డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విషాదాంతాన్ని కవర్ చేసిన జ్ఞాపకం నేటికీ సజీవంగానే ఉంది. మేము ఘటనా స్థలానికి వెళ్లేసరికి.. గ్రేహౌండ్స్ దళాలు.. ప్రముఖుల శరీర భాగాలను ఏర్చి కూర్చే పనిలో ఉన్నారు. ఆ తర్వాత ఆమూటలన్నిటి పైనా విడివిడిగా తెల్లటి వస్త్రాన్ని కప్పేశారు. ఆ మూటలను ఒక్కొక్కటిగా హెలికాప్టర్ లోకి ఎక్కించారు. కచ్చితంగా మృతులకు చెందిన శరీరభాగాలే ఆ మూటల్లో కూర్చారని కచ్చితంగా చెప్పలేం. అక్కడికీ అనుమానం వచ్చిన శరీర భాగాలను అక్కడి సిబ్బంది కొండ గుట్టలపైనే వదిలేశారు. అందులో పాదాలు, వాటి ముక్కలు, గుండె భాగం, కాలేయం, పేగులు లాంటి భాగాలు అక్కడే ఉండిపోయాయి.
హృదయ భారం..
మొత్తమ్మీద ఆ దృశ్యాలన్నింటినీ కవర్ చేశాక, మా హృదయాలు విషాదభరితమయ్యాయి. సహజంగా జర్నలిస్టులు ఫీలింగ్స్ కి అతీతంగా ఉంటారన్న భావన ఉంటుంది. 1999 నుంచి 2005 వరకూ.. అనంతపురం జిల్లాలో పనిచేసినపుడు.. అక్కడి ఫ్యాక్షన్ హత్యలెన్నింటినో చూశాను. ముఖ్యంగా 2004-05 మధ్య కాలంలో దాదాపుగా వారానికి రెండు చొప్పున ఊచకోతలు జరిగాయి. వాటన్నింటినీ చూసి చూసి.. చావు అంటే అదేదో సహజ ప్రక్రియ అన్నంతగా.. కంట నీరు కూడా రానంతగా గుండె రాయి అయింది. అట్లాంటి నాకూ.. హృదయం బరువెక్కింది. అదేంటో..!
తిరుగు పయనం..
ఆ విధమైన భావ సంఘర్షణల మధ్య దాదాపుగా ప్రతి దృశ్యాన్నీ చిత్రీకరించి తిరుగు ప్రయాణమయ్యాం. అప్పటికే సాయంత్రం ఐదు గంటలు కావస్తోంది. మేం వచ్చిన దారిని తలచుకుంటూ.. అంత దూరాన్ని రాత్రిలోగా అధిగమించి ఆత్మకూరు చేరాలన్న లక్ష్యంతో అడుగులు ముందుకేశాం. అయితే.. సాయంత్రం అవుతున్న కొద్దీ.. అడవిలో వాతావరణం మారిపోయింది. ఉన్నట్లుండి భారీ వర్షం మొదలైంది. తడుస్తూనే నా మొలకు ఆచ్ఛాదనంగా కప్పుకున్న జెర్కిన్ ని ఒంటిపై వేసుకున్నాను. మిగిలిన నా సహచరులందరూ బాగా తడిచిపోతూనే నడక కొనసాగించారు. మా వెంట కడప జిల్లాకు చెందిన నలుగురు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మాటా మాటా కలుపుతూ వచ్చారు.
దారి తప్పించిన వాన
మేము బయలుదేరిన విషయాన్ని హెచ్ఎంటీవీ సెంట్రల్ ఆఫీసు(హైదరాబాద్) లోని సాగర్, చక్రపాణి మొదలైన వాళ్లకు చేరవేశాం. అంతా సవ్యంగానే సాగుతున్నామని అనుకున్నాం. వర్షం కూడా ఏకధాటిగా కురవడం లేదు.. అయిదు నిముషాలు తెరిపినిచ్చి.. ఓ రెండు నిముషాలు భారీగా కురుస్తోంది. దీంతో అలసట కూడా పెద్దగా తెలీలేదు. ఉదయం పావురాల గుట్టకు వచ్చేటప్పటి మా అనుభవాలను పంచుకుంటూ నడుస్తున్నాం. మేము వచ్చిన దారిని సరిగ్గానే గుర్తుంచుకుంటూ సాగుతున్నాం. అయితే ఓ చోట వై జంక్షన్ వచ్చింది. అక్కడే మేము తప్పటడుగు వేశాం. వాన కారణంగా.. అక్కడ నేలంతా బురదమయమై పోయింది. ఎవరి కాలిజాడలు కానీ,. అంతకుముందరి అటవీ సిబ్బంది వాహనాల టైర్ల జాడలు కానీ లేకుండా మొత్తం తుడిచిపెట్టుకు పోయాయి. దీంతో మేము తర్జన భర్జన పడి.. ఎడమవైపు
బాటలో నడిచాం. అయితే ఓ నాలుగైదు కిలోమీటర్లు నడిచాక గానీ అర్థం కాలేదు.. మేం దారి తప్పామని. దాంతో ఒక్కసారిగా మా అందరిలోనూ అలజడి.. గుండెల్లో ఓ రకమైన వణుకు. ఎందుకంటే.. మేము తిరుగుతోంది పులుల అభయారణ్యం మరి.
