| జర్నలిస్టు మిత్రులు తరచూ వాడే పదాల్లో అచ్చుతప్పులు ఎక్కువగా దొర్లుతున్నాయి. ఫలితంగా.. చాలా సార్లు దురర్థం వస్తోంది. ( ఉదాహరణకు పుణ్యాంగన అంటే పవిత్రమైన స్త్రీ అని అర్థం. ఐతే, పొరపాటున పణ్యాంగన అని రాస్తే వెలయాలు, వేశ్య అని అర్థం వస్తుంది) అందుకే ఇలాంటి దారుణాలు జరగకూడదన్న సదాశయంతో.. జర్నలిస్టు మిత్రులు తరచూ వాడే పదాల అసలు స్వరూపాలను (వాటి తప్పు రూపాలతో సహా) ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఇది జర్నలిస్టు మిత్రులందరికీ ఉపయోగపడుతుందని.. ఉపయోగపడాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ప్రస్తుతానికి పదాల స్వరూపాలతోనే ముగిద్దాం. తర్వాతి పోస్టులో వీటి అర్థాలు.. వినియోగించే సందర్భాల గురించి చర్చిద్దాం. ( www.journomucchatlu.blogspot.com అనే url తో ఎప్పుడైనా సరే మీరు పదాలను సరిపోల్చుకునేందుకు నా ఈ ప్రయత్నం ఉపయోగ పడుతుందని నమ్ముతున్నాను) మీ... విజయ్ | |||
| తప్పు | ఒప్పు | తప్పు | ఒప్పు |
| ఆగచాట్లు | అగచాట్లు | ఆగత్యం | అగత్యం |
| అట్టాహాసం | అట్టహాసం | అదిగమించు | అధిగమించు |
| అధ్యాయనం | అధ్యయనం | అనర్దదాయకం | అనర్థదాయకం |
| అనుభందం | అనుబంధం | అనుసంథానం | అనుసంధానం |
| అంధలం | అందలం | అపరాథం | అపరాధం |
| అపబ్రంశం | అపభ్రంశం | అపొహ | అపోహ |
| అప్పానంగా | అప్పనంగా | అభద్దం | అబద్ధం |
| అబినందన | అభినందన | అబిమానం | అభిమానం |
| అబియోగం | అభియోగం | అబ్యంతరం | అభ్యంతరం |
| అబ్యర్తి | అభ్యర్థి | అభ్యుధయం | అభ్యుదయం |
| అమాత్యిడు | అమాత్యుడు | అమంతంగా | అమాంతంగా |
| అయోమైయంగా | అయోమయంగా | అరాచకం | అరాజకం |
| అలంకారించు | అలంకరించు | అవకాతవకలు | అవకతవకలు |
| ఆవగాహన | అవగాహన | ఆవశ్యం | అవశ్యం |
| ఆగ్రహాం | ఆగ్రహం | ఆశనిపాతం | అశనిపాతం |
| అశ్రద్ద | అశ్రద్ధ | అసబ్యంగా | అసభ్యంగా |
| అగంతకుడు | ఆగంతకుడు | అస్థమానం | అస్తమానం |
| అక్షేపించు | ఆక్షేపించు | అకతాయి | ఆకతాయి |
| అంక్షలు | ఆంక్షలు | అణిముత్యాలు | ఆణిముత్యాలు |
| ఆధరణ | ఆదరణ | ఆధర్శం | ఆదర్శం |
| ఆధాయం | ఆదాయం | ఆమోధం | ఆమోదం |
| ఆయుకట్టు | ఆయకట్టు | ఆరంబం | ఆరంభం |
| అరిమరికలు | అరమరికలు | ఆర్బాటం | ఆర్భాటం |
| ఆవరన | ఆవరణ | ఆస్రితపక్షపాతం | ఆశ్రిత పక్షపాతం |
| అగ్నిమాపుకం | అగ్నిమాపకం | అత్తిసరు | అత్తెసరు |
| అర్బకుడు | అర్భకుడు | అష్ఠకష్ఠాలు | అష్టకష్టాలు |
| అష్ఠైశ్వర్యాలు | అష్టైశ్వర్యాలు | అస్థవ్యస్థం | అస్తవ్యస్తం |
| ఆధునీకరణ | ఆధునికీకరణ | ఆనవాయతీ | ఆనవాయితీ |
| ఆబాలగోపాళం | ఆబాలగోపాలం | అబివృద్ది | అభివృద్ధి |
| అబిప్రాయం | అభిప్రాయం | అధికృత | అధీకృత |
| అంతర్యుద్దం | అంతర్యుద్ధం | అణ్వాస్త్రం | అణ్వస్త్రం |
| అధారిటీ | అథారిటీ | అనివారంగా | అనివార్యంగా |
| అభ్యర్దించు | అభ్యర్థించు | అవస్త | అవస్థ |
| అగాయిత్యం | అఘాయిత్యం | అత్యథికం | అత్యధికం |
| అధమ | అథమ | అదిక్షేపించు | అధిక్షేపించు |
| అనవతం | అవనతం | అర్ధంతరంగా | అర్ధాంతరంగా |
| అణుకువ | అణకువ | అతిధి | అతిథి |
| అధిష్టానం | అధిష్ఠానం | అగాథం | అగాధం |
| అద్వాన్నం | అధ్వానం | అప్రతిష్ట | అప్రతిష్ఠ |
| అరిష్ఠం | అరిష్టం | అవ్యజ | అవ్యాజ |
| అంతర్థానం | అంతర్ధానం | అతిరధుడు | అతిరథుడు |
| అనర్ధం | అనర్థం | అతివృష్ఠి | అతివృష్టి |
