Thursday, September 2, 2010

పావురాల గుట్ట గుర్తుకొస్తోంది...

సెప్టెంబర్ రెండు... వైఎస్ రాజశేఖరరెడ్డి దివంగతుడైన రోజు. ఆయన అనుచరులకు, అభిమానులకు తీరని వేదనను మిగిల్చిన రోజు.
అయితే నాకు మాత్రం చాలా విచిత్రమైన అనుభవాలను మిగిల్చిన రోజు. ఓ మహానేత మరణం నాలోని మనిషిని వేదనకు గురిచేసినా.. జర్నలిస్టుగా.. నాకు ఒక పరిపూర్ణతను, సవాళ్లను అధిగమించేందుకు మరింత ఆత్మవిశ్వాసాన్ని.. మరెన్నో విశిష్టతలను మిగిల్చిన రోజది.
సెప్టెంబర్ 2, 2009 : ప్రజల కష్టసుఖాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు.. ముందస్తు సమాచారం ఇవ్వకుండా, గ్రామాలకు వెళ్లేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి రూపొందించుకున్నవిభిన్న కార్యక్రమం రచ్చబండ. సెప్టెంబర్ రెండో తేదీన చిత్తూరు జిల్లా అనుప్పల్లె గ్రామంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు.. హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో.. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అదృశ్యమైంది.
అదే రోజు..
ఓ కేసు నిమిత్తం కోర్టుకు హాజరయ్యేందుకు తాడిపత్రి (అనంతపురం జిల్లా) లో ఉన్నాను. కేసు వాయిదా పడే సమయానికి వైఎస్సార్ అదృశ్యం విషయం తెలిసింది. అందరి మాదిరగానే.. ఎక్కడో ఓ చోట ల్యాండ్ అయివుంటారు లెమ్మని అనంతపురం వెళ్లాను. భోజనం అయ్యాక, టైమ్ పాస్ కోసం దగ్గర్లోని ఓ సినిమాకి వెళ్లాను. నా వెంట హెచ్ఎంటీవీ అప్పటి అనంతపురం రిపోర్టర్ చంద్రశేకర్ ను తీసుకు వెళ్లాను. సినిమా మధ్యలో ఉండగానే.. ఇంకా వైఎస్సార్ ఆచూకీ దొరకలేదని స్థానిక కాంగ్రెస్ నాయకుల నుంచి అతనికి ఫోన్ మీద ఫోన్ వచ్చింది. దీంతో ఇక సినిమాలో ఉండలేక, ఇద్దరం బయటకు వచ్చేశాం. హెచ్ఎంటీవీ జిల్లా కార్యాలయంలో కూర్చున్నాం. వార్తలు చూస్తున్నాం. అందరూ నల్లమల అడవులు, దాని పరిసరాలే కేంద్రంగా వైఎస్ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు వార్తల్లో చెబుతున్నారు. నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది. రకరకాలుగా పరిభ్రమిస్తోంది.. సాయంత్రం ఐదు గంటలైంది... ఇక ఉండబట్టలేక పోయాను. అన్వేషణ సాగించాలని నిర్ణయించుకున్నాను.
అంతా గందరగోళం..
సాయంత్రం ఏడుగంటల ప్రాంతంలో.. హైదరాబాద్ లోని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, నా చిరకాల మిత్రుడు ఎ.కె.సాగర్ కు ఫోన్ చేశాను. నేను హైదరాబాద్ తిరిగి రాకుండా.. అట్నుంచి అటే నల్లమల వెళతానని చెప్పాను. సాగర్ వెంటనే ఓకే చెప్పేశారు. (అంతకుముందు.. ఈటీవీలో పనిచేసినపుడు నాలుగు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించిన అనుభవం నాకుంది.. అందునా నేను పుట్టి పెరిగిన జిల్లా కర్నూలు. బహుశా దాన్ని దృష్టిలో ఉంచుకునో.. లేదా ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోరాదన్న స్వతస్సిద్ధ నైజం కారణంగానో.. నేను నల్లమల వెళ్లడానికి సాగర్ అంగీకరించి ఉంటాడనుకుంటా.) హైదరాబాద్ సెంట్రల్ ఆఫీసు ఒకే చెప్పగానే.. కర్నూలు జిల్లాలో పోలీసు శాఖలో పనిచేస్తున్న నా బాల్యమిత్రుడు టిఎ భరత్ కు ఫోన్ చేశా. జిల్లా పోలీసు యంత్రాంగం ఆలోచన.. వారి అంచనాలు తన ద్వారా తెలుసుకున్నా. అప్పుడు నాకు నిర్దిష్టమైన అవగాహన వచ్చింది. ఎక్కడికి వెళ్లాలో అర్థమైంది. వెంటనే ఆత్మకూరు బయలుదేరి వెళ్లా.
