Thursday, November 23, 2017

ప్రాణదాన కేంద్రం.. బెజవాడ ప్రభుత్వ వైద్యాలయం
విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రి
ప్రభుత్వాసుపత్రి డాక్టర్లు అంటే..  ప్రాణాలు తీసే యమదూతలు అన్నది నిన్న మొన్నటిదాకా అందరిలాగానే, నాలోనూ ఉన్న అభిప్రాయం. కానీ.. అక్టోబర్ 26తో.. అది పటాపంచలైంది. నాది ఒట్టి దురూహ అని.. విజయవాడలోని కొత్త ప్రభుత్వాసుపత్రి నిరూపించింది. యమపురి ద్వారాలుగా కాకుండా.. ప్రాణదాన కేంద్రాలుగా ప్రభుత్వాసుపత్రులు భాసిల్లుతున్నాయన్న సత్యం నాకు తెలిసొచ్చింది. అవును.. 30 ఏళ్ల నా జర్నలిజం కెరీర్ సాక్షిగా ఇది నిజం.. అక్షరాక్షర సత్యం.
మా తమ్ముడు ప్యాంక్రియాస్ బాధితుడు :
మా తమ్ముడు మురళీకృష్ణ
మా తమ్ముడు పి.మురళీకృష్ణ,  pancreas (క్లోమం) వ్యాధితో చాలాకాలంగా బాధపడుతున్నాడు. క్లోమ గ్రంథుల్లో నుంచి ద్రవాలు ఊరని పరిస్థితి. క్లోమం రాళ్లతో నిండిపోయి.. గట్టిగా తయారైంది. దీంతో షుగర్ లెవెల్స్ దారుణంగా పెరిగిపోయాయి. తిన్న రెండో నిమిషమే.. మల విసర్జనకు వెళ్లాల్సిన దుస్థితి. తిన్నది ఏదీ ఒంటికి పట్టకుండా.. అస్తిపంజరంలా మారాడు. ఎమ్మిగనూరు సహా కర్నూలు జిల్లాలోని చాలా ఆసుపత్రుల్లో చూపించుకున్నాడు. ప్రతివారూ మందులు ఇచ్చి పంపడమే..! ఆపరేషన్ అంటే ఎవరూ ముందుకు రాలేదు. ఆ పరిస్థితుల్లో తెలిసిన వారి ద్వారా.. మా తమ్ముడు, విజయవాడ వెళ్లి.. అక్కడి ప్రభుత్వాసుపత్రిలో సంప్రదించాడు.
ప్రాణదాత డాక్టర్ ఎం.విశ్వనాథ్ :
సతీసమేతంగా డాక్టర్.ఎం.విశ్వనాథ్
మాతమ్ముడి అదృష్టవశాత్తు.. విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్.ఎం.విశ్వనాథ్ గారు తారసిల్లారు. ప్యాంక్రియాసిస్ కు శస్త్రచికిత్స చేసేందుకు ముందుకొచ్చారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా వెంటనే ఇన్ పేషెంట్ గా చేర్చుకున్నారు. ఆపరేషన్ కు ముందు.. తర్వాత.. మా తమ్ముడికి 95శాతం మేర ఖరీదైన వైద్య పరీక్షలన్నీ ఆసుపత్రిలోనే చేయించారు. మందులు కూడా ఆసుపత్రిలోనే సమకూర్చారు. మరీ తప్పని పరిస్థితుల్లోనే, బయటి నుంచి మందులు, శస్త్రచికిత్సకు అత్యవసరమైన ఒకటి రెండు వస్తువులు మాత్రమే నాతో బయటి నుంచి తెప్పించారు. ఆపరేషన్ ముందు మా తమ్ముడి ఒంట్లోని షుగర్ కంట్రోల్ చేసేందుకు డాక్టర్ విశ్వనాథ్ గారి బృందం పడ్డ తంటాలు అన్నీ ఇన్నీ కావు. మత్తుమందు (anasthesia) నిపుణులు, షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఆపరేషన్ కు ఎక్కడ అంగీకరించరో అని.. మాకన్నా.. డాక్టర్ విశ్వనాథ్ గారు పడ్డ హైరానా అంతా ఇంతా కాదు. పేషెంట్ పరిస్థితి దారుణంగా ఉన్నందున.. వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలన్న వారి తపన కొట్టొచ్చినట్లు కనిపించింది.