| అనుసంథానం | అనుసంధానం | అర్జి | అర్జీ |
| ఆక్రమం | అక్రమం | అక్షంతలు | అక్షింతలు |
| అగ్రస్తానం | అగ్రస్థానం | అజమాయషీ | అజమాయిషీ |
| అత్తలాకుత్తలం | అతలాకుతలం | రంగరంగవైభవం | అంగరంగ వైభవం |
| అడ్డాదిడ్డం | అడ్డదిడ్డంగా | అదృస్యం | అదృశ్యం |
| అధీగమించు | అధిగమించు | అద్యక్షుడు | అధ్యక్షుడు |
| అనుచెరుడు | అనుచరుడు | అనుచిత్తంగా | అనుచితంగా |
| అనుసందానం | అనుసంధానం | ఆహుతులు | ఆహూతులు |
| ఆక్షేపన | ఆక్షేపణ | ఆచ్చాదన | ఆచ్ఛాదన |
| అతిథ్యం | ఆతిథ్యం | ఆస్థులు | ఆస్తులు |
| ఆస్థిపాస్థులు | ఆస్తిపాస్తులు | ఆర్దిక | ఆర్థిక |
| ఆంద్రుడు | ఆంధ్రుడు | అల్పఫీడనం | అల్పపీడనం |
| ఇంగీతం | ఇంగితం | ఇథోదికంగా | ఇతోధికంగా |
| ఇబ్భంది | ఇబ్బంది | ఇబ్బుడిముబ్బుడి | ఇబ్బడిముబ్బడి |
| ఇనస్పెక్టర్ | ఇన్స్పెక్టర్ | ఇల్లరికటం | ఇల్లరికం |
| ఈర్ష | ఈర్ష్య | ఈసుడింపు | ఈసడింపు |
| ఉద్గాటించారు | ఉద్ఘాటించారు | వుత్తమం | ఉత్తమం |
| ఉల్లంగించారు | ఉల్లంఘించారు | ఉచ్ఛారణ | ఉచ్చారణ |
| ఉపోద్గాతం | ఉపోద్ఘాతం | ఉన్నపలంగా | ఉన్నపళంగా |
| ఉపాద్యక్షుడు | ఉపాధ్యక్షుడు | ఉత్తానపతనాలు | ఉత్థానపతనాలు |
| గుండ్రాళ్లదెబ్బ | ఉండేలు దెబ్బ | వుచితంగా | ఉచితంగా |
| ఉద్బవించారు | ఉద్భవించారు | ఉత్ఫాథం | ఉత్పాతం |
| ఉఢాయించారు | ఉడాయించారు | ఉదాశీనత | ఉదాసీనత |
| ఉత్సావం | ఉత్సవం | ఉధ్యమం | ఉద్యమం |
| ఉదాహారణ | ఉదాహరణ | ఉధ్వాసన | ఉద్వాసన |
| ఉద్భోదించారు | ఉద్బోధించారు | ఉపాచారం | ఉపచారం |
| ఉపగృహం | ఉపగ్రహం | ఉపయోగ్యం | ఉపయోగం |
| ఉపదేశ్యం | ఉపదేశం | ఉప సంహారణ | ఉపసంహరణ |
| ఉపాది | ఉపాధి | ఉవ్విల్లూరు | ఉవ్విళ్లూరు |
| ఊరుమ్ముడి | ఊరుమ్మడి | ఎడతెరుపి | ఎడతెరిపి |
| ఏకాఎకిన | ఎకాఎకిన | ఎద్ధడి | ఎద్దడి |
| ఎన్నైక | ఎన్నిక, ఎంపిక | ఏన్నర్థంగా | ఏణ్ణర్థంగా |
| ఏమరుపాటిగా | ఏమరుపాటుగా | ఐచ్చిక | ఐచ్ఛిక |
| ఏకంతంలో | ఏకాంతంలో | ఐక్యమత్యం | ఐకమత్యం |
| ఐఖ్యం | ఐక్యం | ఔఛిత్యం | ఔచిత్యం |
| ఒడంభడిక | ఒడంబడిక | కధ | కథ |
| కనిష్ఠం | కనిష్టం | కౌన్సిలింగ్ | కౌన్సెలింగ్ |
| కటాకట | కటకట | ఖచ్చితంగా | కచ్చితంగా |
| కలక్టరేట్ | కలెక్టరేట్ | క్రోదం | క్రోధం |
| కమీశనర్ | కమిషనర్ | క్రమబద్దీకరణ | క్రమబద్ధీకరణ |
| కూలంకశంగా | కూలంకషంగా | ఖంగారు | కంగారు |
| కలువరింత | కలవరింత | కాపురస్తులు | కాపురస్థులు |
| కల్లోళం | కల్లోలం | కాలుశ్యం | కాలుష్యం |
| కార్యదర్సి | కార్యదర్శి | కూలంఖషంగా | కూలంకషంగా |
| కీర్తిసేషులు | కీర్తిశేషులు | కాయిలా | ఖాయిలా |
| క్రీఢాకారులు | క్రీడాకారులు | ఖచ్చితంగా | కచ్చితంగా |
| కాకీ | ఖాకీ | గాతం | ఘాతం |
| గర్బం | గర్భం | గాయికుడు | గాయకుడు |
| గాయిని | గాయని | గ్రంధసాంగుడు | గ్రంథసాంగుడు |
| గ్రంధం | గ్రంథం | గుభాళింపు | గుబాళింపు |
| గుత్తాదిపత్యం | గుత్తాధిపత్యం | గృహస్తుడు | గృహస్థుడు |
| గూడాచారి | గూఢచారి | గడిబిడ | గడబిడ |
| గౌరవార్ధం | గౌరవార్థం | గంబీరంగా | గంభీరంగా |
| గమినించు | గమనించు | గుభులు | గుబులు |
| గరానా | ఘరానా | చతుర్ది | చతుర్థి |
| ఛట్టబద్దం | చట్టబద్ధం | చిరనామ | చిరునామా |
| చతుష్ఠయం | చతుష్టయం | చేతన్యం | చైతన్యం |
| చాంపియన్ | ఛాంపియన్ | జయంత్యోత్సవం | జయంత్యుత్సవం |
| జనార్ధన | జనార్దన | జీవచ్చవం | జీవచ్ఛవం |
