Monday, January 31, 2011

కిరణ్ గుగ్లీ


ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో జట్టు అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు కొత్త బౌలర్ కిరణ్ కుమార్ రెడ్డి బౌలింగ్ చేస్తున్నారు. నాన్ ప్లేయింగ్ కెప్టెన్ సోనియాగాంధీ ఆదేశాలమేరకు లెగ్ బ్రేక్ ప్రవీణుడు కిరణ్ వరుసగా ఇబ్బందికరమైన బంతులు వేసి స్టార్ బ్యాట్స్ మన్ జగన్మోహన్ రెడ్డిని చీకాకు పెడుతున్నారు. లెగ్ బ్రేక్ తాపీగా వేస్తున్న కిరణ్ ఉన్నట్టుండి అకస్మాత్తుగా, అనూహ్యంగా మణికట్టు గిర్రున తిప్పి గుగ్లీ వేశాడు. ప్రత్యర్థి దిమ్మరబోయారు.
బెర్నాడ్ బోసాంకే అనే క్రికెటర్ కనిపెట్టిన గుగ్లీ మహా కతర్ నాక్ బంతి. బ్యాట్స్ మన్ ని ఆశ్చర్య పర్చుతుంది. కంగారు పెడుతుంది. దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. దిక్కుతోచని పరిస్థితి కల్పిస్తుంది. పెవెలియన్ వైపు నడిపిస్తుంది. లెగ్ స్పిన్ బౌలింగ్ చేసే బౌలర్లు ఈ బంతిని విసిరి బ్యాట్స్ మన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తారు. అస్థిరపర్చుతారు. మతిపోగొడతారు. రైట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ కి లెగ్ బ్రేక్ వేస్తే బంతి లెగ్ నుంచి ఆఫ్ సైడ్ కి, అంటే బ్యాట్స్ మన్ కి దూరంగా వెడుతుంది. గుగ్లీ ఇందుకు భిన్నంగా అడ్డం తిరుగుతుంది. బంతి ఆఫ్ సైడ్ లో పడి లెగ్ వైపు చప్పున తిరిగి అంతలోనే నేరుగా వేగంగా వికెట్ల మీదికి వెడుతుంది. బంతి ఎటు పోయి ఎటు వస్తుందో బ్యాట్స్ మన్ కి ఒక పట్టాన అర్థం కాదు. దీనిని బౌలర్ అమ్ములపొదిలో ఉన్న అత్యంత ప్రమాదరకరమైన అస్త్రంగా- మోస్ట్ లీతల్ వెపన్ గా, స్టెల్దియెస్ట్ వెపన్ గా - క్రికెట్ పండితులు అభివర్ణిస్తారు. పాతతరం క్రికెటర్లలో కర్ణాటకకు చెందిన ప్రఖ్యాత బౌలర్ చంద్రశేఖర్ ఈ ప్రక్రియలో ప్రసిద్ధుడు. కొమ్ములు తిరిగిన అంతర్జాతీయ బ్యాట్స్ మన్ ను తన గుగ్లీతో గింగిరాలు తిరిగేట్టు చేశాడు. ఆధునిక క్రికెట్ లో అనీల్ కుంబ్లే, సచిన్ టెండూల్కర్, అబ్దుల్ ఖాదర్, సక్లైన్ ముస్తాఖ్ వంటి క్రికెటర్లు గుగ్లీ ప్రవీణులు. గుగ్లీని ఆస్ట్రేలియాలో రాంగ్ వన్ అంటారు. పాకిస్తాన్ లో దూసరా అంటారు. శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ వేసే బంతిని దూసరా అనడం పరిపాటి. దూసరా అంటే మరోబంతి అని భావన. అక్రమమైనదని అభియోగం. మొత్తంమీదికి గుగ్లీకి మంచిపేరు లేదు. ఊహించని రీతిలో గబుక్కున అడ్డంతిరిగి వికెట్ల మీదికి వెళ్ళే బంతి ఏ నేరం చేయని బ్యాట్స్ మన్ ని కంగారు పెట్టి అవుట్ చేస్తుంది కనుక గుగ్లీకి చెడ్డపేరే ఉంది. అందుకే రాంగ్ వన్ అనీ, బాసీ అని పిలవడం. బ్యాట్స్ మన్ అవుటు కాకుండా బాగా ఆడుతూ బౌలింగ్ ను అదే పనిగా బాదేస్తుంటే ఫీల్డింగ్ పక్షం కెప్టెన్ ఈ ప్రక్రియను తుర్ఫు ముక్కలాగా ప్రయోగించడం ఆనవాయితీ.
కిరణ్ కూడా మంచి క్రికెటర్. స్వయంగా క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించి పలు సందర్భాలలో విజయం సాధించిన క్రీడాకారుడు. అజరుద్దీన్ వంటి ప్రపంచ ప్రసిద్ధుడైన కెప్టెన్ కు కిరణ్ కెప్టెన్. కెప్టెన్ ఆఫ్ కెప్టెన్ అన్న మాట. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కంట్రోల్డ్ ఎగ్రెషన్... అంటే జాగ్రత్తగా ఆడుతూనే రిస్కు తీసుకొని ధాటిగా షాట్లు కొట్టడం తెలిసిన ఆటగాడు. ప్రత్యర్థిని అవుట్ చేయడానికి ఏమి చేయాలో కిరణ్ కు తెలుసు. ప్రత్యర్థి సైతం సామాన్యుడు కాదు. పిన్న వయస్కుడైనా సాహసోపేతమైన రీతిలో బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న క్రికెటర్. అతని సారథ్యంలో మ్యాచ్ గెలుస్తామనే ఆశతో చాలామంది క్రికెటర్లూ, ఔత్సాహిక క్రికెటర్లూ ఆయన జట్టులో చేరారు. మరికొంత మంది చేరడానికి సిద్ధంగా ఉన్నారు.
కిరణ్ జట్టు సారథ్యం స్వీకరించే సమయంలో జట్టు డీలాపడి ఉంది. ప్రత్యర్థి జట్టు మంచి ఫామ్ లో రెచ్చిపోతున్నట్టు కనిపించింది. సొంత జట్టులోని సభ్యుల విధేయతపైన కెప్టెన్ కు విశ్వాసం లేదు. డ్రసింగ్ రూమ్ లో చర్చించిన వ్యూహాన్ని క్షణాలలో ప్రత్యర్థికి అందించే సహచరులతో తల బొప్పికడుతోంది. మనువొకచోటా, మనసొకచోటా అన్నట్టు ఉన్నది వారి వాలకం. రోశయ్య కెప్టెన్ గా విఫలమైనారు కనుకనే తనకు ఈ బాధ్యత అప్పగించారని కిరణ్ కు తెలుసు. ఏదో ఒక హడావుడి చేసి సంచలనం సృష్టించి ప్రత్యర్థులను బలహీనపరచి సొంత జట్టులోని సభ్యులను ఉత్సాహపరచి ప్రజలను ఆకట్టుకోకపోతే పాత కెప్టెన్ లాగానే తాను సైతం పరాజితుడై పదవి కోల్పోవలసి వస్తుందని కిరణ్ కు తెలుసు. ఓటమి పొంచి ఉన్న సందర్భాలలో విజృంభించి ఆడటం ఒక్కటే మార్గమని క్రికెట్ క్రీడానుభవం నేర్పిన పాఠం. తెలుగు ప్రేక్షకులు ప్రస్తుతం చూస్తున్న దృశ్యం అదే.
మంత్రులు కలసి రారని తెలిసినప్పటికీ, శాసనసభ్యులు గోడమీద పిల్లివాటంగా కపట విన్యాసాలు చేస్తున్నారన్న సమాచారం ఉన్నప్పటికీ కెప్టెన్ గా తాను చొరవ తీసుకొని వీరవిహారం చేయడం ప్రారంభించాలని కిరణ్ నిర్ణయించుకున్నారు. రచ్చబండ కార్యక్రమాన్ని ప్రకటించారు. సీమాంధ్రలో జగన్ అభిమానులూ, తెలంగాణలో తెలంగాణవాదులూ అడ్డుకుంటారనీ, రచ్చబండను రచ్చరచ్చ చేస్తారని తెలుసు. పోలీసు యంత్రాంగం