Sunday, June 2, 2013

రమణా.. ఎందుకిలా చేశావ్‌..?



ఏడాది క్రితం..

బూరా గారి సంస్మరణ సభలో కలిశావు..
ఎన్నో స్మృతులను కలబోసుకున్నావు..
నవ్వుల పువ్వులు పూయించావు..
మధుర స్మృతులు మిగిల్చావు..

బూరా గారి శిష్యులందరికోసం
ఫేస్‌బుక్‌లో ఓ గ్రూపు సృష్టిస్తానన్నావు.
అందులో అందరూ టచ్‌లో ఉందామన్నావు..
అంతలోనే అందరాని లోకాలకు వెళ్లిపోయావు

నీకు అప్పుడే నూరేళ్లూ నిండడమేంటి..?
విధికి అంత తేలిగ్గా ఎలా లొంగావు..?
నీ పోరాట పటిమ విధిని నిలుపలేక పోయిందే..?
ఏమైనా రమణా.. నీ మరణ వార్త నాకు అశనిపాతం

ద్రవిస్తున్న నా హృదయం..
కళ్ల ద్వారా స్రవిస్తోంది..
నీ ఆత్మకు శాంతి కలగాలి
ఇదే నీ ఈ మిత్రుడి అశ్రునివాళి

- విజయ్‌
( ఈనాడు జర్నలిజం స్కూలు 1992 వ బ్యాచ్‌కు చెందిన మా మిత్రుడు వెంకటరమణ అకాల మరణాన్ని జీర్ణించుకోలేక.. బాధను వ్యక్తం చేసేందుకు గొంతుక పెగలక.. ఇలా తొలిసారిగా అక్షరాలను ఆశ్రయించా)

Wednesday, August 1, 2012

భయం గుప్పిట్లో...



పుణెలో ఈ సాయంత్రం ఏడున్నర నుంచి ఎనిమిదింపావు మధ్యలో నాలుగు చోట్ల బాంబు  పేలుళ్లు సంభవించాయి. చిదంబరం స్థానంలో హోంమంత్రిగా నియమితులైన సుశీల్ కుమార్ షిండేకి ఈ పేలుళ్లు సవాలేనని భావించవచ్చు. నిజానికి ఆయనీ సాయంత్రం నగరంలో ఓ బహుమతుల ప్రదానోత్సవంలో పాల్గొనాల్సి ఉంది. ఈ పేలుళ్ల దెబ్బకు ఆయన తన పర్యటనను ఆఖరు క్షణాల్లో రద్దు చేసుకున్నారు. నగరంలో గుండెకాయ లాంటి జంగ్లీ మహరాజ్ రోడ్డులో ఈ పేలుళ్లు జరిగాయి. మహారాష్ట్రనే కాదు.. యావద్దేశాన్నీ ఈ పేలుళ్లు కలవర పరిచాయి. పేలుళ్ల నేపథ్యంలో.. మన రాష్ట్రంలో అన్ని ముందస్తు జాగ్రత్తలూ తీసుకోవాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పోలీసు శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఏమో ఈ ఘటనలు చూస్తుంటే.. ప్రజలను భయాందోళనలకు గురి చేయాలన్న ఉగ్రవాదుల లక్ష్యం నెరవేరినట్లే కనిపిస్తోంది.