| జీర్ణుద్ధరణ | జీర్ణోద్ధరణ | జళిపించు | ఝళిపించు |
| జఠిలం | జటిలం | ఢీలాపడు | డీలా పడు |
| డెప్యూటీ | డిప్యూటీ | డైరక్టరేట్ | డైరెక్టరేట్ |
| డ్రయినేజీ | డ్రైనేజీ | ఢక్కామక్కీలు | డక్కామొక్కీలు |
| డిశంబర్ | డిసెంబర్ | డయిరీ | డెయిరీ |
| డమరుకం | ఢమరుకం | తలుకుబెలుకు | తళుకుబెళుకు |
| తనికీ | తనిఖీ | తాలుకా | తాలూకా |
| తాదాత్మం | తాదాత్మ్యం | తటస్తం | తటస్థం |
| తాకత్తు | తాహతు | తలక్రిందులు | తల్లకిందులు |
| త్రైపక్షిక | త్రైపాక్షిక | తిరోగామం | తిరోగమనం |
| తలవొంపులు | తలవంపులు | తృటి | త్రుటి |
| తిరస్కారించు | తిరస్కరించు | దగ్దం | దగ్ధం |
| తీర్ధం | తీర్థం | ద్వందవైఖరి | ద్వంద్వ వైఖరి |
| ధృడం | దృఢం | దుష్పలితం | దుష్ఫలితం |
| దరకాస్తు | దరఖాస్తు | దృక్ఫదం | దృక్పథం |
| ధీటుగా | దీటుగా | దిగ్భందం | దిగ్బంధం |
| దౌర్బాగ్యం | దౌర్భాగ్యం | ధండకం | దండకం |
| దిగ్బ్రాంతి | దిగ్భ్రాంతి | దాఖలు | దఖలు |
| దైర్యం | ధైర్యం | దగ్దం | దగ్ధం |
| దంఢయాత్ర | దండయాత్ర | దుర్ధినం | దుర్దినం |
| దహానం | దహనం | దర్మాసనం | ధర్మాసనం |
| దషకం | దశకం | దిక్కరించు | ధిక్కరించు |
| దోహధపడు | దోహదపడు | ద్యేయం | ధ్యేయం |
| దాటి | ధాటి | దృవీకరించు | ధ్రువీకరించు |
| ధురందరుడు | దురంధరుడు | దుర్బేధ్యం | దుర్భేద్యం |
| దరలు | ధరలు | నిర్ద్వందంగా | నిర్ద్వంద్వంగా |
| దూమపానం | ధూమపానం | నిర్ధారణ | నిర్ధరణ |
| నిముషం | నిమిషం | నిషేదిత | నిషేధిత |
| నిర్భందం | నిర్బంధం | నిసృహ | నిస్పృహ |
| నిశ్చితార్ధం | నిశ్చితార్థం | నిర్ధిష్టంగా | నిర్దిష్టంగా |
| నిశేదాజ్ఞలు | నిషేధాజ్ఞలు | నెంబరు | నంబరు |
| నేరస్తులు | నేరస్థులు | నిర్ధయ | నిర్దయగా |
| నేపద్యం | నేపథ్యం | న్యాయస్తానం | న్యాయస్థానం |
| నిరూపయోగం | నిరుపయోగం | నసించు | నశించు |
| నిర్ధాక్షిణ్యం | నిర్దాక్షిణ్యం | నిక్కచ్ఛిగా | నిక్కచ్చిగా |
| నదీనదులు | నదీనదాలు | నిమత్తం | నిమిత్తం |
| నాస్థికుడు | నాస్తికుడు | నిరాయుదీకరణ | నిరాయుధీకరణ |
| నిఘ్రహం | నిగ్రహం | నివృతి | నివృత్తి |
| నిరాఠంకంగా | నిరాటంకంగా | నిర్భందం | నిర్బంధం |
| నిరాహార ధీక్ష | నిరాహార దీక్ష | నిర్వీరం | నిర్వీర్యం |
| నిర్ధేశ్యం | నిర్దేశం | నిష్క్రమింఛారు | నిష్క్రమించారు. |
| నిర్వాఖం | నిర్వాకం | నైవేధ్యం | నైవేద్యం |
| నివేధిక | నివేదిక | ప్రధమ | ప్రథమ |
| నీరషించు | నీరసించు | పట్టబద్రులు | పట్టభద్రులు |
| ప్రత్యామ్నం | ప్రత్యామ్నాయం | పుంకానుపుంకాలు | పుంఖానుపుంఖాలు |
| పంఛాయతీ | పంచాయితీ | పునర్వవస్తీకరణ | పునర్వ్యవస్థీకరణ |
| పటిష్ఠం | పటిష్టం | ప్రయివేటు | ప్రైవేటు |
| పునరుద్గాటించు | పునరుద్ఘాటించు | పశుసంవర్దక | పశుసంవర్ధక |
| ప్రాధమిక | ప్రాథమిక | ప్రాదేయపడు | ప్రాధేయపడు |
| పరిణామ్యం | పరిణామం | పరివాహక | పరీవాహక |
| పురష్కారం | పురస్కారం | పర్యావసానం | పర్యవసానం |
| పరిక్ష | పరీక్ష | ప్రణాలిక | ప్రణాళిక |
| పరోపంగా | పరోక్షంగా | పించెను | పింఛను |
| పలయానం | పలాయనం | ఫుకారు | వదంతి |
| పల్లెత్తమాట | పల్లెత్తుమాట | పరంబోకు | పోరంబోకు |
| పీపాస | పిపాస | ప్రచ్చనం | ప్రచ్ఛన్నం |
| పూర్వత్తరాలు | పూర్వోత్తరాలు | ప్రతిబ | ప్రతిభ |
| ప్రక్షాలనం | ప్రక్షాళనం | ప్రతిక | ప్రతీక |
