Wednesday, November 24, 2010

అనుకున్నదే అయింది..!



అనుకున్నదే అయింది... అసహనం పెరిగిపోయిన రోశయ్య రాజీనామా చేస్తారన్న నా అంచనాయే నిజమైంది. అత్యంత విషాదకర పరిస్థితుల్లో.. వైఎస్సార్‌ మరణించిన మర్నాడే రోశయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఖర్మ ఏమో గానీ.. పదవిలో కూర్చున్నప్పటి నుంచీ సమస్యలే సమస్యలు.

ముఖ్యమంత్రి కాగానే.. రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. కనీవినీ ఎరుగని రీతిలో కర్నూలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం పెద్దగా జరగలేదు కానీ, ఆస్తి నష్టం భారీగానే జరిగింది. దీనంతటికీ కారణం.. రోశయ్య నేతృత్వంలోని అధికార బృందం.. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిని దిగువకు విడుదల చేసే విషయంలో మీనమేషాలు లెక్కించడం.. ఆకారణంగానే బ్యాక్‌వాటర్‌ వెనక్కి తన్ని.. తుంగభద్ర నది ఉప్పొంగి కర్నూలును ముంచెత్తిందని ఆరోపణలు వచ్చాయి. ఆతర్వాత ప్రజలను ఆదుకోవడంలో కూడా రోశయ్య సర్కారు విఫలమైందని కర్నూలు జిల్లా వరద బాధితులను కదిలిస్తే అర్థమవుతుంది.
ఏదో ఆ గండం నుంచి గట్టెక్కామనుకునే లోపు.. ఫ్రీజోన్‌ అంశం తెరపైకి వచ్చింది. పోలీసు ఉద్యోగాల నియామకంలో.. హైదరాబాద్‌ ఫ్రీజోనే అని.. ఏ ప్రాంతం వారైనా ఇక్కడ పోలీసు ఉద్యోగాల్లో చేరవచ్చని హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో.. తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర భావన మరింత పెరిగింది. దీన్ని సొమ్ము చేసుకునేందుకు టిఆర్‌ఎస్‌ అధినేత చంద్రశేఖరరావు ఆమరణ నిరాహార దీక్ష ప్రకటన చేశారు. దీక్షకు అనుమతించకుడా.. రోశయ్య సర్కారు, కెసిఆర్‌ను మధ్యలోనే అరెస్టు చేసింది. ఇక అక్కడినుంచి తెలంగాణ అంశం రావణ కాష్ఠంలా రగులుతూనే ఉంది. ఈ గొడవ గడచిన పదకొండు నెలలుగా కొనసాగుతూనే ఉంది.

డిసెంబర్‌ 9న చిదంబరం చేసిన ప్రకటన రోశయ్యకు కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైందన్న ఆ ప్రకటన.. సీమాంధ్రలో ఉద్యమానికి కారణమైంది. సమైక్యాంధ్ర భావనతో.. సీమాంధ్ర ప్రజలు ఉద్యమించారు. దీంతో.. తెలంగాణలోని ఆందోళనలు కాస్తా సీమాంధ్రకు మళ్లాయి. ఒక ప్రాంతానికి మద్దతుగా ఏనిర్ణయం తీసుకున్నా.. రెండో ప్రాంతం వారు గొడవకు దిగే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది.
పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణకమిటీని వేసింది. తొలుత దీన్ని వ్యతిరేకించినా.. తెలంగాణరాష్ట్ర సమితి, కమిటీ పట్ల గౌరవంగానే వ్యవహరిస్తూ వచ్చింది. దీంతో.. కొంతకాలంగా ఉద్యమాల కాక తీవ్రత తగ్గింది.