శివయ్య లాలింపు




మొన్నీ మధ్య తమిళనాడు వెళ్లాను అక్కడ చాలా గుళ్లూ గోపురాలు తిరిగాను. ఇందులో భాగంగా.. అగస్త్య మహాముని తపస్సు చేసిన ప్రదేశం.. తిరుమెచ్చూరు వెళ్లాను  ఇది చెన్నైకి ఓ 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి లలితాంబిక ఆలయంలో శిల్ప సంపదను దగ్గరనుంచి పరిశీలించే అవకాశం దొరికింది. శివుడు పార్వతీ దేవిని లాలిస్తూ.. వేడుకుంటున్నట్లుగా ఇక్కడి గుడి గోడలపై చెక్కిన "క్షేత్ర పురాణేశ్వర" శిల్పం, ఆహా ఎంతటి దేవదేవుడికైనా భార్య అలక తీర్చేందుకు పాట్లు తప్పవు కదా అనిపించింది. ఇంకో విచిత్రమేంటంటే.. శిల్పానికి ఎడమ వైపు నుంచి చూస్తే పార్వతీదేవి కళ్లు ఆగ్రహంతో ఉన్నట్లుగాను, కుడివైపు నుంచి చూస్తే ప్రసన్నంగానూ కనిపిస్తుంది. వేల సంవత్సరాల క్రితపు శిల్పుల ప్రావీణ్యతకు ఈ శిల్పాలు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.


Thursday, July 19, 2012

ది హన్స్ ఇండియా తొలి వార్షికోత్సవ వేళ...



నేను పనిచేస్తున్న hmtv గ్రూపునుంచి వెలువడుతున్న The Hans India ఇంగ్లిష్ పత్రిక తొలి వార్షికోత్సవం ఈనెల 15న జరిగింది. ఆ సందర్భంగా మా అబ్బాయి వికాస్ (తనిప్పుడు ఇంటర్ సెకెండియర్ చదువుతున్నాడు) ని తీసుకు వెళ్లా.   మా చీఫ్ ఎడిటర్ శ్రీ రామచంద్రమూర్తిగారితోను, మంత్రి శ్రీధర్ బాబుతోనూ నేను, మా అబ్బాయి కలిసి ఉన్న ఫోటోలు.

 01) సుందరయ్య విజ్ఞాన కేంద్రం బయట అతిథుల కోసం ఎదురు చూపు
 02) హెచ్ఎంటీవీ చీఫ్ ఎడిటర్ శ్రీ రామచంద్రమూర్తి గారితో మా అబ్బాయి వికాస్ కరచాలనం

03) మంత్రి శ్రీధరబాబుకు ఆత్మీయ స్వాగతం

Wednesday, July 4, 2012

షుగర్‌ వ్యాధినీ తగ్గించొచ్చట...!