| ప్రతిష్ట | ప్రతిష్ఠ | ప్రబాతం | ప్రభాతం |
| ప్రత్యర్ధి | ప్రత్యర్థి | ప్రలోబం | ప్రలోభం |
| ప్రబంజనం | ప్రభంజనం | ప్రశక్తి | ప్రసక్తి |
| ప్రమానం | ప్రమాణం | ప్రాంగనం | ప్రాంగణం |
| ప్రవాశం | ప్రవాసం | భాద్యత | బాధ్యత |
| పందారం | పందేరం | భీభత్సం | బీభత్సం |
| బాహబాహి | బాహాబాహీ | భహిరంగంగా | బహిరంగంగా |
| భుద్ది | బుద్ధి | బ్రహ్మరధం | బ్రహ్మరథం |
| భడుగు | బడుగు | బీష్మించు | భీష్మించు |
| బృంధావనం | బృందావనం | బౌతిక | భౌతిక |
| బవిత | భవిత | భ్రష్ఠుడు | భ్రష్టుడు |
| బేషజం | భేషజం | మర్థించు | మర్దించు |
| బాగస్తులు | భాగస్థులు | మద్యాన్నం | మధ్యాహ్నం |
| భూస్తాపితం | భూస్థాపితం | మనస్థాపం | మనస్తాపం |
| మధ్యపానం | మద్యపానం | మలేషియా | మలేసియా |
| మదువు | మధువు | మెలకువ | మెళకువ |
| మరమత్తు | మరమ్మతు | మార్చ్ | మార్చి |
| మార్ధవం | మార్దవం | మితృడు | మిత్రుడు |
| మహాత్యం | మహాత్మ్యం | మమైకం | మమేకం |
| మథలబు | మతలబు | యధాతధం | యథాతథం |
| మనోనిబ్భరం | మనోనిబ్బరం | యుద్దం | యుద్ధం |
| యధార్థం | యథార్థం | యదేచ్ఛగా | యధేచ్చగా |
| యాదృచ్చికం | యాదృచ్ఛికం | రబస | రభస |
| యవ్వనం | యౌవనం | రంగేళిరాట్నం | రంగులరాట్నం |
| రధం | రథం | రొచ్ఛు | రొచ్చు |
| రిజిష్ట్రార్ | రిజిస్ట్రార్ | రవుతు | రౌతు |
| రాజదాని | రాజధాని | లాటీఛార్జి | లాఠీచార్జ్ |
| రోదశి | రోదసి | లంకణం | లంఖణం |
| లబ్ధిదారులు | లబ్దిదారులు | వైశమ్యం | వైషమ్యం |
| లక్షం | లక్ష్యం | విద్యుద్ఘాతం | విద్యుదాఘాతం |
| వ్యర్ధం | వ్యర్థం | వార్శికం | వార్షికం |
| వ్యాహ్యాళి | వాహ్యాళి | విఛక్షణ | విచక్షణ |
| విమర్ష | విమర్శ | వ్యక్తిగథం | వ్యక్తిగతం |
| వినోధం | వినోదం | వేధిక | వేదిక |
| విరాలం | విరాళం | వెవహారం | వ్యవహారం |
| విస్పోటన | విస్ఫోటన | వ్యాఫారి | వ్యాపారి |
| వెవసాయం | వ్యవసాయం | శబ్ధం | శబ్దం |
| వ్యాక్యానం | వ్యాఖ్యానం | షాశనం | శాసనం |
| వాయగండం | వాయుగుండం | స్మశానం | శ్మశానం |
| శతగ్ని | శతఘ్ని | శికారు | షికారు |
| షాతం | శాతం | సమర్ధించడం | సమర్థించడం |
| శోదన | శోధన | సంభోదన | సంబోధన |
| శృతి | శ్రుతి | సషేశం | సశేషం |
| సధస్సు | సదస్సు | సమృద్ది | సమృద్ధి |
| స్తోమత | స్థోమత | సారధి | సారథి |
| సంషయం | సంశయం | స్తలం | స్థలం |
| సంగటం | సంకటం | సంస్త | సంస్థ |
| సదుద్ధేశ్యం | సదుద్దేశం | సృహలో | స్పృహలో |
| స్తిరం | స్థిరం | సఛివులు | సచివులు |
| స్వచ్చందంగా | స్వచ్ఛందంగా | సందర్బం | సందర్భం |
| స్తితిగతులు | స్థితిగతులు | సమీకరనాలు | సమీకరణాలు |
| సంజాయషీ | సంజాయిషీ | సంస్తాగతం | సంస్థాగతం |
| సంథరించు | సంతరించు | సమిక్ష | సమీక్ష |
| సబ్యుడు | సభ్యుడు | సహాకారం | సహకారం |
| సమర్ధన | సమర్థన | సౌష్టవం | సౌష్ఠవం |
| సమిష్టి | సమష్టి | స్తాయి | స్థాయి |
| సవరన | సవరణ | స్తూలంగా | స్థూలంగా |
| సవుజన్యం | సౌజన్యం | స్ఫందన | స్పందన |
| స్తావరం | స్థావరం | హేమాహేమిలు | హేమాహేమీలు |
| స్నాతకుత్సవం | స్నాతకోత్సవం | హుటాహుటన | హుటాహుటిన |
| స్వానుబవం | స్వానుభవం | క్షిఫణి | క్షిపణి |
| హటాత్తుగా | హఠాత్తుగా | హడావిడి | హడావుడి |
Saturday, November 27, 2010
జర్నలిస్టు మిత్రులారా, ఇదిగో తప్పొప్పుల పట్టిక..
