శబరిమల అయ్యప్ప స్వామి జ్యోతి మానవ చర్యేనని ట్రావెన్‌కోర్ దేవస్థానం స్పష్టం చేసింది. దీని ద్వారా.. అయ్యప్ప జ్యోతిపై తలెత్తిన వివాదాన్ని ముగించే ప్రయత్నం చేసింది. శబరిమలలో ఏదైనా విషాద ఘటన జరిగినప్పుడు మాత్రమే ఇలాంటి చర్చలు మొదలవుతుండడాన్ని బట్టి చూస్తే... ఓ గీత కింద మరో పెద్ద గీత గీయడం అన్న సూత్రం అర్థమవుతుంది.
జనవరి 14వ తేదీ సాయంత్రం.. పులిమేడు లోయలో తొక్కిసలాట జరిగి 102 మంది అయ్యప్ప స్వామి భక్తులు అసువులు బాశారు. దీంతో.. దాదాపు పుష్కరకాలం తర్వాత.. మళ్లీ మకరజ్యోతిపై చర్చ ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం జనవరి 14వ తేదీన శబరిమలలో కనిపించే మకర జ్యోతి దైవిక అద్భుతమా..? మానవ కల్పితమా అన్న అంశంపై విస్తృత చర్చ సాగింది. పులిమేడు తొక్కిసలాట ఘటనపై తీవ్రంగా స్పందించిన కేరళ రాష్ట్ర హైకోర్టు.. మకరజ్యోతిపై వాస్తవాలను వెల్లడించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పులిమేడు తొక్కిసలాటపై కేరళ డిజిపి, అటవీ అధికారులు, ట్రావెన్‌కోర్ దేవస్థానం అధికారులు విడివిడిగా హైకోర్టుకు నివేదికను సమర్పించారు.
ఈ సందర్భంగా.. కోర్టులో వాదనలు వినిపించిన ట్రావెన్‌కోర్ దేవస్థానం న్యాయవాది.. మకరజ్యోతి దైవిక అద్భుతమన్నది భక్తుల భావన అని, అది దివ్యతార, దైవికమైనదేనని అంటూనే.. దీనిపై దేవస్థానం ఎన్నడూ అనుకూల ప్రచారం చేసుకోలేదని వాదించారు. ఈ వాదనను తీవ్రంగా పరిగణించిన హైకోర్టు ధర్మాసనం.. మకరజ్యోతిపై వాస్తవాలను వెల్లడించాలంటూ.. ట్రావెన్‌కోర్ దేవస్థానాన్ని ఆదేశించింది.
ఈలోపే.. కేరళకు చెందిన కొందరు ఔత్సాహికులు, మకరజ్యోతి కనిపించే పొన్నంబలమేడు వెళ్లి వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చారు. వండిపెరియార్ మార్గంలో.. ఇడత్తోట వద్దనుంచి డైవర్ట్ అయితే.. సుమారు 80 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే.. పులిమేడు వస్తుంది. ఈ గిరిపై, స్వర్ణమందిరం ఉందని.. అయ్యప్ప స్వామి.. సర్వదేవ సంసేవితుడై.. ఇక్కడ కొలువు దీరారని, ఇది దేవతలు సంచరించే పొన్నంబలమేడు అన్నది భక్తుల విశ్వాసం. ఇక్కడికి నరమానవులు ఎవరూ వెళ్లలేరని... తెగించి ఎవరైనా వెళ్లినా.. తిరిగి రాలేరన్నది
భక్తుల నమ్మకం. అయితే.. ఈ మార్గంలో ఇటీవలే కొంతమంది వ్యక్తులు సంచరించిన ఆనవాళ్లను ఔత్సాహికులు బయటపెట్టారు. అక్కడ జ్యోతిని వెలిగించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దిమ్మెను గుర్తించారు. అంతేకాదు.. తాజాగా అక్కడ కర్పూరాన్ని వెలిగించిన దాఖలాలనూ బాహ్య ప్రపంచానికి చాటారు. అక్కడినుంచి శబరిమల అయ్యప్పస్వామి ఆలయం ఎలా కనిపిస్తుందో కూడా కళ్లకు కట్టినట్లుగా దృశ్యరూపకంగా వెల్లడించారు.
అంతేకాదు.. వన్యమృగాలు దాహం తీర్చుకునే ఓ చిన్నపాటి మడుగునూ వారు ఆ ప్రాంతంలో గుర్తించారు. మకరజ్యోతిని వెలిగించే దిమ్మకు కేవలం 50 మీటర్ల దూరంలోనే ఈ మడుగు ఉంది. అంతేనా.. మకరజ్యోతిని వెలిగించే సమయంలో అన్యులు ఎవరూ అటువైపు రాకుండా కొండపై నిర్మించిన సెక్యూరిటీ పోస్ట్ కూడా వీరి పరిశోధనలో బట్టబయలైంది.
అసలు మకరజ్యోతిపై చర్చ మొదలు కావడం ఇదే ప్రథమం కాదు. గతంలో కూడా ఇలాంటి చర్చ సాగింది. అప్పట్లో కేరళ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలోనే మకరజ్యోతి మానవ కల్పితమని ప్రకటించింది. అయితే.. అయ్యప్ప భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో ఉంచుకుని.. ఈ ప్రకటనకు విస్తృత ప్రచారం రాకుండా జాగ్రత్తలు తీసుకుంది. పర్యటకరంగం పరంగా వచ్చే ఆదాయం కోసం కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని అప్పట్లో అణగతొక్కేసింది. కానీ.. శబరిమల ఆలయ అర్చకుడి మనవడు రాహుల్ ఈశ్వర్ మాత్రం దీన్ని మానవ కల్పితంగా ఎన్నడో ప్రకటించారు.
"మకరజ్యోతి పొన్నంబలమేడు కొండపైభాగంలో కనిపించే నక్షత్రం. మకర విళక్కు పొన్నంబల మేడులో ఆనూచానంగా కొనసాగించే సంప్రదాయం. ఈ ఆలయాన్ని పరశురాముడు నిర్మించారన్నది ప్రతీతి. ఈ ప్రాంతంలోని ఆదివాసీలు.. ఆకాశంలో మకర నక్షత్రం కనిపించగానే.. దాన్ని దైవికంగా భావించి, కర్పూరంతో హారతి ఇవ్వడం ప్రాచీన కాలం నుంచి వస్తోన్న ఆనవాయితీ. ఇలా మూడు సార్లు హారతి ఇవ్వడం ఆచారం. పొన్నంబలమేడులో ఆదివాసీలు వెలిగించే ఆ హారతులు శబరిమలలో కనిపించగానే.. ఇక్కడి అయ్యప్ప ఆలయంలో పూజావిధులు జరుగుతాయన్నది చరిత్ర. పరిణామ క్రమంలో.. ఆధునికత వచ్చిన క్రమంలో.. ఆదివాసీలు అక్కడినుంచి వలస వెళ్లినా.. ఆ ఆచారాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు" అంటూ రాహుల్ ఈశ్వర్ విస్పష్టంగా ప్రకటించారు.
మకర సంక్రమణం రోజున ఆకాశంలో దేదీప్యమానంగా కనిపించేది నక్షత్రమేనని.. సూర్యుడు ధనూరాసి నుంచి సంక్రమించేటప్పుడు ఆ నక్షత్రానికి జరిపే హారతి పూజే మకరజ్యోతి అని ఆయన విస్పష్టంగా ప్రకటించారు. అటు హేతువాదులదీ ఇదే వాదన. మకర నక్షత్రం వాస్తవం.. సూర్యుడు ధనూరాసి నుంచి మకర రాసిలోకి ప్రవేశించేటప్పుడు.. ఓ నక్షత్రం కొండ పైభాగంలో దేదీప్యమానంగా వెలుగుతూ కనిపిస్తుందని.. ఆతర్వాతి రోజుల్లోనూ దాన్ని నేరుగా చూడొచ్చని వీరు వాదిస్తున్నారు.
మకరజ్యోతి వాస్తవికతపై దాదాపు రెండు దశాబ్దాల క్రితం కూడా విస్తృతంగా చర్చ సాగింది. అప్పట్లో సాక్షాత్తూ ఆరాష్ట్ర ముఖ్యమంత్రే మకరజ్యోతి మానవకల్పితమని కేరళ అసెంబ్లీలో ప్రకటించారు. అయితే.. ఇవేవీ భక్తుల్లో విశ్వాసాన్ని దెబ్బతీయలేక పోయాయి. ఈ చర్చ గురించి తెలియని వాళ్లే కాదు... తెలిసిన వాళ్లు కూడా శబరిమల జ్యోతి దర్శనానికి వెళ్లడం మానలేదు. పైగా.. ఏటేటా మకరజ్యోతి దర్శనానికి శబరిమల వెళ్లే వారి సంఖ్య ఇంతింతలుగా పెరుగుతూ వస్తోంది. కాబట్టి.. ఇప్పుడు ఏదో ప్రమాదం కారణంగా మొదలైన చర్చ కూడా తమ విశ్వాసాన్ని పెద్దగా దెబ్బతీయ బోదని అయ్యప్ప భక్తులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. కేరళ హైకోర్టుకు.. ట్రావెన్‌కోర్ దేవస్థానం తెలిపిన మకరజ్యోతి వాస్తవం భక్తుల మనోభావాలపై పెద్దగా ప్రభావం చూపక పోవచ్చన్న భావనే సర్వత్రా వ్యక్తమవుతోంది. చూడాలి మరి.
(కేరళకు చెందిన టీవీ ఛానల్ ప్రసారం చేసిన మకరజ్యోతి మర్మం వార్తా కథనాన్ని చూడాలనుకుంటే..
www.youtube.com/watch?v=d50EiaQYSzQ క్లిక్ చేయండి)
No comments:
Post a Comment