Friday, October 15, 2010

పెద్దల పండుగ ఇలా...

హైందవ సంస్కృతిలో పండుగలకు ఎంతో విశిష్టత ఉంది. వివిధ మతాలు, కులాలకు చెందిన వారు, విభిన్నమైన వేడుకలను వివిధ రూపాల్లో జరుపుకుంటూ తమ భక్తిని చాటుకుంటుంటారు. వాటిలో పితృదేవతలకు జరిపే వేడుక చాలా భిన్నంగా ఉంటుంది. చాలా చోట్ల 'పెద్దల పండుగ'గా చెప్పుకునే ఈ పండుగ చాలా విచిత్రంగా ఉంటుంది.



ఏడాదికి ఒకసారి, ఆశ్వయుజ మాసం ప్రారంభ సూచికగా వచ్చే అమావాస్య రోజును మహాలయ అమావాస్యగా చెబుతారు. చాతుర్వర్ణాలలో ఒకరైన శూద్రులకు ఈ మహాలయ అమావాస్య చాలా ముఖ్యమైంది. ఈ అమావాస్యను పెద్దల అమావాస్య అని, ఆరోజు చేసుకునే వేడుకను పెద్దల పండుగ అనీ అంటారు. భాద్రపద మాసంలో కృష్ణపక్షాన్ని మహాలయ పక్షమని, పక్షం చివర్లో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అనీ అంటారు. చనిపోయిన తమ పెద్దల ఆత్మలకు శాంతిని కలిగించేందుకు శూద్రవర్ణాల వారు.. మహాలయ అమావాస్య రోజున చేసే పూజా కార్యక్రమమే ఈ పెద్దల పండుగ.
అలంకరణ తీరు :
ఆరోజున ఉదయానికల్లా వీలైనంతలో ఇంటిని శుభ్రం చేసుకుంటారు. ఓపిక ఉన్నవారు, ఆరోజు పచ్చి గంగైనా ముట్టుకోకుండా రాత్రి వరకూ ఉపవాసం చేస్తారు. సాయంత్రం వేళ.. (ఊరి వెలుపల ఉన్న) ఎర్రమట్టిని తెచ్చి, దాన్ని నీటితో కలిపి ముద్దగా చేస్తారు. ఇంట్లో ఓ గోడచాటుగా అనువైన చోట ఆ ఎర్రమట్టి ముద్దతో నేలను అలుకుతారు. ఆ తర్వాత దానిపై జొన్న పిండి, కుంకుమలతో ముగ్గు వేస్తారు. ఆ ముగ్గుపై భాగంలో.. శుభ్రం చేసిన ఓ పీటను ఉంచి.. దాన్ని కొత్త వస్త్రంతో కప్పుతారు. అనంతరం అలంకరించిన ఆపీట పైన, ఓ రెండు, మూడు గుప్పిళ్ల బియ్యం రాసిగా పోస్తారు. ఆ బియ్యం కుప్పను సరిచేసి, దానిపై కలశం (నీటితో నిండుగా నింపిన చెంబు) ఉంచుతారు. దాన్ని విబూది, కుంకుమలతో అలంకరిస్తారు. ఆతర్వాత, దాని వెనుక గోడకు ఆనించి కొత్తగా కొన్న దుస్తులను ఉంచుతారు.


