Saturday, July 30, 2011

ఐరాస బదులు ఐకాస


రాష్ట్ర విభజన ఉద్యమాల వార్తలు కవర్‌ చేసీ చేసీ... పాపం చాలా మంది జర్నలిస్టు మిత్రులు ఐ... అన్న అక్షరంతో ప్రారంభమయ్యే ఏ పదాన్నయినా ఐకాస అనే రాస్తున్నట్టుంది. కావాలంటే ఇవాళ ఈనాడు వెబ్‌ పేజీ, www.eenadu.net లోకి వెళ్లి, తాజావార్తల్లో " ఐకాస ఉగ్రవాద వ్యతిరేక ఆంక్షల జాబితాలో పాక్‌ తాలిబాన్‌ " అన్న వార్త ఉంటుంది చూడండి. పాపం ఐరాస అని రాయబోయి.. సదరు మిత్రుడు ఐకాస అని రాసేశాడు. హడావుడి జర్నలిజంలో తప్పులు సహజమే.. అయినా జర్నలిస్టు మిత్రులు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఉదాహరణ స్పష్టం చేస్తోంది. ఇది సరదాకే తప్ప.. ఎవరినీ దెప్పి పొడుద్దామని కాదు సుమా..!

www.eenadu.net

Thursday, June 23, 2011

ఈనాడు... "స్టీఫెన్‌ రవీంద్ర" కులాన్ని మార్చేసింది..!


పాపం..! ఈనాడు దినపత్రిక పుణ్యమా అని డిసిపి స్టీఫెన్‌ రవీంద్ర... స్టీఫెన్‌ రెడ్డి అయిపోయారు. ఆయన పేరు వింటేనే.. ఆయన కుల మతాలు తేలిగ్గా అర్థమై పోతాయి. పోనీ ఆయన, ఎవరో తెలియని అనామకుడా అంటే అదీ కాదు. వరంగల్ జిల్లాలో మావోయిస్టుల అణచివేతలోను‌, అనంతపురం జిల్లాల ఫ్యాక్షనిస్టుల పీచమణచడంలోనూ.. ఎస్పీగా ఆయన చూపిన చొరవ అనితర సాధ్యం. అంతే వివాదాస్పదం. అంతేకాకుండా, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో.. విద్యార్థులపై పోలీసుల లాఠిన్య వేళా.. ఆయన పాత్ర వివాదాస్పదమైంది. అంతలా ప్రాచుర్యం పొందిన వ్యక్తి పేరును 'స్టీఫెన్‌ రెడ్డి' అని రాయడంలో ఈనాడు లోని సదరు సబ్‌ ఎడిటర్‌ నిర్లక్ష్యం తేటతెల్లమవుతుంది.

తప్పులు చేయడం.. తప్పుగా రాయడం మానవ సహజం... కానీ వ్యక్తుల మనోభావాలను దెబ్బతీసేలాంటి తప్పులు ఎట్టిపరిస్థితుల్లోనూ క్షంతవ్యం కాదు. ముఖ్యంగా ఈనాడు లాంటి అత్యధిక సర్క్యులేషన్‌ గల దినపత్రికలో అట్లాంటి తప్పులు దొర్లకుండా చూడాలి. ఇలాంటి సందర్భాల్లో సబ్‌ ఎడిటర్‌ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అవతలివాళ్లు వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తే... పెద్ద రచ్చే జరుగుతుంది.

మాలాంటి వాళ్లం ఇప్పటికీ ఈనాడు భాషనే ప్రామాణికంగా భావిస్తుంటాం. అంతటి సమున్నతమైన పత్రికలో పనిచేసే వ్యక్తులకు... రాసే భాష విషయంలో మరింత గురుతరమైన బాధ్యత ఉంటుంది. ఈ విషయాన్ని ఈనాడులోని ప్రస్తుత సబ్‌ఎడిటర్లు గుర్తుంచుకుంటే సంతోషం.

Wednesday, March 23, 2011

టిఆర్ఎస్‌ని దువ్వితే చాలు పనై పోద్ది : జస్టిస్‌ శ్రీకృష్ణ

రాష్ట్ర విభజన అంశంపై జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ చేసిన సిఫారసుల్లో ఇప్పటికే అన్నీ బయటకి వచ్చాయి. అయితే 8వ చాప్టర్‌ని మాత్రం కమిటీ సభ్యులు.. సీల్డ్‌ కవర్‌లో నేరుగా హోంమంత్రి చిదంబరానికి సమర్పించారు. ఇంతకీ ఆ రహస్య నివేదికలో ఏముంది..? ఇంతకాలం అందరినీ వేధిస్తోన్న ఈ ప్రశ్నకు సమాధానాలను హైకోర్టు, ఇవాళ ఓ తీర్పు సందర్భంగా ప్రస్తావించింది. శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని 8వ చాప్టర్‌ని బహిర్గం చేయాల్సిందిగా ఎం.నారాయణరెడ్డి వేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి చాప్టర్‌లోని ముఖ్యాంశాలను ప్రస్తావించారు. ఈ డాక్యుమెంట్‌ని రహస్యంగా ఉంచాల్సిన అవసరం లేదని.. ఇది పబ్లిక్‌ డాక్యుమెంటేనని జస్టిస్‌ నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఈ తీర్పులోని అంశాల ప్రకారం చూస్తే... జస్టిస్‌ శ్రీకృష్ణ బృందం 8వ చాప్టర్‌లో పలు ఆందోళనలతో పాటు సూచనలనూ చేసింది. వాటినోసారి చూద్దాం.
శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని
చాప్టర్‌ _ 8 ముఖ్యాంశాలు

రాజకీయ అంశాలు :
  • రాజకీయ పార్టీల నాయకులందరినీ ఏక తాటిపైకి తేవడం
  • తెలంగాణ నాయకులను కీలక పదవుల్లో నియమించడం
  • ఉద్యమానికి మూల కారణమైన టిఆర్‌ఎస్‌ని వీలైనంతగా దువ్వటం
  • తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులను అదుపు చేయటం. (కాంగ్రెస్‌ అధిష్ఠానం తమ పార్టీ నాయకులను అదుపులో ఉంచాలి)
  • ఇవన్నీ చేస్తూ.. ఈ అంశంపై విస్తృత చర్చలకు సిద్ధమని కేంద్రం బహిరంగ ప్రకటన చేయాలి.
సాంఘిక అంశాలు :
  • తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే.. ఈ ప్రాంతంలో నక్సలైట్ల సమస్య పెచ్చు మీరిపోతుంది.
  • మత ఘర్షణలు కూడా పెరుగుతాయి. (అదెలాగంటే.. బిజెపి ఈ ఉద్యమం ద్వారా తెలంగాణ ప్రాంతంలో మరింతగా పాదుకోవాలని ప్రయత్నిస్తోంది. MIM పార్టీని నిలువరించే దిశగా ఆ పార్టీ క్యాడర్‌ ప్రయత్నిస్తుంది. ఇది ఈ ప్రాంతంలో మత ఘర్షణలకు తావిస్తుంది)
  • హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ప్రాంతంలో ఆర్థిక పరిపుష్టి సమృద్ధిగా ఉంది. చాలా ఇతర రాష్ట్రాల కన్నా కూడా ఈ రాష్ట్రంలో జిడిపి (తలసరి ఆదాయం) ఎక్కువగానే ఉంది.
సీమాంధ్ర ప్రాంత వాసుల పెత్తనం :
  • తెలంగాణలో పరిశ్రమలు, విద్యా సంస్థలు, పత్రికలు, మీడియా అత్యధికం సీమాంధ్ర ప్రాంత యాజమాన్యాల చేతుల్లోనే ఉన్నాయి.
  • ఈ సంస్థల్లోని కీలక స్థానాల్లో కూడా సీమాంధ్ర ప్రాంత వాసులే ఉన్నారు.
మీడియా గురించి :
  • రాష్ట్రంలో 13 టివి ఛానళ్లు, 5 ప్రధాన వార్తా పత్రికలు ఉన్నాయి.
  • రాజ్‌ న్యూస్‌, హెచ్ఎంటీవీ తప్ప మిగిలిన అన్ని ఛానళ్లు సమైక్యాంధ్రనే సమర్థిస్తున్నాయి.
  • పత్రికాధిపతులందరూ ఇదే అభిప్రాయంతో ఉన్నారు.
  • ఆంధ్ర జ్యోతి ఎడిటర్‌ తప్ప మిగిలిన సంపాదకులందరూ సీమాంధ్రకు మద్దతుదారులు.
ఓయు ఘటనలపై :
  • హైదరాబాద్‌లోని జర్నలిస్టుల్లో ఎక్కువ మంది ప్రత్యేక తెలంగాణ కావాలనుకుంటున్నారు. వారిలో అత్యధికులు.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని విద్యార్థుల ఆందోళనలను, ఆత్మహత్యలను ఎక్కువ చేసి చూపుతున్నారు. కొన్ని సందర్భాల్లో అలాంటివాటికి కొందరు రిపోర్టర్లే ప్రేరేపిస్తున్నారు.
  • వాస్తవాలను మాత్రమే ప్రసారం చేయాలని.. ఎక్కువ చేసి చూపవద్దని మీడియాకు సూచించాలి.
శాంతి భద్రతల పరిరక్షణకు :
  • (ఉస్మానియా, కాకతీయ, క్రిష్ణదేవరాయ వర్శిటీల్లో ) పూర్తి సాయుధ బలగాలను దించాలి. విధ్వంసాలను తగ్గించాలి.
  • మూడు ప్రాంతాల్లోని విధ్వంసకర శక్తులను గుర్తించి వారిని అదుపు చేసేందుకు నిర్దిష్టమైన ప్రణాళిక రచించాలి.
  • అర్థవంతమైన చర్చల ద్వారా పరిష్కారం సాధించాలి.
  • వాదాలు వినిపించే వారి వాదనలు సావధానంగా వినాలి.
  • పదవుల కోసం తహతహలాడే వారిని సంతృప్తి పరచాలి. ఇది చిన్నా చితకా స్థాయిలో ఉండరాదు... ఎక్కువ మూల్యం చెల్లించేదిగా ఐనా ఉండొచ్చు.