Friday, November 26, 2010
భగవంతుడి మర్మాంగమే ధ్వజస్తంభం..!??

దేవాలయం అంటే నాలుగు చుట్టు గోడలు.. పైన ఓ కప్పు... అందులో రాతితో చేసిన ఓ విగ్రహం.. ఆ బొమ్మకు భక్తి ముసుగులోని కొందరు మూర్ఖులు ఆపాదించిన శక్తి అన్నది నాస్తికులమని చెప్పుకునే వారి భావన. వారి వాదన నిజమా..? ఆలయమంటే ఇంతేనా..?
కాదు.. ముమ్మాటికీ వారి భావన తప్పు.
ఆలయం అంటే.. సాక్షాత్తూ ఆ దేవదేవుడి నివాస స్థలం. స్వామి శరీరాకృతికి ప్రతిరూపం. ఆ సర్వోపహతుడి అంగాంగ విశిష్టతలను చాటే నిర్మాణ చాతుర్యం. (వాస్తు రీత్యా) ఆలయ నిర్మాణ రీతే చాలా విశిష్టమైనది.
దేహమే దేవాలయం. శరీరంలోని షడ్చక్ర స్థానాలు సాక్షాత్తూ భగవత్స్వరూపాలు. వీటిని ఆధీనంలో ఉంచుకుంటే.. జీవుడే దేవుడవుతాడు. ఆ షడ్చక్రాలు (ఆరు చక్రాలు) ఏంటో.. వాటికీ భగవంతుడికీ.. ఆ అంతర్యామి కొలువుండే ఆలయానికీ ఎలాంటి అనుసంధానముందో.. ఓసారి చూద్దాం.
సహస్రార చక్రము: (గర్భ గుడి)
జీవుడికి ఆధారమైన చక్రమిది. మస్తిష్కం (తలలోని మెదడు) పనిచేస్తేనే జీవుడు ఉన్నట్లు.. మెదడు పనిచేయకుంటే.. జీవుడు గాలిలో కలిసి పోయినట్లే. మస్తిష్కం.. జీవుడికే అంతటి కీలకమైనదైతే.. సమస్త జీవకోటిని సృష్టించి, పోషించే ఆ పరంధాముడి మస్తిష్కం మరెంతటి విశిష్టమైనదై ఉండాలి..? మస్తిష్కం.. బ్రహ్మ రంధ్రానికి దిగువన వేయి రేకులతో వికసించే పద్మం అన్నది ప్రాజ్ఞుల నమ్మిక. ఈ కమలం మాయతో ఆవరించి ఉంటుందని.. ఆత్మజ్ఞానాన్ని సాధించిన పరమహంసలు మాత్రమే దీన్ని పొందగలుగుతారన్నది హిందువుల విశ్వాసం. దీన్ని శివులు శైవస్థానమని, వైష్ణవులు పరమ పురుష స్థానమని, ఇతరులు హరిహర స్థానమనీ, దేవీ భక్తులు.. దేవీ స్థానమని పిలుచుకుంటారు. ఈ స్థానం పరిపూర్ణంగా తెలుసుకున్న మనుషులకు పునర్జన్మ ఉండదని కర్మ సిద్ధాంతం చెబుతుంది.
గర్భాలయం : శరీరంలో సహస్రారం ఎంతటి విశిష్టమైనదో.. ఆలయ నిర్మాణంలో గర్భగుడి కూడా అంతే విశిష్టమైనది. దీన్ని గర్భాలయం లేదా ముఖమంటపమని అంటారు. ఇది అత్యంత పవిత్రమైనది. పరమ యోగులు.. స్వామివారి కరుణ భాగ్యాన్ని పొందిన వారికి మాత్రమే ఇందులో ప్రవేశించే అర్హత వస్తుంది.ఆజ్ఞా చక్రము: రెండోది ఆజ్ఞా చక్రం ఇది భ్రూ (కనుబొమల) మధ్య లో ఉంటుంది. ఈ చక్రము, రెండు రంగులతో కూడిన రెండు రేకులు (దళాలు) ఉండే కమలంలా ఉంటుందట. (ఇది కూడా గర్భాలయానికి సంబంధించిన అంశమే.)
విశుద్ధి చక్రము: (అంతరాలం)
మూడోది విశుద్ధి చక్రము. ఇది కంఠ స్థానంలో ఉంటుంది. ఈ చక్రం, తెల్లగా మెరిసిపోయే పదహారు రేకులతో కూడిన కమలంలా ఉంటుందట. ఇది ఆకాశతత్వానికి ప్రతీక అన్నది విశ్వాసం.
అంతరాలం : ఆలయ నిర్మాణంలో విశుద్ధి స్థానాన్ని అంతరాలంగా పిలుస్తారు. ముఖ మంటపాన్నీ మహా మంటపాన్నీ కలిపే స్థానమే అంతరాలం.
అనాహత చక్రము: (అర్ధమంటపం)
ఇది హృదయ (రొమ్ము) స్థానంలో ఉంటుంది. బంగారు రంగులోని పన్నెండు రేకులు గల కమలంలా ఉంటుందిట. ఇది వాయుతత్వానికి ప్రతీక.
అర్ధమంటపం : గర్భాలయానికి ముందు ఉండే మంటపాన్ని ముఖమంటపం లేదా అర్ధమంటపం అంటారు. భగవంతుడి శరీరంలో రొమ్మును ఇది ప్రతిబింబిస్తుంది.
మణిపూరక చక్రము: (మహామంటపం)
నాభి (బొడ్డు) మూలంలో ఈ చక్రం ఉంటుంది. నీల వర్ణంలోని పది దళాలు (రేకులు) కలిగిన పద్మంలా ఉంటుంది. ఇది అగ్ని తత్వాన్ని ప్రతిఫలిస్తుంది.
ఆలయ నిర్మాణంలో... గొంతు నుంచి నాభి దిగువ దాకా మహా మంటపమే ఉంటుంది.
స్వాధిష్ఠాన చక్రము: (ధ్వజస్తంభం)
ఈ చక్రము లింగ (పురుషాంగం) మూలంలో ఉంటుంది. ఈ చక్రం సింధూర వర్ణం గల ఆరు దళాల కమలమట. ఇది జలతత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
ధ్వజస్తంభం : ఆలయ నిర్మాణ రీతిని అనుసరించి, మహా మంటపానికి ముందు ఈ స్తంభం ఉంటుంది. దేవుడి అంగమే ఈ ధ్వజస్తంభం. అంగ మొల వేలుపు అని శివుడికి పేరు. అంగ మొల అంటే, వస్త్రాలేమీ లేని కటి ప్రదేశం అని అర్థం. ధ్వజము అన్నా కూడా జెండా అని, మగ గురి అనీ అర్థాలున్నాయి. మగ గురి లో మగ అంటే.. మగటిమి అని, గురి అంటే లక్ష్యము అని అర్థం. నిజానికి ధ్వజము అంటేనే మగ (పుంసత్వపు) గురి అన్న అర్థముంది. ఏది ఏమైనా భగవంతుడి మర్మాంగ రూపమే ధ్వజస్తంభం అనడంలో సందేహం లేదు. ఆంజనేయుడి ధ్వజస్తంభానికి మండల కాలం పూజలు చేసి ప్రదక్షిణలు చేస్తే.. వివాహాది ఇష్ట కార్యసిద్ధి కలుగుతుందన్న విశ్వాసం కూడా ధ్వజస్తంభం విశిష్టతను చాటుతుంది.
మూలాధార చక్రము:
అన్ని నాడులకూ ఆధారమైన ఈ చక్రం గుద స్థానంలో ఉంటుంది. గుద స్థానానికి పైన, లింగ స్థానానికి కింద (గుద, లింగం రెంటి మధ్యలో) ఉంటుంది. ఎర్రటి రంగులోని నాలుగు దళాల కమలమిది. ఇందులోనే కుండలినీ శక్తి నిక్షిప్తమై ఉంటుందట.
మోకాలి స్థానం : స్వామి వారి రెండు మోకాళ్లు కలిసే స్థానం. ఇక్కడ ఓ గోపుర ద్వారం ఉంటుంది. దీన్ని దుర్గపుర ద్వారం అంటారు. (దుర్గ అంటే కోట, పురం అంటే పట్టణం అని అర్థం) అంటే ప్రజలు స్వామి దర్శనానికి చేరుకునేందుకు ఇది ప్రవేశ ద్వారం.
పాదాలు : ఇది మహాప్రాకార గోపుర స్థానం. (ప్రాకారం అంటే గుడి మొదలైన వాటి చుట్టూ ఉన్న గోడ అని అర్థం. మహా అంటే చాలా గొప్పగా (పటిష్టంగా) అని అర్థం. అంటే శత్రువులు కోటలోకి రాకుండా రాజులు ఎలా దుర్భేద్యమైన ప్రాకారాన్నినిర్మించే వాళ్లో.. గుడికీ, దుష్టశక్తులు ప్రవేశించకుండా ఈ మహాప్రాకార గోపురాన్ని నిర్మిస్తారు. మనం మహాప్రాకారం దాటి లోపలికి వెళుతుండగానే.. మన మనసుల్లోని అన్ని బాధలు, చెడు తలంపులకు కారణమైన... కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం అనే అరిషడ్వర్గాలన్నీ ప్రాకారం బయటే నిలిచిపోతాయి. అందుకే గుళ్లోకి వెళ్లగానే మన మనసు ప్రశాంతమై పోతుంది.
ఇదీ గుడి నిర్మాణం.. ఆ గుళ్లో భగవంతుడి శరీర స్థానాల విశిష్టతల గురించిన సమాచారం. కాబట్టి, ఇకమీదట గుడికి వెళ్లేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకుని, స్వామిని మనస్పూర్తిగా ధ్యానించండి. భగవంతుడి ఆశీస్సులు పొందండి. సర్వే జనాస్సుఖినో భవంతు.
Thursday, November 25, 2010
మా అబ్బాయి "సంకష్ట వ్రతం" చేస్తున్నాడు ఎందుకో..!