ఆత్మీయ బంధువులు.. ఈ వైద్యులు :

నిజానికి ఇది చాలా క్లిష్టమైన ఆపరేషన్. అయినా.. రోగంతో తన వద్దకు వచ్చిన వారిని నయం చేయకుండా పంపరాదన్న భావనతో.. డాక్టర్ విశ్వనాథ్ గారు, మా తమ్ముడి కేసును చేపట్టినట్లుగా నాకు అనిపించింది. తమ డిపార్ట్ మెంట్ హెడ్ డాక్టర్ పురుషోత్తం గారి నిర్దేశకత్వంలో.. ఆపరేషన్ అనుకున్నప్పటి నుంచే.. డాక్టర్ విశ్వనాథ్ గారు, ఆయన బృందంలోని డాక్టర్ శ్వేత గారు మొదలైన వారంతా, మా తమ్ముడిపై కనబరిచిన శ్రద్ధను మాటల్లో చెప్పలేను. . అప్పట్లో నాకు తెలియదు కానీ.. తర్వాత అర్థమైంది.. మా తమ్ముడినే కాదు.. తమ దగ్గరకు వ్యాధితో వచ్చిన ప్రతివారినీ ఈ బృందం అంతే జాగ్రత్తగా, శ్రద్ధగా కనిపెట్టుకుంటారని. డాక్టర్ శ్వేత గారైతే.. ఆపరేషన్ కు ముందు రోజు.. ఆరోగ్యశ్రీ కార్డు నమోదు ప్రక్రియను కూడా స్వయంగా దగ్గరుండి చేయించారు. ఆపరేషన్ తర్వాత కూడా.. నాలుగు రోజులపాటు ప్రతి రెండు గంటలకోసారి.. మా తమ్ముడి పరిస్థితిని చూసుకుంటూ వచ్చారు. నర్సులు లేకున్నా.. స్వయంగా డాక్టర్లే డ్రెస్సింగ్ తదితరాలు చేయడాన్ని చూసి ఆశ్చర్యపోవడం నావంతైంది. ప్రతి క్షణం.. పేషెంట్ కు ఇబ్బంది కలగకూడదన్న తపనే వారిలో కనిపించింది. మొత్తానికి ఈ బృందం కష్టంతో.. మా తమ్ముడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.
అచ్చంగా అమ్మఒడే..!
నేను 10Tv Output Editor అని ఎక్కడా చెప్పుకోలేదు.. ఎవరి రెకమెండేషన్ లు పెట్టించుకోలేదు. కేవలం సాధారణ పేషెంట్ కు ఓ అన్నగానే అక్కడున్నాను. పేషెంట్ పట్ల వైద్యులు కనబరిచే ఆత్మీయతకు సాక్షీభూతంగా నిలిచాను.  మా తమ్ముడిని అమ్మలా లాలించారు.. నాన్నలా పాలించారు.. తోబుట్టువులా ఊరడించారు.. నమ్మరు గానీ.. ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూసుకోనంత ప్రేమగా చూసుకున్నారు. మా తమ్ముడు ఆపరేషన్ వల్ల కలిగిన నొప్పిని భరించలేక.. లేవలేని పరిస్థితుల్లో.. డాక్టర్లు కాస్త కఠినంగానే హెచ్చరించారు.. మా తమ్ముణ్ణి వారే, బలవంతంగా పైకి లేవదీసి చేయి పట్టుకుని నడిపించారు. ఆ తర్వాత నొప్పి తగ్గేందుకు ఉపశమన మార్గాలనూ చూపారు. కచ్చితంగా ఆపరేషన్ జరిగిన వారం రోజులకే.. డిశ్చార్జి చేసేంతటి మెరుగైన స్థితికి మా తమ్ముడిని చేర్చారు.
పరిశుభ్రతకు ఫిదా..!
మానాన్న క్యాన్సర్ వ్యాధికి చికిత్స సందర్భంగా.. 22 ఏళ్ల క్రితం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తిరిగిన జ్ఞాపకం ఇంకా ఉంది. మరకలు పట్టిన గోడలు.. చీకటి కొట్లను తలపించే గదులు.. ఎక్కడా టార్చి లైటు వేసి వెతికినా కనిపించని పరిశుభ్రత... ఇదీ అప్పటి పరిస్థితి. కానీ విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రిని చూస్తే.. కొంపదీసి ఇది కార్పొరేట్ ఆసుపత్రా అన్న అనుమానం కలుగుతుంది. నేను అక్కడ వారం రోజులపాటు మా తమ్ముడికి అటెండెంట్ గా ఉన్నాను. రోజులో 8 సార్లు వార్డులను శుభ్రం చేస్తారు. బెడ్ షీట్స్ కూడా ప్రతిరోజూ శుభ్రమైనవి, చక్కగా ఉతికినవి మారుస్తారు. ఫ్యాన్లకు.. గోడలకు.. ఉన్న బూజును ప్రతి ఆదివారమూ పరిశుభ్రం చేస్తారు.
సేవలు అద్భుతం
మహాప్రస్థానం వాహనం
చెబితే నేనూ నమ్మేవాడిని కాను కానీ.. స్వయంగా చూశాకే అర్థమైంది.. అక్కడ పరిశుభ్రతకు ఎంత ప్రాధాన్యమిస్తారో. ఆసుపత్రి వార్డుల్లోనే కాదు.. పరిసరాల్లోనూ అంతే శుభ్రత కనిపిస్తుంది. పేషెంట్ల బంధువులు చెత్తను పారేయడం ఆలశ్యం.. పారిశుద్ధ్య సిబ్బంది వెంటనే తొలగించడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక ఇక్కడ ఏర్పాటు చేసిన సరికొత్త అంబులెన్స్ ల గురించీ చెప్పాలి. ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడి.. ఇక్కడికి తెచ్చేలోపే మరణించిన వారిని.. వ్యాధిని నయం చేయలేని స్థితిలో వచ్చి.. ప్రాణాలు కోల్పోయిన వాళ్ల మృతదేహాలను.. బెజవాడ పరిసరాల్లోని వారి ఇళ్లకు తరలించేందుకు ఏర్పాటు చేసిన మహాప్రస్థానం అంబులెన్స్ వ్యవస్థ కూడా అద్భుతం. (మానాన్న మరణించినప్పుడు.. హైదరాబాద్ నుంచి మానాన్న మృతదేహాన్ని మా ఊరికి తరలించేందుకు నేను పడ్డ పాట్లు.. గుర్తుకొచ్చాయి. అప్పట్లో ఈటీవీ జీఎం బాపినీడు గారు కంపెనీ వాహనాన్ని సమకూర్చకుంటే నా పరిస్థితి ఏంటో తలచుకుంటే ఇప్పటికీ ఒళ్లు ఝల్లుమంటుంది). మృతుల బంధువులకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ నిజంగా ఆపన్నహస్తమే.
ప్రతి చోటా ఇలాగే ఉంటుందా..? 

