Monday, November 26, 2018


దుర్గగుడి ఫ్లైఓవర్ : రాష్ట్రానికి కేంద్రం వార్నింగ్
విజయవాడ : దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణంలో జాప్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. పనుల్లో జాప్యం వల్ల ఫ్లై ఓవర్  బడ్జెట్ అంచనా భారీగా పెరిగిపోతోందని కేంద్రం ఆగ్రహంగా ఉంది. అందుకే, కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. ఇక ముందు ప్రాజెక్ట్ ఆర్థిక భారాన్ని మోయలేమని తేల్చేసింది. దీంతోపాటే, వంతెన నిర్మాణాన్ని వచ్చే సంవత్సరం మార్చి నాటికి పూర్తి చేసి తీరాలని హుకుం కూడా జారీ చేసింది.
తూతూ మంత్రం పనులే..!

విజయవాడ నగర వాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం
, రెండున్నర కిలోమీటర్ల మేర ఆరు వరుసల వంతెన, నాలుగు వరుసల దారి నిర్మాణాన్ని ప్రతిపాదించింది. దీనికోసం రూ.448.60 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్‌తో, 2015 డిసెంబర్ 27న సోమా కన్ స్ట్రక్షన్ సంస్థ దుర్గగుడి ఫ్లై ఓవర్ పనులు మొదలు పెట్టింది. 2016 నాటికి పూర్తి కావాలన్నది తొలి లక్ష్యం. కానీ మూడేళ్లుగా ఫ్లైఓవర్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతునే ఉన్నాయి.
పదే పదే డెడ్‌లైన్‌లు :
సీఎం చంద్రబాబు దుర్గగుడి పైవంతెన పనులను చాలాసార్లు సమీక్షించారు. సుమారు 10 సార్లు డెడ్‌లైన్లు విధించారు. సీఎం సీరియస్ అయినప్పుడు ఒకటి రెండు రరోజులు పనులు వేగం అందుకోవడం, తర్వాత జోరు తగ్గడం పరిపాటిగా మారింది. ఇప్పటి వరకూ కేవలం 70 శాతం పనులు మాత్రమే పూర్తిచేయగలిగారు. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ పని చకచకా సాగుతుంటే, ప్రధానమైన దుర్గగుడి పైవంతెన పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న రీతిలో ఉన్నాయి. భారీ ప్రాజెక్టులు చేపట్టిన సోమ సంస్థ ఈ చిన్న ప్రాజెక్ట్ విషయంలో ఇంత జాప్యం చేస్తుండడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసహనంగానే ఉన్నాయి.
ట్రాఫిక్ సమస్య ఇంతింత కాదు
పోలీస్, రవాణా, నేషనల్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ 2015లో ఓ సర్వే ప్రకారం దుర్గగుడి మీదుగా నిత్యం 57 వేలకుపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీన్నిబట్టే బెజవాడలో ట్రాఫిక్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ రోజూ పరిపాటిగా మారింది. ఈసారైనా డెడ్‌లైన్ ప్రకారం ఫ్లైఓవర్‌ పనులు పూర్తయి, బెజవాడ ప్రజలకు ఊరటనిస్తాయో లేదో చూడాలి.

No comments:

Post a Comment