Thursday, September 30, 2010
శభాష్ పోలీస్..
(అయోధ్యపై తీర్పు అనంతరం బెజవాడలో శాంతి కపోతాలు ఎగురవేస్తున్న హిందూ, ముస్లింలు)
హమ్మయ్య! మొత్తానికి పెద్ద టెన్షన్ పోయింది. అలహాబాద్ హైకోర్టు లక్నోబెంచ్ అయోధ్యలోని వివాదాస్పద స్థలంపై తీర్పు చెప్పింది. ఈ స్థలం రామజన్మభూమేనని.. బాబర్ చక్రవర్తి అక్కడ అంతకుముందున్న రామాలయాన్ని కూల్చేసి.. ఓ కట్టడాన్ని నిర్మించాడని తీర్పులో వెల్లడించింది. ఈ తీర్పు అనంతరం, చాలామంది గెలుపోటముల మీద చర్చ చేశారు. ఎవరు గెలిచారు..? ఎవరు ఓడారు..?
నేను మాత్రం ఈ వ్యవహారంలో గెలుపొందింది ఎవరంటే.. కచ్చితంగా పోలీస్ శాఖేనంటాను. రాష్ట్రంలో, (ముఖ్యంగా హైదరాబాద్‌లో) ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా, పోలీసు శాఖ అనుసరించిన వ్యూహం అభినందనీయం. ముందునుంచీ, అంటే సెప్టెంబర్ 20వ తేదీ నుంచే.. అన్ని జిల్లాల్లోనూ ఎస్పీలు చొరవ తీసుకుని, మత పెద్దలతో సమావేశాలు నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ ఆవశ్యకతను చాటి చెప్పారు. అయోధ్య వివాదంలో అలహాబాద్ కోర్టు తీర్పు ఎలా వచ్చినా సంయమనం పాటించేలా అందరి మైండ్‌సెట్స్‌నీ మార్చారు. తీర్పు 24న కాకుండా, 30వ తేదీకి వాయిదా పడ్డా... పోలీసు శాఖ మతాల మధ్య సామరస్యాన్ని పెంపొందించే విషయంలో, ఎక్కడా ఉదాసీనత ప్రదర్శించలేదు.
ఇక 29వ తేదీ నుంచైతే.. పోలీసు శాఖ, రాష్ట్రాన్ని పూర్తిగా తమ గుప్పిట్లో తీసుకున్నట్లే కనిపించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రతి అడుగుకూ ఓ పోలీసును మోహరించారు. అలాగని మిగిలిన ప్రాంతాలనూ తేలిగ్గా ఏమీ తీసుకున్నట్లు లేదు.
30వ తేదీ తీర్పు వెలువడేంత వరకూ.. అందరినీ కలిపి సంయమనంగా ఉండాలని కోరిన పోలీసు అధికారులు, తీర్పు వెలువడ్డాక కూడా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తీర్పు వల్ల ఏదో ఓ వర్గం మనోభావాలు గాయపడే అవకాశం ఉందని భావించినట్లున్నారు. ఆ భావన బయటపడకుండా.. తద్వారా హింసాత్మక ఘటనలు చెలరేగకుండా, తీర్పు అనంతరం కూడా కొన్ని కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. తీర్పు వెలువడ్డ మరుక్షణం నుంచే.. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ శాంతి ర్యాలీలు, సమభావన సమావేశాలు నిర్వహించారు. ఇది సత్ఫలితాలనిచ్చిందనే చెప్పాలి.
ఇక యధావిధిగా జర్నలిస్టు మిత్రులు, ఈ తీర్పు విషయంలో.. మారని తమ బుద్ధిని యధేచ్ఛగా ప్రదర్శించారు. తీర్పుపై ఎలాంటి ముందస్తు వ్యాఖ్యలు చేయరాదని, తర్వాత కూడా దానికి సంబంధించిన చర్చలు నిర్వహించరాదని చేసిన సూచనలను స్వేచ్ఛగా ఉల్లంఘించేశారు. కొన్ని ఛానళ్లలో, ఏకంగా తీర్పుపైనే వ్యాఖ్యలు చేశారు. ఇవి చూసే కాబోలు.. హైదరాబాద్‌లోని పోలీసు బాసులు (ముఖ్యంగా నగర కమిషనర్ ఎ.కె.ఖాన్) ఛానళ్ల చర్చా కార్యక్రమాలపై ఆంక్షలు విధించారు. ఆయనే నేరుగా రంగంలోకి దిగడంతో.. దాదాపుగా అన్ని తెలుగు ఛానళ్లలో ఏడు గంటలలోపే చర్చా కార్యక్రమాలు పూర్తయ్యాయి. లేకుంటే, రాత్రంతా ఇదే అంశంపై రొదపెట్టి ఉండేవారు.. లేనిపోని సమస్యలకు కారకులయ్యేవారు.
మొత్తానికి, ఎన్నెన్నో భయాలు.. మరెన్నో అనుమానాలను పటాపంచలు చేస్తూ.. సెప్టెంబర్ 30వ తేదీ సాధారణంగానే గడిచిపోయింది. రాష్ట్ర ప్రజలను కొన్ని గంటల పాటు ఆందోళనలో ఉంచడం తప్ప ఈ రోజుకు మరెలాంటి ప్రయోజనమూ లేదు. మరెలాంటి ఇబ్బందులూ తలెత్తలేదు. దీనికి కచ్చితంగా పోలీసు శాఖనే అభినందించాలి. శభాష్.. పోలీస్.
