Thursday, January 13, 2011
బోఫోర్స్ : మన్మోహన్ వ్యక్తిత్వంపై మరో మరక
బోఫోర్స్ భూతం మరోసారి నిద్రలేచి వికటాట్టహాసం చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని నిద్రకు దూరం చేస్తోంది. అధినాయకురాలి ప్రతిష్ఠ మసకబారే ప్రమాదం ముంచుకొస్తోంది. మచ్చలేని నీతిమంతుడుగా ఇంతకాలం పేరు నిలబెట్టుకున్న ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యక్తిత్వంపైన మరో మరక పడుతోంది. స్వయంగా అవినీతికి ఒడిగట్టకపోయినప్పటికీ అవినీతిపరులకు కొమ్ముకాస్తున్న ప్రధానిగా మన్మోహన్ ను చరిత్ర బోను ఎక్కించనున్నది. దేశంలో అత్యున్నత పరిశోధన సంస్థ అయిన కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)పాలకుల చేతిలో ఆయుధమని ఇంకోసారి నిరూపించుకున్నది. నేరపరిశోధన చేయకుండా, అధికార పార్టీ లేదా అధికార కూటమి ప్రత్యర్థులను వేధించడానికీ, అస్మదీయులను రక్షించడానికీ అక్రమంగా పనిచేస్తున్న జేబు సంస్థగా తాజా ముద్ర వేయించుకున్నది.
సోనియాగాంధీకి అత్యంత సన్నిహితుడైన ఇటాలియన్ వ్యాపారి అట్టావియో కత్రోకీకి బోఫోర్స్ ముడుపులు ముట్టినట్టు ఇన్ కంటాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) ఈ నెల 3వ తేదీన ప్రకటించడంతో కాంగ్రెస్ నాయకులు దిగ్భ్రాంతి చెందారు. కత్రోకీకీ, సోనియా కుటుంబానికీ సంబంధాలు లేవంటూ బుకాయించడానికి దిగ్విజయ్ సింగ్, వీరప్పమొయిలీ వంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు నిస్సిగ్గుగా ప్రయత్నిస్తున్నారు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ఆడుతున్న నాటకాన్నే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడూ ప్రదర్శిస్తున్నది. ఐటీఏటీలో నిజాయితీపరులు లేకపోతే కత్రోకీ నిర్దోషిగా బయటపడేవాడు. బోఫోర్స్ కుంభకోణం కారణంగానే 1989లో రాజీవ్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఈ కారణంగానే విశ్వనాథ ప్రతాప్ సింగ్ నేషనల్ ఫ్రంట్ ప్రధాని కాగలిగారు. వీపీ సింగ్ కానీ ఆయన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రశేఖర్ కానీ, పీవీ నరసింహారావు కానీ, దేవెగౌడ, గుజ్రాల్ కానీ, అటల్ బిహారీ వాజపేయి కానీ, మన్మోహన్ సింగ్ కానీ బోఫోర్స్ గుట్టు రట్టు చేయలేకపోయారు. బోఫోర్స్ కుంభకోణంలో కత్రోకీతో పాటు ఆరోపణలు ఎదుర్కొన్న విన్ చఢాను దోషిగా నిర్ధారించడాన్ని ప్రభుత్వాలు అనుమతించాయి కానీ కత్రోకీకి మాత్రం రాచమర్యాదలు చేశాయి. అతగాడిమీద ఈగ కూడా వాలకుండా సీబీఐని కట్టడి చేశాయి. న్యాయస్థానాలకు వాస్తవాలు తెలియకుండా మాయ చేశాయి. బోఫోర్స్ కేసులో కీలకమైన పరిశోధన చేసిన సీబీఐ మాజీ డైరెక్టర్ జోగీందర్ సింగ్ ఈ విషయంలో విసిగి వేసారిపోయాడు. ‘సీబీఐ స్వతంత్ర సంస్థ అని ఎవరు చెప్పారు? అది ప్రభుత్వంలో భాగం. ప్రభుత్వం అనుమతి లేకుండా ఈ సంస్థ అప్పీలు