Monday, January 3, 2011

ప్రజల మనీషి.. కన్నబిరాన్‌


న్యాయవాదులు చాలా మంది ఉన్నారు. రెండు చేతులా అదేపనిగా గడిస్తున్న క్రిమినల్ లాయర్లు ఉన్నారు. రాజకీయ నాయకుల ప్రాపకంతో న్యాయమూర్తులుగా పదవులు సంపాదించినవారున్నారు. ఆ పదవులను వినియోగించుకొని కోట్లకు పడగలెత్తినవారున్నారు. వీరిలో చాలామందిని సమాజం గౌరవించదు. ఇందుకు భిన్నంగా న్యాయంకోసం, ధర్మంకోసం మడమ తిప్పకుండా నిలిచి పోరాడి ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నవారు బహుకొద్దిమంది ఉంటారు. అటువంటి సిసలైన ప్రజాన్యాయవాదులలో అగ్రగణ్యుడు గురువారంనాడు కన్నుమూసిన కన్నబిరాన్. న్యాయవాద వృత్తికి వన్నె తెచ్చినవాడు, న్యాయవాద వృత్తిని సార్థకం చేసినవాడు కందాళ గోపాలస్వామి కన్నబిరాన్.

రాజ్యాంగ స్ఫూర్తిని బాగా వంటబట్టించుకున్న హక్కుల యోధుడు ఆయన. రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించడమే కర్తవ్యంగా నిర్దేశించుకున్ననూటికి నూరు పాళ్ళు ప్రజాస్వామ్యవాది. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రత్యక్షమై కత్తిదూసిన సమరశీలుడు. నిరుపేదలకూ, దుర్బలులకూ న్యాయభిక్ష పెట్టిన ధీశాలి. బడుగుల పక్షాన పోరాడే క్రమంలో పాదరసం వంటి బుర్రనూ, అపారమైన న్యాయశాస్త్ర పరిజ్నానాన్నీ, అద్భుతమైన వాక్పటిమనూ, అసాధారణమైన సమయస్ఫూర్తినీ, సహజసిద్ధమైన సత్యాగ్రహాన్నీ, నిరుపమానమైన నిర్భీతినీ ఆయుధాలుగా చేసుకున్న అతిరథుడు. విచారణ లేకుండా జైళ్ళలో మగ్గుతున్న వందలాదిమందికి విముక్తి ప్రసాదించిన పేదలపాలిట దేవుడు.

ఆంధ్రప్రదేశ్ లో హక్కుల కార్యకర్తలపైనా, విరసం నాయకులపైనా, బడుగువర్గాలకు చెందిన అనేక మందిపైనా పోలీసులు పెట్టిన కుట్రకేసులను తన వాదనతో పటాపంచలు చేయడమే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పలు కేసులలో కన్నబిరాన్ డిఫెన్స్ లాయర్ గా వ్యవహరించారు. పార్లమెంటు మీద ఉగ్రవాదుల దాడి కేసులో, కోయంబత్తూరు బాంబు పేలుళ్ళ కేసులో, మదురైలో ఆర్ ఎస్ ఎస్ భవనం పేల్చివేత కేసులో, వీరప్పన్ అనుచరులపైన టాడా కేసులో, తమిళ పులుల నాయకుడు కిట్టూ కేసులో ఆయన వాదించారు. కారంచేడు, చుండూరు వంటి కేసులలోనూ, రామనగర్ కుట్ర కేసుల వంటి కేసులలోనూ తాను వాదించడమే కాకుండా అటువంటి కేసులలో వాదించడానికి అనేకమంది యువన్యాయవాదులకు శిక్షణ ఇచ్చారు. విచారణ లేకుండా నిర్బంధంలో ఉన్నవారి రాజకీయ సిద్ధాంతాలతో, నేపథ్యంతో నిమిత్తం లేకుండా రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కును కాపాడటంకోసం జీవితం అంకితం చేసిన న్యాయవాది కన్నబిరాన్.


రాజకీయ పార్టీలతో కానీ సైద్ధాంతిక విభేదాలతో కానీ ప్రమేయం లేకుండా ఎవరికి అన్యాయం జరిగినా ఎదిరించేవారు. ఆత్యయిక పరిస్థితిలో అన్ని పార్టీల నాయకుల పరఫునా అనేక హెబియస్ కార్పస్ పిటిషన్లు దాఖలు చేసి వాదించారు. చమత్కార భాషణంలో, వాగ్బాణాలు సంధించడంలో, ప్రత్యర్థి ఆత్మవిశ్వాసాన్ని తునాతునకలు చేయడంలో కన్నబిరాన్ ది ప్రత్యేక శైలి. రౌడీషీటర్ గా పేరుమోసిన కొత్తదాస్ తరఫున వాదించడాన్ని ఆక్షేపించిన ఒక న్యాయమూర్తితో ‘ఎవరికి తెలుసు మిలార్డ్, ఆయన ఏదో ఒక రోజున మన ముఖ్యమంత్రి కావచ్చు’ అంటూ కన్నబిరాన్ చేసిన వ్యాఖ్య నేరప్రపంచానికీ, రాజకీయరంగానికీ మధ్య బలపడుతున్న అపవిత్రబంధంపైన ఖడ్గప్రహారం.


రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఎవరు వ్యవహరించినా కన్నబిరాన్ సహించేవారు కాదు. ప్రధాని కావచ్చు. ముఖ్యమంత్రి కావచ్చు. ప్రధాన న్యాయమూర్తి కావచ్చు. న్యాయవాది కావచ్చు. ఐఏఎస్ అధికారి కావచ్చు. బడా పారిశ్రామికవేత్త కావచ్చు. కార్మిక నాయకుడు కావచ్చు. నక్సలైటు లేదా మావోయిస్టు కావచ్చు. ఎవ్వరినీ వదిలేది లేదు. అవతలి వ్యక్తి హోదా కానీ, సంపద కానీ, నేపథ్యం కానీ ఆయనపై ప్రభావం వేసేవి కావు. భయమూ, వెరపూ లేని నైజం ఆయనది. రాజ్యాంగ పీఠికనూ, ప్రాథమిక హక్కులనూ, ఆదేశిక సూత్రాలనూ త్రికరణశుద్ధిగా పాలకులూ, పౌరులూ గౌరవించడం ప్రజాస్వామ్యంలో పరమావధి అన్నది ఆయన ప్రగాఢమైన విశ్వాసం. కన్నబిరాన్ ఎవరి తరఫున వాదించినా, ఏమని వాదించినా, ఎటువంటి వ్యాఖ్యలు చేసినా రాజ్యాంగ స్ఫూర్తిని జవదాటిన సందర్భం లేదు. బూటకపు ఎన్ కౌంటర్ ను ఏ విధంగా వ్యతిరేకించేవారో ఇన్ ఫార్మర్ అనే ఆరోపణతో పౌరులను నక్సలైట్లు చంపివేయడాన్నీ, ఎత్తుగడగా ప్రముఖులను అపహరించడాన్ని కూడా అంతే గట్టిగా వ్యతిరేకించేవారు. ప్రభుత్వాల అప్రజాస్వామిక ధోరణులకూ, పోలీసు వ్యవస్థ దాష్టీకానికీ, బలవంతుల అక్రమాలకూ, దౌర్జన్యాలకూ, అత్యాచారాలకీ వ్యతిరేకంగా పోరాడటంలో రాజీపడని న్యాయవాది కన్నబిరాన్. అన్యాయానికి గురి అయిన పేదవారి తరఫున వకాల్తా తీసుకొని ఫీజు లేకుండా వాదించడం, న్యాయం జరిగేవరకూ పోరాడటం ఆయనను పేదల పాలిట పెన్నిధిని చేశాయి. ముఖ్యంగా పౌరహక్కుల పరిరక్షణకోసం పోరాడుతున్న కార్యకర్తలను పోలీసులు నిర్బంధించిన సందర్భాలలో, వేధించిన సమయాలలో బాధితులకు కన్నబిరాన్ కొండంత అండగా నిలిచారు. అందుకే ఆయనను హక్కుల ఉద్యమానికి పెద్ద దిక్కుగా అభివర్ణించడం, అభినందించడం, ఆరాధించడం.

పదహారు మాసాలలో ముగ్గురు దీనజనబాంధవులు మరణించారు. బాలగోపాల్, శంకరన్, కన్నబిరాన్. ముగ్గురూ ముగ్గురే. మహోన్నతులు. పేదలకోసం, పీడితులకోసం, తాడితులకోసం జీవితాలను సంపూర్ణంగా అంకితం చేసిన మహానుభావులు. ఎవరి మార్గంలో వారు మానవీయ విలువలకు పట్టం కట్టినవారు. అటువంటి వ్యక్తులు అరుదుగా ఆవిర్భవిస్తారు. విపణి ప్రేరిత ఆర్థిక విధానాలు రాజ్యం చేస్తున్న తరుణంలో సమష్టితత్వం, సంఘీభావం, ఉద్యమస్వభావం లుప్తమౌతున్న రోజులలో, మనిషినీ, మానవత్వాన్నీ గాలికి వదిలి స్వార్థ ప్రయోజనాలనూ, కాసునూ కొలిచే హీన సంస్కృతి బలపడుతున్న పాడుకాలంలో మరో కన్నబిరాన్, మరో బాలగోపాల్, మరో శంకరన్ మన నేలపైన తిరుగాడుతారా? పౌరహక్కులనూ, మానవహక్కులకూ, మానవీయ విలువలకూ పూచీగా నిలబడతారా? కన్నబిరాన్ వదిలి వెళ్ళిన కాడిని భుజాన వేసుకుంటారా? అధోజగత్సహోదరులనూ, ప్రజాస్వామ్యవాదులనూ, మానవతావాదులనూ వేధిస్తున్న ప్రశ్నలివి.


(శ్రీరామచంద్రమూర్తి గారు, ఈ వ్యాసాన్ని hmtv సంపాదకీయం "హంసధ్వని" కోసం 02-01-11న రాశారు. వీరి మరిన్ని వ్యాసాలు చూడాలనుకుంటే.. www.hmtvhamsadhwani.blogspot.com క్లిక్‌ చేయండి)

No comments:

Post a Comment