భలే వింతైన నైవేద్యం :
పైరకంగా పూజాస్థలాన్ని అలంకరించిన తర్వాత, కలశానికి రెండువైపులా దీపపు ప్రమిదలు ఉంచి వెలిగిస్తారు. అనంతరం, అంతకు ముందే వండి సిద్ధం చేసుకున్న నైవేద్యాన్ని.. పీట ఉంచగా మిగిలిన ముగ్గులో ఉంచుతారు. నైవేద్యమంటే మరేమో అనుకునేరు.. మద్యమాంసాలే! పొట్టేలును కసాయి కోసిన తర్వాత, దాని తల, కాళ్లను నిప్పులపై కాల్పిస్తారు. ఆ మాంసంతో పాటు, పొట్టేలు మెదడు, పేగులు, గుండె, కాలేయము తదితర భాగాలను వండుతారు. పొట్టేలును కోసినప్పుడు వచ్చిన రక్తంతో ప్రత్యేకంగా ఓ పచ్చడిని రూపొందిస్తారు. ఈ రకంగా వండిన వంటలను, మద్యం సీసా, పూర్వీకుల సంతృప్తి కోసం బీడీ, సిగరెట్‌ ఇలా కాదేది నైవేద్యానికి అనర్హం అన్నట్లుగా (చనిపోయిన) పెద్దలకు నివేదిస్తారు.
గోవిందుడి నామమే మంత్రం :
ఈ నైవేద్యం సమర్పించేటప్పుడు.. ఏడుకొండల వాడి నామ స్మరణే వీరికి మంత్రాలు. షోడశోపచారాలూ గోవిందుని నామస్మరణతో సరి. దీపం వెలిగించి, అగరుబత్తులు అంటించి.. సాంబ్రాణి పొగ రేపి.. ఇంట్లో ఓ రకమైన ఆధ్యాత్మక భావనను తెస్తారు. పూజ చివరలో, పత్తితో చేసిన బొడ్డువత్తితో మంగళహారతి ఇస్తారు. ఇప్పుడు కూడా గోవిందుని నామస్మరణే హారతి పాట. అందరూ ఆ హారతిని స్వీకరించాక, విస్తట్లో నైవేద్యంగా ఉంచిన పదార్థాలన్నింటినీ కొద్దికొద్దిగా తీసుకుని హారతి మంటపై.. వేస్తారు. అది ఆరిపోకుండా, నైవేద్యంగా ఉంచిన మద్యాన్ని ఆ మంటపై పోస్తారు. అది ఎంత భగభగ మంటే.. పితృదేవతలు అంత శాంతించినట్లుగా భావిస్తారు.
తర్వాత.... పూజ జరిపించిన ఇంటి పెద్ద... పెద్దలకు నమస్కరించిన ప్రతివారికీ నుదుటన నిలువుగా కుంకుమ తిలకం దిద్ది, విస్తరిలో పెద్దలకు నైవేద్యంగా పెట్టిన తినుబండారాలను కొద్దిగా తీసి ప్రసాదంగా ఇస్తారు. అది తిన్నాక, వారికి తీర్థంగా, బెల్లం పానకాన్ని అందిస్తారు. అయినవారికి, మద్యాన్ని కూడా తీర్థంగా ఓ గ్లాసులో పోసి ఇస్తారు. ఇలా ఇంట్లోని వారు, బంధుమిత్రులు ఈ పూజలు చేసి.. చనిపోయిన వారి ఆత్మశాంతికి సాంబ్రాణి ధూపాన్ని సమర్పిస్తారు. పూజ మొత్తం అయిపోయాక, చేసుకున్న వంటకాలను, మందు తాగుతూ.. తింటారు. అంతా అయ్యాక, పడుకునే ముందు... పూజలో వినియోగించిన దుస్తులను తలగడ కింద ఉంచుకుని నిద్రిస్తారు. ఇలా చేస్తే తమని అమితంగా ప్రేమించే పితృపితామహుల్లో ఒకరు కలలోకి వస్తారట.


ఎందుకీ తంతు..?
ప్రాచీన కాలంలో శూద్రులు కేవలం వృత్తి పనులకు మాత్రమే పరిమితమయ్యే వారు. అక్షరజ్ఞానం ఈ వర్ణం వారిలో చాలా తక్కువగా ఉండేది. అందుకే.. ఇతర మూడు వర్ణాల వారి మాదిరగా వీరికి తిథి, వార, నక్షత్ర, గ్రహ సంచార గతుల గురించి తెలిసేది కాదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాల వారు, తమకు తెలిసిన రీతిగా, పితృదేవతల మృతిని బట్టి.. నిర్దిష్ట కాలంలోగా తద్దినాలు పెట్టేవారు. అయితే, అప్పట్లో నిరక్షరాస్యులు, నిరుపేదలు అయిన శూద్రులకు ఈ రీతిగా తిథి, నక్షత్రాలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కో సమయంలో తద్దినం పెట్టడం కుదిరేది కాదు. అందుకే.. అందరికీ కలిపి ఒకేరోజున పెట్టే తద్దినం తంతే.. ఈ పెద్దల అమావాస్య.
మహాలయము అంటే.. గొప్ప వినాశము అని అర్థం. భౌతికంగా నాశమైన తమ పెద్దలను ఆరోజున స్మరించుకుంటూ.. శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే.. ఏడాది వరకూ వారు సంతోషంగా ఉంటారన్నది నమ్మకం. స్కాంద పురాణం నాగర ఖండంలో ఈ ప్రస్తవన ఉందని చెబుతారు. ఏ ప్రస్తావన ఎలా ఉన్నా... శూద్రులు తమదైన శైలిలో.. ఏడాదికొక్కమారు, మద్య మాంసాదులతో చేసుకునే విందే.. ఈ పండుగ.
ఇంత వివరణాత్మక రచన అవసరమా..? ఏమో..! మంచో చెడో.. సంప్రదాయాలు ఇలా ఉన్నాయి.. వాటిని ఇలా పాటిస్తారు.. అని తలచుకోవడం సమంజసంగా ఉంటుందన్నదే నా భావన. ఇందులో ఎలాంటి దురుద్దేశమూ లేదు సుమా!