పిటిషన్ సైతం దాఖలు చేయజాలదు. బోఫోర్స్ కేసులో అదే జరిగింది. మూడు సందర్భాలలో కోర్టు ఆదేశాన్ని సవాలు చేయడానికి ప్రభుత్వం సీబీఐకి అనుమతి మంజూరు చేయలేదు. ఈ కేసును పద్ధతి ప్రకారం ధ్వంసం చేశారు’ అంటూ ఇటీవల ఒక ఇంటర్వూలో ఆవేదన వెలిబుచ్చాడు జోగీందర్ సింగ్. ఈ కేసుకు సంబంధించిన పత్రాలు తీసుకురావడానికి జోగీందర్ స్వయంగా స్విట్జర్లాండ్ లోని బెర్న్ వెళ్ళివచ్చాడు. కత్రోకీకి ముడుపులు ముట్టాయని నిరూపించడానికి అవసరమైన సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ ఆయన వాదిస్తున్నాడు. రాజీవ్ ప్రధానిగా ఉండగా కత్రోకీ, ఆయన భార్య మారియా ప్రధాని అధికార నివాసానికి తరచుగా వచ్చేవారనీ, రాజీవ్ మరణం తర్వాత కూడా కత్రోకీ సోనియాగాంధీని ఇరవై ఒక్క సార్లు కలుసుకున్నాడనీ సీబీఐ నమోదు చేసిన వాగ్మూలంలో కత్రోకీ డ్రైవర్ శశి ధరణ్, సోనియా అంగరక్షకుడు నరేష్ చంద్ర గోసాయిన్ వెల్లడించారు. బోఫోర్స్ కేసు విచారణ జరుగుతున్న కాలంలోనూ కత్రోకీ కుటుంబం సోనియా కుటుంబం మధ్య రాకపోకలు సాగాయి. సోనియా తల్లి సావొలా మెయినోతోనూ, సోదరి మరౌచ్కాతోనూ కత్రోకీకి సన్నిహిత సంబంధాలు ఉండేవని కూడా సీబీఐ దర్యాప్తులో తేలింది. సమస్త సమాచారం ఉన్నప్పటికీ కత్రోకీని నిలదీయకుండా దేశం నుంచి వెళ్ళిపోవడానికీ, లండన్ బ్యాంకు నుంచి డబ్బు తీసుకోవడానికీ అవకాశం కల్పించింది సీబీఐ. కత్రోకీపైన కేసు మూసివేయడానికి సన్నాహాలు జరుగుతుండగా బోఫోర్స్ భూతం వెకిలిగా నవ్వింది. ఇటాలియన్ మధ్యదళారీ కత్రోకీ 41కోట్ల రూపాయల ముడుపులు ముట్టాయంటూ ఐటీఏటీ 22 సంవత్సరాల విచారణ తర్వాత మొన్న జనవరి 4న నిర్థారించింది. ఈ ముడుపులలో కొంత భాగాన్ని పనామాలోని బ్యాంకు ఖాతాకు బదిలీ చేసినట్టు కూడా ఆదాయం పన్ను వ్యవహారాల ఉన్నత సంస్థ స్పష్టం చేసింది. ఈ బ్యాంకు ఖాతా సోనియాగాంధీ కుటుంబ సభ్యులదంటూ భారతీయ జనతా పార్టీ ఆరోపణ చేస్తున్నది. ఈ ఆరోపణ న్యాయస్థానాలలో రుజువు కాకపోవచ్చు. సోనియాను కానీ ఆమె తోబుట్టువులను కానీ దోషులుగా నిర్ధారించలేకపోవచ్చు. కానీ చెరిగిపోయిందనుకున్న బోఫోర్స్ మచ్చ మళ్ళీ అకస్మాత్తుగా బయటపడి వికృతంగా కనిపిస్తోంది. నెహ్రూ-గాంధీ వంశంలో నాలుగో ప్రధానిగా రాహుల్ ను గద్దెనెక్కించడమే పరమావధిగా జీవిస్తున్న సోనియాపైనే ఆరోపణల మేఘాలు కమ్ముకుంటే, ప్రజల హృదయాలలో ఆమెపైన గౌరవం తగ్గిపోతే కాంగ్రెస్ కు తిరిగి రెండు వందల పైచిలుకు లోక్ సభ సీట్లు దక్కడం, యూపీఏ కూటమి మూడో సారి ప్రభుత్వం ఏర్పాటు చేయడం, దానికి రాహుల్ నాయకత్వం వహించడం సాధ్యమా? కామన్ వెల్త్ గేమ్స్ కుంభకోణం, టూజీ స్పెక్ట్రమ్ మహాకుంభకోణం చాలవన్నట్టు బోఫోర్స్ భూతం అమాంతంగా కాంగ్రెస్ అధిష్ఠానం నెత్తినెక్కి నాట్యం చేస్తోంది. సోనియాకూ, రాహుల్ కూ, వారిద్దరిపైనే ఆధారపడిన కాంగ్రెస్ కూ కష్టకాలం దాపురించిందనుకోవాలి.
ఇక నీతిమంతుడుగా, నిజాయితీపరుడుగా ఇంతకాలం ప్రపంచవ్యాప్తంగా గౌరవం పొందుతున్న మన్మోహన్ పరిస్థితి మరీ దయనీయం. కత్రోకీపైన కేసును నీరు కార్చే ప్రక్రియను మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పర్యవేక్షించడం వల్ల ఆయన ఈ వ్యవహారంలో తప్పుకోవడానికి అవకాశం లేదు. సాక్ష్యాధారాలు లేని కారణంగా కత్రోకీ ప్రాసిక్యూషన్ ను విరమించుకుంటున్నట్టు 2009 సెప్టెంబరులో మన్మోహన్ సింగ్ సర్కార్ సుప్రీంకోర్టుకు చెప్పింది. వాజపేయి ప్రధానిగా ఉండగా 2003లో ప్రభుత్వం ఒత్తిడి కారణంగా లండన్ లో కత్రోకీ బ్యాంకు ఖాతాను స్తంభింపజేశారు. 2006లో మన్మోహన్ ప్రధానిగా ఉండగా ఆంక్షలు ఎత్తివేసి లండన్ బ్యాంక్ ఖాతాకు తిరిగి ప్రాణం పోసింది. ఆ ఖాతా నుంచి కత్రోకీ 21కోట్ల రూపాయలు తీసుకోవడానికి వీలు కల్పించింది. కత్రోకీపైన రెడ్ కార్నర్ నోటీసును ఉపసంహరించుకోవలసిందిగా సీబీఐకి 2008 అక్టొబర్ లో నాటి అటార్నీ జనరల్ మిలన్ బెనర్జీ సలహా ఇచ్చాడు. ఈ పనులన్నీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆమోదం లేకుండా జరిగేవి కావు. పనామా బ్యాంకు ఖాతా ఎవరిదో సీబీఐకి తెలుసు. ప్రధానికి తెలుసు. కానీ కోర్టులకు తెలియదు. ప్రజలకు తెలియదు. కత్రోకీకి ముడుపులు చెల్లించిన మాట నిజమంటూ ట్రిబ్యూనల్ ప్రకటించిన తర్వాత కత్రోకీని రక్షించడానికీ, దేశం నుంచి సురక్షితంగా సాగనంపడానికీ, అతడు ముడుపుల సొమ్మును బ్యాంకు నుంచి తీసుకోవడానికీ, అతనిపైన కేసు ఎత్తివేయడానికీ సహకరించిన ప్రభుత్వం అప్రతిష్ఠపాలు కాకుండా ఉంటుందా? ప్రభుత్వాన్ని నడుపుతున్న మన్మోహన్ సింగ్, ఆయనను నడుపుతున్న సోనియాగాంధీ పట్ల ప్రజల విశ్వాసం కొనసాగుతుందా?
