Sunday, January 23, 2011

జగన్‌ ఓటమా..? నరసింహన్‌కి రాజదండమా..?

ముసుగులు గబగబా తొలగిపోతున్నాయి. ఒరలలో నుంచి బరబరా బయటికి దూసిన కత్తులు తళతళా మెరుస్తున్నాయి. కుత్తుకలు కత్తిరించడానికి సిద్ధం అవుతున్నాయి. వాతావరణం అమాంతంగా వెడెక్కిపోతున్నది. యుద్ధానికి ఉభయ పక్షాలూ సై అంటున్నాయి. రాబోయే కాలంలో రాజకీయ పోరాటం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికీ, కడప మాజీ ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికీ మధ్యనే ప్రధానంగా. మూడో పక్షం కొంత తగ్గవలసి వస్తుంది. తెలుగు దేశం అధినేత చంద్రబాబు చాలా శ్రమిస్తున్నారు. కష్టానికి తగిన ఫలితం వెంటనే రాకపోవచ్చు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు చంద్రశేఖరరావు చాలా ఆలోచిస్తున్నారు. ఉద్యమంలో కాస్తంత విలంబన పాటించవలసి రావచ్చు. రాష్ట్రంలో రసవత్తరంగా జరగబోయే కోడిపందెం ఫలితం తేలిన తర్వాత కొన్ని ప్రశ్నలు వాటంతట అవే పరిష్కారం అవుతాయి. మరికొన్ని ప్రశ్నలకు సమాధానాలు కనుచూపు మేరలో కనిపిస్తాయి. పెరుగుతున్న నిత్యావసర వస్తవుల ధరలూ, రైతుల కష్టనష్టాలూ వంటి సమస్యలకు పరిష్కారం గురించి ఆలోచించే వ్యవధి ఏలినవారికి ఉండదు.