Thursday, October 14, 2010

మేరా భారత్‌ మహాన్..


నాకివాళ చాలా గర్వంగా ఉంది.. చెప్పలేనంత ఆనందంగా ఉంది.. ఈ అనుభూతిని వర్ణించడానికి మాటలు రావడం లేదు.. నాదేశం.. నన్ను గన్న నా దేశ పతాకం.. ప్రపంచ క్రీడా యవనికపై సగర్వంగా రెపరెపలాడింది. కామన్వెల్త్‌ క్రీడాంగణంలో.. మున్నెన్నడూ లేని రీతిలో పతకాల సెంచరీ సాధించింది. పతకాల పట్టికలో.. రెండో స్థానంలో సగర్వంగా నిలిచింది.

ఎన్నెన్నో అవినీతి ఆరోపణలు.. కూలిన నిర్మాణాలు.. మనదేశానికి విదేశీ ఆటగాళ్లు రారేమోనన్న అనుమానాలు..! ఇలా ఒకటా రెండా..? జరుగుతున్న పరిణామాలు... కామన్వెల్త్‌ క్రీడలు సజావుగా సాగుతాయన్న నమ్మకాన్ని ఎవ్వరిలోనూ కలిగించలేక పోయాయి. రాజకీయాల రొచ్చులో కూరుకుపోయిన వారు మసకబారేలా చేసిన ప్రతిష్టను.. మన ఆటగాళ్లు స్వచ్ఛమైన గంగాజలంతో పునీతం చేశారు. దేశ ప్రతిష్టకు శాశ్వత యశస్సును సముపార్జించి పెట్టారు.

కామన్వెల్త్‌ క్రీడలు అట్టహాసంగా ప్రారంభమైనా.. ఎవ్వరికీ భారత క్రీడాకారుల పాటవంపై నమ్మకం లేదు. రోజురోజుకీ పతకాల సంఖ్య పెరుగుతూ పోతుంటే.. ప్రపంచానికి దిమ్మతిరిగే దిగ్భ్రమ. తొలి స్వర్ణం వచ్చినపుడు.. ఏదో గాలి వాటం అనుకున్నారు. మలి స్వర్ణం.. ఆ తర్వాతి స్వర్ణం.. మధ్యలో రజత, కాంశ్య పతకాలు భారత్‌ పట్టికలో చేరుతుంటే.. మనదేశ పౌరులూ అవాక్కయ్యారు. మన జాతీయ క్రీడ హాకీ స్వర్ణాన్ని సాధించలేక మనల్ని నిరాశ పరిచినా.. మన హైదరాబాదీ సైనా నెహ్వాల్‌ "బంగారు" కొండగా మురిపించింది. ఈ అమ్మాయి తను స్వర్ణం సాధించడమే కాదు.. దేశ ప్రతిష్టను ఓ మెట్టు పెంచింది. సైనా స్వర్ణం కారణంగా.. పతకాల పట్టికలో భారత దేశం రెండో స్థానంలో నిలిచింది. (మన హైదరాబాదీ గగన్‌నారంగ్‌ మూడు స్వర్ణాల బోణీని విస్మరించరాదు సుమా..)