ఉన్నత స్థాయిలో ఉన్న ఇద్దరు నేతలతో పాటు ఉన్నత స్థాయి దర్యాప్తు సంస్థ సైతం అప్రతిష్ఠపాలు కావడం విశేషం. బోఫోర్స్ కుంభకోణంలో కత్రోకీని రక్షించడానికీ, పనామా బ్యాంకు ఖాతాదారుల వివరాలు గోప్యం ఉంచడానికీ ప్రయత్నించి విశ్వసనీయతను కోల్పోయిన సీబీఐ మరికొన్ని కేసులలో కూడా ప్రభుత్వానికీ, పాలకవర్గానికీ లొంగి దర్యాప్తు చేయకుండా వాస్తవాలను సమాధి చేసింది. ఆరుషి, హేమరాజ్ హత్య కేసు, రుచిక గిర్హోత్రా ఆత్మహత్య కేసు, 1984 నాటి సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ నాయకుడు జగదీశ్ టైట్లర్ పాత్రను నిర్ధారించే కేసు వంటి కేసులలోనూ సీబీఐ పాత్ర శోభాయమానంగా లేదు. జుగుప్సాకరంగా, అవమానకరంగా ఉంది. ఆరుషి హత్య కేసులో హంతకులను పట్టుకోకపోగా దంతవైద్యుడు తల్వార్ కుటుంబాన్ని అనవసరంగా బజారుకు ఈడ్చి సీబీఐ అదనంగా అపకీర్తి మూటకట్టుకుంది. బహుజన సమాజ్ నేత మాయావతినీ, సమాజ్ వాదీ అధ్యక్షుడు ములాయం సింగ్ నీ, జనతాదళ్ నాయకుడు లాలూప్రసాద్ నీ బెదిరించి లొంగదీసుకోవడానికి సీబీఐని ఒక సాధనంగా యూపీఏ నాయకత్వం వినియోగించుకుంటున్నది. యూపీఏకి విధేయంగా ఉన్నంత కాలం మాయావతిపైన కేసులు కానీ ములాయంపైన కేసులు కానీ లాలూపైన కేసులు కానీ ముందుకు సాగవు. యూపీఏ తో విభేదించి ప్రతిపక్ష శిబిరంలో చేరిన వెంటనే వారిపై కేసులు మళ్ళీ మొదలవుతాయి. ఈ బాగోతాన్ని దేశ ప్రజలు గమనిస్తున్నారు. విదేశీ జర్నలిస్టులు, రచయితలు సైతం సీబీఐ నిర్వాకంపైన విమర్శలు గుప్పిస్తున్నారు. సీబీఐని భ్రష్టుపట్టించిన ఘనత కూడా యూపీఏ సర్కార్ కే దక్కుతుంది.
అవినీతిని అరికట్టవలసిన యూపీఏ అధ్యక్షురాలు, ప్రధాని, సీబీఐ అవినీతితో రాజీపడితే ఈ దేశానికి నిష్కృతి ఉంటుందా? అవినీతి ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాంగ్రెస్ అగ్రనాయకత్వం యూపీఏ సర్కార్ ను సరైన మార్గంలో నడిపించగలుగుతుందా? టూజీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై విచారణకు పార్లమెంటు సంయుక్త సంఘాన్ని-జేపీసీని- నియమంచడానికి అంగీకరించకపోతే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయా? ఈ పరిస్థితులు మధ్యంతర ఎన్నికలకు దారి తీస్తాయా? మధ్యంతర ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కు మెజారిటీ రాదని ఇప్పటికే సర్వేలు చెబుతున్నాయి. యూపీఏ సర్కార్ పైన వచ్చిన అవినీతి ఆరోపణలనే అస్త్రాలుగా చేసుకొని ప్రచార యుద్ధం సాగించాలని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గం ఇటీవల గువాహతి సమావేశంలో నిర్ణయించింది. ఏ కోణం నుంచి చూసినా కాంగ్రెస్ కు పరిస్థితులు సానుకూలంగా కనిపించడం లేదు. బోఫోర్స్ భూతం మరో సారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కబళించనున్నదా? రాజీవ్ గాంధీని గద్దె దింపిన బోఫోర్స్ భూతం ఆయన కుమారుడు రాహుల్ 2014లో అనుకున్న ప్రకారం గద్దెనెక్కకుండా అడ్డుపడుతుందా?
Subscribe to:
Post Comments (Atom)
విజయ్ గారు,
ReplyDeleteచాలా మంచి పోస్ట్ . ఇంతవరకూ, నాకు సోనియా తల్లి, సోదరి పేర్లు తెలియదు. తెలియజెప్పినందుకు ధన్యవాదాలు. మీ శబరిమల యాత్రావిషయాలు తెలియజేయగలరు.
~శశిధర్ సంగరాజు
www.sasidharsangaraju.blogspot.com