హైదరాబాద్‌లోని సీసీఎంబీ శాస్త్రజ్ఞులు.. జన్యు కణాలపై చేసిన పరిశోధనలు.. అనుకోకుండా.. షుగర్‌ వ్యాధి మూలాలను బయటపెట్టాయి. ఇన్సులిన్‌ అవసరం లేకుండానే.. షుగర్‌ వ్యాధిని కంట్రోల్‌ చేయడం కాదు.. ఏకంగా ఇతర వ్యాధుల మాదిరిగా నయం చేయవచ్చట. జీవుల్లోని 30 వేల జన్యువులు ఏ ఏ పనులు చేస్తాయో పరిశోధిస్తున్న సిసిఎంబీ శాస్త్రవేత్తలు.. తమ ప్రయోగాల ద్వారా.. డయాబెటీస్‌కి మందు కనుక్కోవచ్చని నిర్ధారించారు. WDR-13 అనే జన్యువుపై అధ్యయనంలో భాగంగా.. పదినెలల క్రితం ఓ కృత్రిమ ఎలుకను సృష్టించారు. ఆ చుంచులో WDR-13 జన్యువును తొలగించారు. అనూహ్యంగా.. WDR-13 జన్యువును తొలగించిన చుంచులో.. సాధారణ ఎలుకలకన్నా రెండింతల ఇన్సులిన్‌ పెరిగిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మనుషుల్లోనూ ఇదే నాకౌట్‌ పద్ధతిని అమలు చేస్తే.. మధుమేహానికి అడ్డుకట్ట వేయవచ్చని సిసిఎంబీ శాస్త్రవేత్త డాక్టర్‌ సతీశ్‌కుమార్‌ నిర్ధారించారు.
తక్షణ ప్రయోజనం లేదు..!
సిసిఎంబీ శాస్త్రవేత్తల ప్రయోగ ఫలితం.. తక్షణమే మధుమేహ వ్యాధిగ్రస్థులకు ఉపయోగకరం కాదు. అయితే.. మందుల తయారీ సంస్థలు.. తమ జన్యు సిద్ధాంతాన్ని అనుసరించి ప్రయోగాలు చేస్తే.. త్వరలోనే డయాబెటిస్‌ నివారణకు మందు తయారు కావడం తథ్యమన్నది సిసిఎంబీ శాస్త్రవేత్తల నమ్మకం.
ఈ జన్యు ప్రొటీన్‌ పనితీరు చుంచుల్లోనూ.. మనుషుల్లోనూ ఇకే రీతిలో ఉండడం పరిశోధనల్లో కీలకాంశం. అయితే.. WDR-13 జన్యువును తొలగించిన కృత్రిమ ఎలుకలో కణాల సంఖ్య పెరుగుతూ పోతే మాత్రం అది ట్యూమర్‌కు దారి తీసే ప్రమాదం ఉంది. ఇలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ను కూడా దృష్టిలో ఉంచుకొని.. మందుల కంపెనీలు ప్రయోగాలు చేస్తే.. త్వరలోనే సత్ఫలితాలు రావొచ్చన్నది శాస్త్రవేత్తల నమ్మకం.
షుగర్‌ టెస్ట్‌ ఇక రూ.2
మధుమేహం వచ్చిందన్న బాధాకరమైన కబురు వినేందుకు ఇప్పుడు వందలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. మధుమేహ నిర్ధారణకు.. రక్త పరీక్షతో పాటు.. రకరకాల  టెస్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. రక్త పరీక్షకే వంద రూపాయల దాకా ఖర్చవుతోంది. ఇతరత్రా పరీక్షలు కలుపుకుంటే.. వెయ్యి దాకా అవుతోంది. ఈ పరీక్ష ఖర్చును భరించలేక బాధపడుతున్నవారికి త్వరలోనే ఉపశమనం కలగనుంది.   భారత వైద్య పరిశోధన మండలి - ఐసిఎంఆర్..... మధుమేహం కారణాన్ని అన్వేషించేందుకయ్యే ఖర్చును, తగ్గించే ప్రాజెక్టు చేపట్టింది. ఐసిఎంఆర్‌... శాస్త్రసాంకేతిక పరిశ్రమ పరిశోధన మండలి, ఐఐటి ఖరగ్‌పూర్‌, ప్రైవేట్‌ ఔషధ సంస్థలతో కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టు కింద కొత్త పరీక్ష విధానాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇది సఫలమైతే.. మన జేబులో రెండు రూపాయలుంటే చాలు.. మధుమేహ వ్యాధి వచ్చిందో లేదో తెలుసుకునే అవకాశం దక్కుతుంది. ఈ ఏడాది చివరినాటికల్లా ఈ కొత్త పరీక్షా విధానం సిద్ధమవుతుందని భావిస్తున్నారు. ఈ పరీక్ష అందుబాటులోకి వస్తే షుగర్‌ పేషెంట్లకు గొప్ప ఉపశమనం కలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రయోగాలు ఆశాజనకం
ఒకప్పుడు టైఫాయిడ్.. ఆ తర్వాత కలరా.. కొన్నాళ్లకు క్షయ.. కొంతకాలం క్రితం క్యాన్సర్‌.. ఇంకొన్నాళ్లకు ఎయిడ్స్‌.. ఇలా ఎప్పుడూ ప్రాణాంతంక వ్యాధులు పుడుతూనే ఉన్నాయి. కొన్నాళ్లు ప్రజల ప్రాణాలు హరించినా.. కొంతకాలానికి మన శాస్త్రవేత్తల ప్రయోగాలకు తలవంచుతూనే ఉన్నాయి. ఇప్పుడు బెంబేలెత్తిస్తున్న మధుమేహాన్ని కూడా మన శాస్త్రవేత్తలు తమ దారిలోకి తెచ్చుకోవడం ఖాయం. ఆ తియ్యని కబురు త్వరలోనే రావాలని.. ఆశిద్దాం.