క్రీడలు ముగిసే సమయానికి 38 స్వర్ణాలు, 27 రజతాలు, 36 కాంస్య పతకాలు మెడలో ధరించిన భరత మాత.. వాటిని సంపాదించి పెట్టిన తన సంతానాన్ని చూసి మురిసి పోతోంది. అంతేనా.. ప్రపంచ దేశాల ముందు సగర్వంగా నిలుచుంది.

అందుకే మేరా భారత్‌ మహాన్‌..

Tuesday, October 5, 2010

బొడ్డెమ్మను విస్మరించారెందుకో...!


తెలంగాణ సంస్కృతి.. ఈ ప్రాంత విశిష్ట పర్వం.. అనగానే వెంటనే గుర్తొచ్చేది బతుకమ్మ. విదేశీ నాగరికత మోజులో బతుకమ్మను అంతా మరచిపోతున్నారనుకుంటుండగా.. పరిస్థితిలో కొద్దిగా మార్పు వచ్చింది. ఈ సంబరం ఓ రెండేళ్ల నుంచి కొత్త ఊపిరి పోసుకుంటోంది. అయితే.. బతుకమ్మ వేడుకలు శ్రీకారం చుట్టుకునే ముందే.. నిమజ్జనమయ్యే మరో అమ్మవారు బొడ్డెమ్మ. మరెందుకో ఆ అమ్మవారికి మీడియాలో అంతగా ప్రాధాన్యత దక్కడం లేదు.

బొడ్డెమ్మ పూర్తిగా అవివాహిత యువతుల వేడుక. ఇది కూడా తొమ్మిదిరోజుల పండుగ. భాద్రపద మాసం బహుళ పంచమి రోజున బొడ్డెమ్మ ఉత్సవం ప్రారంభమవుతుంది. మహాలయ అమావాస్యకు ముందు రోజున వేడుక ముగుస్తుంది. అచ్చంగా బతుకమ్మ తరహాలోనే.. బొడ్డెమ్మనూ రంగురంగుల పూలతో రూపొందిస్తారు. సాయంత్రం వేళల్లో బొడ్డెమ్మను.. ఓ చోట ప్రతిష్ఠించి, దాని చుట్టూ పాటలు పాడుతూ తిరుగుతారు. పెళ్లీడుకొచ్చిన యువతులు మాత్రమే ఈ సంబరాన్ని జరుపుకుంటారు. ఇందులో పెళ్లయిన మహిళలెవరూ పాల్గొనరు. ఈ ఏడు కన్నెలుగా బొడ్డెమ్మను పూజిస్తున్నాం.. పై ఏడు వివాహితులుగా బతుకమ్మకు జోతలిడుతాం అంటూ అవివాహితులు మురిపెంగా చెబుతారు.

బొడ్డెమ్మ ఎవరు అంటే.. స్థానికంగా భిన్న కథనాలు వినిపిస్తాయి. కాకతీయుల నాటి నుంచీ బతుకమ్మకన్నా ముందే.. బొడ్డెమ్మను పూజించేవారని చెబుతారు. బొడ్డెమ్మ, బతుకమ్మ ఇద్దరూ అక్క చెల్లెళ్లని ఓ కథనం.. భూస్వాముల వేధింపులకు బలవన్మరణం పొందిన తల్లీబిడ్డలంటూ మరో కథనం ప్రచారంలో ఉంది.

ఈ కథల గురించి పక్కన పెడితే.. తెలంగాణలోని మారుమూలనున్న... ఈ ప్రాంత సంస్కృతి ఇంకా మిగిలి ఉన్న కొన్ని పల్లెల్లో.. బొడ్డెమ్మను ఇవాళ (05-10-2010) నిమజ్జనం చేశారు. రేపు మహాలయ అమావాస్య. ఎల్లుండి నుంచి బతుకమ్మ సంబురాలు మొదలవుతాయి. ఏదేమైనా.. ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బొడ్డెమ్మకు బతుకమ్మ స్థాయిలో ప్రాచుర్యం దక్కక పోవడం ఒకింత బాధాకరం.

Sunday, October 3, 2010

మా అబ్బాయి ప్యారడీ రాశాడోచ్...