రాత్రి ఆఫీసులో స్టాఫ్ తక్కువగా ఉండడం.. ముఖ్యమంత్రి మార్పిడికి సంబంధించిన వార్తా కథనాలు రాయడం, రాయించాల్సి ఉండడంతో.. 24వ తేదీ రాత్రి ఆఫీసులోనే గడిపాను. 25వ తేదీ అంటే, నిన్న ఉదయం 8 గంటలకు, 10 గంటలకు ప్రాంతీయ వార్త బులెటిన్లు పూర్తి చేసి ఇంటికి వచ్చాను. అప్పుడు మా శ్రీమతి ఓ ఆశ్చర్యకరమైన విషయం చెప్పింది.మా అబ్బాయి వికాస్ (తను టెన్త్ క్లాస్ చదువుతున్నాడు) సంకట హర వ్రతాన్ని చేస్తానని చెప్పాడట. ఆమేరకు దేవుడి గదిలో.. విఘ్నేశ్వరుడి ప్రతిమ ముందు సంకల్పించుకుని.. మా ఆవిడ వారిస్తున్నా వినకుండా ఏమీ తినకుండా, లంచ్ బాక్స్ తీసుకోకుండా స్కూలుకి వెళ్లిపోయాడట. (ఈ వ్రతాన్ని చేసేవారు ఉదయాన్ని స్నానాదికాలు ముగించి, గణపతి ముందు కూర్చుని దీప, ధూపాలతో పూజించి, "రోజంతా ఉపవాసం ఉండి.. రాత్రికి సంకష్ట వ్రతాన్ని ఆచరిస్తా.." అని స్వామి ముందు సంకల్పించుకుంటారు. రాత్రి వేళ పూజ చేసి.. స్వామికి నివేదించిన పదకొండు కుడుములలో ఓ ఐదింటిని మాత్రమే తిని ఉపవాస దీక్ష విరమించి, నిద్రిస్తారు. ) మా అబ్బాయి ఈ వ్రతాన్ని చేస్తాననడం నాకు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది. సాధారణంగా ఈ వయసులో పిల్లలు ఆటపాటలతో.. స్నేహితులతో సరదాగా గడిపేందుకు ఇష్టపడతారు. కానీ మా అబ్బాయి వ్రతాల వైపు ఆకర్షితుడవుతున్నాడేంటా అని ఆలోచించా. అయినా.. ఆకలికి తనెక్కడ తట్టుకుంటాడులెమ్మని సర్ది చెప్పుకున్నా.

ఆఫీసులో పని ముగించుకుని నిన్న రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చేసరికి, మా అబ్బాయి.. వాళ్లమ్మ (నా శ్రీమతి) ఇద్దరూ వ్రతాచరణలో హడావుడిగా ఉన్నారు. ఏదో ఆషామాషీగా అనుకున్నా గానీ.. మా అబ్బాయి సంకష్ట వ్రతాచరణ పట్ల నిజంగానే పట్టుదలతో ఉండడం అబ్బురపరిచింది. వికాస్ ముఖం కాస్త వడిలినట్లున్నా.. కాంతిమంతంగా ఉండడం కాస్త ఆలోచించేటట్లు చేసింది. ఏమైతేనేం.. తను, వాళ్లమ్మతో కలిసి దిగ్విజయంగా వ్రతాన్ని ఆచరించాడు.
పదో తరగతి చదువుతున్నాడు కదా..! ఒకవేళ పరీక్షలంటే భయపడి ఇలా వ్రతాల వైపు మొగ్గు చూపుతున్నాడేమో అని అనుమానం వేసింది. అదే విషయాన్ని మా అబ్బాయిని అడిగా.. నథింగ్ డూయింగ్ 550 మార్కులకు పైబడే వస్తాయి.. మరికాస్త చదివితే ఇంకొన్ని మార్కులు వస్తాయి.. అన్నాడు. (అది నిజమే) మరి ఈ వయసులో ఇంత కఠినమైన వ్రతాన్ని ఎందుకు మొదలు పెట్టావు..? అని ఆరా తీశా. జస్ట్ ఇదెలా ఉంటుందో చూద్దామనిపించింది.. చేశా దట్సాల్ అన్నాడు. ఎలా అనిపించింది..? అంటే.. బావుంది అన్నాడు.
మా అబ్బాయి వ్యవహారాన్ని పరిశీలించాక, ఈ తరం ఓ కొత్త విషయాన్ని తెలుసుకుంటే.. దాన్ని ప్రయోగాత్మకంగా రూఢీ చేసుకునేదాకా నిద్రపోరు కాబోలు అనిపించింది. 
మా అబ్బాయి సంకట హర గణపతి వ్రతాచరణ తర్వాత చంద్రదర్శనం చేసుకుని త్వరగానే నిద్రపోయాడు. సో నేను మెయిల్స్ చెక్ చేద్దామని నెట్ ఓపెన్ చేశాను. సిస్టమ్ డెస్క్‌టాప్‌పైన పేరు పెట్టని ఓ unknown ఫోల్డర్ కనిపిస్తే ఓపెన్ చేశా. అందులో మా ఫ్యామిలీ ఫోటోలున్నాయి. బాగా పరిశీలించి చూస్తే.. మా అబ్బాయి ఆధ్యాత్మిక ధోరణిని చాటే మరికొన్ని సందర్భాలు.. ఫోటోల రూపంలో కనిపించాయి. వినాయక చవితి రోజున పూజ చేసినప్పటి ఫోటో, తన ఆరేళ్ల వయసులో.. నాతోపాటు అయ్యప్ప స్వామి దీక్ష చేసినప్పటి ఫోటోలు, తిరుమల వేంకటేశుని దర్శనానికి వెళుతున్నప్పుడు ప్రకృతిని ఆరాధిస్తూ.. అక్కడి అడవి జంతువుల పట్ల ఆదరణ కనిపిస్తున్న సందర్భానికి సంబంధించిన ఫోటోలు, తన పుట్టిన రోజున నేను ప్రెజెంట్ చేసిన పెంపుడు శునకం శాండీతో మా అబ్బాయి ఆటలకు సంబంధించిన ఫోటోలు.. ఇలా రకరకాల ఫోటోలు ఆ ఫోల్డర్‌లో కనిపించాయి. అంతేనా దసరా రోజున మా అమ్మగారికి పాదాభివందనం చేస్తూ.. ఆమెతో ఆప్యాయంగా ముచ్చటిస్తున్నప్పటి ఫోటో కూడా అందులో ఉంది.

