దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అంటూ నవయుగ వైతాళికుడు గురజాడ చేసిన ప్రబోధం విలువైనది. వెలలేనిది. ఈ ప్రబోధాన్ని ఎవరు విస్మరించినా అవివేకమే. ఆత్మహత్యాసదృశమే. ఏక్తా యాత్ర పేరుతో శ్రీనగర్ వెళ్ళి లాల్ చౌక్ లో గణతంత్ర దినోత్సవం నాడు త్రివర్ణపతాకాన్ని ఎగురవేయాలన్న భారతీయ జనతా పార్టీ యువజన విభాగం నాయకుల సంకల్పం ఆందోళన కలిగిస్తున్నది. కథ మళ్ళీ మొదటికి వస్తున్నందుకు ఖేదం కలుగుతున్నది. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం దేశభక్తికి నిదర్శనం. భారత దేశంలో ఎక్కడైనా మూడురంగుల జెండాను ఎగువేసే స్వేచ్ఛ దేశప్రజలందరికీ ఉంది. ముఖ్యంగా కశ్మీర్ మిలిటెంట్లు ఉద్యమం ఉధృతంగా ఉన్న రోజుల్లో పాకిస్తాన్ పతాకాన్ని ఎగురవేసిన లాల్ చౌక్ లో మూడు వన్నెల జెండాను ఎగురువేసి దేశభక్తిని చాటుకోవడంలో తప్పు లేదు. కశ్మీరీలు భారతీయులనీ, జమ్మూ-కశ్మీర్ భారత దేశంలో భాగమనీ చాటడానికి ఇది మంచి సందర్భం. ఇదీ భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాయకుల వాదన.
కశ్మీర్ భారత్ లో భాగమని నిరూపించడం ఎట్లా? అంతర్జాతీయ వేదికలపైన నిరంతరం వాదించడం ద్వారానా? శ్రీనగర్ లో మట్టిని నెత్తిన పెట్టుకొని ఈ భూమి నాది, ఈ దేశం నాది అంటూ నినాదాలు చేయడం ద్వారానా? కశ్మీర్ లో జరుగుతున్న పరిణామాలను జాతికి తెలియకుండా దాచడం ద్వారానా? లాల్ చౌక్ లో జాతీయ జెండాను ఆగస్టు పదిహేనో తేదీనో, జనవరి ఇరవై ఆరవ తేదీనో ఎగురవేసి భారతమాతాకీ జై అంటూ నినదించడం ద్వారానా? కశ్మీర్ లో భారత దేశంలో భాగమనడానికి తిరుగులేని రుజువు ఏమిటి? ఏమి చేస్తే అటువంటి రుజువు లభిస్తుంది. భాజపా యువజన నేతలు పోలీసు బందోబస్తుతో శ్రీనగర్ వెళ్ళి లాల్ చౌక్ లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తే కశ్మీర్ భారత దేశంలో విడదీయలేని భాగమని లోకం విశ్వసిస్తుందా? కశ్మీర్ భారత్ అంతర్భాగమని ప్రపంచం నమ్మాలంటే ఏమి చేయాలి? కశ్మీర్ లోయలోని ప్రజలు స్వాతంత్ర్య దినోత్సవాన్నీ, గణతంత్రదినోత్సవాన్నీ పండుగ వాతావరణంలో జరుపుకోవాలి. ఐచ్ఛికంగా, ఆనందంగా, ఉత్సాహంగా లాల్ చౌక్ లో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతం మనసారా సగౌరవంగా ఆలపించాలి. అటువంటి శుభవేళకోసం దేశప్రజలు వేచి ఉండాలి. అటువంటి ఉత్కృష్టమైన సన్నివేశం ఆవిష్కృతం కావాలంటే భారతీయ జనతా పార్టీకి చెందిన మహోన్నత నాయకుడు అటల్ బిహారీ వాజపేయి చూపించిన దారిలో ప్రయాణం చేయాలి.
