నదో ఎప్పటికప్పుడు తెలుస్తుంది. టెలికాం కుంభకోణం జరుగుతున్నట్టు ప్రధానికి తెలియదంటే ఎట్లా నమ్మడం? సీబీఐ దర్యాప్తు ప్రారంభించిన తర్వాత సంవత్సరం పాటు చేసింది ఏమీ లేదు. సీబీఐ కూడా ప్రభుత్వం కదిలినప్పుడే కదిలింది. అంటే పాలకుల కనుసన్నలలోనే మెదిలింది. ఇంత జరిగిన తర్వాత రాజా చేత రాజీనామా చేయించక తప్పలేదు. కానీ ప్రతిపక్షం కోరుతున్న జేపీసీ నియామకానికి మాత్రం యూపీఏ సిద్ధంగా లేదు. ఈ లోగా మరో నాటకం. రాజా రాజీనామా అనంతరం టెలికాం శాఖను అదనంగా స్వీకరించిన మానవ వనరుల మంత్రి కపిల్ సిబ్బల్ చావుతెలివి ప్రదర్శించారు. గజం మిథ్య పలాయనం మిథ్య అంటూ అడ్డంగా వాదించే సాహసం చేశారు. పార్లమెంటు సభ్యులనూ, దేశ ప్రజలనూ అవివేకులుగా జమకట్టి బుకాయించబోయారు. అవమానించబోయారు. స్పెక్ట్రమ్ అమ్మకాల విషయంలో కుంభకోణం ఏమీ లేదనీ, దేశ ఖజానాకు నయాపైసా కూడా నష్టం రాలేదనీ దర్జాగా ప్రకటించారు. మరోదేశంలో అయితే పనిగట్టుకొని అబద్ధాలు చెప్పిన మంత్రి చేత ప్రధానమంత్రి వెంటనే రాజీనామా చేయించేవారు. అవినీతికి కొమ్ముకాసిన అన్యాయవాది సిబ్బల్ ను మన్మోహన్ కానీ సోనియా కానీ మందలించిన దాఖలా లేదు. పైగా ప్రధాని ఆమోదంతోనే తాను అన్ని పనులూ చేశానంటూ రాజా బహిరంగంగా ప్రకటించినట్టే చెప్పారు. ప్రధాని లేదా కాంగ్రెస్ అధ్యక్షురాలు పురమాయిస్తేనే కపిల్ సిబ్బల్ సైతం జాతిని బుకాయించే ప్రయత్నం చేశారు. అవినీతిని కప్పిపుచ్చి జాతిని దబాయించే దుస్సాహసానికి ఒడిగట్టిన కపిల్ సిబ్బల్ చేతిలో టెలికాం శాఖ ఉండటం మాత్రం ఏమంత అభిలషణీయం? రాజా చేసిన నేరం ఏమీ లేదనీ, ప్రతిపక్షాల ఆరోపణ కారణంగానే రాజా రాజీనామా చేయవలసి వచ్చిందనీ సోనియా వ్యాఖ్యానించారు. టూజీ స్పెక్ట్రమ్ విషయంలో రాజా కానీ తాను కానీ ఎటువంటి నేరం చేయలేదని మన్మోహన్ చెప్పారు. సోనియా, మన్మోహన్, కపిల్ సిబ్బల్ చెప్పిందే నిజమైతే పాపం రాజాను ఎందుకు సీబీఐ అరెస్టు చేసినట్టు? అవకాశం ఉన్నంతవరకూ రాజా అండ్ కో అవినీతిని చాపకింద కప్పి పెట్టడానికే సోనియా అండ్ కో ప్రయత్నించినట్టు నిర్ద్వంద్వంగా స్పష్టం అవుతోంది. గత్యంతర లేకనే అరకొర చర్యలైనా అయిష్టంగా తీసుకుంటున్నారు. అపారమైన అవినీతి సొమ్ములో రాజా తిన్నది పది శాతం మాత్రమేనని ఈ కుంభకోణం వెలుగు చూడటానికి ప్రధాన కారకుడైన జనతా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి అంటున్నారు. కరుణానిధికీ, సోనియా సోదరీమణులకూ అవినీతి సొమ్ములో భారీ వాటా ముట్టిందని కూడా డాక్టర్ స్వామి ఆరోపిస్తున్నారు. కనీసం ఈ ఆరోపణలలో సత్యం లేదని నిరూపించడానికైనా సమగ్రమైన దర్యాప్తుకోసం సోనియా పట్టుపట్టవలసింది. అది జరగడం లేదు. అన్నిటికీ మౌనమే సమాధానం. దొంగసొత్తు ఎక్కడికి వెళ్ళిందో, ఎక్కడ దాగున్నదో తేలితే కానీ అసలు సూత్రధారులు ఎవ్వరో వెలుగులోకి రాదు.