వీటన్నింటినీ చూశాక.. నాలో ఓ రకమైన భరోసా కలిగింది. చెప్పొద్దూ.. ఉన్నది ఒక్కగానొక్క నలుసాయె.. ఎక్కడ చెడు స్నేహాల వైపు వెళతాడో అని నేనూ, నాభార్యా భయపడుతుంటాం. అది పటాపంచలై పోయింది. (మా అబ్బాయికి కావలసినంత స్వేచ్ఛనిచ్చాను. అలా అని విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించలేదు. చాలా పద్ధతిగా పెరిగాడు.. కానీ ప్రేమ ఎక్కువ ఉన్న చోట భయం

కూడా అంతేస్థాయిలో ఉంటుందంటారే.. ఆ ప్రకారం ఎక్కడ పాడై పోతాడో అన్న భయం ఎంత వద్దనుకున్నా మమ్మల్ని వెంటాడుతూనే ఉంటోంది. ) శ్రుతి మించని స్థాయిలో ఆధ్యాత్మిక ధోరణి ఉంటే.. పిల్లలు చెడు నడవడికకు దూరంగా ఉంటారన్నది నా ప్రగాఢ నమ్మకం. మా అబ్బాయి ఆ దిశగా సాగుతున్నాడు. మరి ఇంటర్, గ్రాడ్యుయేషన్ లలో కూడా ఇదే సత్ప్రవర్తనను కొనసాగిస్తే.. తను దారిలో పడ్డట్లే. తల్లిదండ్రులుగా మేము భరోసాగా ఉండొచ్చనుకుంటా.. ఏమంటారు..?
నోట్ : ఈ పోస్టుతో పాటు వేస్తున్న ఫోటోలు మా పద్నాలుగేళ్ల అబ్బాయి వికాస్ వివిధ సందర్భాల్లో తీయించుకున్న ఫోటోలు.
సిఎం గారూ... ఎందుకొచ్చిన తెలుగు తిప్పలు చెప్పండీ...

రాష్ట్ర 16వ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి గారికి.. పాపం ఒక్కసారిగా తెలుగు మీద ప్రేమ పొంగిపోయింది. పదవీ స్వీకార ప్రమాణాన్ని తెలుగు భాషలోనే చేస్తానని ఆయన అధికారులకు చెప్పారు. దీనికి తగ్గట్లుగా అధికారులు కూడా ప్రమాణ పత్రాన్ని తయారు చేసి ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న నాలాంటి అర్భకులకు.. హమ్మయ్య, ఈయన హయాంలో కాస్త తెలుగుకు మంచి రోజులు వచ్చేలా ఉన్నాయి అని అనిపించింది. కానీ, సిఎం గారు ప్రతిజ్ఞ చేసిన తీరు చూశాక.. ఆశలు ఆవిరై పోయాయి. అయ్యా కిరణ్‌కుమార్ రెడ్డి గారూ మీకెందుకొచ్చిన తెలుగు తిప్పలు చెప్పండీ.. ఎంచక్కా మీకు అనర్గళంగా వచ్చే ఆ ఇంగ్లీషులోనే గోడు పెట్టుంటే పోయుండేది అని అనాలనిపించింది..
ఇంతకీ కొత్త సిఎం గారు పలికిందేంటంటే..

బారత దేస..
(నాలుక తిరగలేదేమో..)
సార్వబౌమ్..అ..అధికారాన్ని,
(ఇక్కడా తడబాటే..)
అంక్..అంక్..అంతకర్త శుద్ధితో..
(ఏంటో ఏడుపొచ్చేస్తోంది.. మొత్తం అర్థాన్నే మార్చేశారు)
రాజద్వేషాలు లేకుండా
(రాజశేఖరరెడ్డిని ఇంకా మరిచినట్లు లేదు)
శాసనం..శాస్..శాసనాలను
(పాపం గజిబిజిగా ఉంది కాబోలు)
విదేయత
(కింద జఠ ఉంటుందని, అది విధేయత అని ఇంగ్లిష్ మీడియం వారికి తెలియాలని రూలు లేదుగా)
నాయం చేకూర్చుతానని
(న్యాయం కామోసు..)
సిఎం గారు చేయాల్సిన ప్రతిజ్ఞ అసలు రూపం :
" నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అనే నేను, శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంత:కరణ శుద్ధితో నిర్వర్తిస్తానని, భయం గానీ, పక్షపాతం గానీ, రాగ ద్వేషాలు గానీ లేకుండా.. రాజ్యాంగాన్ని, శాసనాలనూ అనుసరించి, ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. "
ఇది కోడిగుడ్డుకు వెంట్రుకలు పీకే ఉద్దేశంతో రాసింది కాదు. ఎవరూ కోరక పోయినా.. తెలుగులోనే ప్రమాణం చేయాలని నిర్ణయించుకున్న సిఎం గారు, కనీసం ఆ ప్రమాణ పత్రాన్ని ముందుగా ఓసారి కూడా చదువుకోకుండా... తెలుగు భాషను, అంతలా పీకి పాకం పెడుతుంటే.. గుండెల్లో కళుక్కుమని.. ఈ ముక్కలు రాయాలనిపించింది. అంతే..! అయినా.. పోనీలెండి.. ఏదో మనమీద దయతో.. కిరణ్‌కుమార్‌రెడ్డి గారు.. మన తెలుగు భాషకు వీలైనంత ప్రాధాన్యతనిచ్చారని ఓ రవ్వ సంతోషిద్దాం. ఏమంటారు..?
Subscribe to:
Posts (Atom)