ఎంత నడచినా తరగని కీకారణ్యం
కొద్ది క్షణాలు మాలో మేము తర్జన భర్జన పడ్డాం. అక్కడే ఆగాలా..? ముందుకు సాగాలా..? ఆగితే షెల్టర్ ఏదీ.. అందునా ఆగి ఆగి కురుస్తున్న వానని అడ్డుకునేదెలా...? ఇన్ని సమాధానం దొరకని ప్రశ్నల నడుమ.. చివరికి ముందుకు సాగాలనే అందరం నిర్ణయించుకున్నాం. మమ్మల్ని వనం నుంచి జనారణ్యంలోకి చేర్చే బాధ్యతను మా ఆత్మకూరు రిపోర్టర్ సత్యపీటర్ తీసుకున్నాడు. అంతకుముందు ఆ అటవీ ప్రాంతంలో సంచరించిన అనుభవం అతనికుంది. దీంతో పీటర్ ఆలోచనలు.. సూచనల మేరకు ముందుకు సాగాం. కేవలం నాలుగైదు కిలోమీటర్లు నడిస్తే రోడ్డు చేరతామని అనుకున్నాం. అయితే.. మా ప్రయాణం విశాల ప్రాంతానికి కాకుండా.. మరింత దట్టమైన అడవిలోకి సాగుతున్నట్లు అర్థమైంది. చాలామంది సెల్ ఫోన్లు కూడా అప్పటికే మూగబోయాయి. కేవలం ఒకరిద్దరి ఫోన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అతి ప్రయాస మీద.. ఛార్జింగ్ ఉన్న ఫోన్ కు సెంట్రల్ ఆఫీసు నుంచి సిఇఓ రామచంద్రమూర్తి గారు ఫోన్ చేసి.. మా వివరాలు ఆరా తీశారు. అర్ధరాత్రి దాటిపోయిందని తామంతా టెన్షన్ పడుతున్నట్లు చెప్పారు. ఆయనకు ఇబ్బందేమీ లేదని చెప్పాం. అయితే మా పరిస్థితి మాకు తెలిసి పోతోంది. అడవిలోనే జీవితాలు అంతం కావచ్చు అనుకున్నాం. తెల్లవారేలోగా క్రూర మృగాలు కబళిస్తాయని భయం. ఈ భయాందోళన నడుమ సెంట్రల్ ఆఫీసు నుంచి కోఆర్డినేటర్ శ్రీనివాస్ మండ్యా ఫోన్ చేశారు. అడవిలో ఓ విశాల స్థలం ఎంచుకుని.. ఒక్కొక్కరు అరగంట చొప్పున సెంట్రీ నిర్వహిస్తూ.. మిగిలిన వారు అక్కడే పడుకోవాల్సిందిగా సూచించారు.
మురికి నీరు వడగట్టి తాగాం..
అప్పటికే సమయం ఎంతైందో తెలీకుండా..ఎన్ని కిలోమీటర్లు నడిచామో తెలీదు. అందరం విపరీతంగా అలసిపోయాం. అయితే మా సత్యపీటర్.. అది పులులు సంచరించే ప్రాంతం కాబట్టి, విశ్రమించడం అంత సమంజసం కాదని అనడంతో.. మళ్లీ అందరిలోనూ భయం పుట్టింది. అందుకే మళ్లీ నడక సాగించాం. అప్పటికే విశ్వనాథ్... వేసుకున్న షూలో నీళ్లు చొరబడి.. కాళ్లు బాగా నాని తిమ్మిరెక్కిపోయాయి. దాంతో అతడు కాళ్లు వంకర్లు పోతున్నాయంటూ.. నిస్సత్తువగా కింద కూర్చుండిపోయాడు. మిగతా వారి పరిస్థితీ దాదాపు అదే. అయితే.. అడవిలోనుంచి బయటపడాలన్న ఏకైక లక్ష్యంతో ఒకరికొకరం ధైర్యం చెప్పుకుంటూ నడకను ఆపకుండా సాగించాం. ఉదయం ఏడుగంటల ప్రాంతంలో తిన్న రెండేసి ఇడ్లీలు ఎప్పుడు అరిగిపోయాయి. ఆకలి వేస్తోంది.. నడచి నడచీ దప్పిక వేస్తోంది. ఆ సమయంలో.. ఓ బండ రాతి కింద, నిల్వ ఉన్న బురద నీరు కనిపించింది. ఆ నీటినే ఓ ప్లాస్టిక్ కవర్ లో నింపాం. చేతిరుమాలే ఫిల్టర్ గా ఆ నీటిని నోట్లో పిండుకున్నాం. ఒక్కొక్కరం ఒక్కో గుక్క అంతే. ఆ విధంగా దాహం తీర్చుకున్నాం. ఎంత నడిచినా గమ్యం రావడం లేదు. దీంతో.. ఓ విశాలమైన స్థలం చూసుకుని అరగంటకు ఒకరు చొప్పున సెంట్రీ డ్యూటీలు వేసుకుని విశ్రమించాం.
బెంబేలెత్తించిన తెల్లటి ఆకారం :
విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో.. అడవి దోమలు మామీద ప్రతాపం చూపడం మొదలు పెట్టాయి. ఏదైతే అదయిందని.. శరీరాన్ని దోమలకు సెంట్రీ తప్ప అందరూ నడుం వాల్చారు. ఆ సమయంలో.. కాస్త దూరంలో చంద్రుని వెన్నెల్లో ఓ తెల్లటి ఆకారం రావడం కనిపించింది. మొదట్లో ఏదో భ్రమ అనుకున్నాం. అయితే.. ఆ ఆకారం దగ్గరకు వస్తున్న కొద్దీ గుండెల్లో గుబులు రేగింది. నిశితంగా పరిశీలిస్తే.. అది అడవి ఆవు అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నాం. జంతువులు, పక్షులు ఉన్నట్టుండి చేసే శబ్దాలు బెంబేలెత్తిస్తుంటే.. అందరికీ విశ్రాంతి తీసుకోవడం కన్నా ముందుకు సాగడమే మేలన్న భావన కలిగింది. దీంతో మళ్లీ ప్రయాణం మొదలు పెట్టాం.
దారి చూపిన ఆకాశ వెలుగులు
కనిపించిన దారి వెంట మళ్లీ అడుగులు వేస్తూ పోతున్నాం. ఉన్నట్లుండి దూరంగా ఎక్కడో ఏదో వాహనం వెళుతున్నట్లు మోటార్ శబ్దం వినిపించింది. దాంతో మా అందరిలో ఒక్కసారిగా కొత్త ఉత్సాహం వచ్చింది. ఆ శబ్దాలను ఆనవాలుగా తీసుకుని నడక వేగం పెంచాం. అయితే.. అడవి నుంచి విశాల ప్రాంతానికి రావాల్సింది పోయి.. మళ్లీ దట్టమైన అడవిలోకి ప్రవేశిస్తున్నట్లు కొంతసేపటికే అర్థమైంది. పైగా ఎలాంటి వాహనాల సవ్వడీ వినిపించదాయె. అప్పుడు ఇక ఆ దేవుడే దిక్కు అని ఆకాశంలోకి చూసిన నాకు.. చాలా దూరంగా విద్యుత్ దీపాల కాంతి ఒక ధూళిలా కనిపించింది. ఆ వెలుగులను ఆధారంగా చేసుకుని బయటపడదామని మిత్రులందరికీ చెప్పాను. అందరూ సరేనన్నారు. ఆ వెలుగులు ఆధారంగా చేసుకుని నడిచాం.. చివరికి ఆత్మకూరుకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో అటవీ శివారు పొలాల్లో తేలాం. అప్పుడు సమయం ఉదయం ఎనిమిది గంటలు.
అసలైన ఊపిరి ని పీల్చాం ...
దాదాపు పదిహేను గంటల హై టెన్షన్. అటు మా ఇళ్లల్లోని వారికి, ఆఫీసులోని వారికి, మాకు విపరీతమైన టెన్షన్. మేం అడవి నుంచి బయటపడ్డ విషయాన్ని సెంట్రల్ ఆఫీసుకు తెలియజేశాం. మేము పొలాల్లోనుంచి రోడ్డుకు వచ్చే సరికి (దాదాపు గంట పట్టింది) నల్లకాల్వ దగ్గరున్న మా కర్నూలు రిపోర్టర్ రాజకుమార్ తిండి, నీరు తీసుకుని మా వద్దకు వచ్చాడు. కాస్త ఎంగిలిపడ్డాక, మా మనుషుల మధ్య పడ్డామన్న భావనతో అప్పుడు గుండెలనిండా ఊపిరి పీల్చాం. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి మూడో తేదీ ఉదయం దాకా అపురూపమైన, అనన్యమైన అనుభూతులను సొంతం చేసుకుని.. నాలుగో తేదీ ఉదయానికి హైదరాబాద్ లో విధులకు హాజరయ్యాను. నేను సాధించిన విజయంతో చికున్ గున్యా నొప్పులు గానీ.. అడవిలో పడ్డ బాధలు గానీ నాకు కనిపించలేదు. యధావిధిగా డ్యూటీకి హాజరవుతుంటే ఆశ్చర్య పోవడం అందరి వంతైంది. విజయం ఇచ్చే కిక్ అలాంటిది మరి.
vijay kumar garu
ReplyDeleteme sramaku abhinandanalu... ila akshara rupamlo panchinanduku marinni abhinandanalu...
-kesav
విజయ్ కుమార్ గారు, బ్లాగ్ ప్రపంచంలోకి స్వాగతం. మీ వృత్తి విజయానికి అభినందనలు. ముందు ముందు మరిన్ని మంచి అంశాలు, అభిప్రాయాలు మరియు కధనాలు మీ పాఠకులతో పంచుకుంటారని ఆశిస్తున్నాను.
ReplyDelete- చదువరి