శనివారం ఉదయం.. దైనందిన కార్యక్రమంలో భాగంగా.. "ఈనాడు" పత్రికను చదివి పక్కన పెట్టేశాను. తర్వాత మా అబ్బాయి వికాస్‌ (తను పదో తరగతి చదువుతున్నాడు) ఈనాడు పత్రికను అందుకున్నాడు. అందులో "ఈతరం" స్లిప్‌ పేజీలో పవన్‌ కల్యాణ్ గురించిన చిలిపి బయోడేటా చదివి.. దాని స్ఫూర్తితో ఓ ప్యారడీ రాశాడు. కాస్త జంకుతూనే నా చేతికి ఇచ్చాడు. డ్యాడీ.. ఇదెలా ఉందో కాస్త చూసి చెప్పు అని బెరుకు బెరుగ్గా ఇచ్చాడు. (బహుశా అందులో ఏదైనా తప్పులు వెతుకుతాననో.. భాష విషయంలో తప్పు పడతాననో భయపడ్డట్లున్నాడు) చూశాక బాగానే ఉందనిపించింది. ఒకరిద్దరు స్నేహితులకు చూపితే, ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అందుకే దీనికి నాకున్న కొద్దిపాటి సర్కిల్‌లో.. కొంత ప్రాచుర్యం కల్పిస్తే బావుంటుందనిపించి, దీన్ని బ్లాగ్‌లో పెడుతున్నా.

సచ్చినోడి చిలిపి బయోడేటా
పేరు : టెండూల్కర్
ముద్దుపేరు : సచ్చినోడు
ఇష్టమైన డ్రింక్‌ : బూస్ట్
మూడుంటే : ముంబై ఇండియన్‌
మరవనిది : క్రికెట్
వీలైతే.... : లెక్కలేనన్ని మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌లు
కుదిరితే... : పది వరల్డ్‌ కప్పులు
ఎక్కువగా చూసేది : అవార్డులు, రివార్డులు
ఫిలాసఫీ : ఇండియన్‌గా ఆడాలి...! ముంబై ఇండియన్‌గా ఆడించాలి..!!

ఇది ప్రపంచానికి అంత ప్రధానమైన విషయం కాక పోవచ్చు. కానీ, మా అబ్బాయి ఓ ప్యారడీ రాయడం అందులోనూ తెలుగు భాషలో రాయడం నాకు అలవిమాలినంత ఆనందాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే.. నా తరంతోనే తెలుగు అంతరించి పోతుందేమోనన్న భయానికి, ఆంగ్లమాధ్యమంలో విద్యను అభ్యసిస్తోన్న నా తర్వాతి తరం ఇస్తున్న భరోసాలా ఈ ప్యారడీ అనిపించింది. అందుకే, దీనికి నేనింత ప్రాధాన్యతనిస్తున్నాను... గర్విస్తున్నాను.

Friday, October 1, 2010

నేర్చుకోవాల్సింది ఎంతుందో..!


ఒక్కోసారి ఏదైనా పదానికి అర్థం తెలుసుకుందామని ప్రయత్నించేటప్పుడు.. ఆ శోధన ఎక్కడెక్కడికో వెళుతుంటుంది. మొన్నీమధ్య వాగ్దానం (వాగ్ధానం కాదు) అన్న పదం మీద కాస్త శ్రద్ధ పెట్టాను. వాక్కును దానం చేయడం ఏంటి..? అసలు దానాల్లో ఈ వాక్కు ఎలా చేరింది..? అసలు దానాలు ఎన్ని రకాలు..? ఇలా ఆలోచిస్తే.. భలే సమాధానాలు దొరికాయి.

వాగ్దానం (వాగ్ధానం కాదు) = అంటే వాక్కును దానం చేయడం అని వివరణ
వాక్కు అంటే పలుకు అని అర్థం. (వాక్కు మూల రూపం వాకు)
పలుకును దానం చేయడం వాగ్దానం. దీన్ని 'మాట ఇవ్వడం' అన్న అర్థంలో వాడొచ్చు.
వాగ్దానం చేశారు అనే బదులు 'మాటిచ్చారు' అని రాస్తే సరిపోతుంది.