హెచ్ ఎంటీవీ బృందం ఇటీవల కశ్మీర్ లో పర్యటించినప్పుడు అక్కడి ముఖ్యనాయకులనూ, సాధారణ ప్రజలనూ ఒక ప్రశ్న అడిగింది. భారత దేశాన్ని పరిపాలించిన ప్రధాన మంత్రులలో మీకు నచ్చిన ప్రధాని ఎవరన్నది ఆ ప్రశ్న. దాదాపు అందరు నాయకులూ ఒకే సమాధానం ఇచ్చారు. సాధారణ ప్రజలు అదే జవాబు చెప్పారు. హురియత్ నాయకులు సయ్యద్ అలీ షా గిలానీ, మీర్వాయిజ్ ఒమర్ ఫారూఖ్ నుంచి పీడీపీ నాయకుడు నయీమ్ అఖ్తర్ వరకూ మొదట జవహర్ లాల్ నెహ్రూ పేరు చెప్పి వెంటనే వాజపేయి పేరు చెప్పారు. సాధారణ పౌరులలో చాలామంది వాజపేయి పేరు మాత్రమే చెప్పారు. కశ్మీర్ లో వాజపేయి ప్రతిష్ఠ ఆశ్చర్యం కలిగించింది. రాజ్యాంగపరిధిలో కశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుక్కుంటామంటూ భారత ప్రధానులూ, విదేశాంగ మంత్రులూ, ఇతర నాయకులూ అరిగిపోయిన రికార్డులాగా చేసిన ప్రకటనలను పూర్వపక్షం చేశారు వాజపేయి. మానవత్వం పరిధిలో కశ్మీర్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానంటూ అటల్ జీ చేసిన ప్రకటన కశ్మీర్ ప్రజల హృదయాలకు హత్తుకుంది. వాజపేయి కశ్మీర్ విధానాన్ని కొత్త పుంతలు తొక్కించారు. ఆయన ప్రధానిగా జమ్మూ-కశ్మీర్ ను సందర్శించారు. ప్రజల బాధల గాధలు ఆలకించి చలించిపోయారు. కవిత్వ రూపంలో సానుభూతి తెలిపారు. సంఘీభావం ప్రకటించారు. ఒక మానవతావాదిగా కరడుగట్టిన కశ్మీరీ మిలిటెంట్లకు సైతం అర్థమైనారు. కశ్మీర్ ప్రజలలో ఒక ఆశను రేకెత్తించారు. అందమైన భవిష్య చిత్రాన్ని చూపించారు. అటువంటి విలువైన వాజపేయి వారసత్వాన్ని యమునానదిలో కలిపే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రస్తుత నాయకత్వం వ్యవహరిస్తోంది. వాజపేయి కశ్మీర్ విధానం అమలులో ఆయన కుడిభుజంగా, దేశీయాంగమంత్రిగా తనవంతు కర్తవ్యాన్ని సమర్థంగా నిర్వహించిన లాల్ కృష్ణ అద్వానీ ఇప్పుడు వాజపేయి విధానానికి సమాధి కట్టడం అత్యంత బాధాకరం. బహుశా అందుకే అద్వానీ రాజనీతిజ్ఞుడుగా పేరు తెచ్చుకోలేకపోయారు. వాజపేయి తర్వాత సమున్నత నాయకుడిగా దేశ ప్రజల అభిమానాన్నీ, పార్టీ కార్యకర్తల విశ్వాసాన్నీ అందుకే పొందలేకపోయారేమో. వాజపేయి వారసత్వాన్ని కొనసాగించి ఉంటే... అద్వానీ, ఇతర భాజపా నాయకులు దేశానికి గొప్ప సేవ చేసి ఉండేవారు. కశ్మీర్ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచేవారు. కశ్మీర్ సమస్య శాశ్వత పరిష్కారానికి దోహదం చేసేవారు. భారత ఉపఖండంలో శాంతి స్థాపనలో కీలకమైన భూమికను పోషించేవారు. భారత దేశ అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటగలిగేవారు. ద్విజాతి సిద్ధాంతంలో పసలేదని మరోసారి నిరూపించగలిగేవారు.