Saturday, July 30, 2011

ఐరాస బదులు ఐకాస


రాష్ట్ర విభజన ఉద్యమాల వార్తలు కవర్‌ చేసీ చేసీ... పాపం చాలా మంది జర్నలిస్టు మిత్రులు ఐ... అన్న అక్షరంతో ప్రారంభమయ్యే ఏ పదాన్నయినా ఐకాస అనే రాస్తున్నట్టుంది. కావాలంటే ఇవాళ ఈనాడు వెబ్‌ పేజీ, www.eenadu.net లోకి వెళ్లి, తాజావార్తల్లో " ఐకాస ఉగ్రవాద వ్యతిరేక ఆంక్షల జాబితాలో పాక్‌ తాలిబాన్‌ " అన్న వార్త ఉంటుంది చూడండి. పాపం ఐరాస అని రాయబోయి.. సదరు మిత్రుడు ఐకాస అని రాసేశాడు. హడావుడి జర్నలిజంలో తప్పులు సహజమే.. అయినా జర్నలిస్టు మిత్రులు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఉదాహరణ స్పష్టం చేస్తోంది. ఇది సరదాకే తప్ప.. ఎవరినీ దెప్పి పొడుద్దామని కాదు సుమా..!

www.eenadu.net

Thursday, June 23, 2011

ఈనాడు... "స్టీఫెన్‌ రవీంద్ర" కులాన్ని మార్చేసింది..!


పాపం..! ఈనాడు దినపత్రిక పుణ్యమా అని డిసిపి స్టీఫెన్‌ రవీంద్ర... స్టీఫెన్‌ రెడ్డి అయిపోయారు. ఆయన పేరు వింటేనే.. ఆయన కుల మతాలు తేలిగ్గా అర్థమై పోతాయి. పోనీ ఆయన, ఎవరో తెలియని అనామకుడా అంటే అదీ కాదు. వరంగల్ జిల్లాలో మావోయిస్టుల అణచివేతలోను‌, అనంతపురం జిల్లాల ఫ్యాక్షనిస్టుల పీచమణచడంలోనూ.. ఎస్పీగా ఆయన చూపిన చొరవ అనితర సాధ్యం. అంతే వివాదాస్పదం. అంతేకాకుండా, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో.. విద్యార్థులపై పోలీసుల లాఠిన్య వేళా.. ఆయన పాత్ర వివాదాస్పదమైంది. అంతలా ప్రాచుర్యం పొందిన వ్యక్తి పేరును 'స్టీఫెన్‌ రెడ్డి' అని రాయడంలో ఈనాడు లోని సదరు సబ్‌ ఎడిటర్‌ నిర్లక్ష్యం తేటతెల్లమవుతుంది.

తప్పులు చేయడం.. తప్పుగా రాయడం మానవ సహజం... కానీ వ్యక్తుల మనోభావాలను దెబ్బతీసేలాంటి తప్పులు ఎట్టిపరిస్థితుల్లోనూ క్షంతవ్యం కాదు. ముఖ్యంగా ఈనాడు లాంటి అత్యధిక సర్క్యులేషన్‌ గల దినపత్రికలో అట్లాంటి తప్పులు దొర్లకుండా చూడాలి. ఇలాంటి సందర్భాల్లో సబ్‌ ఎడిటర్‌ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అవతలివాళ్లు వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తే... పెద్ద రచ్చే జరుగుతుంది.

మాలాంటి వాళ్లం ఇప్పటికీ ఈనాడు భాషనే ప్రామాణికంగా భావిస్తుంటాం. అంతటి సమున్నతమైన పత్రికలో పనిచేసే వ్యక్తులకు... రాసే భాష విషయంలో మరింత గురుతరమైన బాధ్యత ఉంటుంది. ఈ విషయాన్ని ఈనాడులోని ప్రస్తుత సబ్‌ఎడిటర్లు గుర్తుంచుకుంటే సంతోషం.