ఓ నాలుగు నెలలు కాస్త ఊపిరి పీల్చుకున్న రోశయ్య సర్కారు.. ఈ కాలంలో, రాష్ట్ర ఆదాయాన్ని గణనీయంగా పెంచగలిగారు. మద్యం దుకాణాల వేలం ద్వారా.. అబ్కారీ శాఖకు టార్గెట్లు విధించి, గతంలో కనీవినీ ఎరుగని రీతిలో ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చి పెట్టారు. దీంతో పాటే... రిజిస్ట్రేషన్‌ ధరలు పెంచడం, ఆదాయపన్నుల రూపంలో.. ఇలా ఏ అవకాశం ఉన్నా వదలకుండా ఖజానాకు ఆదాయాన్ని పెంచారు. సహజంగానే, ఖర్చు విషయంలో.. రోశయ్య చాలా పొదుపును పాటించారు. రోశయ్యకు కాస్త బాగా ఉన్న కాలం ఏదంటే.. ఈ నాలుగు నెలలే.
ఈమధ్యలోనే ఆయనకు జగన్‌ గండం ఎదురైంది. ఓదార్పు యాత్ర పేరిట, జగన్‌... అధిష్ఠానాన్ని ధిక్కరిస్తున్నా ఏమీ చేయలేని అసమర్థత.. తరచూ తనకు వ్యతిరేకంగా సాక్షిలో వస్తున్న కథనాలు పెంచుతున్న అసహనం.. రోశయ్యలో శాంతాన్ని నశింప చేశాయి.
అధిష్ఠానం ఏదోలా పరిస్థితిని చక్కదిద్దుతుందిలే అన్న భావనతో ఉన్న సమయంలో.. మళ్లీ ఫ్రీజోన్‌ అంశం రోశయ్యకు గండంగా పరిణమించింది. ఎస్‌ఐ పరీక్షల రాత పరీక్ష నిర్ణయం విషయంలో రోశయ్య సర్కారు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. హైదరాబాద్‌లో పరీక్షలు నిర్వహించకుండా.. మిగిలిన ప్రాంతాల్లోనే పరీక్షలు జరుపుతామని ప్రకటించింది. పరీక్షలకు ఫ్రీజోన్‌ అంశానికి ఏమాత్రం సంబంధం లేదని నచ్చచెప్పే ప్రయత్నం ఫలించలేదు. పైగా, దీనికి రాజకీయ పార్టీలూ జత కలవడంతో.. పరిస్థితి మరింత జటిలమైంది. ఉస్మానియా విద్యార్థులు ఆమరణ దీక్షలకు దిగారు. పరిస్థితి తీవ్రరూపంలో దాల్చుతున్న తరుణంలో.. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, పరీక్షలు వాయిదా వేయించేందుకు సిఎంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఆ అసహనంలో.. సంయమనం కోల్పోయి.. విద్యార్థులను హుస్సేన్‌ సాగర్‌లో దూకమనండి అన్న అర్థం వచ్చేలా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. దీంతో పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చింది. దీంతో రోశయ్య ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు. ఎస్‌ఐ పరీక్షలను అన్ని ప్రాంతాల్లోనూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో సీమాంధ్రలో ఉద్యమం మొదలైంది.

వీటికి తోడు, వరంగల్‌లో కాంట్రాక్ట్‌ నర్సులు ఎంజిఎం ఆసుపత్రిలో వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి దాదాపు 36 గంటలు తిండీ తిప్పలు లేకుండా ఆందోళన చేశారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగం దిగి వచ్చి.. వారి డిమాండ్ల పరిష్కారానికి హామీ ఇచ్చింది. ఈ ఘటన స్ఫూర్తినిచ్చిందని అనుకోను గానీ.. ప్రతివారూ డిమాండ్ల సాధన కోసం బిల్డింగులు, టవర్లు ఎక్కడం ప్రారంభించారు. పారా మెడికల్‌ సిబ్బంది, బిఇడి-2008 అభ్యర్థులు, ప్రభుత్వోద్యోగులు అందరూ రోశయ్య సర్కారును ముట్టడించారు.

వీటన్నింటి నేపథ్యంలో.. ఎంతో సహనంగా.. మీడియా మిత్రుడిగా ఉండే రోశయ్య, ఏకంగా మీడియా ప్రతినిధులమీద కూడా రుసరుసలాడడం మొదలెట్టారు. ఆయన ఏ సభకు వెళ్లినా అడ్డంకులు సృష్టిస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం ప్రారంభించారు. ఇలాంటి ఘటనలతో 77 సంవత్సరాల వయసులో రోశయ్య ఆరోగ్యం కూడా క్షీణించి పోయింది.

దీనికి తోడు, సాక్షి ఛానల్‌లో సోనియా గాంధీకి వ్యతిరేకంగా కథనం ప్రసారమైందంటూ రాష్ట్ర కాంగ్రెస్‌లోని ఓ వర్గం గగ్గోలు మొదలుపెట్టింది. ఆ ఛానల్‌లోను, పత్రికలోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు మొదలయ్యాయి. వీటన్నింటి నేపథ్యంలో, జగన్‌ వర్గాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా రోశయ్య హడావుడిగా ఢిల్లీ వెళ్లారని భావించారు. అయితే.. అక్కడ ఏంజరిగిందన్న వివరాలు ఇప్పటికిప్పుడు తెలియడం లేదు గానీ.. రోశయ్యే తన పదవిని వదులుకోవాల్సి వచ్చింది. అలా ఓ కురువృద్ధుడు.. కాంగ్రెస్‌ సుశిక్షిత సైనికుడు అత్యున్నత పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇప్పుడు రోశయ్యలో, పదవి పోయిందన్న బాధ ఎక్కడో ఓ మూల ఉన్నా.. గొడవలను పరిష్కరించాల్సిన తలనొప్పి తగ్గిందన్న భావన, కాస్తంత ప్రశాంతతనిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

No comments:

Post a Comment