నిరుడు వేసవిలో రాళ్ళు రువ్వుతున్న యువకులను సైన్యం కాల్చి చంపినప్పుడు భాజపా నాయకత్వం నిరసర ప్రకటించి ఉంటే బాగుండేది. నూటా పన్నెండు మంది యువకుల మృతికి దారితీసిన ఘటనలపైన పార్లమెంటులో చర్చకోసం పట్టుబట్టి ఉంటే ఒక జాతీయ ప్రతిపక్షంగా భాజపా తన కర్తవ్యాన్ని నిర్వర్తించి ఉండేది. అద్వానీ, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ వంటి వరిష్ఠ నాయకులు కశ్మీర్ లోయకు వెళ్ళి చనిపోయిన పిల్లల తల్లులనూ, ఇతర కుటుంబ సభ్యులనూ పరామర్శించి ఉంటే కశ్మీర్ లోయలో ఒక మహత్తరమైన లౌకికవాతావరణం ఏర్పడి ఉండేది. వేసవి అల్లర్ల తర్వాత నెలకొన్న శాంతియుత వాతావరణాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన యూపీఏ ప్రభుత్వం, ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ సిగ్గుతో తలవంచుకోవలసి వచ్చేది. కష్టాలలో ఉన్న కశ్మీరీలకు భాజపా నాయకులు సంఘీభావం ప్రకటించి ఉంటే గణతంత్ర దినోత్సవం నాడు భాజపా నాయకులతో కలిసి కశ్మీరీలు లాల్ చౌక్ లోనే జెండావందనం జరుపుకునేవారు. ఒక మంచి అవకాశాన్ని భాజపా నాయకులు చేజార్చుకున్నారు. ఒక మంచి వారసత్వాన్ని చేజేతులా వదులుకున్నారు. ఒక మంచి భవిష్యత్తును అవివేకంగా కాలదన్నుకున్నారు. దేశమంటే మనుషులనే విశ్వాసం ఉంటే భాజపా నాయకులు ఈ విధంగా వ్యవహరించేవారు కాదు. కశ్మీర్ భూఖండం పైన ఉన్న ప్రేమ కశ్మీరీల పైన లేదు.
కశ్మీర్ ప్రజలు పరాయీకరణ చెందడానికి కారకులు ఎవరో భారతీయులందరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి. తాము భారత దేశంలో భాగం కాదంటూ కశ్మీరీలు భావించడం సగటు భారతీయులకు మనోవేదన కలిగిస్తుంది. ఇది సహజం. భారత దేశంలో తాము భాగమని కశ్మీరీలు తలపోయడం లేదు సరే. మరి భారతీయుల మాటేమిటి? కశ్మీరీలు భారత దేశంలో భాగమని భారతీయులందరూ భావిస్తున్నారా? ఆ విధంగా భావిస్తుంటే కశ్మీర్ లో సైన్యం పదఘట్టనలో ప్రజలు నలిగిపోతుంటే. రాళ్ళు రువ్వుతున్న కుర్రాలను పోలీసులు నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపుతుంటే పౌరసమాజం భారత స్పందించలేదు ఎందుకని? ప్రఖ్యాత రచయిత్రి, సామాజిక కార్యకర్త అరుంధతీరాయ్ కశ్మీర్ వెళ్ళి అక్కడి ప్రజల దుర్భర జీవితాల గురించి ప్రపంచానికి చాటే వరకూ కశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘనను ఎవ్వరూ ప్రశ్నించలేదు ఎందుకని? తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు చంద్రశేఖరరావు నిరాహారదీక్ష విరమించకపోతే తెలంగాణలో హింసాకాండ జరుగుతుందనే భయంతో దేశీయాంగ మంత్రి తెలంగాణ విధానాన్ని హడావుడిగా అర్ధరాత్రి ప్రకటించారు. గుజ్జర్లు హింసాత్మక ఉద్యమం కొద్ది రోజులు నిర్వహించే సరికి ఉద్యమ నాయకులను సర్కార్ చర్చలకు ఆహ్వానించింది. కానీ కశ్మీర్ సమస్య పరిష్కరానికి చర్చలు జరపాలంటూ ఎంతమంది నాయకులు విన్నపాలు చేసినా, ప్రజలు ఎన్ని ఉద్యమాలు చేసినా దేశ నాయకులు పట్టించుకోలేదు. సైన్యం నీడలో బతకలేమంటూ కశ్మీరీలు చేస్తున్న ఘోషను వినిపించుకునే నాధుడు లేడు. సైన్యాన్ని తగ్గిస్తామంటూ దేశీయాంగ కార్యదర్శి పిళ్ళై ప్రకటిస్తే