Tuesday, November 23, 2010

రోశయ్యలో పెరుగుతోన్న అసహనం..!

రోశయ్య శాంతస్వభావం... మాటల చమత్కారం.. కనుమరుగై పోతున్నాయి. ఈ మధ్యకాలంలో ఆయన తీవ్ర అసహనంతో కనిపిస్తున్నారు. ముప్పిరిగొంటున్న సమస్యలు ఆయనకు శాంతిని దూరం చేస్తున్నాయి. ప్రాంతాలకు అతీతంగా, ఆయన ఎక్కడికి వెళ్లినా.. నిరసనలు చుట్టుముడుతున్నాయి. ఆయన ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నాక తొలి అర్ధ సంవత్సరం విపరీతమైన సమస్యలతో సతమతమయ్యారు. తర్వాత ఓ నాలుగు నెలలు కాస్తంత ప్రశాంతంగానే సాగింది. అయితే.. ఫ్రీజోన్‌, బిఇడి-2008 అభ్యర్థుల అంశాలపై రోశయ్య తీసుకున్న నిర్ణయాలు పరిస్థితులను దిగజార్చాయి. ఎస్‌ఐ రాతపరీక్షల నిర్వహణపై రోశయ్య ద్వంద్వ నిర్ణయం... రాష్ట్రంలో మళ్లీ విభజన చిచ్చును రాజేసింది. అది మొదలు, పారా మెడికల్‌ సిబ్బంది, ఉస్మానియా విద్యార్థులు, బిఇడి అభ్యర్థులు.. ఇలా ప్రతివారూ... ప్రభుత్వం మెడలు వంచేందుకు ఆత్మహత్యాయత్నాలకు దిగడం... ప్రభుత్వం బెంబేలెత్తి పోవడం ఆనవాయితీగా మారింది.
ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌లోనే... తనను వ్యతిరేకిస్తున్న జగన్‌ వర్గం తరచూ ఆటంకాలు సృష్టిస్తుండడం.. రోశయ్య చికాకుకు కారణమవుతోంది. సిఎం ఏ జిల్లాకు వెళ్లినా.. సభల్లో వైఎస్‌ను విస్మరిస్తున్నారంటూ.. జగన్‌ వర్గీయులు బహిరంగంగా విరుచుకుపడుతున్నారు. దీంతో.. రోశయ్యలో అసహనం బాగా పెరిగిపోతోంది. ఆవేశంతో ఊగిపోతున్నారు. తాజాగా, అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయం వద్ద కూడా ఆయన ప్రశాంతత భగ్నమై పోయింది. స్థానిక నాయకత్వాన్ని విస్మరించారంటూ.. ఆందోళనకు దిగిన కాంగ్రెస్‌ కార్యకర్తలపై రోశయ్య విరుచుకుపడ్డారు. అనూహ్యంగా ఆయన నోట రాజీనామా మాట కూడా దొర్లింది. అంతేకాదు.. అధికారులు నా మాట వినట్లేదు ఏం చేయమంటారు..? అని ప్రశ్నించారు. దీంతో అవాక్కవడం కాంగ్రెస్‌ కార్యకర్తల వంతైంది. మరి ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ఎలా నడిపిస్తారో మన రోశయ్య గారు. రాష్ట్రానికి (ఉంటే గింటే.. ) ఆ భగవంతుడే దిక్కు.

No comments:

Post a Comment