ఆత్మకూరులో ఉద్దండ పిండాలు..
అనంతపురంలో రాత్రి పది గంటలకు బయలుదేరి కర్నూలు జిల్లాలో నల్లమల అటవీ ప్రాంతం ప్రారంభమయ్యే ఆత్మకూరుకు సెప్టెంబర్ 3వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు చేరుకున్నారు. అప్పటికే మా సహచరుడు తిరుపతి బ్యూరో ఇంఛార్జి విశ్వనాథ్, కర్నూలు రిపోర్టర్ రాజకుమార్ అక్కడ DSNG వాహనాలతో లైవ్ లు ఇస్తున్నారు. వారితో ముచ్చటించాక వారికి కూడా వైఎస్ ఆచూకీ కి సంబంధించిన సమాచారం లేదని అర్థమైంది. నేను అక్కడికి చేరేటప్పటికి, తెలుగు ఛానళ్లే కాదు.. దేశంలోని ప్రముఖ టీవీ ఛానళ్ల రిపోర్టర్లు DSNG వాహనాలతో సిద్ధంగా ఉన్నారు. ఎవరికి వారు ఏవేవో ఊహాగానాలతో లైవ్ లు ఇస్తున్నారు. (పాపం వారిపై ఉండే ఒత్తిళ్లు అలాంటివి మరి..) అనంతపురంలో ఈటీవీ, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ గా పనిచేసిన అనుభవంతో.. వైఎస్ఆర్ వీర విధేయుడు, అనంతపురం జిల్లాకు చెందిన వ్యవసాయ మంత్రి రఘువీరారెడ్డితో మాట్లాడా.. ఆయనకూ సరైన సమాచారం లేదు. ఇంతట్లోపే తెల్లారింది.
అడవి తల్లి నమ్మి..
ఉదయం 8.45 నిముషాల ప్రాంతంలో.. మా కర్నూలు పోలీసు మిత్రుడు భరత్ కు మళ్లీ ఫోన్ చేశా. తను చెప్పిన విషయం విని కొద్దిసేపు మైండ్ బ్లాంక్ అయింది. "గాలింపు బృందాలు నల్లమల్ల అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ శకలాలు గుర్తించాయి.. హెలికాప్టర్ లో ప్రయాణించిన వారి దేహాలు ఛిద్రమై కనిపిస్తున్నాయట.." ఇదీ నా మిత్రుడు భరత్ చెప్పిన సమాచారం. మనిషిగా ఈ వార్త నన్ను బాధకు గురిచేసినా.. నాలో నిస్తేజం చొరబడకుండా.. నాలోని జర్నలిస్టు మేల్కోన్నాడు. చకచకా ముఖ్యమంత్రి మరి లేరు అన్న విషయాన్ని తక్షణమే సెంట్రల్ ఆఫీసుకు సమాచారం అందించాను. లైవ్ ఫోన్ ఇన్ ఇచ్చాను. ఆ విధంగా సిఎం మృతి వార్తను తొలుతగా హెచ్ఎంటీవీయే బ్రేక్ చేసింది. ఇంక వెనక్కు చూడలేదు. నా మిత్రుడు భరత్ అందించిన సమాచారం ప్రకారం.. తక్షణమే అడవుల్లోకి బయలుదేరాను..