అటువంటి అవకాశమే లేదంటూ మరునాడే రక్షణ మంత్రి పోటీ ప్రకటన చేశారు. సాయుధ బలగాల(ప్రత్యేక అధికారాల)చట్టాన్ని సవరించాలని యోచిస్తున్నట్టు హోంమంత్రి చెబితే అటువంటి ప్రతిపాదనను తాను ఎన్నటికీ ఆమోదించేది లేదంటూ సైన్యాధిపతి వెంటనే స్పష్టం చేశారు. పరస్పర విరుద్ధమైన ప్రకటనలూ, చర్యలూ ఆనవాయితీగా మారాయి. భారత ప్రభుత్వానికి కశ్మీర్ వ్యవహారంలో ఒక విధానం అంటూ లేదనడానికి ఇది నిదర్శనం. మన్మోహన్ సింగ్ కు కానీ సోనియాకి కానీ దార్శనికత లోపించిందనడానికి ఈ పరిణామాలే సాక్ష్యం. నిజానికి యూపీఏ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో వాజపేయి వారసత్వాన్ని కొనసాగించే ప్రయత్నం నిజాయితీగా చేసినట్టు కనిపించింది. శ్రీనగర్, ముజాఫరాబాద్ మధ్య బస్సు సర్వీసులను ప్రారంభించడంలో యూపీఏ సర్కార్ పట్టుదలగా వ్యవహరించింది. మిలిటెంట్ల బెదిరింపులకు లొంగకుండా గట్టిగా నిలిచింది. ఆ తర్వాత హురియత్ నాయకులతో చర్చలకోసం మన్మోహన్ సింగ్ తీసుకున్న చొరవ ఫలించలేదు. ఢిల్లీలో, శ్రీనగర్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశాలను హురియత్ నాయకులలో అత్యధికులు బహిష్కరించారు. అంతటితో మన్మోహన్ ఆగిపోయారు. కశ్మీర్ లో పరిస్థితులు క్రమంగా దిగజారాయి. నిరుడు వేసవి పరిణామాల తర్వాత పార్లమెంటు సభ్యలు బృందాన్ని తీసుకొని హోంమంత్రి చిదంబరం కశ్మీర్ లో పర్యటించారు. అప్పుడు శ్రీనగర్ పౌరులు మెత్తబడినట్టు కనిపించారు. అఖిలపక్ష బృందం పర్యటన తర్వాత మరో ఉన్నత స్థాయి బృందాన్ని పంపించి చర్చలు ప్రారంభించి ఉంటే పరిస్థితి సానుకూలంగా మారేదేమో. ఆ పని చేయకుండా ప్రముఖ జర్నలిస్టు దిలీప్ పాడ్గాంకర్ నాయకత్వంలో ముగ్గురు సభ్యుల బృందాన్ని నియమించడం శాంతిప్రియులకు నిరాశ కలిగించింది. ఈ బృందం సభ్యుల వ్యక్తిగత చొరవతో, సుహృద్భావంతో కొంతమందిని కలుసుకొని మాట్లాడగలిగారు. కానీ ప్రయోజనం పరిమితం. కశ్మీర్ సమస్య అత్యంత జటిలమైనది. ఒక వైపు భారత ప్రభుత్వాల వరుస తప్పిదాలు. మరో వైపు పాకిస్తాన్ భూభాగం నుంచి ఉగ్రవాదుల అగడాలు. ఇంకోవైపు కశ్మీరీ నాయకుల కపట ధోరణి. నాలుగో అంశం పాకిస్తాన్ మొడితనం. పీటముడి పడిన కశ్మీర్ సమస్యను పరిష్కరించాలంటే అపారమైన నేర్పూ, ఓర్పూ కావాలి. అద్వానీ వంటి అనుభవజ్ఞుడైన నాయకుడు ఈ వ్యవహారంలో ఈ దశలో చొరవ తీసుకొని ఉంటే, భారత రాజకీయ నాయకత్వానికి దారి చూపించి ఉంటే చరిత్రలో శాశ్వత స్థానం సంపాదించుకునేవారు. ఆ పని చేయకుండా శ్రీనగర్ లాల్ చౌక్ లో జాతీయ జెండా ఎగురవేయడాన్ని ఒక వివాదం చేసి అందులో వర్థిల్లాలని, దేశభక్తిని రాజకీయ లబ్ధికి వినియోగించుకోవాలనీ విఫలయత్నం చేయడం విషాదం. వాజపేయి సజీవంగా ఉండగానే ఆయన వారసత్వాన్ని మంటకలపడం క్షంతవ్యం కాని నేరం. ఏక్తా యాత్ర పేరుతో అనైక్యతకు బాటలు వేయడం జాతికి చేస్తున్నతీరని అపచారం.
(ఈ వ్యాసాన్ని శ్రీ రామచంద్రమూర్తి hmtv సంపాదకీయం "హంసధ్వని" కోసం 25-01-2011న రాశారు. శ్రీ మూర్తిగారి మరిన్ని వ్యాసాలు చూడాలనుకుంటే.. www.hmtvhamsadhwani.blogspot.com క్లిక్ చేయండి)
No comments:
Post a Comment