Wednesday, February 9, 2011

ఇకనైనా తొక్కిసలాటలు, చావులు ఆగితే బావుణ్ణు

శబరిమల అయ్యప్ప స్వామి జ్యోతి మానవ చర్యేనని ట్రావెన్‌కోర్‌ దేవస్థానం స్పష్టం చేసింది. దీని ద్వారా.. అయ్యప్ప జ్యోతిపై తలెత్తిన వివాదాన్ని ముగించే ప్రయత్నం చేసింది. శబరిమలలో ఏదైనా విషాద ఘటన జరిగినప్పుడు మాత్రమే ఇలాంటి చర్చలు మొదలవుతుండడాన్ని బట్టి చూస్తే... ఓ గీత కింద మరో పెద్ద గీత గీయడం అన్న సూత్రం అర్థమవుతుంది.

జనవరి 14వ తేదీ సాయంత్రం.. పులిమేడు లోయలో తొక్కిసలాట జరిగి 102 మంది అయ్యప్ప స్వామి భక్తులు అసువులు బాశారు. దీంతో.. దాదాపు పుష్కరకాలం తర్వాత.. మళ్లీ మకరజ్యోతిపై చర్చ ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం జనవరి 14వ తేదీన శబరిమలలో కనిపించే మకర జ్యోతి దైవిక అద్భుతమా..? మానవ కల్పితమా అన్న అంశంపై విస్తృత చర్చ సాగింది. పులిమేడు తొక్కిసలాట ఘటనపై తీవ్రంగా స్పందించిన కేరళ రాష్ట్ర హైకోర్టు.. మకరజ్యోతిపై వాస్తవాలను వెల్లడించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పులిమేడు తొక్కిసలాటపై కేరళ డిజిపి, అటవీ అధికారులు, ట్రావెన్‌కోర్‌ దేవస్థానం అధికారులు విడివిడిగా హైకోర్టుకు నివేదికను సమర్పించారు.


ఈ సందర్భంగా.. కోర్టులో వాదనలు వినిపించిన ట్రావెన్‌కోర్‌ దేవస్థానం న్యాయవాది.. మకరజ్యోతి దైవిక అద్భుతమన్నది భక్తుల భావన అని, అది దివ్యతార, దైవికమైనదేనని అంటూనే.. దీనిపై దేవస్థానం ఎన్నడూ అనుకూల ప్రచారం చేసుకోలేదని వాదించారు. ఈ వాదనను తీవ్రంగా పరిగణించిన హైకోర్టు ధర్మాసనం.. మకరజ్యోతిపై వాస్తవాలను వెల్లడించాలంటూ.. ట్రావెన్‌కోర్‌ దేవస్థానాన్ని ఆదేశించింది.

ఈలోపే.. కేరళకు చెందిన కొందరు ఔత్సాహికులు, మకరజ్యోతి కనిపించే పొన్నంబలమేడు వెళ్లి వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చారు. వండిపెరియార్‌ మార్గంలో.. ఇడత్తోట వద్దనుంచి డైవర్ట్‌ అయితే.. సుమారు 80 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే.. పులిమేడు వస్తుంది. ఈ గిరిపై, స్వర్ణమందిరం ఉందని.. అయ్యప్ప స్వామి.. సర్వదేవ సంసేవితుడై.. ఇక్కడ కొలువు దీరారని, ఇది దేవతలు సంచరించే పొన్నంబలమేడు అన్నది భక్తుల విశ్వాసం. ఇక్కడికి నరమానవులు ఎవరూ వెళ్లలేరని... తెగించి ఎవరైనా వెళ్లినా.. తిరిగి రాలేరన్నది
భక్తుల నమ్మకం. అయితే.. ఈ మార్గంలో ఇటీవలే కొంతమంది వ్యక్తులు సంచరించిన ఆనవాళ్లను ఔత్సాహికులు బయటపెట్టారు. అక్కడ జ్యోతిని వెలిగించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దిమ్మెను గుర్తించారు. అంతేకాదు.. తాజాగా అక్కడ కర్పూరాన్ని వెలిగించిన దాఖలాలనూ బాహ్య ప్రపంచానికి చాటారు. అక్కడినుంచి శబరిమల అయ్యప్పస్వామి ఆలయం ఎలా కనిపిస్తుందో కూడా కళ్లకు కట్టినట్లుగా దృశ్యరూపకంగా వెల్లడించారు.

అంతేకాదు.. వన్యమృగాలు దాహం తీర్చుకునే ఓ చిన్నపాటి మడుగునూ వారు ఆ ప్రాంతంలో గుర్తించారు. మకరజ్యోతిని వెలిగించే దిమ్మకు కేవలం 50 మీటర్ల దూరంలోనే ఈ మడుగు ఉంది. అంతేనా.. మకరజ్యోతిని వెలిగించే సమయంలో అన్యులు ఎవరూ అటువైపు రాకుండా కొండపై నిర్మించిన సెక్యూరిటీ పోస్ట్‌ కూడా వీరి పరిశోధనలో బట్టబయలైంది.

అసలు మకరజ్యోతిపై చర్చ మొదలు కావడం ఇదే ప్రథమం కాదు. గతంలో కూడా ఇలాంటి చర్చ సాగింది. అప్పట్లో కేరళ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలోనే మకరజ్యోతి మానవ కల్పితమని ప్రకటించింది. అయితే.. అయ్యప్ప భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకుని.. ఈ ప్రకటనకు విస్తృత ప్రచారం రాకుండా జాగ్రత్తలు తీసుకుంది. పర్యటకరంగం పరంగా వచ్చే ఆదాయం కోసం కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని అప్పట్లో అణగతొక్కేసింది. కానీ.. శబరిమల ఆలయ అర్చకుడి మనవడు రాహుల్‌ ఈశ్వర్‌ మాత్రం దీన్ని మానవ కల్పితంగా ఎన్నడో ప్రకటించారు.

"‌మకరజ్యోతి పొన్నంబలమేడు కొండపైభాగంలో కనిపించే నక్షత్రం. మకర విళక్కు పొన్నంబల మేడులో ఆనూచానంగా కొనసాగించే సంప్రదాయం. ఈ ఆలయాన్ని పరశురాముడు నిర్మించారన్నది ప్రతీతి. ఈ ప్రాంతంలోని ఆదివాసీలు.. ఆకాశంలో మకర నక్షత్రం కనిపించగానే.. దాన్ని దైవికంగా భావించి, కర్పూరంతో హారతి ఇవ్వడం ప్రాచీన కాలం నుంచి వస్తోన్న ఆనవాయితీ. ఇలా మూడు సార్లు హారతి ఇవ్వడం ఆచారం. పొన్నంబలమేడులో ఆదివాసీలు వెలిగించే ఆ హారతులు శబరిమలలో కనిపించగానే.. ఇక్కడి అయ్యప్ప ఆలయంలో పూజావిధులు జరుగుతాయన్నది చరిత్ర. పరిణామ క్రమంలో.. ఆధునికత వచ్చిన క్రమంలో.. ఆదివాసీలు అక్కడినుంచి వలస వెళ్లినా.. ఆ ఆచారాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు" అంటూ రాహుల్‌ ఈశ్వర్‌ విస్పష్టంగా ప్రకటించారు.