రాజాను అరెస్టు చేశారు. సరే. ఆయన సోదరిడినీ, ఇతర బంధువులనూ, స్నేహితులను కూడా అదుపులోకి తీసుకోవచ్చు. డీఎంకే పార్టీ సభ్యత్వానికి రాజా చేత రాజీనామా ఇప్పించవచ్చు. ఇటువంటి పనులు ఎన్ని చేసినా అసలు కుంభకోణం మటుమాయం కాదు. కాంగ్రెస్ అగ్రనాయకత్వంపైన పడిన మచ్చ మాసిపోదు. ఈ కుంభకోణంలో రాజాకు ఎంత బాధ్యత ఉన్నదో, మంత్రిమండలి అధినాయకుడుగా ప్రధాని మన్మోహన్ సింగ్ కూ అంతే బాధ్యత ఉన్నదని వాదించడం తప్పు అవుతుందా? జయలలిత చెప్పినట్టు మానవేతిహాసంలోనే అతిపెద్ద కుంభకోణం జరిగినప్పుడు అందుకు సంబంధించిన మంత్రిని బలి ఇస్తే సరిపోతుంది. ప్రధాన మంత్రి మూల్యం చెల్లించనక్కరలేదా? ఇది ఒక్కటే కాదు. కామన్ వెల్త్ గేమ్స్ నిర్వహణలో అవినీతి, ముంబయ్ ఆదర్శ్ సహకార సంఘం అవినీతి, ఇంకా అనేక అవినీతి కుంభకోణాలకు ప్రత్యక్ష సాక్షి అయిన ప్రధాన మంత్రికి నైతిక బాధ్యత బొత్తిగా ఉండదా? మన్మోహన్ సింగ్ వ్యక్తిగతంగా మచ్చలేని మనిషి. కానీ అపచారం వల్లనో, గ్రహచారం వల్లనో ప్రధాన మంత్రిగా అనేక కుంభకోణాలకు బాధ్యత వహించవలసిన దుస్థితిలో పడిన వ్యక్తి. నైతిక విలువలు పాటించి పదవికి రాజీనామా చేస్తే మన్మోహన్ సింగ్ కు చరిత్రలో కొద్దో గొప్పో స్థానం ఉంటుంది. మొన్న ఏఐసీసీ సమావేశాలలో ప్రధాని ప్రసంగిస్తూ ‘సీజర్స్ వైఫ్ మస్ట్ బీ ఎబౌవ్ సస్పీషన్’ అంటూ ఉద్భోదించారు. అంటే సీజర్ భార్య అనుమానాలకు అతీతంగా ఉండాలని అర్థం. ఇది ప్రధాని మన్మోహన్ సింగ్ కి వర్తించినంతగా ప్రస్తుత సందర్భంలో మరెవ్వరికీ వర్తించదు. ఇంత జరిగిన తర్వాత మన్మోహన్ సింగ్ దేశంలోని అత్యున్నత పదవిలో కొనసాగడం ఏ మాత్రం సమర్థనీయం కాదు. ఆయనకూ మంచిది కాదు. దేశానికీ మంచిది కాదు. మన్మోహన్ స్థానంలో ప్రధానిగా ప్రణబ్ ముఖర్జీని నియమిస్తారో, పగ్గాలు కుమార రత్నానికి అప్పగిస్తారో సోనియాగాంధీ ఇష్టం.
(ఇది శ్రీ రామచంద్రమూర్తి గారు hmtv సంపాదకీయం హంసధ్వని కోసం రాసిన వ్యాసం. శ్రీ మూర్తిగారి మరిన్ని వ్యాసాలు చూడాలనుకుంటే..www.hmtvhamsadhwani.blogspot.com క్లిక్‌ చేయండి