ప్రతి ఆసుపత్రిలోనూ పేషెంట్ల మీద ఇలాంటి శ్రద్ధే ఉంటుందా..? ఏమో నాకు తెలియదు. నేను చూసింది.. మీతో పంచుకుంటోందీ.. విజయవాడలోని కొత్త ప్రభుత్వాసుపత్రిలోని మంచి పరిస్థితిని.  వైద్యులకు.. ముఖ్యంగా ప్రభుత్వానికి బాకా ఊదేందుకు రాసిన రాతలు కావు. మా తమ్ముడికి ప్రాణదానం చేసిన వైద్యుల అంకిత భావం గ్రహించి..  కృతజ్ఞతతో నిండిన నా మనసులోని భావాలకు అక్షర రూపం మాత్రమే. మా తమ్ముడు ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడు. జీర్ణవ్యవస్థ పక్కాగా పనిచేస్తోంది. షుగర్ లెవెల్స్ కూడా బాగా కంట్రోల్ లోకి వచ్చాయి. మా తమ్ముడికి మళ్లీ జన్మను ప్రసాదించిన డాక్టర్ ఎం.విశ్వనాథ్ గారికి మా కుటుంబ సభ్యులందరమూ సదా కృతజ్ఞులము. వైద్యో నారాయణో హరి:

P.VIJAYA KUMAR
Output Editor, 10Tv.,
Hyderabad

No comments:

Post a Comment