సహకారంతో, కలసివచ్చే మంత్రులూ, శాసనసభ్యుల మద్దతుతో కార్యక్రమాన్ని ప్రణాళిక ప్రకారం కొనసాగించాలనే నిర్ణయించారు. కొనసాగిస్తున్నారు. తెలంగాణలో లాఠీచార్జీ, బాష్పవాయు ప్రయోగం వంటి చర్యలు అవసరమైనా వెనుకంజ వేయడం లేదు. రచ్చబండ కార్యక్రమం ప్రచారం పత్రికలలో, టీవీ చానళ్ళలో జోరుగా వస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా కోట్లాది తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనారు. ఆయన మాట తీరు కూడా తెలుగువారికి అలవాటైపోయింది. సంవత్సరానికి పైబడి ముఖ్యమంత్రిగా పని చేసిన రోశయ్యకు రాని ప్రచారం కిరణ్ కుమార్ రెడ్డికి వారం రోజులలోనే వచ్చింది. జగన్ శిబిరంలోకి వలసలు తగ్గినట్టు కనిపిస్తున్నాయి. ఇది తాత్కాలికమే కావచ్చు. కాకపోవచ్చు. మొత్తంమీద పలుకున్న ఆటగాడినని నిరూపించుకునే ప్రయత్నం కిరణ్ చేస్తున్నారు. ఈ సానుకూలతను ఎట్లా ఉపయోగించుకుంటారన్న అంశంపైన కిరణ్ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
అన్నట్టు గుగ్లీ విషయం. రచ్చబండ కార్యక్రమం ప్రారంభమైన జనవరి 24 వ తేదీన విశాఖపట్టణంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలోనే కిరణ్ జగన్ పైన గుగ్లీ విసిరారు. అంతకు కొన్ని రోజుల కిందటే ఆ నగరంలో కాంగ్రెస్ కార్యకర్తలు జగన్ కు బ్రహ్మరథం పట్టారు. అక్కడే జగన్ పైన కిరణ్ శక్తిమంతమైన అస్త్రాన్ని ప్రయోగించారు. పరిటాల రవి హత్య కేసులో జగన్ కు ప్రమేయం ఉందన్న ఆరోపణలను తెలుగు ప్రజలకు మరోసారి గుర్తు చేశారు. జగన్ పైన తెలుగుదేశం చేసిన ఆరోపణలను అసెంబ్లీలో ఎదుర్కొనే బాధ్యత నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనకే అప్పగించారని చెప్పారు. ఆ బాధ్యతను నెరవేర్చే క్రమంలో అరవై రోజుల పాటు తాను విషయాన్ని అధ్యయనం చేయవలసి వచ్చిందని తెలిపారు. జగన్ నిర్దోషి అని నిరూపించేందుకు అసెంబ్లీలో ఎట్లా వాదించబోతున్నావని అరవై రోజుల్లో ఒక్కసారి కూడా తనను వైఎస్ అడగలేదని బెబుతూ నాటి ముఖ్యమంత్రికి తనపైన అంతటి విశ్వాసం ఉన్నదని చాటుకున్నారు. అందువల్ల ఇరవై సంవత్సరాలు కలిసి నడిచిన తన వంటి రాజకీయ నాయకులే వైఎస్ కు నిజమైన రాజకీయ వారసులు కానీ జగన్ కానేకాదని తేల్చారు. రాజకీయ నాయకత్వం తనబోటి వాళ్ళదేనని చెప్పడం ఒక లక్ష్యం. అంతకంటే ముఖ్యమైన లక్ష్యం పరిటాల రవి హత్య కేసులో జగన్ కు పాత్ర ఉండి ఉండవచ్చుననే అనుమానాన్ని కలిగించే విధంగా స్పష్టాస్పష్టంగా చెప్పడం. కిరణ్ కుమార్ రెడ్డి ఇంత వ్యూహాత్మకంగా, ఇంత సాహసోపేతంగా, ఇంత నాటకీయంగా ప్రమాదపుటంచులపైన విన్యాసం చేయగలరని తెలుగు ప్రేక్షకులు బహుశా ఊహించి ఉండరు. షేక్ స్పియర్ రాసిన జూలియస్ సీజర్ నాటకంలో ఐ కమ్ టు బరీ సీజర్. నాట్ టు ప్రైజ్ హిమ్ అంటూ మహోపన్యాసం ప్రారంభించిన మార్క్ ఆంటనీ కిటుకునే కిరణ్ రివర్స్ లో ప్రయోగించారు. కిరణ్ విశాఖ ఉపన్యాసాన్ని లెగ్ బ్రేక్ లాగా కనిపించిన గుగ్లీ అనడం అందుకే. దీనికి ప్రతిగా జగన్ వర్గం విశ్వాస తీర్మానం డిమాండ్ తో బంతిని బౌండరీ దాటించింది. ఒక్క గుగ్లీతో బ్యాట్స్ మన్ అవుటై పోవాలని లేదు. ఇన్నింగ్స్ కుప్పకూలి పోవాలనీ లేదు. కానీ కిరణ్ వేసిన గుగ్లీ మాత్రం ప్రమాదకరమైనది. సందట్లో సడేమియా లాగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం స్కోరు పెంచుకునే రంధిలో పడింది. కిరణ్ వ్యాఖ్యలను కొద్దిగా మార్చి వక్రభాష్యం చెబుతోంది. హత్య కేసులో జగన్ ను రక్షించినట్టు కిరణ్ చెప్పారని అంటూ అటువంటి పని చేసిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండరాదంటూ చంద్రబాబునాయుడు, యనమల రామకృష్ణుడు వంటి సీనియర్ నాయకులు డిమాండ్ చేయడం విడ్డూరం. జగన్ పైన తెలుగుదేశం నాయకులు చేస్తున్న ఆరోపణలకు అసెంబ్లీలో సమాధానం చెప్పడం గురించి కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తావిస్తే హత్య కేసులో జగన్ ని రక్షించినట్టు ముఖ్యమంత్రి చెప్పారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు వాదిస్తున్నారు. కిరణ్ వ్యాఖ్యలను వక్రీకరించి వర్థిల్లాలని ప్రయత్నిస్తున్నారు. మొత్తంమీద జగన్ తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తర్వాత ఎదుర్కొన్న అత్యంత నిశితమైన విమర్శనాస్త్రం రచ్చబండ ప్రారంభంలో కిరణ్ కుమార్ రెడ్డి వేసిన గుగ్లీ. విజేతలు ఎవరో ఇప్పుడే చెప్పలేము కానీ ఆట రసవత్తరంగా, ప్రేక్షకులను మునుగాళ్ళ మీద నిలబెట్టే విధంగా, గుండెల్లో రైళ్ళను పరుగెత్తించే రకంగా ఉంటుందని మాత్రం చెప్పగలం. మిగిలిన కథ తెలుగు టీవీ న్యూస్ చానళ్ళ తెరపై నిరవధికంగా చూడవచ్చు.
(ఈ వ్యాసాన్ని శ్రీ రామచంద్రమూర్తి గారు hmtv సంపాదకీయం “ హంసధ్వని” కోసం 30వ తేదీన రాశారు. మూర్తిగారి మరిన్ని వ్యాసాలు చూడాలనుకుంటే.. www.hmtvhamsadhwani.blogspot.com ని క్లిక్‌ చేయండి)

1 comment:

  1. Vijay Garu,

    Thanks for the nice article. Especially, comparing KKR's political strategy with Googly when world cup is around the corner is excellent.

    Convey our regards to Mr. Murthy

    ~Sasidhar Sangaraju
    www.sasidharsangaraju.blogspot.com

    ReplyDelete