మకర సంక్రమణం రోజున ఆకాశంలో దేదీప్యమానంగా కనిపించేది నక్షత్రమేనని.. సూర్యుడు ధనూరాసి నుంచి సంక్రమించేటప్పుడు ఆ నక్షత్రానికి జరిపే హారతి పూజే మకరజ్యోతి అని ఆయన విస్పష్టంగా ప్రకటించారు. అటు హేతువాదులదీ ఇదే వాదన. మకర నక్షత్రం వాస్తవం.. సూర్యుడు ధనూరాసి నుంచి మకర రాసిలోకి ప్రవేశించేటప్పుడు.. ఓ నక్షత్రం కొండ పైభాగంలో దేదీప్యమానంగా వెలుగుతూ కనిపిస్తుందని.. ఆతర్వాతి రోజుల్లోనూ దాన్ని నేరుగా చూడొచ్చని వీరు వాదిస్తున్నారు.
కరజ్యోతి వాస్తవికతపై దాదాపు రెండు దశాబ్దాల క్రితం కూడా విస్తృతంగా చర్చ సాగింది. అప్పట్లో సాక్షాత్తూ ఆరాష్ట్ర ముఖ్యమంత్రే మకరజ్యోతి మానవకల్పితమని కేరళ అసెంబ్లీలో ప్రకటించారు. అయితే.. ఇవేవీ భక్తుల్లో విశ్వాసాన్ని దెబ్బతీయలేక పోయాయి. ఈ చర్చ గురించి తెలియని వాళ్లే కాదు... తెలిసిన వాళ్లు కూడా శబరిమల జ్యోతి దర్శనానికి వెళ్లడం మానలేదు. పైగా.. ఏటేటా మకరజ్యోతి దర్శనానికి శబరిమల వెళ్లే వారి సంఖ్య ఇంతింతలుగా పెరుగుతూ వస్తోంది. కాబట్టి.. ఇప్పుడు ఏదో ప్రమాదం కారణంగా మొదలైన చర్చ కూడా తమ విశ్వాసాన్ని పెద్దగా దెబ్బతీయ బోదని అయ్యప్ప భక్తులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. కేరళ హైకోర్టుకు.. ట్రావెన్‌కోర్‌ దేవస్థానం తెలిపిన మకరజ్యోతి వాస్తవం భక్తుల మనోభావాలపై పెద్దగా ప్రభావం చూపక పోవచ్చన్న భావనే సర్వత్రా వ్యక్తమవుతోంది. చూడాలి మరి.
(కేరళకు చెందిన టీవీ ఛానల్‌ ప్రసారం చేసిన మకరజ్యోతి మర్మం వార్తా కథనాన్ని చూడాలనుకుంటే..
www.youtube.com/watch?v=d50EiaQYSzQ క్లిక్‌ చేయండి)

Thursday, February 3, 2011

కలుగులోని దొంగలందరూ బయటకు వస్తారా...?

స్వతంత్ర భారతంలో అతిపెద్ద అవినీతి కుంభకోణం. లక్షా డెబ్బయ్ ఆరు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రాకుండా పోయిన వైనం. ఎప్పటికైనా నిజం నిగ్గు తేలుతుందా? దొంగలు దొరుకుతారా? దొంగలందరూ దొరుకుతారా? దొంగసోమ్ము మొత్తం దొరుకుతుందా? అసలు దొంగలు ఎవరు? లబ్ధిదారులు ఎవరు?

అవినీతిని అంతం చేయాలన్న అంకితభావంతోనే టెలికాం మాజీ మంత్రి రాజాను సీబీఐ అరెస్టు చేసిందని అనుకోవాలా? ప్రధాని కార్యాలయం నుంచి అందిన సంకేతాల మేరకే వ్యవహరించిందని భావించాలా? కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేకుండా సీబీఐ ఇటువంటి విషయంలో స్వతంత్రంగా వ్యవహరిస్తున్నదని నమ్మగలమా? మూడు విడతల ప్రశ్నించినా, ఢిల్లీలో, తమిళనాడులో అనేక విడతల సోదాలు చేసినా దర్యాప్తు అంగుళం ముందుకు కదలలేదు ఎందుకని? సోనియాగాంధీ, కరుణానిధి మధ్య ఢిల్లీలో సమాలోచన జరిగే వరకూ రాజాను అరెస్టు చేయకుండా సీబీఐ చేతులు కట్టుకొని ఉన్నది ఎందుకని? తమిళనాడులో, మరి నాలుగు రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరగబోతున్న కారణంగానే, ప్రతిపక్షాలు పార్లమెంటు సంయుక్త సంఘం-జేపీసీ- నియామకంకోసం పట్టుపడుతున్న కారణంగానే, ప్రతిపక్షాలు పార్లమెంటును స్తంభింపజేసిన కారణంగానే రాజా అరెస్టు ఒక ఎత్తుగడగా జరిగిందా? ఇది కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకుంటున్న నష్టనివారణ చర్యలలో భాగమేనా?
బుధవారంనాడు రాజానూ, టెలీకం మాజీ కార్యదర్శి సిద్దార్థ బెహురానూ, ఐఆర్ ఎస్ అధికారి ఆర్కే చందోలియానూ సీబీఐ అరెస్టు చేసినట్టు వచ్చిన వార్త ఇప్పటికే ప్రజలను వేధిస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోగా అనేక కొత్త ప్రశ్నలను లేవనెత్తింది.
రెండవ తరం వాయుతరంగాల-టూజీ స్ప్రెక్ట్రమ్- కుంభకోణంలో మరికొంత మంది పాత్రధారులను అరెస్టు చేయవచ్చు. ప్రశ్నించవచ్చు. క్రిమినల్ కేసులు పెట్టవచ్చు. వారికి జైలు శిక్ష సైతం పడవచ్చు. అనంతరం వారు సుఖరామ్ లాగా బెయిలు సంపాదించుకొని సుఖంగా జీవితం గడపవచ్చు. మరి సూత్రధారుల పాత్ర ఏమిటి? ఈ మొత్తం వ్యవహారంలో ప్రధాని మన్మోహన్ సింగ్ పాత్ర ఏమిటి? రాజాను బలిపశువును చేసినంత మాత్రాన మన్మోహన్ సింగ్ కు ఈ కుంభకోణంలో ప్రమేయం లేకుండా పోతుందా? యూపీఏ అధ్యక్షురాలి హోదాలో ఏడేళ్ళుగా చక్రం తప్పుతున్న సోనియాగాంధీకి నైతిక బాధ్యత లేకుండా పోతుందా?
ఈ కుంభకోణంలో దోషులను పట్టుకోవాలనీ, జేపీసీని నియమించాలనీ ఉద్ఘోషిస్తున్నవారందరూ అవినీతికి అతీతులు కాకపోవచ్చు. ఎన్ డీ ఏ హయాంలో జరిగిన అవినీతిని కూడా వెలికి తీయడానికి ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. ఎన్ డీ ఏ పాలనలోనూ కుంభకోణం జరిగింది కనుక రాజా మార్కు కుంభకోణంపైన దర్యాప్తు జరగాలని కోరే నైతిక హక్కు ఎన్ డీ ఏ నాయకులకు లేదని వాదించడం వితండ వాదం అవుతుంది. టెలికాం మంత్రిత్వ శాఖ అత్యంత కీలకమైనదని మన్మోహన్ సింగ్ కూ, సోనియాకూ తెలుసు. రాజా కంటే ముందు ఈ శాఖను నిర్వహించినవారికి అవినీతి మరకలు అంటినట్టు అందరికీ తెలుసు. పీవీ నరసింహారావు మంత్రిమండలిలో టెలికాం శాఖ నిర్వహించిన సుఖరామ్ పైన సీబీఐ 1996లో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసింది. ఢిల్లీలో, హిమాచల్ ప్రదేశ్ లో ఆయన నివాసాలపైన సీబీఐ దాడులు జరిపింది. 3.62 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకుంది. పదమూడేళ్ళ విచారణ తర్వాత 2009లో సుఖ్ రామ్ కు మూడేళ్ళ కఠిన కారాగార శిక్ష విధించారు. నెల రోజులు జైలులో గడిపి బెయిలు సంపాదించుకున్నారు. టెలిఫోన్ కంపెనీలకు లాభాలు సంపాదించిపెట్టడానికి వీలుగా లైసెన్సింగ్ పద్ధతికి స్వస్తి చెప్పడం ద్వారా అవినీతికి ఎన్ డీ ఏ సర్కార్ తలుపులు తెరిచింది. ఈ పద్ధతిని వ్యతిరేకించిన జగ్ మోహన్ మంత్రి పదవి నుంచి వైదొలగవలసి వచ్చింది. జస్వంత్ సింగ్ నాయకత్వంలోని కమిటీ సిఫార్సు మేరకు 1999 జూలైలో లైసెన్స్ పద్ధతికి స్వస్తి పలికారు. ఈ కారణంగా దేశ ఖజానాకు యాభై వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఆరోపించారు. భారతీయ జనతా పార్టీలో నిధులు సేకరించే నేర్పరిగా పేరున్న ప్రమోద్ మహాజన్ రిలయన్స్ సంస్థకు లాభం కలిగే విధంగా ట్రాయ్ సిఫార్సులను తుంగలో తొక్కారు. దీని వల్ల అప్పటి లెక్కల ప్రకారం పదకొండు వందల కోట్ల రూపాయల నష్టం దేశ ఖజానాకు వచ్చిందని అంచనా. ఇటువంటి కీలకమైన, అవినీతికి ఆస్కారం పుష్కలంగా ఉన్న శాఖను ఎవరికి అప్పగించాలి? నీతి, నిజాయితీలను నిజజీవితంలో పాటించే వ్యక్తి చేతుల్లో ఈ శాఖ బాధ్యతలు పెట్టాలి. రాజాకు కానీ డిఎంకే కి చెందిన మంత్రులకు కానీ అటువంటి మంచి పేరు లేదని ప్రధానికి తెలియదా? సంకీర్ణ పితలాటకం వల్ల కరుణానిధి పట్టుదల వల్ల రాజాకే టెలికాం మంత్రిత్వ శాఖను అప్పగించవలసి వస్తే ఆ శాఖ పని తీరుపైన నిరంతరం నిఘా ఉంచవలసిన బాధ్యత ప్రధానికి లేదా? 2007 నుంచి 2008 వరకూ ప్రధానికీ, రాజాకీ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలను పరిశీలిస్తే రాజా చేస్తున్నది ఏమిటో ప్రధానికి తెలుసనే అనుకోవలసి వస్తుంది. రాజా అవలంబిస్తున్న పద్ధతిపై మొదట్లో వివరణ కోరిన ప్రధాని అనంతరం ఆ పద్ధతిని ఆమోదించారనే అభిప్రాయం కలుగుతుంది. కుంభకోణం జరుగుతున్నట్టు పయనీర్ పత్రికలో పరిశోధనాత్మక వార్తలు పుంఖానుపుంఖంగా వచ్చినా, సెంట్రల్ విజలెన్స్ కమిషన్ హెచ్చరించినా, కాగ్ నివేదిక తూర్పారపట్టినా ప్రధాని చలించలేదు. సుప్రీంకోర్టు తలంటిన తర్వాతనైనా వెంటనే స్పందించలేదు. అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రభుత్వ సుస్థిరతను పణం పెట్టడానికి సంకోచించని మన్మోహన్ సింగ్ అవినీతి రాజాపై చర్య తీసుకోవడానికి మీనమేషాలు లెక్కించారు. సోనియా సాధ్యమైనంత వరకూ మౌనం పాటిస్తే, మన్మోహన్ సందర్భం వచ్చిన ప్రతిసారీ రాజాను వెనకేసుకొని వచ్చారు. రాజా అక్రమం చేయలేదంటూ కితాబు ఇస్తూ వచ్చారు. సుప్రీంకోర్టు ఒకటికి రెండు సార్లు చురకలు వేయడం ప్రారంభించిన తర్వాత, ప్రతిపక్షాలు పార్లమెంటును స్తంభింపజేసి రాజీ లేని పోరాటం సాగించిన అనంతరమే యూపీ ఏ సర్కార్ లో చురుకు పుట్టింది. మూడేళ్ళ కిందటే కుంభకోణం జరుగుతున్నట్టు సమాచారం ఉన్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టు ప్రధాని వ్యవహరించారు. ప్రతిష్ఠాత్మకమైన, బలమైన ప్రధాని కార్యాలయానికి అన్ని మంత్రిత్వ శాఖలలో ఏమి జరుగుతున్నదో ఎప్పటికప్పుడు తెలుస్తుంది. టెలికాం కుంభకోణం జరుగుతున్నట్టు ప్రధానికి తెలియదంటే ఎట్లా నమ్మడం? సీబీఐ దర్యాప్తు ప్రారంభించిన తర్వాత సంవత్సరం పాటు చేసింది ఏమీ లేదు. సీబీఐ కూడా ప్రభుత్వం కదిలినప్పుడే కదిలింది. అంటే పాలకుల కనుసన్నలలోనే మెదిలింది. ఇంత జరిగిన తర్వాత రాజా చేత రాజీనామా చేయించక తప్పలేదు. కానీ ప్రతిపక్షం కోరుతున్న జేపీసీ నియామకానికి మాత్రం యూపీఏ సిద్ధంగా లేదు. ఈ లోగా మరో నాటకం. రాజా రాజీనామా అనంతరం టెలికాం శాఖను అదనంగా స్వీకరించిన మానవ వనరుల మంత్రి కపిల్ సిబ్బల్ చావుతెలివి ప్రదర్శించారు. గజం మిథ్య పలాయనం మిథ్య అంటూ అడ్డంగా వాదించే సాహసం చేశారు. పార్లమెంటు సభ్యులనూ, దేశ ప్రజలనూ అవివేకులుగా జమకట్టి బుకాయించబోయారు. అవమానించబోయారు. స్పెక్ట్రమ్ అమ్మకాల విషయంలో కుంభకోణం ఏమీ లేదనీ, దేశ ఖజానాకు నయాపైసా కూడా నష్టం రాలేదనీ దర్జాగా ప్రకటించారు. మరోదేశంలో అయితే పనిగట్టుకొని అబద్ధాలు చెప్పిన మంత్రి చేత ప్రధానమంత్రి వెంటనే రాజీనామా చేయించేవారు. అవినీతికి కొమ్ముకాసిన అన్యాయవాది సిబ్బల్ ను మన్మోహన్ కానీ సోనియా కానీ మందలించిన దాఖలా లేదు. పైగా ప్రధాని ఆమోదంతోనే తాను అన్ని పనులూ చేశానంటూ రాజా బహిరంగంగా ప్రకటించినట్టే చెప్పారు. ప్రధాని లేదా కాంగ్రెస్ అధ్యక్షురాలు పురమాయిస్తేనే కపిల్ సిబ్బల్ సైతం జాతిని బుకాయించే ప్రయత్నం చేశారు. అవినీతిని కప్పిపుచ్చి జాతిని దబాయించే దుస్సాహసానికి ఒడిగట్టిన కపిల్ సిబ్బల్ చేతిలో టెలికాం శాఖ ఉండటం మాత్రం ఏమంత అభిలషణీయం? రాజా చేసిన నేరం ఏమీ లేదనీ, ప్రతిపక్షాల ఆరోపణ కారణంగానే రాజా రాజీనామా చేయవలసి వచ్చిందనీ సోనియా వ్యాఖ్యానించారు. టూజీ స్పెక్ట్రమ్ విషయంలో రాజా కానీ తాను కానీ ఎటువంటి నేరం చేయలేదని మన్మోహన్ చెప్పారు. సోనియా, మన్మోహన్, కపిల్ సిబ్బల్ చెప్పిందే నిజమైతే పాపం రాజాను ఎందుకు సీబీఐ అరెస్టు చేసినట్టు? అవకాశం ఉన్నంతవరకూ రాజా అండ్ కో అవినీతిని చాపకింద కప్పి పెట్టడానికే సోనియా అండ్ కో ప్రయత్నించినట్టు నిర్ద్వంద్వంగా స్పష్టం అవుతోంది. గత్యంతర లేకనే అరకొర చర్యలైనా అయిష్టంగా తీసుకుంటున్నారు. అపారమైన అవినీతి సొమ్ములో రాజా తిన్నది పది శాతం మాత్రమేనని ఈ కుంభకోణం వెలుగు చూడటానికి ప్రధాన కారకుడైన జనతా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ సుబ్రహ్మణ్యస్వామి అంటున్నారు. కరుణానిధికీ, సోనియా సోదరీమణులకూ అవినీతి సొమ్ములో భారీ వాటా ముట్టిందని కూడా డాక్టర్ స్వామి ఆరోపిస్తున్నారు. కనీసం ఈ ఆరోపణలలో సత్యం లేదని నిరూపించడానికైనా సమగ్రమైన దర్యాప్తుకోసం సోనియా పట్టుపట్టవలసింది. అది జరగడం లేదు. అన్నిటికీ మౌనమే సమాధానం. దొంగసొత్తు ఎక్కడికి వెళ్ళిందో, ఎక్కడ దాగున్నదో తేలితే కానీ అసలు సూత్రధారులు ఎవ్వరో వెలుగులోకి రాదు.
రాజాను అరెస్టు చేశారు. సరే. ఆయన సోదరిడినీ, ఇతర బంధువులనూ, స్నేహితులను కూడా అదుపులోకి తీసుకోవచ్చు. డీఎంకే పార్టీ సభ్యత్వానికి రాజా చేత రాజీనామా ఇప్పించవచ్చు. ఇటువంటి పనులు ఎన్ని చేసినా అసలు కుంభకోణం మటుమాయం కాదు. కాంగ్రెస్ అగ్రనాయకత్వంపైన పడిన మచ్చ మాసిపోదు. ఈ కుంభకోణంలో రాజాకు ఎంత బాధ్యత ఉన్నదో, మంత్రిమండలి అధినాయకుడుగా ప్రధాని మన్మోహన్ సింగ్ కూ అంతే బాధ్యత ఉన్నదని వాదించడం తప్పు అవుతుందా? జయలలిత చెప్పినట్టు మానవేతిహాసంలోనే అతిపెద్ద కుంభకోణం జరిగినప్పుడు అందుకు సంబంధించిన మంత్రిని బలి ఇస్తే సరిపోతుంది. ప్రధాన మంత్రి మూల్యం చెల్లించనక్కరలేదా? ఇది ఒక్కటే కాదు. కామన్ వెల్త్ గేమ్స్ నిర్వహణలో అవినీతి, ముంబయ్ ఆదర్శ్ సహకార సంఘం అవినీతి, ఇంకా అనేక అవినీతి కుంభకోణాలకు ప్రత్యక్ష సాక్షి అయిన ప్రధాన మంత్రికి నైతిక బాధ్యత బొత్తిగా ఉండదా? మన్మోహన్ సింగ్ వ్యక్తిగతంగా మచ్చలేని మనిషి. కానీ అపచారం వల్లనో, గ్రహచారం వల్లనో ప్రధాన మంత్రిగా అనేక కుంభకోణాలకు బాధ్యత వహించవలసిన దుస్థితిలో పడిన వ్యక్తి. నైతిక విలువలు పాటించి పదవికి రాజీనామా చేస్తే మన్మోహన్ సింగ్ కు చరిత్రలో కొద్దో గొప్పో స్థానం ఉంటుంది. మొన్న ఏఐసీసీ సమావేశాలలో ప్రధాని ప్రసంగిస్తూ ‘సీజర్స్ వైఫ్ మస్ట్ బీ ఎబౌవ్ సస్పీషన్’ అంటూ ఉద్భోదించారు. అంటే సీజర్ భార్య అనుమానాలకు అతీతంగా ఉండాలని అర్థం. ఇది ప్రధాని మన్మోహన్ సింగ్ కి వర్తించినంతగా ప్రస్తుత సందర్భంలో మరెవ్వరికీ వర్తించదు. ఇంత జరిగిన తర్వాత మన్మోహన్ సింగ్ దేశంలోని అత్యున్నత పదవిలో కొనసాగడం ఏ మాత్రం సమర్థనీయం కాదు. ఆయనకూ మంచిది కాదు. దేశానికీ మంచిది కాదు. మన్మోహన్ స్థానంలో ప్రధానిగా ప్రణబ్ ముఖర్జీని నియమిస్తారో, పగ్గాలు కుమార రత్నానికి అప్పగిస్తారో సోనియాగాంధీ ఇష్టం.
(ఇది శ్రీ రామచంద్రమూర్తి గారు hmtv సంపాదకీయం హంసధ్వని కోసం రాసిన వ్యాసం. శ్రీ మూర్తిగారి మరిన్ని వ్యాసాలు చూడాలనుకుంటే..www.hmtvhamsadhwani.blogspot.com క్లిక్‌ చేయండి

Monday, January 31, 2011

కిరణ్ గుగ్లీ


ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో జట్టు అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు కొత్త బౌలర్ కిరణ్ కుమార్ రెడ్డి బౌలింగ్ చేస్తున్నారు. నాన్ ప్లేయింగ్ కెప్టెన్ సోనియాగాంధీ ఆదేశాలమేరకు లెగ్ బ్రేక్ ప్రవీణుడు కిరణ్ వరుసగా ఇబ్బందికరమైన బంతులు వేసి స్టార్ బ్యాట్స్ మన్ జగన్మోహన్ రెడ్డిని చీకాకు పెడుతున్నారు. లెగ్ బ్రేక్ తాపీగా వేస్తున్న కిరణ్ ఉన్నట్టుండి అకస్మాత్తుగా, అనూహ్యంగా మణికట్టు గిర్రున తిప్పి గుగ్లీ వేశాడు. ప్రత్యర్థి దిమ్మరబోయారు.
బెర్నాడ్ బోసాంకే అనే క్రికెటర్ కనిపెట్టిన గుగ్లీ మహా కతర్ నాక్ బంతి. బ్యాట్స్ మన్ ని ఆశ్చర్య పర్చుతుంది. కంగారు పెడుతుంది. దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. దిక్కుతోచని పరిస్థితి కల్పిస్తుంది. పెవెలియన్ వైపు నడిపిస్తుంది. లెగ్ స్పిన్ బౌలింగ్ చేసే బౌలర్లు ఈ బంతిని విసిరి బ్యాట్స్ మన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తారు. అస్థిరపర్చుతారు. మతిపోగొడతారు. రైట్ హ్యాండ్ బ్యాట్స్ మన్ కి లెగ్ బ్రేక్ వేస్తే బంతి లెగ్ నుంచి ఆఫ్ సైడ్ కి, అంటే బ్యాట్స్ మన్ కి దూరంగా వెడుతుంది. గుగ్లీ ఇందుకు భిన్నంగా అడ్డం తిరుగుతుంది. బంతి ఆఫ్ సైడ్ లో పడి లెగ్ వైపు చప్పున తిరిగి అంతలోనే నేరుగా వేగంగా వికెట్ల మీదికి వెడుతుంది. బంతి ఎటు పోయి ఎటు వస్తుందో బ్యాట్స్ మన్ కి ఒక పట్టాన అర్థం కాదు. దీనిని బౌలర్ అమ్ములపొదిలో ఉన్న అత్యంత ప్రమాదరకరమైన అస్త్రంగా- మోస్ట్ లీతల్ వెపన్ గా, స్టెల్దియెస్ట్ వెపన్ గా - క్రికెట్ పండితులు అభివర్ణిస్తారు. పాతతరం క్రికెటర్లలో కర్ణాటకకు చెందిన ప్రఖ్యాత బౌలర్ చంద్రశేఖర్ ఈ ప్రక్రియలో ప్రసిద్ధుడు. కొమ్ములు తిరిగిన అంతర్జాతీయ బ్యాట్స్ మన్ ను తన గుగ్లీతో గింగిరాలు తిరిగేట్టు చేశాడు. ఆధునిక క్రికెట్ లో అనీల్ కుంబ్లే, సచిన్ టెండూల్కర్, అబ్దుల్ ఖాదర్, సక్లైన్ ముస్తాఖ్ వంటి క్రికెటర్లు గుగ్లీ ప్రవీణులు. గుగ్లీని ఆస్ట్రేలియాలో రాంగ్ వన్ అంటారు. పాకిస్తాన్ లో దూసరా అంటారు. శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ వేసే బంతిని దూసరా అనడం పరిపాటి. దూసరా అంటే మరోబంతి అని భావన. అక్రమమైనదని అభియోగం. మొత్తంమీదికి గుగ్లీకి మంచిపేరు లేదు. ఊహించని రీతిలో గబుక్కున అడ్డంతిరిగి వికెట్ల మీదికి వెళ్ళే బంతి ఏ నేరం చేయని బ్యాట్స్ మన్ ని కంగారు పెట్టి అవుట్ చేస్తుంది కనుక గుగ్లీకి చెడ్డపేరే ఉంది. అందుకే రాంగ్ వన్ అనీ, బాసీ అని పిలవడం. బ్యాట్స్ మన్ అవుటు కాకుండా బాగా ఆడుతూ బౌలింగ్ ను అదే పనిగా బాదేస్తుంటే ఫీల్డింగ్ పక్షం కెప్టెన్ ఈ ప్రక్రియను తుర్ఫు ముక్కలాగా ప్రయోగించడం ఆనవాయితీ.
కిరణ్ కూడా మంచి క్రికెటర్. స్వయంగా క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించి పలు సందర్భాలలో విజయం సాధించిన క్రీడాకారుడు. అజరుద్దీన్ వంటి ప్రపంచ ప్రసిద్ధుడైన కెప్టెన్ కు కిరణ్ కెప్టెన్. కెప్టెన్ ఆఫ్ కెప్టెన్ అన్న మాట. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కంట్రోల్డ్ ఎగ్రెషన్... అంటే జాగ్రత్తగా ఆడుతూనే రిస్కు తీసుకొని ధాటిగా షాట్లు కొట్టడం తెలిసిన ఆటగాడు. ప్రత్యర్థిని అవుట్ చేయడానికి ఏమి చేయాలో కిరణ్ కు తెలుసు. ప్రత్యర్థి సైతం సామాన్యుడు కాదు. పిన్న వయస్కుడైనా సాహసోపేతమైన రీతిలో బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న క్రికెటర్. అతని సారథ్యంలో మ్యాచ్ గెలుస్తామనే ఆశతో చాలామంది క్రికెటర్లూ, ఔత్సాహిక క్రికెటర్లూ ఆయన జట్టులో చేరారు. మరికొంత మంది చేరడానికి సిద్ధంగా ఉన్నారు.
కిరణ్ జట్టు సారథ్యం స్వీకరించే సమయంలో జట్టు డీలాపడి ఉంది. ప్రత్యర్థి జట్టు మంచి ఫామ్ లో రెచ్చిపోతున్నట్టు కనిపించింది. సొంత జట్టులోని సభ్యుల విధేయతపైన కెప్టెన్ కు విశ్వాసం లేదు. డ్రసింగ్ రూమ్ లో చర్చించిన వ్యూహాన్ని క్షణాలలో ప్రత్యర్థికి అందించే సహచరులతో తల బొప్పికడుతోంది. మనువొకచోటా, మనసొకచోటా అన్నట్టు ఉన్నది వారి వాలకం. రోశయ్య కెప్టెన్ గా విఫలమైనారు కనుకనే తనకు ఈ బాధ్యత అప్పగించారని కిరణ్ కు తెలుసు. ఏదో ఒక హడావుడి చేసి సంచలనం సృష్టించి ప్రత్యర్థులను బలహీనపరచి సొంత జట్టులోని సభ్యులను ఉత్సాహపరచి ప్రజలను ఆకట్టుకోకపోతే పాత కెప్టెన్ లాగానే తాను సైతం పరాజితుడై పదవి కోల్పోవలసి వస్తుందని కిరణ్ కు తెలుసు. ఓటమి పొంచి ఉన్న సందర్భాలలో విజృంభించి ఆడటం ఒక్కటే మార్గమని క్రికెట్ క్రీడానుభవం నేర్పిన పాఠం. తెలుగు ప్రేక్షకులు ప్రస్తుతం చూస్తున్న దృశ్యం అదే.
మంత్రులు కలసి రారని తెలిసినప్పటికీ, శాసనసభ్యులు గోడమీద పిల్లివాటంగా కపట విన్యాసాలు చేస్తున్నారన్న సమాచారం ఉన్నప్పటికీ కెప్టెన్ గా తాను చొరవ తీసుకొని వీరవిహారం చేయడం ప్రారంభించాలని కిరణ్ నిర్ణయించుకున్నారు. రచ్చబండ కార్యక్రమాన్ని ప్రకటించారు. సీమాంధ్రలో జగన్ అభిమానులూ, తెలంగాణలో తెలంగాణవాదులూ అడ్డుకుంటారనీ, రచ్చబండను రచ్చరచ్చ చేస్తారని తెలుసు. పోలీసు యంత్రాంగం సహకారంతో, కలసివచ్చే మంత్రులూ, శాసనసభ్యుల మద్దతుతో కార్యక్రమాన్ని ప్రణాళిక ప్రకారం కొనసాగించాలనే నిర్ణయించారు. కొనసాగిస్తున్నారు. తెలంగాణలో లాఠీచార్జీ, బాష్పవాయు ప్రయోగం వంటి చర్యలు అవసరమైనా వెనుకంజ వేయడం లేదు. రచ్చబండ కార్యక్రమం ప్రచారం పత్రికలలో, టీవీ చానళ్ళలో జోరుగా వస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా కోట్లాది తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనారు. ఆయన మాట తీరు కూడా తెలుగువారికి అలవాటైపోయింది. సంవత్సరానికి పైబడి ముఖ్యమంత్రిగా పని చేసిన రోశయ్యకు రాని ప్రచారం కిరణ్ కుమార్ రెడ్డికి వారం రోజులలోనే వచ్చింది. జగన్ శిబిరంలోకి వలసలు తగ్గినట్టు కనిపిస్తున్నాయి. ఇది తాత్కాలికమే కావచ్చు. కాకపోవచ్చు. మొత్తంమీద పలుకున్న ఆటగాడినని నిరూపించుకునే ప్రయత్నం కిరణ్ చేస్తున్నారు. ఈ సానుకూలతను ఎట్లా ఉపయోగించుకుంటారన్న అంశంపైన కిరణ్ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
అన్నట్టు గుగ్లీ విషయం. రచ్చబండ కార్యక్రమం ప్రారంభమైన జనవరి 24 వ తేదీన విశాఖపట్టణంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలోనే కిరణ్ జగన్ పైన గుగ్లీ విసిరారు. అంతకు కొన్ని రోజుల కిందటే ఆ నగరంలో కాంగ్రెస్ కార్యకర్తలు జగన్ కు బ్రహ్మరథం పట్టారు. అక్కడే జగన్ పైన కిరణ్ శక్తిమంతమైన అస్త్రాన్ని ప్రయోగించారు. పరిటాల రవి హత్య కేసులో జగన్ కు ప్రమేయం ఉందన్న ఆరోపణలను తెలుగు ప్రజలకు మరోసారి గుర్తు చేశారు. జగన్ పైన తెలుగుదేశం చేసిన ఆరోపణలను అసెంబ్లీలో ఎదుర్కొనే బాధ్యత నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనకే అప్పగించారని చెప్పారు. ఆ బాధ్యతను నెరవేర్చే క్రమంలో అరవై రోజుల పాటు తాను విషయాన్ని అధ్యయనం చేయవలసి వచ్చిందని తెలిపారు. జగన్ నిర్దోషి అని నిరూపించేందుకు అసెంబ్లీలో ఎట్లా వాదించబోతున్నావని అరవై రోజుల్లో ఒక్కసారి కూడా తనను వైఎస్ అడగలేదని బెబుతూ నాటి ముఖ్యమంత్రికి తనపైన అంతటి విశ్వాసం ఉన్నదని చాటుకున్నారు. అందువల్ల ఇరవై సంవత్సరాలు కలిసి నడిచిన తన వంటి రాజకీయ నాయకులే వైఎస్ కు నిజమైన రాజకీయ వారసులు కానీ జగన్ కానేకాదని తేల్చారు. రాజకీయ నాయకత్వం తనబోటి వాళ్ళదేనని చెప్పడం ఒక లక్ష్యం. అంతకంటే ముఖ్యమైన లక్ష్యం పరిటాల రవి హత్య కేసులో జగన్ కు పాత్ర ఉండి ఉండవచ్చుననే అనుమానాన్ని కలిగించే విధంగా స్పష్టాస్పష్టంగా చెప్పడం. కిరణ్ కుమార్ రెడ్డి ఇంత వ్యూహాత్మకంగా, ఇంత సాహసోపేతంగా, ఇంత నాటకీయంగా ప్రమాదపుటంచులపైన విన్యాసం చేయగలరని తెలుగు ప్రేక్షకులు బహుశా ఊహించి ఉండరు. షేక్ స్పియర్ రాసిన జూలియస్ సీజర్ నాటకంలో ఐ కమ్ టు బరీ సీజర్. నాట్ టు ప్రైజ్ హిమ్ అంటూ మహోపన్యాసం ప్రారంభించిన మార్క్ ఆంటనీ కిటుకునే కిరణ్ రివర్స్ లో ప్రయోగించారు. కిరణ్ విశాఖ ఉపన్యాసాన్ని లెగ్ బ్రేక్ లాగా కనిపించిన గుగ్లీ అనడం అందుకే. దీనికి ప్రతిగా జగన్ వర్గం విశ్వాస తీర్మానం డిమాండ్ తో బంతిని బౌండరీ దాటించింది. ఒక్క గుగ్లీతో బ్యాట్స్ మన్ అవుటై పోవాలని లేదు. ఇన్నింగ్స్ కుప్పకూలి పోవాలనీ లేదు. కానీ కిరణ్ వేసిన గుగ్లీ మాత్రం ప్రమాదకరమైనది. సందట్లో సడేమియా లాగా తెలుగుదేశం పార్టీ నాయకత్వం స్కోరు పెంచుకునే రంధిలో పడింది. కిరణ్ వ్యాఖ్యలను కొద్దిగా మార్చి వక్రభాష్యం చెబుతోంది. హత్య కేసులో జగన్ ను రక్షించినట్టు కిరణ్ చెప్పారని అంటూ అటువంటి పని చేసిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండరాదంటూ చంద్రబాబునాయుడు, యనమల రామకృష్ణుడు వంటి సీనియర్ నాయకులు డిమాండ్ చేయడం విడ్డూరం. జగన్ పైన తెలుగుదేశం నాయకులు చేస్తున్న ఆరోపణలకు అసెంబ్లీలో సమాధానం చెప్పడం గురించి కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తావిస్తే హత్య కేసులో జగన్ ని రక్షించినట్టు ముఖ్యమంత్రి చెప్పారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు వాదిస్తున్నారు. కిరణ్ వ్యాఖ్యలను వక్రీకరించి వర్థిల్లాలని ప్రయత్నిస్తున్నారు. మొత్తంమీద జగన్ తిరుగుబాటు బావుటా ఎగురవేసిన తర్వాత ఎదుర్కొన్న అత్యంత నిశితమైన విమర్శనాస్త్రం రచ్చబండ ప్రారంభంలో కిరణ్ కుమార్ రెడ్డి వేసిన గుగ్లీ. విజేతలు ఎవరో ఇప్పుడే చెప్పలేము కానీ ఆట రసవత్తరంగా, ప్రేక్షకులను మునుగాళ్ళ మీద నిలబెట్టే విధంగా, గుండెల్లో రైళ్ళను పరుగెత్తించే రకంగా ఉంటుందని మాత్రం చెప్పగలం. మిగిలిన కథ తెలుగు టీవీ న్యూస్ చానళ్ళ తెరపై నిరవధికంగా చూడవచ్చు.
(ఈ వ్యాసాన్ని శ్రీ రామచంద్రమూర్తి గారు hmtv సంపాదకీయం “ హంసధ్వని” కోసం 30వ తేదీన రాశారు. మూర్తిగారి మరిన్ని వ్యాసాలు చూడాలనుకుంటే.. www.hmtvhamsadhwani.blogspot.com ని క్లిక్‌ చేయండి)

Wednesday, January 26, 2011

ఏక్తా యాత్ర ఎవరి కోసం..?

దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అంటూ నవయుగ వైతాళికుడు గురజాడ చేసిన ప్రబోధం విలువైనది. వెలలేనిది. ఈ ప్రబోధాన్ని ఎవరు విస్మరించినా అవివేకమే. ఆత్మహత్యాసదృశమే. ఏక్తా యాత్ర పేరుతో శ్రీనగర్ వెళ్ళి లాల్ చౌక్ లో గణతంత్ర దినోత్సవం నాడు త్రివర్ణపతాకాన్ని ఎగురవేయాలన్న భారతీయ జనతా పార్టీ యువజన విభాగం నాయకుల సంకల్పం ఆందోళన కలిగిస్తున్నది. కథ మళ్ళీ మొదటికి వస్తున్నందుకు ఖేదం కలుగుతున్నది. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం దేశభక్తికి నిదర్శనం. భారత దేశంలో ఎక్కడైనా మూడురంగుల జెండాను ఎగువేసే స్వేచ్ఛ దేశప్రజలందరికీ ఉంది. ముఖ్యంగా కశ్మీర్ మిలిటెంట్లు ఉద్యమం ఉధృతంగా ఉన్న రోజుల్లో పాకిస్తాన్ పతాకాన్ని ఎగురవేసిన లాల్ చౌక్ లో మూడు వన్నెల జెండాను ఎగురువేసి దేశభక్తిని చాటుకోవడంలో తప్పు లేదు. కశ్మీరీలు భారతీయులనీ, జమ్మూ-కశ్మీర్ భారత దేశంలో భాగమనీ చాటడానికి ఇది మంచి సందర్భం. ఇదీ భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాయకుల వాదన.
కశ్మీర్ భారత్ లో భాగమని నిరూపించడం ఎట్లా? అంతర్జాతీయ వేదికలపైన నిరంతరం వాదించడం ద్వారానా? శ్రీనగర్ లో మట్టిని నెత్తిన పెట్టుకొని ఈ భూమి నాది, ఈ దేశం నాది అంటూ నినాదాలు చేయడం ద్వారానా? కశ్మీర్ లో జరుగుతున్న పరిణామాలను జాతికి తెలియకుండా దాచడం ద్వారానా? లాల్ చౌక్ లో జాతీయ జెండాను ఆగస్టు పదిహేనో తేదీనో, జనవరి ఇరవై ఆరవ తేదీనో ఎగురవేసి భారతమాతాకీ జై అంటూ నినదించడం ద్వారానా? కశ్మీర్ లో భారత దేశంలో భాగమనడానికి తిరుగులేని రుజువు ఏమిటి? ఏమి చేస్తే అటువంటి రుజువు లభిస్తుంది. భాజపా యువజన నేతలు పోలీసు బందోబస్తుతో శ్రీనగర్ వెళ్ళి లాల్ చౌక్ లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తే కశ్మీర్ భారత దేశంలో విడదీయలేని భాగమని లోకం విశ్వసిస్తుందా? కశ్మీర్ భారత్ అంతర్భాగమని ప్రపంచం నమ్మాలంటే ఏమి చేయాలి? కశ్మీర్ లోయలోని ప్రజలు స్వాతంత్ర్య దినోత్సవాన్నీ, గణతంత్రదినోత్సవాన్నీ పండుగ వాతావరణంలో జరుపుకోవాలి. ఐచ్ఛికంగా, ఆనందంగా, ఉత్సాహంగా లాల్ చౌక్ లో భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతం మనసారా సగౌరవంగా ఆలపించాలి. అటువంటి శుభవేళకోసం దేశప్రజలు వేచి ఉండాలి. అటువంటి ఉత్కృష్టమైన సన్నివేశం ఆవిష్కృతం కావాలంటే భారతీయ జనతా పార్టీకి చెందిన మహోన్నత నాయకుడు అటల్ బిహారీ వాజపేయి చూపించిన దారిలో ప్రయాణం చేయాలి.
హెచ్ ఎంటీవీ బృందం ఇటీవల కశ్మీర్ లో పర్యటించినప్పుడు అక్కడి ముఖ్యనాయకులనూ, సాధారణ ప్రజలనూ ఒక ప్రశ్న అడిగింది. భారత దేశాన్ని పరిపాలించిన ప్రధాన మంత్రులలో మీకు నచ్చిన ప్రధాని ఎవరన్నది ఆ ప్రశ్న. దాదాపు అందరు నాయకులూ ఒకే సమాధానం ఇచ్చారు. సాధారణ ప్రజలు అదే జవాబు చెప్పారు. హురియత్ నాయకులు సయ్యద్ అలీ షా గిలానీ, మీర్వాయిజ్ ఒమర్ ఫారూఖ్ నుంచి పీడీపీ నాయకుడు నయీమ్ అఖ్తర్ వరకూ మొదట జవహర్ లాల్ నెహ్రూ పేరు చెప్పి వెంటనే వాజపేయి పేరు చెప్పారు. సాధారణ పౌరులలో చాలామంది వాజపేయి పేరు మాత్రమే చెప్పారు. కశ్మీర్ లో వాజపేయి ప్రతిష్ఠ ఆశ్చర్యం కలిగించింది. రాజ్యాంగపరిధిలో కశ్మీర్ సమస్యకు పరిష్కారం కనుక్కుంటామంటూ భారత ప్రధానులూ, విదేశాంగ మంత్రులూ, ఇతర నాయకులూ అరిగిపోయిన రికార్డులాగా చేసిన ప్రకటనలను పూర్వపక్షం చేశారు వాజపేయి. మానవత్వం పరిధిలో కశ్మీర్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానంటూ అటల్ జీ చేసిన ప్రకటన కశ్మీర్ ప్రజల హృదయాలకు హత్తుకుంది. వాజపేయి కశ్మీర్ విధానాన్ని కొత్త పుంతలు తొక్కించారు. ఆయన ప్రధానిగా జమ్మూ-కశ్మీర్ ను సందర్శించారు. ప్రజల బాధల గాధలు ఆలకించి చలించిపోయారు. కవిత్వ రూపంలో సానుభూతి తెలిపారు. సంఘీభావం ప్రకటించారు. ఒక మానవతావాదిగా కరడుగట్టిన కశ్మీరీ మిలిటెంట్లకు సైతం అర్థమైనారు. కశ్మీర్ ప్రజలలో ఒక ఆశను రేకెత్తించారు. అందమైన భవిష్య చిత్రాన్ని చూపించారు. అటువంటి విలువైన వాజపేయి వారసత్వాన్ని యమునానదిలో కలిపే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రస్తుత నాయకత్వం వ్యవహరిస్తోంది. వాజపేయి కశ్మీర్ విధానం అమలులో ఆయన కుడిభుజంగా, దేశీయాంగమంత్రిగా తనవంతు కర్తవ్యాన్ని సమర్థంగా నిర్వహించిన లాల్ కృష్ణ అద్వానీ ఇప్పుడు వాజపేయి విధానానికి సమాధి కట్టడం అత్యంత బాధాకరం. బహుశా అందుకే అద్వానీ రాజనీతిజ్ఞుడుగా పేరు తెచ్చుకోలేకపోయారు. వాజపేయి తర్వాత సమున్నత నాయకుడిగా దేశ ప్రజల అభిమానాన్నీ, పార్టీ కార్యకర్తల విశ్వాసాన్నీ అందుకే పొందలేకపోయారేమో. వాజపేయి వారసత్వాన్ని కొనసాగించి ఉంటే... అద్వానీ, ఇతర భాజపా నాయకులు దేశానికి గొప్ప సేవ చేసి ఉండేవారు. కశ్మీర్ ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచేవారు. కశ్మీర్ సమస్య శాశ్వత పరిష్కారానికి దోహదం చేసేవారు. భారత ఉపఖండంలో శాంతి స్థాపనలో కీలకమైన భూమికను పోషించేవారు. భారత దేశ అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటగలిగేవారు. ద్విజాతి సిద్ధాంతంలో పసలేదని మరోసారి నిరూపించగలిగేవారు.
నిరుడు వేసవిలో రాళ్ళు రువ్వుతున్న యువకులను సైన్యం కాల్చి చంపినప్పుడు భాజపా నాయకత్వం నిరసర ప్రకటించి ఉంటే బాగుండేది. నూటా పన్నెండు మంది యువకుల మృతికి దారితీసిన ఘటనలపైన పార్లమెంటులో చర్చకోసం పట్టుబట్టి ఉంటే ఒక జాతీయ ప్రతిపక్షంగా భాజపా తన కర్తవ్యాన్ని నిర్వర్తించి ఉండేది. అద్వానీ, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ వంటి వరిష్ఠ నాయకులు కశ్మీర్ లోయకు వెళ్ళి చనిపోయిన పిల్లల తల్లులనూ, ఇతర కుటుంబ సభ్యులనూ పరామర్శించి ఉంటే కశ్మీర్ లోయలో ఒక మహత్తరమైన లౌకికవాతావరణం ఏర్పడి ఉండేది. వేసవి అల్లర్ల తర్వాత నెలకొన్న శాంతియుత వాతావరణాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన యూపీఏ ప్రభుత్వం, ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ సిగ్గుతో తలవంచుకోవలసి వచ్చేది. కష్టాలలో ఉన్న కశ్మీరీలకు భాజపా నాయకులు సంఘీభావం ప్రకటించి ఉంటే గణతంత్ర దినోత్సవం నాడు భాజపా నాయకులతో కలిసి కశ్మీరీలు లాల్ చౌక్ లోనే జెండావందనం జరుపుకునేవారు. ఒక మంచి అవకాశాన్ని భాజపా నాయకులు చేజార్చుకున్నారు. ఒక మంచి వారసత్వాన్ని చేజేతులా వదులుకున్నారు. ఒక మంచి భవిష్యత్తును అవివేకంగా కాలదన్నుకున్నారు. దేశమంటే మనుషులనే విశ్వాసం ఉంటే భాజపా నాయకులు ఈ విధంగా వ్యవహరించేవారు కాదు. కశ్మీర్ భూఖండం పైన ఉన్న ప్రేమ కశ్మీరీల పైన లేదు.
కశ్మీర్ ప్రజలు పరాయీకరణ చెందడానికి కారకులు ఎవరో భారతీయులందరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి. తాము భారత దేశంలో భాగం కాదంటూ కశ్మీరీలు భావించడం సగటు భారతీయులకు మనోవేదన కలిగిస్తుంది. ఇది సహజం. భారత దేశంలో తాము భాగమని కశ్మీరీలు తలపోయడం లేదు సరే. మరి భారతీయుల మాటేమిటి? కశ్మీరీలు భారత దేశంలో భాగమని భారతీయులందరూ భావిస్తున్నారా? ఆ విధంగా భావిస్తుంటే కశ్మీర్ లో సైన్యం పదఘట్టనలో ప్రజలు నలిగిపోతుంటే. రాళ్ళు రువ్వుతున్న కుర్రాలను పోలీసులు నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపుతుంటే పౌరసమాజం భారత స్పందించలేదు ఎందుకని? ప్రఖ్యాత రచయిత్రి, సామాజిక కార్యకర్త అరుంధతీరాయ్ కశ్మీర్ వెళ్ళి అక్కడి ప్రజల దుర్భర జీవితాల గురించి ప్రపంచానికి చాటే వరకూ కశ్మీర్ లో మానవ హక్కుల ఉల్లంఘనను ఎవ్వరూ ప్రశ్నించలేదు ఎందుకని? తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు చంద్రశేఖరరావు నిరాహారదీక్ష విరమించకపోతే తెలంగాణలో హింసాకాండ జరుగుతుందనే భయంతో దేశీయాంగ మంత్రి తెలంగాణ విధానాన్ని హడావుడిగా అర్ధరాత్రి ప్రకటించారు. గుజ్జర్లు హింసాత్మక ఉద్యమం కొద్ది రోజులు నిర్వహించే సరికి ఉద్యమ నాయకులను సర్కార్ చర్చలకు ఆహ్వానించింది. కానీ కశ్మీర్ సమస్య పరిష్కరానికి చర్చలు జరపాలంటూ ఎంతమంది నాయకులు విన్నపాలు చేసినా, ప్రజలు ఎన్ని ఉద్యమాలు చేసినా దేశ నాయకులు పట్టించుకోలేదు. సైన్యం నీడలో బతకలేమంటూ కశ్మీరీలు చేస్తున్న ఘోషను వినిపించుకునే నాధుడు లేడు. సైన్యాన్ని తగ్గిస్తామంటూ దేశీయాంగ కార్యదర్శి పిళ్ళై ప్రకటిస్తే అటువంటి అవకాశమే లేదంటూ మరునాడే రక్షణ మంత్రి పోటీ ప్రకటన చేశారు. సాయుధ బలగాల(ప్రత్యేక అధికారాల)చట్టాన్ని సవరించాలని యోచిస్తున్నట్టు హోంమంత్రి చెబితే అటువంటి ప్రతిపాదనను తాను ఎన్నటికీ ఆమోదించేది లేదంటూ సైన్యాధిపతి వెంటనే స్పష్టం చేశారు. పరస్పర విరుద్ధమైన ప్రకటనలూ, చర్యలూ ఆనవాయితీగా మారాయి. భారత ప్రభుత్వానికి కశ్మీర్ వ్యవహారంలో ఒక విధానం అంటూ లేదనడానికి ఇది నిదర్శనం. మన్మోహన్ సింగ్ కు కానీ సోనియాకి కానీ దార్శనికత లోపించిందనడానికి ఈ పరిణామాలే సాక్ష్యం. నిజానికి యూపీఏ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో వాజపేయి వారసత్వాన్ని కొనసాగించే ప్రయత్నం నిజాయితీగా చేసినట్టు కనిపించింది. శ్రీనగర్, ముజాఫరాబాద్ మధ్య బస్సు సర్వీసులను ప్రారంభించడంలో యూపీఏ సర్కార్ పట్టుదలగా వ్యవహరించింది. మిలిటెంట్ల బెదిరింపులకు లొంగకుండా గట్టిగా నిలిచింది. ఆ తర్వాత హురియత్ నాయకులతో చర్చలకోసం మన్మోహన్ సింగ్ తీసుకున్న చొరవ ఫలించలేదు. ఢిల్లీలో, శ్రీనగర్ లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశాలను హురియత్ నాయకులలో అత్యధికులు బహిష్కరించారు. అంతటితో మన్మోహన్ ఆగిపోయారు. కశ్మీర్ లో పరిస్థితులు క్రమంగా దిగజారాయి. నిరుడు వేసవి పరిణామాల తర్వాత పార్లమెంటు సభ్యలు బృందాన్ని తీసుకొని హోంమంత్రి చిదంబరం కశ్మీర్ లో పర్యటించారు. అప్పుడు శ్రీనగర్ పౌరులు మెత్తబడినట్టు కనిపించారు. అఖిలపక్ష బృందం పర్యటన తర్వాత మరో ఉన్నత స్థాయి బృందాన్ని పంపించి చర్చలు ప్రారంభించి ఉంటే పరిస్థితి సానుకూలంగా మారేదేమో. ఆ పని చేయకుండా ప్రముఖ జర్నలిస్టు దిలీప్ పాడ్గాంకర్ నాయకత్వంలో ముగ్గురు సభ్యుల బృందాన్ని నియమించడం శాంతిప్రియులకు నిరాశ కలిగించింది. ఈ బృందం సభ్యుల వ్యక్తిగత చొరవతో, సుహృద్భావంతో కొంతమందిని కలుసుకొని మాట్లాడగలిగారు. కానీ ప్రయోజనం పరిమితం. కశ్మీర్ సమస్య అత్యంత జటిలమైనది. ఒక వైపు భారత ప్రభుత్వాల వరుస తప్పిదాలు. మరో వైపు పాకిస్తాన్ భూభాగం నుంచి ఉగ్రవాదుల అగడాలు. ఇంకోవైపు కశ్మీరీ నాయకుల కపట ధోరణి. నాలుగో అంశం పాకిస్తాన్ మొడితనం. పీటముడి పడిన కశ్మీర్ సమస్యను పరిష్కరించాలంటే అపారమైన నేర్పూ, ఓర్పూ కావాలి. అద్వానీ వంటి అనుభవజ్ఞుడైన నాయకుడు ఈ వ్యవహారంలో ఈ దశలో చొరవ తీసుకొని ఉంటే, భారత రాజకీయ నాయకత్వానికి దారి చూపించి ఉంటే చరిత్రలో శాశ్వత స్థానం సంపాదించుకునేవారు. ఆ పని చేయకుండా శ్రీనగర్ లాల్ చౌక్ లో జాతీయ జెండా ఎగురవేయడాన్ని ఒక వివాదం చేసి అందులో వర్థిల్లాలని, దేశభక్తిని రాజకీయ లబ్ధికి వినియోగించుకోవాలనీ విఫలయత్నం చేయడం విషాదం. వాజపేయి సజీవంగా ఉండగానే ఆయన వారసత్వాన్ని మంటకలపడం క్షంతవ్యం కాని నేరం. ఏక్తా యాత్ర పేరుతో అనైక్యతకు బాటలు వేయడం జాతికి చేస్తున్నతీరని అపచారం.
(ఈ వ్యాసాన్ని శ్రీ రామచంద్రమూర్తి hmtv సంపాదకీయం "హంసధ్వని" కోసం 25-01-2011న రాశారు. శ్రీ మూర్తిగారి మరిన్ని వ్యాసాలు చూడాలనుకుంటే.. www.hmtvhamsadhwani.blogspot.com క్లిక్‌ చేయండి)