దానం అంటే ఇవ్వడం :
ఆదానం అంటే పుచ్చుకోవడం

ఇక దానాలు ఎన్ని రకాలు..? అంటే దశదానాలు, షోడశ దానాలు ఉన్నాయని శబ్దరత్నాకరం వివరిస్తుంది అవేంటో ఓసారి చూద్దాం.
దశ (10) దానాలు :
1.గోదానం (= ఆవులను దానం ఇవ్వడం)
2.భూదానం, (= భూమిని దానంగా ఇవ్వడం)
3.తిల దానం, (= నువ్వుల దానం)
4.హిరణ్యదానం, (బంగారం దానం)
5.ఆజ్య దానం, (= నెయ్యి దానం)
6.వస్త్ర దానం, (= దుస్తుల దానం)
7.ధాన్య దానం, (= ధాన్యం దానం)
8.గుడ దానం, (= బెల్లం దానం)
9.రౌప్య దానం (= రౌప్యం అంటే రూప్యం. అంటే బంగారు లేదా వెండితో చేసిన నాణ్యం. స్థూలంగా దీన్ని ధనదానం అనవచ్చు)
10.లవణ దానం (= ఉప్పు దానం) (లవణాలు మళ్లీ మూడు రకాలు వాటి గురించి కింద వివరణ ఉంది.)
షోడశ (16) దానాలు :
1. గోదానం (= ఆవుల దానం)
2. భూదానం, (= భూమి దానం)
3. తిలదానం (=నువ్వుల దానం)
4.హిరణ్యదానం (=బంగారు దానం)
5.రత్నదానం (= రత్నాల దానం)
6.విద్యాదానం (= విద్య దానం)
7.కన్యాదానం (= అమ్మాయినిచ్చి పెళ్లి చేయడం)
8.దాసీదానం (= దాసీ జనాన్ని దానంగా ఇవ్వడం) (దాసి అంటే డబ్బిచ్చి కొన్న సేవకుడు/సేవకురాలు)
9.శయ్యాదానం (= పడకను దానంగా ఇవ్వడం)
10.గృహదానం (= ఇంటిని దానంగా ఇవ్వడం)
11.అగ్రహారదానం, (= పల్లెటూళ్లను దానంగా ఇవ్వడం)
12.రథదానం (= రథాన్ని దానం)
13.గజదానం (= ఏనుగులను దానం చేయడం)
14.అశ్వదానం, (= గుర్రాలను దానం చేయడం)
15.ఛాగదానం, (= జున్నుపాలు లేదా మజ్జిగ ను దానం చేయడం)
16 మహిషీదానం (= ఎనుము(గేదె)లను దానం ఇవ్వడం)

త్రిలవణాలు :

* లవణాలు మూడు రకాలు (త్రిలవణాలు) అని తెలుసుకున్నాం కదా. అవేంటో తెలుసుకుందాం.
1. సైంధవ లవణం
దీన్ని ఇందుప్పు అని అంటారు. ఇందుడు అంటే చంద్రుడు అని అర్థం. అంటే చంద్రుడిలా తెల్లగా ఉండే ఉప్పును సైంధవ లవణం అని చెప్పుకోవచ్చు.
2. బిడము
దీన్ని అట్టుప్పు అంటారు. (అట్టు+ఉప్పు). అట్టు అంటే ఆపూప విశేషం అంటుంది శబ్దరత్నాకరం. ఆపూపం అంటే పిండివంట. కాబట్టి పిండివంటల్లో వాడే ఉప్పును బిడము అని చెబుతారు.
3. రుచకము
దీన్ని సౌవర్చల లవణం అని అంటారు. ఇది ఒక దినుసు ఉప్పు అంటుంది శబ్దరత్నాకరం.

ఒక్క పదం గురించి శోధన మొదలు పెడితే.. ఎన్ని విషయాలు తెలిశాయో చూశారా..? అందుకే ప్రతి పదానికీ సరైన అర్థం కోసం వెతకాలి.. కొత్తకొత్త విశేషాలు తెలుసుకోవాలి. వాటిని సమర్థవంతంగా ప్రయోగించాలి. అప్పుడే భాష విస్తరిస్తుంది. ఏమంటారూ..!

Thursday, September 30, 2010

శభాష్ పోలీస్..


(అయోధ్యపై తీర్పు అనంతరం బెజవాడలో శాంతి కపోతాలు ఎగురవేస్తున్న హిందూ, ముస్లింలు)

హమ్మయ్య! మొత్తానికి పెద్ద టెన్షన్ పోయింది. అలహాబాద్‌ హైకోర్టు లక్నోబెంచ్‌ అయోధ్యలోని వివాదాస్పద స్థలంపై తీర్పు చెప్పింది. ఈ స్థలం రామజన్మభూమేనని.. బాబర్ చక్రవర్తి అక్కడ అంతకుముందున్న రామాలయాన్ని కూల్చేసి.. ఓ కట్టడాన్ని నిర్మించాడని తీర్పులో వెల్లడించింది. ఈ తీర్పు అనంతరం, చాలామంది గెలుపోటముల మీద చర్చ చేశారు. ఎవరు గెలిచారు..? ఎవరు ఓడారు..?

నేను మాత్రం ఈ వ్యవహారంలో గెలుపొందింది ఎవరంటే.. కచ్చితంగా పోలీస్ శాఖేనంటాను. రాష్ట్రంలో, (ముఖ్యంగా హైదరాబాద్‌లో) ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా, పోలీసు శాఖ అనుసరించిన వ్యూహం అభినందనీయం. ముందునుంచీ, అంటే సెప్టెంబర్ 20వ తేదీ నుంచే.. అన్ని జిల్లాల్లోనూ ఎస్పీలు చొరవ తీసుకుని, మత పెద్దలతో సమావేశాలు నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ ఆవశ్యకతను చాటి చెప్పారు. అయోధ్య వివాదంలో అలహాబాద్‌ కోర్టు తీర్పు ఎలా వచ్చినా సంయమనం పాటించేలా అందరి మైండ్‌సెట్స్‌నీ మార్చారు. తీర్పు 24న కాకుండా, 30వ తేదీకి వాయిదా పడ్డా... పోలీసు శాఖ మతాల మధ్య సామరస్యాన్ని పెంపొందించే విషయంలో, ఎక్కడా ఉదాసీనత ప్రదర్శించలేదు.

ఇక 29వ తేదీ నుంచైతే.. పోలీసు శాఖ, రాష్ట్రాన్ని పూర్తిగా తమ గుప్పిట్లో తీసుకున్నట్లే కనిపించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రతి అడుగుకూ ఓ పోలీసును మోహరించారు. అలాగని మిగిలిన ప్రాంతాలనూ తేలిగ్గా ఏమీ తీసుకున్నట్లు లేదు.

30వ తేదీ తీర్పు వెలువడేంత వరకూ.. అందరినీ కలిపి సంయమనంగా ఉండాలని కోరిన పోలీసు అధికారులు, తీర్పు వెలువడ్డాక కూడా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తీర్పు వల్ల ఏదో ఓ వర్గం మనోభావాలు గాయపడే అవకాశం ఉందని భావించినట్లున్నారు. ఆ భావన బయటపడకుండా.. తద్వారా హింసాత్మక ఘటనలు చెలరేగకుండా, తీర్పు అనంతరం కూడా కొన్ని కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. తీర్పు వెలువడ్డ మరుక్షణం నుంచే.. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ శాంతి ర్యాలీలు, సమభావన సమావేశాలు నిర్వహించారు. ఇది సత్ఫలితాలనిచ్చిందనే చెప్పాలి.

ఇక యధావిధిగా జర్నలిస్టు మిత్రులు, ఈ తీర్పు విషయంలో.. మారని తమ బుద్ధిని యధేచ్ఛగా ప్రదర్శించారు. తీర్పుపై ఎలాంటి ముందస్తు వ్యాఖ్యలు చేయరాదని, తర్వాత కూడా దానికి సంబంధించిన చర్చలు నిర్వహించరాదని చేసిన సూచనలను స్వేచ్ఛగా ఉల్లంఘించేశారు. కొన్ని ఛానళ్లలో, ఏకంగా తీర్పుపైనే వ్యాఖ్యలు చేశారు. ఇవి చూసే కాబోలు.. హైదరాబాద్‌లోని పోలీసు బాసులు (ముఖ్యంగా నగర కమిషనర్ ఎ.కె.ఖాన్‌) ఛానళ్ల చర్చా కార్యక్రమాలపై ఆంక్షలు విధించారు. ఆయనే నేరుగా రంగంలోకి దిగడంతో.. దాదాపుగా అన్ని తెలుగు ఛానళ్లలో ఏడు గంటలలోపే చర్చా కార్యక్రమాలు పూర్తయ్యాయి. లేకుంటే, రాత్రంతా ఇదే అంశంపై రొదపెట్టి ఉండేవారు.. లేనిపోని సమస్యలకు కారకులయ్యేవారు.
మొత్తానికి, ఎన్నెన్నో భయాలు.. మరెన్నో అనుమానాలను పటాపంచలు చేస్తూ.. సెప్టెంబర్ 30వ తేదీ సాధారణంగానే గడిచిపోయింది. రాష్ట్ర ప్రజలను కొన్ని గంటల పాటు ఆందోళనలో ఉంచడం తప్ప ఈ రోజుకు మరెలాంటి ప్రయోజనమూ లేదు. మరెలాంటి ఇబ్బందులూ తలెత్తలేదు. దీనికి కచ్చితంగా పోలీసు శాఖనే అభినందించాలి. శభాష్.. పోలీస్.

మిత్రులారా సంయమనం పాటిద్దాం

అయోధ్యలోని రామజన్మభూమి, బాబ్రీ మసీదు స్థల వివాదంపై, అలహాబాద్‌ లక్నో బెంచ్ ఇవాళ‌ తీర్పు ఇవ్వబోతోంది.

దేశమంతా తీవ్ర ఉద్విగ్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్కూళ్లు మధ్యాహ్నం వరకే పనిచేస్తున్నాయి.. ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న పిల్లల్ని పదిగంటలకంతా ఇళ్లకు పంపేయాలని పాఠశాలల యాజమాన్యాలు నిర్ణయించాయి. ఆమేరకు సిద్ధపడి బడికి రావాలని నిన్ననే పిల్లలకు చెప్పేశాయి. దాదాపు అన్ని విద్యా సంస్థల్లోనూ ఇదే పరిస్థితి.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లు, ఎస్పీలు సంయుక్తంగా సమావేశాలు ఏర్పాటు చేసి, రెండు మతాల పెద్దలను శాంతి సామరస్యతలకు కట్టుబడి ఉంటామని ఒప్పించారు! ఈనెల 24వ తేదీనే ఈ తీర్పు వెలువడుతుందని భావించిన అధికారులు, 21వ తేదీనుంచే ఈ సమావేశాలు నిర్వహించారు. అయితే తీర్పు వాయిదా కోరుతూ.. సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు కావడం.. దానిపై విచారించిన సుప్రీం పిటిషన్‌ను తోసిపుచ్చడం వల్ల.. తీర్పు వెలువడడంలో కాస్త జాప్యం ఏర్పడింది. దీంతో అధికారులు, నిన్న మళ్లీ హడావుడిగా అందరినీ సమావేశపరిచి, సుహృద్భావతను పెంపొందించాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి రోశయ్య, డిజిపి అరవిందరావు‌ ఒకరేమిటి అందరూ అన్ని సందర్భాల్లోనూ సంయమనం పాటించాల్సిన అవసరాన్ని చాటి చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు.. అయోధ్య వివాదంపై తీర్పు నేపథ్యంలో, ఇవాళ్టినుంచి మూడు రోజుల పాటు కొనసాగించాలనుకున్న తూర్పుగోదావరి జిల్లా పర్యటననూ రద్దు చేసుకుని, అందరూ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

బ్యూరోక్రాట్లు, మనం ఎంచుకున్న ప్రజాప్రతినిధులు ఇందరు చేస్తున్న విన్నపాన్ని జర్నలిస్టులుగా మనందరం మన్నిద్దాం. పెడధోరణులను విడిచి పెడదాం. ప్రతిరోజూ కన్నా మిన్నగా.. ప్రజాహితమే పరమావధిగా ఇవాళ మరింత బాధ్యతాయుతంగా పనిచేద్దాం. ఆవేశం అన్ని వేళలా అనర్థదాయకం. తెచ్చిపెట్టుకున్న, ప్రేరేపిత ఆవేశాలను పూడ్చిపెట్టేద్దాం. సహజసిద్ధమైన మన సౌభ్రాతృత్వాన్ని పరిమళింప చేద్దాం.

పుకార్లను విస్మరిద్దాం. సంయమనం పాటిద్దాం. శాంతిని కాపాడదాం.