సంక్రాంతికి బాగా ముందుగానే కాంగ్రెస్ అధిష్ఠానం కోడి పందాలకు రంగం సిద్ధం చేసింది. పౌరుషం అధికంగా ఉన్న జగన్ అనే పోరు కోడి అదేపనిగా కాలుదువ్వడాన్నీ, ధిక్కారపు కూతలు కూయడాన్నీ సహించలేకపోయిన అధిష్ఠాన దేవత పోటీ కోడిని దగ్గరికి తీసుకొని దువ్వి, పోరు పాఠాలు చెప్పి మరీ రంగంలోకి దించింది. అదే ప్రాంతానికీ, అదే జాతికీ చెందిన దాదాపు అదే వయస్సు కోడిని గుర్తించి పోటీకి నిలిపినందుకు అధిష్ఠానం తనను తాను అభినందించుకున్నది. కడప కోడి ఆట కట్టిస్తానంటూ పీలేరుకు చెందిన కొత్త కోడి ఇచ్చిన హామీని ఢిల్లీ రాజకీయ జూదరులు విశ్వసించారు. జగన్ బెడద త్వరలోనే తొలగిపోతుందని అధిష్ఠానం తలపోసింది. కానీ కొత్త కోడి బరిలోకి దిగడానికి మీనమేషాలు లెక్కించింది. ముక్కుకూ, కాళ్ళకూ కత్తులు కట్టుకొని పోరాటం ప్రారంభించేందుకు అవసరానికి మించిన సమయం తీసుకుంది. ఇంతలో అధిష్ఠాన దేవతకు అనుమానం వచ్చింది. సర్కారు కోడికి పౌరుషం ఉన్నదా లేదా అన్న ప్రశ్న ఉదయించింది. గుండెబలం లేదేమోనన్న సందేహం కలిగింది. హస్తినకు పిలిపించింది. రెండు మాసాల కిందట ఇచ్చిన హామీని గుర్తు చేసింది. కర్తవ్యాన్ని తిరిగి ప్రబోధించింది. ధైర్యం నూరిపోసింది. పోరు వెంటనే ప్రారంభించాలనీ, చావో రేవో తేల్చుకోవాలనీ కరాఖండిగా చెప్పింది. కడప కోడి శృంగనాదం చేసిన హస్తినలోనే సర్కార్ కోడి కూడా శంఖం పూరించాలని పట్టుపట్టింది. అధిష్ఠానం ఆదేశాల మేరకు కిరణ్ కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిపైన ధ్వజమెత్తారు. మొట్టమొదటి సారిగా ప్రత్యక్షంగా మాటల తూటాలు పేల్చారు. జగన్ వెంట తిరుగుతున్న కాంగ్రెస్ శాసనసభ్యులు తమ సభ్యత్వాలకు రాజీనామా చేసి తిరిగి పోటీ చేసి గెలవాలంటూ హితవు చెప్పారు. ‘తమలపాకుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నే రెండంటా’ అన్నట్టు జగన్ అనుయాయులు తక్షణమే తిరుగుదాడి ప్రారంభించారు. ముఖ్యమంత్రి జిల్లా చిత్తూరుకే చెందిన సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యురాలు కుతూహలమ్మ మరోసారి కదన కుతూహలం ప్రదర్శించారు. మంత్రిపదవి రాలేదని కోపగించిన కుతూహలమ్మ కిరణ్ కుమార్ రెడ్డికి అటువంటి వ్యాఖ్య చేసే అర్హతే లేదంటూ విమర్శించారు. మంత్రి పదవి పోయిందని కృద్ధుడైన కురువృద్ధుడు గాదె వెంకటరెడ్డి ముఖ్యమంత్రి తొందరపడ్డారంటూ తప్పుపట్టారు. జగన్ ను విమర్శిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే జగన్ ను అనుసరిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తారంటూ అంబటి రాంబాంబు వంటి జగన్ వర్గీయులు బదులిచ్చారు. వేడిలో వేడిగా వైఎస్ కుటుంబానికి కోట వంటి పులివెందులలో రచ్చబండ కార్యక్రమం జరిపించేందుకు ముఖ్యమంత్రి సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే శత్రు దుర్గాన్ని ముట్టడించడానికి ముఖ్యమంత్రి సాహసిస్తున్నారని అనుకోవాలి. మంచి పోరాట పటిమ ప్రదర్శిస్తున్నారని భావించాలి.
నిధులు లేక బొక్కసం నిండుకున్నప్పటికీ రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలన్న ముఖ్యమంత్రి తాపత్రయం ప్రజలకు ఏదో ఒక విధంగా దగ్గర కావాలనే. వైఎస్ రాజశేఖరరెడ్డిలాగా సంక్షేమ పథకాల దన్నుతో ప్రజల హృదయాలలో చోటు సంపాదించుకోవాలన్నది కిరణ్ దీర్ఘ కాలిక వ్యూహం కావచ్చు. కానీ రచ్చబండ ప్రారంభం కావడానికి ముందే జగన్మోహన్ రెడ్డితో అమీతుమీ తేల్చుకోవాలని అధిష్ఠానం ఒత్తిడి తేవడంతో కిరణ్ కుమార్ రెడ్డి యుద్ధప్రణాళికలో స్వల్పంగా సవరణలు చేసుకోవలసి వస్తున్నది. జగన్ ఆట కట్టిస్తానంటూ అధిష్ఠానవర్గానికి వాగ్దానం చేసి... ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన కిరణ్ ప్రమాణస్వీకారం తర్వాత ఒకసారి ఫోన్ చేసి జగన్ ను పలకరించడం మినహా యువనాయకుడితో సయోధ్యకోసం ప్రత్యేకించి ప్రయత్నించిన దాఖలా లేదు. జగన్ ను బలహీనపరచడానికి తీసుకున్న అరకొర చర్యలు సైతం సత్ఫలితాలు ఇవ్వలేదు. విజయవాడ దీక్షకు కానీ, ఢిల్లీ ప్రదర్శనకు కానీ, విశాఖపట్టణం నిరశన వ్రతానికి కానీ హాజరు కారాదంటూ కిరణ్ చెప్పిన హితవును దాదాపు పాతిక మంది కాంగ్రెస్ శాసనసభ్యులూ పెడచెవిన పెట్టారు. జగన్ ను అనుసరిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య పెరగకుండా చూసుకుంటూ మిగిలినవారిని పిలిపించి మాట్లాడుతున్నారు. నరుడా ఏమి నీ కోరిక అన్న పద్ధతిలో అడుగుతున్నారు. ఒకవైపు శాసనసభ్యలను బుజ్జగించి మంచి చేసుకుంటూనే మరోవైపు అభివృద్ధి కార్యక్రమాల అమలు ద్వారా ప్రజలలోకి వెళ్ళాలనీ, ప్రజామోదం పొందాలనీ కిరణ్ కుమార్ రెడ్డి తలపోశారు. కానీ వైఎస్ రాజశేఖరరెడ్డికి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడవద్దంటూ, జగన్మోహన్ రెడ్డి గురించి పట్టించుకోవద్దంటూ శాసనసభ్యులకు కిరణ్ కుమార్ రెడ్డి సలహా చెబుతున్నట్టు అధిష్ఠానవర్గానికి సమాచారం అందింది. రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు వంటి రాజీవ్ కుటుంబ విధేయులూ, అనుభవజ్ఞులైన పార్లమెంటు సభ్యులూ లేఖల ద్వారానూ, మౌఖికంగానూ అందించిన సమాచారం అధిష్ఠానదేవతకు ఆగ్రహం కలిగించింది.
ఇటీవల కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సభ్యులైన ముఖ్యనాయకులు సోనియా సమక్షంలో రెండు గంటల పాటు రాష్ట్ర వ్యవహారాలపైన సమాలోచన జరిపినట్టు వార్త వచ్చింది. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక పైనా, రాష్ట్ర భవిష్యత్తుపైనా సుదీర్ఘ చర్చలు జరిగి ఉంటాయని అందరూ భావించారు. అనంతర పరిణామాలను గమనిస్తే కోర్ కమిటీ చర్చ ప్రధానంగా జగన్ తిరుగుబాటును ఎట్లా అణచివేయాలన్న అంశంపైనే జరిగినట్టు కనిపిస్తోంది.