మిత్రులారా సంయమనం పాటిద్దాం
దేశమంతా తీవ్ర ఉద్విగ్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్కూళ్లు మధ్యాహ్నం వరకే పనిచేస్తున్నాయి.. ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న పిల్లల్ని పదిగంటలకంతా ఇళ్లకు పంపేయాలని పాఠశాలల యాజమాన్యాలు నిర్ణయించాయి. ఆమేరకు సిద్ధపడి బడికి రావాలని నిన్ననే పిల్లలకు చెప్పేశాయి. దాదాపు అన్ని విద్యా సంస్థల్లోనూ ఇదే పరిస్థితి.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లు, ఎస్పీలు సంయుక్తంగా సమావేశాలు ఏర్పాటు చేసి, రెండు మతాల పెద్దలను శాంతి సామరస్యతలకు కట్టుబడి ఉంటామని ఒప్పించారు! ఈనెల 24వ తేదీనే ఈ తీర్పు వెలువడుతుందని భావించిన అధికారులు, 21వ తేదీనుంచే ఈ సమావేశాలు నిర్వహించారు. అయితే తీర్పు వాయిదా కోరుతూ.. సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు కావడం.. దానిపై విచారించిన సుప్రీం పిటిషన్‌ను తోసిపుచ్చడం వల్ల.. తీర్పు వెలువడడంలో కాస్త జాప్యం ఏర్పడింది. దీంతో అధికారులు, నిన్న మళ్లీ హడావుడిగా అందరినీ సమావేశపరిచి, సుహృద్భావతను పెంపొందించాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి రోశయ్య, డిజిపి అరవిందరావు ఒకరేమిటి అందరూ అన్ని సందర్భాల్లోనూ సంయమనం పాటించాల్సిన అవసరాన్ని చాటి చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు.. అయోధ్య వివాదంపై తీర్పు నేపథ్యంలో, ఇవాళ్టినుంచి మూడు రోజుల పాటు కొనసాగించాలనుకున్న తూర్పుగోదావరి జిల్లా పర్యటననూ రద్దు చేసుకుని, అందరూ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.
బ్యూరోక్రాట్లు, మనం ఎంచుకున్న ప్రజాప్రతినిధులు ఇందరు చేస్తున్న విన్నపాన్ని జర్నలిస్టులుగా మనందరం మన్నిద్దాం. పెడధోరణులను విడిచి పెడదాం. ప్రతిరోజూ కన్నా మిన్నగా.. ప్రజాహితమే పరమావధిగా ఇవాళ మరింత బాధ్యతాయుతంగా పనిచేద్దాం. ఆవేశం అన్ని వేళలా అనర్థదాయకం. తెచ్చిపెట్టుకున్న, ప్రేరేపిత ఆవేశాలను పూడ్చిపెట్టేద్దాం. సహజసిద్ధమైన మన సౌభ్రాతృత్వాన్ని పరిమళింప చేద్దాం.
పుకార్లను విస్మరిద్దాం. సంయమనం పాటిద్దాం. శాంతిని కాపాడదాం.
Wednesday, September 22, 2010
మూడో స్థానానికి ఎదిగిన hmtv
19 నెలల స్వల్ప వ్యవధిలో అంచెలంచెలుగా ఎదుగుతూ హెచ్ఎంటీవీ ఈ స్థాయికి చేరడం వెనుక, నేను నేతృత్వం వహిస్తున్న ప్రాంతీయ వార్త బులెటిన్ల పాత్రను విస్మరించలేము. ఈ స్థానం అంత సులువుగా ఏమీ దక్కలేదు. ఎంతోమంది అవిశ్రాంత కృషి.. అనునిత్యం శ్రమించడమే ఏకైక తత్వంగా సాగిన తీరు.. సమష్టితత్వం.. అన్నీ కలిస్తేనే ఈ అపూర్వ విజయం సిద్ధించింది.
ఇక నా విషయానికి వస్తే.. ముందునుంచీ, లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం.. దాన్ని సాధించేవరకూ.. నిద్రాహారాలు మాని పనిచేయడం నాకు ముందునుంచీ ఉన్న అలవాటు. ఇది ఈనాడు-ఈటీవీలలొ పని చేస్తున్నప్పటినుంచీ అలవాటైంది. గడచిన 23 సంవత్సరాలుగా ఇదే విధంగా లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం.. సాధించడం.. కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం.. ఇలా నా ప్రస్థానం సాగుతూ వస్తోంది.
ఈ సందర్భంగా.. 2009, సెప్టెంబర్ 3వ తేదీన పావురాల గుట్టపై రాజశేఖరరెడ్డి మరణించిన దృశ్యాలను తొలుతగా హెచ్ఎంటీవీకి అందించిన.. 'నాటి లక్ష్యం' కూడా ఇప్పుడు గుర్తొస్తోంది. రాజశేఖరరెడ్డి మరణించినట్లు రూఢీ అయ్యాక, హెచ్ఎంటీవీ సిఇఓ శ్రీ రామచంద్రమూర్తి గారికి ఆ విషయం చెప్పాను. దానికి సంబంధించిన ఫోన్ ఇన్ కూడా ఇచ్చాను. అప్పుడే మరోమారు శ్రీ మూర్తిగారితో ఫోన్ లో మాట్లాడుతూ.."sir, I am moving into forest.. definitely I will make those visuals first aired on hmtv" అని కచ్చితంగా చెప్పాను. అప్పటికే నేను చికున్ గున్యా నొప్పులతో బాధపడుతున్నాను. అయినా.. ఎలాగైనా విజువల్స్ సాధించాలన్న ఏకైక లక్ష్యంతో పంటిబిగువన అన్ని నొప్పులూ భరిస్తూ.. వ్యూహాత్మకంగా అక్కడికి చేరుకున్నాను. నేను ముందుగా రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం.. రాజశేఖరరెడ్డి మరణానికి సంబంధించిన దృశ్యాలు పంపి, first on hmtv అన్న మాటను నిలుపుకున్నాను. దేశంలోని అన్ని ముఖ్య ఛానెల్స్ హెచ్ఎంటీవీ దృశ్యాలనే యథాతథంగా వాడాయి.
లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం.. దాన్నిసాధించేందుకు ప్రయత్నించడం అన్న నా తత్వమే.. ఇప్పుడు హెచ్ఎంటీవీ ప్రాంతీయ వార్త బులెటిన్లు మంచి రేటింగ్ సాధించడానికి కారణమయ్యాయి. ఈ ప్రయత్నం విజయవంతానికి కూడా శ్రీ మూర్తి గారే కారకులు కావడం యాధృచ్ఛికమే. ఓ మూడు వారాల క్రితం (ఈ నెల ప్రారంభంలో) ప్రాంతీయ వార్త మంచి రేటింగ్ లో ఉంది అభినందనలు అని మూర్తి గారు అన్నారు. అప్పుడు, "ప్రాంతీయ వార్త బులెటిన్ 1.00 రేటింగ్ దాటాలి.. మన ఛానెల్ టాప్ టెన్ ప్రోగ్రామ్స్ లో కనీసం ఐదు స్థానాలు ప్రాంతీయ వార్త కే దక్కాలి.. ఆ తర్వాతే నేను సంతృప్తి చెందుతా" అని అన్నాన్నేను.
మాటైతే చెప్పాను గానీ.. ఆ రేటింగ్ సాధించడం ఎంత కష్టమో నాకు బాగా తెలుసు. అందుకే, లక్ష్య సాధనకు ప్రత్యేకంగా ఓ సెగ్మెంట్ ను ఎంచుకున్నా. ఉదయం పూట 8 గంటలకు ప్రసారం అయ్యే ప్రాంతీయ వార్త బులెటిన్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. దీనికోసం రీజనల్ డెస్క్ లోని సభ్యులను బృందాలుగా విడదీశాను. కాపీఎడిటర్లు రమేశ్, మృత్యుంజయ, జయశ్రీ లను మూడు బులెటిన్లకు బాధ్యులను చేశాను. నేను, ఓవరాల్ సూపర్విజన్ చేశాను. రమేశ్, మృత్యుంజయ లకు ఉదయం బులెటిన్లలో ఏయే వార్తలు ఏ రకంగా ప్రెజెంట్ చేయాలో సూచనలిచ్చి, ఆప్రకారం పక్కాగా వార్తలు ప్రసారం అయ్యేలా చూశా.
ప్రతిరోజూ ఉదయాన్నే ఆరు గంటలకు ఆఫీసుకు వెళ్లేవాడిని. రాత్రి 9 లేదా 10 గంటల దాకా, బులెటిన్ల స్వరూపంపై ప్లాన్ వేసేవాడిని. ఇక ఉదయం 8 గంటల బులెటిన్ ను అయితే.. ఆమూలాగ్రం పరిశీలించే వాడిని. నేను అనుకున్న (జనం మెచ్చే) పద్ధతిలో ఏ వార్త లేకున్నా నిర్దాక్షిణ్యంగా తిరగరాసేవాడిని. వీడియో కోఆర్డినేటర్లుగా ఉన్న మీనేశ్, శంకర్, విశ్వనాథ్ లు ఎవరు షిఫ్టులో ఉన్నా.. పాపం 'అవ్వదు.. అసాధ్యం' అని చెప్పకుండా, హడావుడిగా ప్యాకేజీలు ఎడిట్ చేయించే వాళ్లు. మా ఎడిటర్లు కూడా ప్రాంతీయ వార్తలో ప్రసారం కావాల్సిన వార్తల ఎడిటింగ్ లో మరికొంత చలాకీగా పనిచేసేవాళ్లు. ఆ రకంగా, ఉదయం ఎనిమిది గంటల ప్రాంతీయ వార్త బులెటిన్.. అచ్చంగా (సంస్థ విధానాలకు అనుగుణంగా) నేను అనుకున్నట్లు ప్రసారం అయ్యేట్లు జాగ్రత్త తీసుకున్నాను. ప్రతి ప్రాంతానికీ సమ ప్రాధాన్యతనిచ్చేందుకే ప్రాధాన్యతనిచ్చా. ఈ విషయంలో పిసిఆర్ (ప్రొడక్షన్ కంట్రోల్ రూమ్) సిబ్బంది సహకారం బ్రహ్మాండం. అందుకే.. ప్రాంతీయ వార్త బులెటిన్ అందరికీ నచ్చింది. ఈ రేటింగ్స్ సాధించింది. హెచ్ఎంటీవీని మూడో స్థానంలో నిలిపింది.
ఈ విజయం అందుకోవడంలో సహకరించిన మా మిత్రులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకోక పోతే.. ఈ విజయానికి అర్థమే ఉండదు. అందుకే సహకరించిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ శుభ సందర్భంలో నాకు ఆనందమే కాదు.. ముందే చెప్పినట్లు పెరిగిన బాధ్యత కూడా అప్రమత్తం చేస్తోంది. ఈసారి కొత్త టార్గెట్ తో ముందుకు వెళుతున్నాను. మళ్లీ విజయం సాధిస్తానన్న గట్టి నమ్మకంతో సాగుతున్నాను. విష్ మి ఆల్ ది బెస్ట్.
Friday, September 17, 2010
సెప్టెంబర్ 24 : జర్నలిస్టులకు పరీక్షాదినం
జర్నలిస్టులకు తమ పరిధులు, పరిమితులు తెలుసు. అయినా.. ఎందుకైనా మంచిదని, నేషనల్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్.. (ఎన్.బి.ఎ.) జర్నలిస్టు మిత్రులు, సెప్టెంబర్ 24వ తేదీన అనుసరించి తీరాల్సిన మార్గదర్శకాలను జారీ చేసింది. వాటిని అన్ని ప్రసార సంస్థలూ.. వాటిల్లో పనిచేసే జర్నలిస్టులు తు.చ. తప్పకుండా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మండల స్థాయి విలేకరి నుంచి, ప్రసార సంస్థ సిఇఓ వరకు, అన్ని స్థాయుల్లోనూ అప్రమత్తత అవసరం.
ఎన్.బి.ఎ మార్గదర్శకాలను అన్ని ప్రసార మాధ్యమాలూ.. కచ్చితంగా పాటించి, దేశంలో హింస చెలరేగకుండా, బాధ్యతగా వ్యవహరిస్తాయని నమ్ముతున్నాను. ఎన్.బి.ఎ వెలువరించిన మార్గదర్శకాలతో కూడిన లేఖకు అనువాదాన్ని ఇక్కడ ఇస్తున్నాను.
* * * * *
16.09.2010
NBA ఎడిటర్లందరికీ,
విషయం : ఆసన్నమైన అయోధ్య తీర్పు
ఈనెల 24 వ తేదీన అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్.. అయోధ్య కేసులో తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పును, దీనిపై అభిప్రాయ సేకరణలను ప్రసారం చేయడంలో మరింత జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నేషనల్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్.. అన్ని టీవీ ఛానెళ్ల యాజమాన్యాలు, ఎడిటర్లకు సూచిస్తోంది.
అయోధ్య అంశం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అంశం. ముఖ్యంగా ఈ కేసు తీర్పుకు సంబంధం ఉన్న ఏ వార్తను ప్రసారం చేయాల్సి వచ్చినా.. సంచలనానికి, ఆగ్రహావేశాలు పెరిగేందుకు, రెచ్చగొట్టే చర్యలకు, కవ్వింపు చర్యలకు అవకాశం ఇవ్వరాదు. వచ్చిన ప్రతి వార్తను రూఢీ చేసుకోవాలన్న ప్రాథమిక సూత్రాన్ని.. మరీ జాగ్రత్తగా అనుసరించాలి. వార్త ప్రసారం చేయాల్సి వస్తే.. అది ప్రజాప్రజయోజనాలను అనుసరించి మాత్రమే ఉండాలి. సమాజంలో మత సామరస్యాన్ని, లౌకిక భావాన్నిదెబ్బతీసేలా ఏవార్తా ఉండరాదు.
అత్యంత సున్నితమైన అయోధ్య అంశాన్ని దృష్టిలో ఉంచుకుని.. ఈ కేసులో హైకోర్టు తీర్పును రిపోర్ట్ చేసేటప్పుడు, ప్రతివారూ.. స్వీయ మార్గదర్శకాలు, నైతిక ప్రవర్తనా నియమావళిని అనుసరించి, సందర్భానుసారంగా వెలువరించిన ఈ అదనపు మార్గదర్శకాలనూ పాటించాలి. అంతేకాదు.. ఊహాగానాల ఆధారంగా, అవాంఛనీయ ఘటనలు తలెత్తేలా వార్తలు ప్రసారం చేయకుండా కచ్చితత్వాన్ని పాటించాలి.
ఈ అంశంలో అనుసరించాల్సిన కొన్ని అదనపు మార్గదర్శకాలు:
1. హైకోర్టు తీర్పునకు సంబంధించిన అన్ని వార్తలు, ఉన్నది ఉన్నట్లుగా, ఎలాంటి వ్యాఖ్యానాలు జోడించకుండా ప్రసారం చేయాలి.
2. తీర్పు వెలువడక ముందే, సంచలనాల, ఆవేశాగ్నులు రగిలించేలా, రెచ్చగొట్టేలా.. ఎలాంటి ముందస్తు ఊహాగానాల వార్తలను ప్రసారం చేయరాదు.
3. తీర్పునకు అనుగుణంగా.. బాబ్రీ మసీదు కూల్చినప్పటి దృశ్యాలను ఏ వార్తలోనూ ప్రసారం చేయరాదు
4. తీర్పు నేపథ్యంలో జరిగే ఆందోళనలు లేదా సంబరాలపై చిత్రించిన దృశ్యాలను ప్రసారం చేయరాదు
5. అత్యంత సున్నితమైన ఈ వార్తను రిపోర్ట్ చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా, ప్రసారంలోనూ.. వ్యాఖ్యలలోనూ కచ్చితత్వం ఉండేలా.. అత్యున్నత సంపాదక వర్గం స్థాయిలోనే, క్షుణ్ణంగా పరీక్షించి, ప్రసారానికి అనుమతులు ఇవ్వాలి.
ఎలాంటి హింసకు తావివ్వకుండా, ఈ మార్గదర్శకాలను ఎడిటర్లందరూ కచ్చితంగా అనుసరిస్తారని భావిస్తున్నాం. ఉల్లంఘనలకు కఠిన చర్యలు తప్పవు.
అన్నే జోసెఫ్
సెక్రెటరీ జనరల్, ఎన్.బి.ఎ (న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్)
అర్థం తెలిసే వాడుతున్నామా..?
తృటిలోనా..? త్రుటిలోనా..?
ఈ మధ్య ప్రమాద వార్తలు రాసేటప్పుడు, 'తృటిలో' అన్న పదాన్ని బాగా ఎక్కువగా వాడుతున్నాము. నిజానికి తృటిలో అన్నది సరైన రూపం కాదు. దీన్ని త్రుటిలో అని రాయాలి.
త్రుటి అంటే ఒక తీక్షణమైన (వాడిగా ఉన్న) సూది, తామర పువ్వు రేకులో దిగేందుకు పట్టే సమయం. ఇంకా స్పష్టంగా వ్యాకరణరీత్యా చెప్పాలంటే.. ఒక లఘువును (హ్రస్వాక్షరాన్ని ఉదా: అ, క, చ, ట, ర మొ...) ఉచ్ఛరించేందుకు పట్టే సమయంలో నాలుగో వంతు సమయమే త్రుటి.
ఆశనిపాతమా..? అశనిపాతమా..?
"అశని" అంటే పిడుగు. పాతం అంటే పాటు, పడడం.. అని అర్థం. అశని పాతం అంటే పిడుగు పాటు అని అర్థం. "ఆశనిపాతం" అన్నది సరైన రూపం కాదు.
రావణ కాష్ఠం :
సమస్య రగులుతూనే ఉంది అన్న అర్థంలో ఈ పదాన్ని వాడుతున్నాం. అది సరైన భావనే. అయితే.. ఇంతకీ రావణ కాష్టం అన్న పదం ఎలా పుట్టిందో తెలుసా..?
రావణాసురుడు ఎప్పుడు యుద్ధానికి వెళ్లినా.. మహా పతివ్రత అయిన ఆయన సతీమణి మండోదరి పూజామందిరంలో దీక్షకు కూర్చునేదట. రావణుడి శక్తికి, ఆమె అకుంఠిత దీక్ష తోడై.. అన్నీ విజయాలే సిద్ధించేవట. రామ రావణ యుద్ధ సమయంలోనూ ఆమె దీక్షలో కూర్చుందట. ఆమె దీక్షను భగ్నం చేయకుంటే రావణవధ జరగదని తెలిసిన దేవతలు, మండోదరి దీక్ష భగ్నం చేసే బాధ్యతను ఆంజనేయుడికి అప్పగించారట. మారుతి ప్రయత్నంతో మండోదరి దీక్షకు భగ్నమైందట. దాంతో, రాముడు రావణుడిని మట్టుపెట్టగలిగాడట. రావణుడి కాయాన్ని చితిపై చేర్చి తగులబెట్టిన తర్వాత, సతీసహగమనం చేయబోతూ.. తనను వంచించిన దేవతలను మండోదరి శపించబోయిందట. మహాసాధ్వి శాపానికి భయపడ్డ దేవతలు.. ఆమెను శాంతింప చేసేందుకు, ఆమెకు శాశ్వత సుమంగళిత్వాన్ని వరంగా ఇచ్చారట.
భర్త చనిపోయిన తాను శాశ్వత సుమంగళిని ఎలా కాగలను అన్న ప్రశ్నకు, చితి ఆరిపోయి.. అస్తికలు, భస్మాన్ని పుణ్యతీర్థాల్లో నిమజ్జనం చేసి, పిండ ప్రదానం చేస్తే కానీ మనిషి గతించినట్లు కాదు కాబట్టి, రావణాసురుడి చితి శాశ్వతంగా ఆరిపోకుండా, రగులుతూ ఉండేటట్లు దేవతలు ఆమెకు వరమిచ్చారు. తద్వారా, ఆమె సుమంగళిత్వానికి ఏ లోటూ రాదని దేవతలు ఆమెను శాంతింప చేశారు. అప్పటినుంచీ, రావణకాష్ఠం రగులుతూనే ఉంటుందన్నది ఇతిహాసం.
రావణకాష్ఠం అన్న పదం ఈ విధంగా ఉద్భవించింది. (కాష్ఠం అంటే కట్టె)
నిందారోపణ చేశారు :
నిందారోపణ అనే పదం సరైన రూపం కాదు. ( ఆరోపం = ఆరోపణం = నింద మోపడం ). ఆరోపణ అంటే నింద మోపడం అని అర్థం. నిందారోపణ అన్న పదప్రయోగం సరైంది కాదు. "ఆరోపించారు" వాడొచ్చు. లేదూ.. నింద మోపారు అన్న ప్రయోగమూ బాగుంటుంది.
దుయ్యబట్టారు :
దూయు అన్న పదం నుంచి దుయ్యు వచ్చింది. దూయు అంటే బాణం నాటు అన్న అర్థమూ ఉంది. తీయడం అన్న అర్థమూ ఉంది.
"గుండెల్లో బాణం నాటితే" ఎలా విలవిలలాడతారో, అలాగే వైరివర్గాలను బాణాల్లాంటి మాటలతో విలవిలలాడేలా చేయడం అన్న అర్థంలో "దుయ్యబట్టారు" అని వాడుతున్నారు. (విమర్శ తీవ్రతను బట్టి ఈ పదం వాడాలి)
దుమ్మెత్తి పోశారు :
నగరీకరణ అంతగా లేని చోట్ల.. పల్లెసీమల్లో, ( నేటికీ )తమకు అన్యాయం చేసిన వారు నాశనం కావాలంటూ.. నేలపై మట్టిని (దుమ్ము) తీసుకుని మోసం చేసిన వాళ్లపై విసిరేస్తుంటారు. ఈ విధంగా శపించడాన్ని దుమ్మెత్తి పోయడం అన్న పదాలతో చెబుతాం. అయితే.. ఇప్పుడు ఓ మోస్తరు నిందలకే ఈ పదబంధాన్ని వాడేస్తున్నారు. (తిట్ల తీవ్రతను బట్టి ఈ పదబంధం వాడాలి)
ఆవేదన వ్యక్తం చేశారు :
ఆవేదన వ్యక్తం చేశారు అన్న పదాన్ని బాధను తెలిపారు అన్న అర్థంలో వాడుతున్నాం.
వేదన అంటే నొప్పి, తెలివి అని అర్థం. ఆవేదనం అంటే తెలపడం అని అర్థం.
ఇక, వ్యక్తం అంటే తెల్లమైనది, తెలియబడింది (తెలిసింది) అని అర్థం.
ఆవేదనం వ్యక్తం చేశారు అంటే.. నిఘంటువు అర్థం ప్రకారం, తెలపడం తెలిసింది అని చెప్పాలి.
లేదూ ఆవేదన అన్న పదాన్ని బాధ అన్న అర్థంలో తీసుకున్నా.. " బాధ తెలిసింది చేశారు " అన్న అర్థం వస్తుంది.
ఇంత గందరగోళ పడే బదులు.. బాధపడ్డారు... బాధను తెలిపారు అంటే సరిపోతుంది.
తేటతెల్లమైంది : మిక్కిలి స్పష్టమైంది (తేట = నిర్మలం, ప్రసన్నత, విశదం ) అని అర్థం
హతుడు ఎవరు..?
హత్యలకు సంబంధించిన వార్తల్లో చనిపోయిన వారిని హతులు అని రాస్తున్నాం.
హత్య అంటే చంపుట అని నిఘంటువు అర్థం. హతుడు అంటే దెబ్బతిన్న వాడు లేదా మనసు చెడిన వాడు అని అర్థం. నిఘుంటువుల్లో హతుడు అంటే హత్యకు గురైన వాడు అన్న అర్థం లేదు. దీని "చనిపోయిన వ్యక్తి" లేదా " చనిపోయిన వ్యక్తులు" అని రాస్తే సరిపోతుంది.
స్వైర విహారం చేశారు :
నేర కథనాల్లో... దొంగలు స్వైర విహారం చేశారు.. పారిశుద్ధ్య కథనాల్లో పందులు స్వైర విహారం చేస్తున్నాయి.. లాంటి ప్రయోగాలు బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి.
స్వైరి లేదా స్వైరుడు అంటే స్వతంత్రుడు అని నిఘంటువు చెబుతుంది. స్వైర విహారం అంటే.. స్వతంత్రుడి విహారం అని అర్థం.
కానీ విచ్చలవిడిగా, ఇష్టానుసారంగా ప్రవర్తించాడు అన్న వ్యతిరేక భావనలో దీన్ని వాడుతున్నారు. (స్వతంత్రుడు బాధ్యతాయుతంగా వ్యవహరించ కూడదని ఏమీ లేదు కదా..? )
దీని బదులు.. ఇష్టానుసారంగా తిరిగారు.. ఇష్టానుసారంగా తిరుగుతున్నాయి అని రాస్తే సరిపోతుంది.
అక్షరం మారిందో అర్థమే మారిపోతుంది
ఇక కొన్ని అక్షరాలు తప్పు రూపంలో రాయడం వల్ల వాటి అర్థాలే మారిపోతుంటాయి. ఈ మధ్య కాలంలో నేను గుర్తించిన అట్లాంటి కొన్ని పదాలు :
నిర్దిష్టం : నిర్ణీతమైన, కచ్చితమైన
నిర్దుష్టం : దోషం లేనిది (దుష్టం అంటే దోషం కలిగినది అని అర్థం)
దృష్టం = కనిపించేది (అదృష్టం = కనిపించనిది)
ధృష్టం = దిట్టతనం (అధృష్టం = దిట్టతనం కానిది)
పుణ్యాంగన : పవిత్ర స్త్రీ, ధార్మికురాలు, సుకృతములు చేయు స్త్రీ
పణ్యాంగన : వెలయాలు, వేశ్య
ఇలా గుర్తుంచుకుందాం..
కొన్ని పదాలు అల్ప, మహా ప్రాణాల ఒత్తులతో భలే ఇబ్బంది పెడుతుంటాయి. వాటి అర్థాలను మరచిపోకుండా ఇవిగో.. కొన్ని కొండ గుర్తులు :
షష్టి = అరవై
షష్ఠి = ఆరు (ఒత్తు అల్ప ప్రాణం అయితే ఎక్కువ మొత్తం, మహాప్రాణం అయితే తక్కువ మొత్తం అని గుర్తుంచుకుంటే సరి)
నాసిక = ముక్కు
నాసి = పిల్లి (కంపోజింగ్ లో జాగ్రత్తగా ఉంటే అర్థం మారదు)
Sunday, September 12, 2010
థ్యాంక్యూ రామూ..
ఇక లాభం లేదనుకొని.. నాకు మనసులో తట్టిన ప్రతి భావాన్నీ ఇక్కడ అక్షరబద్ధం చేయాలన్ని నిర్ణయానికి వచ్చి.. పోస్ట్ రాయడం మొదలు పెడుతున్నా.
ఈ పోస్ట్ ద్వారా నేను, నా ప్రియమిత్రుల్లో ఒకడైన సురావఝల రాముకు అనేకానేక ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే, నా నల్లమల సాహస యాత్ర గురించిన వ్యాసాన్ని తను, తన apmediakaburlu.blogspot.com లో పోస్ట్ చేసి.. నాకు విపరీతమైన పబ్లిసిటీ తెచ్చి పెట్టాడు. కొత్తవాళ్లు స్నేహితులవడం మాటేమో గానీ.. రామూ గాడి పుణ్యమా అని.. ఏళ్ల కింద మిస్ అయిపోయిన స్నేహ సంబంధాలు మళ్లీ చిగురించాయి.
నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా అందుబాటులోకి రాని తోట భావనారాయణ.. తనే ఫోన్ చేసి (వ్యక్తిగత పనుల కోసం బళ్లారిలో ఉన్నప్పుడు) బ్లాగ్ బాగోగుల గురించి మాట్లాడి రచన కొనసాగించమని సూచించారు..),నేను అనంతపురం జిల్లాలో ఈటీవీ సీనియర్ రిపోర్టర్ గా పనిచేస్తున్నపుడు.. ఈనాడు జర్నలిజం క్షేత్రస్థాయి శిక్షణలో భాగంగా నావద్ద కొన్ని రోజులు శిక్షణ పొందిన అరుణ (తను ఎక్కడుందీ చెప్పలేదు అయితే ఆంధ్రజ్యోతిలో ఉన్నట్లు మిత్రులు చెప్పారు), భార్గవి (సాక్షి).. అక్కడే ఈనాడులో కర్ణాటక డెస్క్ ఇంఛార్జిగా పనిచేసి.. తర్వాత మహబూబ్ నగర్ బదిలీ అయి వెళ్లిపోయిన డబీర్ రాజేంద్రప్రసాద్, (ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నానని.. వీలున్నప్పుడు కలుద్దామని నా ఫోన్ నంబరు సాధించి ఎంతో ఆత్మీయంగా ఆహ్వానించారు) ఈనాడు జర్నలిజం స్కూల్ లో శిక్షణ పూర్తి చేసుకోగానే చెన్నై స్టాఫ్ రిపోర్టర్ గా వెళ్లినపుడు అక్కడ అప్పటి తమిళనాడు డెస్క్ ఇంఛార్జి నాగేందర్ (తనూ ప్రస్తుతం హైదరాబాద్ లోనే ప్రజాశక్తిలో ఉన్నానని.. అలనాటి స్మృతులను అందంగా గుర్తు చేశారు) బిఎస్ (అదేనండి ఈటీవీ నేరాలు-ఘోరాలు ఫేమ్.. శ్రీనివాస్, నా ఫోన్ స్విచాఫ్ అయివుంటే అన్నా ఫోన్ చేయ్.. అంటూ మెసేజ్ పెట్టి మరీ నాతో మైత్రీ బంధాన్ని పునరుద్ధరించుకున్నాడు..తనిప్పుడు మహాటీవీలో ఉన్నాడు) సాక్షిలో ఉన్న ప్రభాకర్..(నెల్లూరు లో ఒకప్పటి ఈటీవీ కెమెరా స్ట్రింగర్.. ప్రస్తుతం సాక్షిలో మంచి కాపీ ఎడిటర్..) ఇలా ఒకరేమిటి..? ఎందరో ఆత్మీయులు మళ్లీ నాకు టచ్ లోకి వచ్చారు.
మరి నాకింత మంచి చేసిన రామూ గాడికి (గాడు, వీడు లాంటి పదాలు వాడడం బ్లాగ్ మర్యాద కాదంటారా..? ఏమో! అయినా ఇది నా స్వగతం.. మావోణ్ణి ఏరా ఒరేయ్ అనుకునే హక్కు నాకుండదా ఏంటండీ.. మీ దృష్టిలో తప్పయితే సారీ..) ధన్యవాదాలు చెప్పకుంటే ఎలా..?
రేయ్ రామూ @ apmediakaburlu.blogspot.com , నీకు మెనీ మెనీ థ్యాంక్స్ రా. నువ్వు మన మిత్రులందరికీ వారధివిరా.. అందుకే లాంగ్ లివ్ మై ఫ్రెండ్.
ఇప్పటికి ఈ ఆర్టికల్ ఇంతటితో సమాప్తం. మంచి ఊపొచ్చింది.. వెన్వెంటనే మరిన్ని పోస్ట్ లు రాసి వేస్తా.. ఈసారి జాగు చేయబోను. ప్రామిస్.
Thursday, September 2, 2010
నల్లమల లో దారి తప్పి...
డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విషాదాంతాన్ని కవర్ చేసిన జ్ఞాపకం నేటికీ సజీవంగానే ఉంది. మేము ఘటనా స్థలానికి వెళ్లేసరికి.. గ్రేహౌండ్స్ దళాలు.. ప్రముఖుల శరీర భాగాలను ఏర్చి కూర్చే పనిలో ఉన్నారు. ఆ తర్వాత ఆమూటలన్నిటి పైనా విడివిడిగా తెల్లటి వస్త్రాన్ని కప్పేశారు. ఆ మూటలను ఒక్కొక్కటిగా హెలికాప్టర్ లోకి ఎక్కించారు. కచ్చితంగా మృతులకు చెందిన శరీరభాగాలే ఆ మూటల్లో కూర్చారని కచ్చితంగా చెప్పలేం. అక్కడికీ అనుమానం వచ్చిన శరీర భాగాలను అక్కడి సిబ్బంది కొండ గుట్టలపైనే వదిలేశారు. అందులో పాదాలు, వాటి ముక్కలు, గుండె భాగం, కాలేయం, పేగులు లాంటి భాగాలు అక్కడే ఉండిపోయాయి.
హృదయ భారం..
మొత్తమ్మీద ఆ దృశ్యాలన్నింటినీ కవర్ చేశాక, మా హృదయాలు విషాదభరితమయ్యాయి. సహజంగా జర్నలిస్టులు ఫీలింగ్స్ కి అతీతంగా ఉంటారన్న భావన ఉంటుంది. 1999 నుంచి 2005 వరకూ.. అనంతపురం జిల్లాలో పనిచేసినపుడు.. అక్కడి ఫ్యాక్షన్ హత్యలెన్నింటినో చూశాను. ముఖ్యంగా 2004-05 మధ్య కాలంలో దాదాపుగా వారానికి రెండు చొప్పున ఊచకోతలు జరిగాయి. వాటన్నింటినీ చూసి చూసి.. చావు అంటే అదేదో సహజ ప్రక్రియ అన్నంతగా.. కంట నీరు కూడా రానంతగా గుండె రాయి అయింది. అట్లాంటి నాకూ.. హృదయం బరువెక్కింది. అదేంటో..!
తిరుగు పయనం..
ఆ విధమైన భావ సంఘర్షణల మధ్య దాదాపుగా ప్రతి దృశ్యాన్నీ చిత్రీకరించి తిరుగు ప్రయాణమయ్యాం. అప్పటికే సాయంత్రం ఐదు గంటలు కావస్తోంది. మేం వచ్చిన దారిని తలచుకుంటూ.. అంత దూరాన్ని రాత్రిలోగా అధిగమించి ఆత్మకూరు చేరాలన్న లక్ష్యంతో అడుగులు ముందుకేశాం. అయితే.. సాయంత్రం అవుతున్న కొద్దీ.. అడవిలో వాతావరణం మారిపోయింది. ఉన్నట్లుండి భారీ వర్షం మొదలైంది. తడుస్తూనే నా మొలకు ఆచ్ఛాదనంగా కప్పుకున్న జెర్కిన్ ని ఒంటిపై వేసుకున్నాను. మిగిలిన నా సహచరులందరూ బాగా తడిచిపోతూనే నడక కొనసాగించారు. మా వెంట కడప జిల్లాకు చెందిన నలుగురు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మాటా మాటా కలుపుతూ వచ్చారు.
దారి తప్పించిన వాన
మేము బయలుదేరిన విషయాన్ని హెచ్ఎంటీవీ సెంట్రల్ ఆఫీసు(హైదరాబాద్) లోని సాగర్, చక్రపాణి మొదలైన వాళ్లకు చేరవేశాం. అంతా సవ్యంగానే సాగుతున్నామని అనుకున్నాం. వర్షం కూడా ఏకధాటిగా కురవడం లేదు.. అయిదు నిముషాలు తెరిపినిచ్చి.. ఓ రెండు నిముషాలు భారీగా కురుస్తోంది. దీంతో అలసట కూడా పెద్దగా తెలీలేదు. ఉదయం పావురాల గుట్టకు వచ్చేటప్పటి మా అనుభవాలను పంచుకుంటూ నడుస్తున్నాం. మేము వచ్చిన దారిని సరిగ్గానే గుర్తుంచుకుంటూ సాగుతున్నాం. అయితే ఓ చోట వై జంక్షన్ వచ్చింది. అక్కడే మేము తప్పటడుగు వేశాం. వాన కారణంగా.. అక్కడ నేలంతా బురదమయమై పోయింది. ఎవరి కాలిజాడలు కానీ,. అంతకుముందరి అటవీ సిబ్బంది వాహనాల టైర్ల జాడలు కానీ లేకుండా మొత్తం తుడిచిపెట్టుకు పోయాయి. దీంతో మేము తర్జన భర్జన పడి.. ఎడమవైపు
బాటలో నడిచాం. అయితే ఓ నాలుగైదు కిలోమీటర్లు నడిచాక గానీ అర్థం కాలేదు.. మేం దారి తప్పామని. దాంతో ఒక్కసారిగా మా అందరిలోనూ అలజడి.. గుండెల్లో ఓ రకమైన వణుకు. ఎందుకంటే.. మేము తిరుగుతోంది పులుల అభయారణ్యం మరి.
ఎంత నడచినా తరగని కీకారణ్యం
కొద్ది క్షణాలు మాలో మేము తర్జన భర్జన పడ్డాం. అక్కడే ఆగాలా..? ముందుకు సాగాలా..? ఆగితే షెల్టర్ ఏదీ.. అందునా ఆగి ఆగి కురుస్తున్న వానని అడ్డుకునేదెలా...? ఇన్ని సమాధానం దొరకని ప్రశ్నల నడుమ.. చివరికి ముందుకు సాగాలనే అందరం నిర్ణయించుకున్నాం. మమ్మల్ని వనం నుంచి జనారణ్యంలోకి చేర్చే బాధ్యతను మా ఆత్మకూరు రిపోర్టర్ సత్యపీటర్ తీసుకున్నాడు. అంతకుముందు ఆ అటవీ ప్రాంతంలో సంచరించిన అనుభవం అతనికుంది. దీంతో పీటర్ ఆలోచనలు.. సూచనల మేరకు ముందుకు సాగాం. కేవలం నాలుగైదు కిలోమీటర్లు నడిస్తే రోడ్డు చేరతామని అనుకున్నాం. అయితే.. మా ప్రయాణం విశాల ప్రాంతానికి కాకుండా.. మరింత దట్టమైన అడవిలోకి సాగుతున్నట్లు అర్థమైంది. చాలామంది సెల్ ఫోన్లు కూడా అప్పటికే మూగబోయాయి. కేవలం ఒకరిద్దరి ఫోన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అతి ప్రయాస మీద.. ఛార్జింగ్ ఉన్న ఫోన్ కు సెంట్రల్ ఆఫీసు నుంచి సిఇఓ రామచంద్రమూర్తి గారు ఫోన్ చేసి.. మా వివరాలు ఆరా తీశారు. అర్ధరాత్రి దాటిపోయిందని తామంతా టెన్షన్ పడుతున్నట్లు చెప్పారు. ఆయనకు ఇబ్బందేమీ లేదని చెప్పాం. అయితే మా పరిస్థితి మాకు తెలిసి పోతోంది. అడవిలోనే జీవితాలు అంతం కావచ్చు అనుకున్నాం. తెల్లవారేలోగా క్రూర మృగాలు కబళిస్తాయని భయం. ఈ భయాందోళన నడుమ సెంట్రల్ ఆఫీసు నుంచి కోఆర్డినేటర్ శ్రీనివాస్ మండ్యా ఫోన్ చేశారు. అడవిలో ఓ విశాల స్థలం ఎంచుకుని.. ఒక్కొక్కరు అరగంట చొప్పున సెంట్రీ నిర్వహిస్తూ.. మిగిలిన వారు అక్కడే పడుకోవాల్సిందిగా సూచించారు.