చికున్ గున్యాను జయించిన పట్టుదల
నాకు చికున్ గున్యా సోకి అప్పటికి కేవలం నెల రోజులే అయింది. నొప్పులు ఏమాత్రం తగ్గలేదు. అడుగులు వేగంగా వేస్తే.. నొప్పి బాధిస్తోంది. అయినా.. నా సంకల్పం ముందు ఆ నొప్పులు బలాదూరే అయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ ఛాపర్ కుప్పకూలిన ప్రాంతానికి వెళ్లాలన్నదే నా ఏకైక లక్ష్యం. జర్నలిస్టులే కాదు.. వైఎస్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నల్లకాల్వ ప్రజలు, ఒకరేమిటి రాష్ట్రం నలుమూలల నుంచి ఆత్మకూరు వచ్చిన ప్రజలందరి లక్ష్యమూ అదే. అందుకే.. ఛాపర్ కూలిందని భావిస్తున్న ప్రాంతానికి పరుగులు ప్రారంభించారు. వాహనాల్లో వచ్చిన వారందరూ గాలేరు నది వద్దకు రాగానే నిలిచిపోయారు. ఉధృతంగా ప్రవహిస్తోన్న నది.. ముందుకు సాగనివ్వడం లేదు. ఒకరికొకరు ఆసరాగా చేసుకుని.. జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ.. నదిలో మిట్ట, గట్టి ప్రాంతాలను చూసుకుంటూ ఎలాగోలా ఆవలి గట్టుకు చేరుకున్నాం. నది దాటేసరికి, వేల మంది కాస్తా వందల మంది అయ్యారు.
అసలు సమస్య అక్కడే..
గాలేరు నది ఆవలి ఒడ్డున జర్నలిస్టులు, అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు, వైఎస్ వీరాభిమానులు మాత్రమే అక్కడ మిగిలారు. బాధ్యత, అభిమానం ఈ రెండు భావనలు అందరినీ కనీసం మూడు కిలోమీటర్ల దూరం పరుగులు పెట్టించాయి. అయితే.. అడవి మధ్యలో శివాలయం ప్రాంతానికి వచ్చే సరికి అభిమానులు, అధికారులు నిలిచిపోయారు. ముందుకు సాగాలా వద్దా అని తర్జన భర్జన పడి.. ఇక ముందుకు సాగడం అసాధ్యమని నిర్ణయించుకుని వారు వెనుదిరగాలని నిర్ణయించుకున్నారు. అధికారులే ఆ నిర్ణయానికి వచ్చేసరికి, జర్నలిస్టు మిత్రుల్లో సగం మంది వారి బాటే పట్టారు. కొందరు జర్నలిస్టులం మాత్రమే.. ఎలాగైనా ఘటనాస్థలాన్ని చేరాలన్న స్థిర సంకల్పంతో ముందుకు సాగాం. ఆక్రమంలో, మరి రెండు కిలోమీటర్లు వెళ్లేసరికి ఇంకొంతమంది నిలిచిపోయారు. ఈ బృందంలో.. మా హెచ్ఎంటీవీ సభ్యులు కూడా కొంతమంది ఉన్నారు.
హెలికాప్టర్ లే దిక్సూచి..
దాదాపుగా పది కిలోమీటర్ల దూరం నడిచాం. నా వెంట, మా హెచ్ఎంటీవీ ఆత్మకూరు రిపోర్టర్ సత్యపీటర్, మా ఐటిడిఎ రిపోర్టర్ రాఘవేంద్ర, కర్నూలు అప్పటి ట్రైనీ రిపోర్టర్ చంద్ర, అనంతపురం సాక్షి రిపోర్టర్ సంతోశ్ మాత్రమే ఉన్నారు. ఓ ఐదారుగురు కాంగ్రెస్ కార్యకర్తలు మమ్మల్ని వెన్నంటి వస్తున్నారు. మేం పరుగులు ఆపలేదు.. వంకల్లో దిగుతున్నాం.. వాగులు దాటుతున్నాం... అలసిన గొంతుకను వాగునీటితోనే తడుపుకుంటున్నాం. పరిస్థితి ఎక్కే కొండ, దిగే కొండగా ఉంది. దారి తెలీదు. మార్గదర్శకులెవరూ లేరు. లక్ష్యం ఉందిగానీ.. దిశా నిర్దేశం లేదు. అయినా మడమ తిప్పరాదన్న భావనతోనే సాగాం. ఆ సమయానికి హెలికాప్టర్ శకలాలు గుర్తించిన హెలికాప్టర్లు, మృతదేహాలను తరలించేందుకు సన్నద్ధమవుతూ.. పావురాల గుట్ట పై భాగంలో చక్కర్లు కొడుతున్నాయి. సైన్యపు హెలికాప్టర్లను కొండపై నిశ్చలంగా నిలబడి ఉంటే.. అందులోంచి రోప్ ద్వారా సిబ్బంది దిగుతున్నారు. ఆ దృశ్యాలు మాకు కనిపిస్తున్నాయి. ఇక గమ్యం కనిపించింది. మళ్లీ ఉరుకులు పరుగులు.
హెలికాప్టర్ ఉన్న ప్రాంతానికి, మేమున్న ప్రాంతానికి ఓ కొండ మాత్రమే అడ్డుగా ఉన్నట్లు కనిపించింది. ఏమీ ఆలోచించకుండా ఆకొండ ఎక్కాం. ఎక్కాక గానీ తెలీలేదు.. ఛాపర్ కూలిపోయింది అక్కడ కాదని. మళ్లీ కొండ దిగి, ఆవలి కొండ ఎక్కడం ప్రారంభించాం. ఈ మధ్యలో, సాక్షి మిత్రుడు సంతోశ్ (తను నేను అనంతపురం ఆంధ్రజ్యోతి బ్యూరో ఇంఛార్జిగా పనిచేసినపుడు నాదగ్గర కంట్రిబ్యూటర్ లెండి) తెచ్చిన నాలుగైదు అరటిపళ్లలోంచి ఒక పండు ఇచ్చాడు. బాగా అలసిన నేను దాన్ని ఆబగా తినేశాను. అయితే ఆ తర్వాత దాహార్తి నన్ను ఎంతలా వేధించిందంటే.. నేను అక్కడే ప్రాణాలు విడుస్తానేమోనన్న ఆందోళన కలిగించింది. నడచి నడచి ఒంట్లోని శక్తి, నీరు చెమట రూపంలో వెళ్లిపోయింది. అయినా తప్పదు.. పరుగు ఆపలేదు.. నాకు అరటి పండిచ్చిన సంతోశ్.. దిగువకు రాలేనని అక్కడే నిస్సత్తువగా ఆగిపోయాడు. అతడికి ఉత్తేజాన్నిస్తూ ముందుకు సాగిపోయాను. వస్తున్నట్లు శబ్ద సంకేతాలు ఇచ్చాడు కానీ అతను నా వెంట రాలేదని కాస్త దూరం వెళ్లాక గానీ అర్థం కాలేదు. అప్పటికే నాకు దాహం తారాస్థాయికి చేరింది. ఇంకేం చేయాలో పాలుపోలేదు. పావురాల గుట్ట కొండ ఎక్కుతున్నాను. అన్నీ బండరాళ్లే. పరిశీలించి చూస్తే.. ఓ బండకు చిన్నపాటి గుంత ఉంది. అందులో ఓ రెండు టేబుల్ స్పూన్ పరిమాణంలో నీరు కనిపించింది. వెంటనే నోటిని ఆ బండకు కరిపించి నీటిని జుర్రేశాను. అవి వర్షపు నీరో.. ఆ ప్రాంతంలో సంచరిస్తున్న కోతుల మూత్రమో తెలీదు. ఆ సమయంలో నాకు నీటి రుచి కూడా తెలీలేదు. అప్పటికే నా జీన్స్ ప్యాంట్.. ముళ్ల కంపలకు తగులుకుని.. కొండ ఎక్కుతున్నప్పుడు తేడా వచ్చి చిరిగి పీలికగా మారింది. దాంతో ప్యాంటు విడిచి, నేను వేసుకున్న జెర్కిన్ నే ఆచ్ఛాదనగా చుట్టుకుని అలసటతో కూర్చున్నాను. నా వెంట ఉన్న మా హెచ్ఎంటీవీ బృంద సభ్యులు చంద్ర, రాఘవేంద్ర నాతోపాటే ఆగబోయారు. వద్దని వారించి ముందుకు వెళ్లమని చెప్పి ఓ పదినిముషాలు విశ్రాంతి తీసుకుని తిరిగి కొండ ఎక్కడం ప్రారంభించాను.
విషాదంలో ఆనందం..
నేను విశ్రమిస్తున్న సమయంలో ముందుకు సాగిన మా రిపోర్టర్లు.. ఘటనా స్థలానికి నాకన్న పదినిముషాలు ముందుగా చేరారు. వెంటనే అంతకుముందే నేను చేసిన సూచన ప్రకారం, చకచకా అక్కడి దృశ్యాలను చిత్రీకరించారు. నేను వెళ్లేసరికి ఇంకా అక్కడ చిత్రీకరణ సాగుతోంది. అక్కడికి చేరుకున్న తొలి జర్నలిస్టుల బృందం మాదేనంటూ గ్రేహౌండ్స్ దళాలు ప్రశంసించాయి. ఆ ప్రశంసలు అందుకుంటూనే.. మా రాఘవేంద్రకు తీసుకోవాల్సిన విజువల్స్ కు సంబంధించి కొన్ని సూచనలు చేశాను. ఆ వెంటనే తొలి క్యాసెట్ ను తీసుకుని.. తెలిసిన అడ్డదారుల్లో వెంటనే నల్లకాల్వ చేరి.. విజువల్స్ ఎయిర్ చేయించమని ఆ కుర్రాడికి చెప్పాను. రాఘవేంద్ర చకచకా పరుగులు పెట్టాడు. ఆలోపు మా తిరుపతి బ్యూరో ఛీఫ్ విశ్వనాథ్, సత్యపీటర తో కలిసి అక్కడికి వచ్చాడు. మేమంతా దాదాపు ఓ రెండు గంటల పాటు అక్కడే ఉన్నాం. అక్కడి అన్ని దృశ్యాలనూ చిత్రీకరించాం. సాయంత్రం ఆరుగంటల కల్లా నా నేతృత్వంలోని బృందం తీసిన విజువల్స్ దేశవ్యాప్తంగా ఉండే వార్తా ఛానెళ్లలో ప్రసారం అయ్యాయి. మా హెచ్ఎంటీవీ ప్రతిష్టను దేశవ్యాప్తం చేశాయి. ఈ విషయం తెలిసి అడవిలోనే ఉన్న మేము పొందిన అనుభూతి మాటల్లో చెప్పలేం. అంతటి విషాదంలోనూ మాకు కొన్ని ఘడియల పాటు చెప్పలేంత ఆనందం కలిగింది.
మహా విషాదం..
నా జీవితంలో నేను చూసిన అత్యంత విషాదభరిత దృశ్యాల్లో పావురాల గుట్ట బీభత్సమే అగ్రభాగాన నిలుస్తుంది. మహానేతగా లక్షలాది మంది అభిమానాన్ని పొందిన వైఎస్ రాజశేఖరరెడ్డి, అనామకంగా ఓ కొండ గుట్టపై ఇలా ప్రాణాలు కోల్పోవడం ఎంత విషాదం. ఆయన పాదం ఓ చోట, గుండె మరో చోట, (ఆయన వేసుకున్న పంచె ఆధారంగా) చూసిన మా అందరి హృదయాలూ ద్రవించిపోయాయి. ఛాపర్ చెట్లకు కొట్టుకోగానే పేలి మంటలు రేగినట్లు.. కాలిన శరీర భాగాలు స్పష్టం చేస్తున్నాయి. పైగా మంటలు అంటుకోగానే.. వర్షం కురియడంతో శరీర భాగాలకున్న మంటలు ఆరిపోయాయి. దీంతో అక్కడ విపరీతమైన కమురు కంపు కొడుతోంది. వాసన కడుపులో తిప్పుతోంది. జనహృదయ నేతకు ఎలాంటి మరణం..? ఇదేనా విధి వైపరీత్యం..? చివరిక్షణాల్లో ఆయన ఏమి ఆలోచించి ఉంటారు..? ఘటనా స్థలం చూస్తే అది నిస్సందేహంగా ప్రమాదమే అనిపిస్తోంది... అయినా నాలోని జర్నలిస్టు కుట్రకోణం ఉందా అని కూడా పరిశోధన మొదలు పెట్టాడు. కుట్ర కోణానికి ఏ ఆధారాలూ లభ్యం కాలేదు. అంతా గందరగోళం. జర్నలిస్టుగా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించి నేను, విశ్వనాథ్, సత్యపీటర్ వెనక్కు తిరిగాం.
(గుర్తుకొస్తున్నాయి తొలి భాగం.. పావురాల గుట్ట నుంచి తిరిగి వస్తూ.. అడవిలో దారి తప్పి రాత్రంతా సంచరించిన మా అనుభవాలు రేపటి రెండో భాగంలో..)

5 comments:

  1. వి.కు. గారు, మీ అనుభవాల్ని కళ్ళకి కట్టినట్టు చెప్పారు........అప్పుడప్పుడూ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడూ మీడియా వాళ్ళు చేసే హడావిడి చూస్తే విపరీతం అనిపిస్తుంది కాని మీ version విన్నాక, అది మీ వృత్తి ధర్మం కదా అనిపించింది. Thank god ఈ కవరేజ్ లో మీకేం కాలేదు....కాని ఏదయినా అయ్యుంటే ఈ ఓదార్ఫు అకౌంట్లో మిమ్మల్ని కూడా కలిపేసేవారు.

    ReplyDelete
  2. మనలాంటి పిచ్చివాళ్ళు ఉన్నంతకాలం ఆ కాంగ్రెస్ కుహానా రాజకీయాలు మారవు...
    నెహ్రూ కుటుంభమే గొప్పదంటూ మన మనసుల్లోకి జొప్పించి
    ఇక వేరే ఎవరూ పేరు తెచ్చుకోకుండా చేస్తున్న ఆ నకలు"గాంధీ" వంశీయుల మాటలు మనం ఎందుకు నమ్మాలి..
    మనలో ఎవరికైనా YSR అన్యాయం చేసారా ఆ స్వార్ధ రాజకీయ వేత్తలకు తప్ప?
    మన బ్రతుకులు బాగుపడాలని చూసాడాయన..సరే కొందరన్నట్లు అతను " అవినీతిపరుడే" ఐతే మన సొంతసొమ్మేమైనా పోయిందా?? అయితే బయటికి తీయడంకి ఇంత ఆలశ్యమెందుకు? అంత అసమర్ధులా ??
    చనిపోయినవాళ్ళను కించపరచి వారి పేరుకి మచ్చతెచ్చి "భావి" తరాల పుస్తకాల్లో వారి పేరులేకుండా చేస్తే చివరికి ఆ "గాంధీ", "నెహ్రూ" తప్ప మన తర్వాతి తరాల వారికి మన "తెలుగు" బిడ్డలు" కకపోతే పోనీ, అసలు "నాయకులే" కనిపించరు..
    ఒక పీవీ, ఒక NTR, ఒక YSR మనవారు కాదా..

    వాళ్ళ మీద బురద చల్లే పని చేయొద్దని నా మనవి..
    అర్ధం చేసుకోండి..

    ReplyDelete
  3. విజయ్ గారు,
    అనుకోకుండా అంతర్జాల విహారంలో వుంటూ మీ బ్లాగు చూశాను. మళ్ళీ ఓ సారి సంవత్సరం క్రింది జ్నాపకాలు ముప్పిరిగొన్నాయి.మీరు ఆరోజు పడ్డ ఇబ్బందులు కూడా ఆరోజుల్లో నేను తోటి పాత్రికేయులతో పంచుకున్నాను.మీ విశ్వనాథ్,కెమెరా మన్ కాళీ ఈనెల మొదటివారంలో నల్లకాలవకు వచ్చారు.మా ఇంట్లో మేమంతా గత సంవత్సరపు జ్నాపకాలు నెమరు వేసుకున్నాము.విశ్వనాద్ బృందం మరోమారు చింతగుం
    డం వెళ్ళి వచ్చింది. అన్నట్లు వైయస్సార్ మరణించిన ప్రాంతం విషయంలో మీడియా ప్రజలను తప్పుదోవ పట్టించింది.ఆయన ప్రయాణించిన భెల్ ఛాపర్ ఆత్మకూరు అటవి డివిజన్, బైర్లూటి రేంజ్ లోని పసురూట్ల బీట్ లోని ఓ కంపార్ట్ మెంట్ పరిదిలో వున్న చింతగుండం తిప్పపై లేల కూలింది.కాని అన్ని చానళ్ళు దాన్ని పావురాల గుట్టగానే ప్రచారం చేశాయి.పోలీసుల firలో కూడా చింతగుండం చిరుత గుండంగా రాశారు.అన్నట్లు నేను వార్త ఆత్మకూరు స్టాఫ్ రిపోర్టర్ గా పని చేస్తున్నాను.నల్లకాల్వ నా స్వంతవూరు.నాకు ఓబ్లాగు వుంది.నలమలలోని చెంచుల దీనమైన స్తితిగతులను బయటి ప్రపంచానికి చూపే ప్రయత్నం చేస్తుంటాను.
    http://swechakosam.blogspot.com
    _సుబారెడ్డి

    ReplyDelete
  4. విజయ్ గారు,
    అనుకోకుండా మీబ్లాగ్ చూడడం తటస్తించింది.సంవత్సరం క్రిందటి విషయాలు మరోసారి స్మృతిపథంలో మెదిలాయి.ఆరోజు నేను కూడా నల్లమలలో సిఎం ఛాఫర్ క్రాష్ కవరేజ్ లొ వున్నాను. రోజు అడవుల్లోనే తిరిగే నేను సమయానికి క్రాష్ పాయింట్ కు చేరుకోలేక పోయాను.ఆతరువాత మీరు పడ్డ అవస్తలు పీటర్ ద్వారా తెలిశాయి.ఈ నెల మొదటివారంలో మీ విశ్వనాథ్,కాళిలు మరోసారి చింతగుండం తిప్పకువెల్లివచ్చారు.ఆసంధర్భంలో వారు నన్ను కలిశారు.అన్నట్లువైయస్సార్ మరణించింది పావురాలగుట్టపై కాదు.మీడియాలో అవగాహనాలోపంతో కొదరు ఇచ్చిన బ్రేకింగ్ న్యూస్ లు పదుగురాడు మాట లా పాపులర్ అయింది. వాస్తవానికి వైఎస్ ఆర్ మరణించింది ఆత్మకూరు అటవీ డివిజన్ లోని బైర్లూటి రేంజ్ లోని పసురుట్లబీట్ లొ వున్న చింతగుండంతిప్పపైనే. పోలీసుల ఎఫ్ ఐఆర్ లో కూడా చిరుతగుండం అని తప్పుగారాశారు.నిజానికి ఆ ప్రాంతంలోనే పావురేండ్ల తిప్ప అని మరొ కొండ వుంది అందువల్ల మీడియా తప్పు దోవ పట్టింది. అన్నట్లు నేను కూడా బ్లాగర్నేనండి.మన జర్నలిస్టులు మంచి బ్లాగులనే నడుపుతున్నారు.కేక్యూబ్ వర్మ ప్రజోపయోగ బ్లాగులు నడుపుతున్నారు. మిమ్మల్ని అంతర్జాలంలో ఇకనుంచి అనుసరిస్తాను.
    _సుబ్బారెడ్డి

    ReplyDelete
  5. విజయ్ సార్,
    సుబ్బారెడ్డిఅన్న నెట్ కు తీసుకువెళ్ళి మీబ్లాగును చూపించారు.అప్పటి విషయాలను పూసగుచ్చినట్లు రాశారు.మొన్న సెప్టంబరు రెండున విశ్వనాథ్ సార్ వాళ్ళతో కలిసి పావురాల గుట్ట వెళ్ళివచ్చాను. మిమ్మల్ని మరోసారి నెట్ లోనైనా చూసినందుకు సంతోషంగా వుంది.అన్న మీబ్లాగుపై ఓ సారి కామెంట్ పెట్టినా అది కనిపించకపోవడంతో రెండోసారి పెట్టాడు. రెండవదానిని రిమూవ్ చెయగలరు
    _సత్యపీటర్,రిపోర్టర్
    హెచ్ ఎం టీవి, అత్మకూరు

    ReplyDelete