తుదకంటా పోరాడాలన్నదే అధిష్ఠానం నిర్ణయం. జగన్ అనుయాయులపైన చర్య తీసుకోవడమే అభిమతం. చేతనైతే ప్రభుత్వాన్ని పడగొట్టమంటూ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ జగన్ ను సవాలు చేయడం సైతం ఆయన స్వయంగా చేసిన పని కాకపోవచ్చు. అధిష్ఠానం ప్రణాళికలో భాగమే కావచ్చు. జగన్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీని చీల్చితే ప్రజారాజ్యం సభ్యలను ప్రభుత్వంలో చేర్చుకోవాలన్నది నిర్ణయం. ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి అటువంటి శుభసంకేతం కోసం శతసహస్ర నయనాలతో ఎదురు చూస్తున్నారన్నది ప్రజాభిప్రాయం. అప్పటికీ చాలకపోతే మజ్లీస్ మిత్రులు జో హుకుం అంటూ ఉండనే ఉన్నారు. జగన్ పట్ల శాసనసభ్యుల విధేయత ఊహించనంతగా పెరిగితే, ప్రజారాజ్యం, ఎంఐఎం మద్దతు సైతం పరిపోక ప్రభుత్వం పడిపోయే పరిస్థితే వస్తే రాష్ట్రంలో పరిపాలన బాధ్యతలు స్వీకరించడానికి గవర్నర్ నరసింహన్ సిద్ధంగా ఉన్నారు. ఈ నెల ప్రథమార్థంలోనే ఆయన రెండు సార్లు హస్తిన వెళ్ళివచ్చారు. నిరుడు అనేక పర్యాయాలు ఢిల్లీ పోయివచ్చారు. సోనియాను సందర్శించారు. నిజానికి ఆయన రాష్ట్ర గవర్నర్ గా ప్రమాణం చేసినప్పటి నుంచే పరిపాలనా బాధ్యతలకోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. రోశయ్య స్థానంలో కిరణ్ కుమార్ రెడ్డి పేరు ఖాయం కావడంలో నరసింహన్ పాత్ర సైతం ఎంతో కొంత ఉంది. జగన్ వ్యవహారాన్ని రోశయ్య లాగా నాన్చకుండా ఏదో ఒకటి తేల్చేయాలన్న అధిష్ఠానం సంకల్పానికి అనుగుణంగా ఈ మార్పులు జరుగుతున్నాయి. జగన్ పరాజయమో, నరసింహన్ కు రాజదండం అప్పగించడమో తేలిపోవాలన్నది ఢిల్లీ పెద్దల పట్టుదలగా కనిపిస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డికి పూర్తిగా మద్దతు ఇవ్వడం, జగన్ ను పూర్వపక్షం చేయడంలో ముఖ్యమంత్రి విఫలమైతే, ప్రభుత్వ నిర్వహణ సజావుగా సాగకపోతే రాష్ట్రపతి పాలన విధించి శాసనసభను సుప్తావస్థలో ఉంచడం కాంగ్రెస్ నాయకత్వం వ్యూహం. తెలంగాణ ఉద్యమం, జగన్ రాజకీయం అనే రెండు బెడదలకూ ఇది తాత్కాలిక పరిష్కారం అవుతుందనీ, పరిస్థితులు కుదురుకున్న తర్వాత రెండు సమస్యల శాశ్వత పరిష్కారంకోసం తీసుకోవలసిన చర్యల గురించి ఆలోచించవచ్చుననీ భావన.
(hmtv చీఫ్‌ ఎడిటర్‌ శ్రీ రామచంద్రమూర్తి గారు.. hmtv సంపాదకీయం 'హంసధ్వని' కోసం ఈ వ్యాసాన్ని 23-01-2011న రాశారు. మూర్తిగారి మరిన్ని వ్యాసాలు చూడాలనుకునే వారు www.hmtvhamsadhwani.blogspot.com క్లిక్‌ చేయండి.)

1 comment: