ఉస్మానియా విశ్వవిద్యాలయం.. మరో సంచలన ఘటనతో పతాక వార్తల్లోకి వచ్చింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కన్నా సమున్నతుడంటూ ప్రాజ్ఞులు ప్రస్తుతించిన గురువు.. ఈ సరస్వతీ ప్రాంగణంలో.. అతి నీచాతినీచమైన అవమానానికి గురయ్యాడు. విద్యార్థుల చేతిలో చావు దెబ్బలు తిని.. ఘోర పరాభవానికి గురయ్యాడు.
విశ్వవిద్యాలయం నిర్వహించిన బిఇడి పరీక్ష సమాధాన పత్రాలు దిద్దేందుకు సీమాంధ్ర ప్రాంతపు అధ్యాపకులు రావడం.. ఇక్కడి విద్యార్థులకు రుచించలేదు. వారు దిద్దితే మార్కులు సరిగ్గా రావని, ఫెయిల్ అయిపోతామన్నది దాడి చేసిన విద్యార్థుల బెంగ. తెలంగాణ ప్రాంత అధ్యాపకులే తమ పరీక్ష సమాధాన పత్రాలు దిద్దాలన్నది వారి డిమాండ్. అందుకే.. పరీక్ష పత్రాలు దిద్దేందుకు వచ్చిన సీమాంధ్ర అధ్యాపకులను తరిమి తరిమి కొట్టారు. వీడియో క్లిప్పింగులు చూస్తే.. ఒకరిద్దరు విద్యార్థులు అధ్యాపకులపై చెప్పులతోనూ దాడి చేసినట్లూ కనిపించింది. (పాపం శమించుగాక..)
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో ఉస్మానియా విద్యార్థుల పాత్రను ఏమాత్రం తక్కువ చేయలేము. వారి అంకిత భావాన్నీ శంకించలేము. రాష్ట్ర సాధన కోసం వాళ్లు ఎంచుకున్న మార్గాన్నీ ప్రశ్నించలేము. అక్కడక్కడా కొన్ని హింసాత్మక ఘటనలు జరిగినా.. విద్యార్థుల్లో ఆమాత్రం ఆవేశం సహజమేనని అంతా అనుకున్నారు.
తెలంగాణ రాష్ట్రం రాదేమోనన్న బెంగతోనో, ఎవరో అడ్డుపడుతున్నారనో, మరెవరో ఓడిపోతే ఆత్మబలిదానం చేసుకుంటామనో.. రకరకాల కారణాలతో తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకోవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేక పోయారు. మళ్లీ ఇప్పుడు అలాంటి స్వాగతించలేని ఘటనకు ఉస్మానియా విద్యా ప్రాంగణం వేదిక కావడం బాధాకరంగా ఉంది. ఏకంగా అధ్యాపకులపైనే విద్యార్థులు దాడికి ప్రయత్నించడాన్ని సభ్యసమాజం ఏమాత్రం ఆమోదించదు.
విద్యార్థులకు సీమాంధ్ర అధ్యాపకులపై అనుమానం కలగొచ్చు... గతంలో ఒకటి రెండు ఘటనలు వారి అనుమానాలను
బలోపేతం చేసేలా ఉండవచ్చు. అయితే, అందరినీ ఒకే గాటన కట్టడం ఏమి న్యాయం. సహజంగా ఏ అధ్యాపకుడూ విద్యార్థుల జీవితాలతో ఆటలాడతానుకోవడంలో అంత హేతుబద్ధత కనిపించదు. ఒకవేళ ఒకరిద్దరు అధ్యాపకులు విద్యార్థులను ఫెయిల్ చేశారనుకున్నా.. రీ వాల్యుయేషన్ ప్రక్రియ ఉండనే ఉంది కదా..! అందులో తప్పు బయటపెట్టి, బాధ్యులను గుర్తించడం, శిక్ష పడేటట్లు చేయడం పెద్ద కష్టమేమీ కాదే. కేవలం ఒకరిద్దరి మీద అనుమానంతో, ఒక ప్రాంతానికి చెందిన అధ్యాపకులందరినీ ఇంతలా అవమానించడం అంత మంచిది కాదు.
తెలంగాణ ప్రాంతంలో పుట్టి పెరిగిన బిడ్డలు ఆత్మాభిమానంతో పాటు.. అతిథి మర్యాదలు చేయడంలో మర్యాదరామన్నలే. మరి ఆ స్ఫూర్తి ఏమైంది..?
విద్యార్థులు ఉద్యమ ఉధృతికి రకరకాల వ్యూహాలు రచించ వచ్చు.. ఏలికల తలలు వంచి లక్ష్యాన్ని సాధించ వచ్చు. అయితే ఇలాంటి ఘటనలకు పాల్పడడం వల్ల, ఉభయ ప్రాంతాల సోదరుల మధ్య అనవసర వైషమ్యాలు పెరుగుతాయి. ఇది ఎవరికీ మంచిది కాదు. అందుకే విద్యార్థులారా.. కాస్త నెమ్మదించండి.. ఆలోచించండి.. ఉద్యమ వ్యూహాన్ని సరిచూసుకోండి. లక్ష్యం దిశగా అడుగులు వేయండి.
No comments:
Post a Comment