మురికి నీరు వడగట్టి తాగాం..
అప్పటికే సమయం ఎంతైందో తెలీకుండా..ఎన్ని కిలోమీటర్లు నడిచామో తెలీదు. అందరం విపరీతంగా అలసిపోయాం. అయితే మా సత్యపీటర్.. అది పులులు సంచరించే ప్రాంతం కాబట్టి, విశ్రమించడం అంత సమంజసం కాదని అనడంతో.. మళ్లీ అందరిలోనూ భయం పుట్టింది. అందుకే మళ్లీ నడక సాగించాం. అప్పటికే విశ్వనాథ్... వేసుకున్న షూలో నీళ్లు చొరబడి.. కాళ్లు బాగా నాని తిమ్మిరెక్కిపోయాయి. దాంతో అతడు కాళ్లు వంకర్లు పోతున్నాయంటూ.. నిస్సత్తువగా కింద కూర్చుండిపోయాడు. మిగతా వారి పరిస్థితీ దాదాపు అదే. అయితే.. అడవిలోనుంచి బయటపడాలన్న ఏకైక లక్ష్యంతో ఒకరికొకరం ధైర్యం చెప్పుకుంటూ నడకను ఆపకుండా సాగించాం. ఉదయం ఏడుగంటల ప్రాంతంలో తిన్న రెండేసి ఇడ్లీలు ఎప్పుడు అరిగిపోయాయి. ఆకలి వేస్తోంది.. నడచి నడచీ దప్పిక వేస్తోంది. ఆ సమయంలో.. ఓ బండ రాతి కింద, నిల్వ ఉన్న బురద నీరు కనిపించింది. ఆ నీటినే ఓ ప్లాస్టిక్ కవర్ లో నింపాం. చేతిరుమాలే ఫిల్టర్ గా ఆ నీటిని నోట్లో పిండుకున్నాం. ఒక్కొక్కరం ఒక్కో గుక్క అంతే. ఆ విధంగా దాహం తీర్చుకున్నాం. ఎంత నడిచినా గమ్యం రావడం లేదు. దీంతో.. ఓ విశాలమైన స్థలం చూసుకుని అరగంటకు ఒకరు చొప్పున సెంట్రీ డ్యూటీలు వేసుకుని విశ్రమించాం.
బెంబేలెత్తించిన తెల్లటి ఆకారం :
విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో.. అడవి దోమలు మామీద ప్రతాపం చూపడం మొదలు పెట్టాయి. ఏదైతే అదయిందని.. శరీరాన్ని దోమలకు సెంట్రీ తప్ప అందరూ నడుం వాల్చారు. ఆ సమయంలో.. కాస్త దూరంలో చంద్రుని వెన్నెల్లో ఓ తెల్లటి ఆకారం రావడం కనిపించింది. మొదట్లో ఏదో భ్రమ అనుకున్నాం. అయితే.. ఆ ఆకారం దగ్గరకు వస్తున్న కొద్దీ గుండెల్లో గుబులు రేగింది. నిశితంగా పరిశీలిస్తే.. అది అడవి ఆవు అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నాం. జంతువులు, పక్షులు ఉన్నట్టుండి చేసే శబ్దాలు బెంబేలెత్తిస్తుంటే.. అందరికీ విశ్రాంతి తీసుకోవడం కన్నా ముందుకు సాగడమే మేలన్న భావన కలిగింది. దీంతో మళ్లీ ప్రయాణం మొదలు పెట్టాం.
దారి చూపిన ఆకాశ వెలుగులు
కనిపించిన దారి వెంట మళ్లీ అడుగులు వేస్తూ పోతున్నాం. ఉన్నట్లుండి దూరంగా ఎక్కడో ఏదో వాహనం వెళుతున్నట్లు మోటార్ శబ్దం వినిపించింది. దాంతో మా అందరిలో ఒక్కసారిగా కొత్త ఉత్సాహం వచ్చింది. ఆ శబ్దాలను ఆనవాలుగా తీసుకుని నడక వేగం పెంచాం. అయితే.. అడవి నుంచి విశాల ప్రాంతానికి రావాల్సింది పోయి.. మళ్లీ దట్టమైన అడవిలోకి ప్రవేశిస్తున్నట్లు కొంతసేపటికే అర్థమైంది. పైగా ఎలాంటి వాహనాల సవ్వడీ వినిపించదాయె. అప్పుడు ఇక ఆ దేవుడే దిక్కు అని ఆకాశంలోకి చూసిన నాకు.. చాలా దూరంగా విద్యుత్ దీపాల కాంతి ఒక ధూళిలా కనిపించింది. ఆ వెలుగులను ఆధారంగా చేసుకుని బయటపడదామని మిత్రులందరికీ చెప్పాను. అందరూ సరేనన్నారు. ఆ వెలుగులు ఆధారంగా చేసుకుని నడిచాం.. చివరికి ఆత్మకూరుకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో అటవీ శివారు పొలాల్లో తేలాం. అప్పుడు సమయం ఉదయం ఎనిమిది గంటలు.
అసలైన ఊపిరి ని పీల్చాం ...
దాదాపు పదిహేను గంటల హై టెన్షన్. అటు మా ఇళ్లల్లోని వారికి, ఆఫీసులోని వారికి, మాకు విపరీతమైన టెన్షన్. మేం అడవి నుంచి బయటపడ్డ విషయాన్ని సెంట్రల్ ఆఫీసుకు తెలియజేశాం. మేము పొలాల్లోనుంచి రోడ్డుకు వచ్చే సరికి (దాదాపు గంట పట్టింది) నల్లకాల్వ దగ్గరున్న మా కర్నూలు రిపోర్టర్ రాజకుమార్ తిండి, నీరు తీసుకుని మా వద్దకు వచ్చాడు. కాస్త ఎంగిలిపడ్డాక, మా మనుషుల మధ్య పడ్డామన్న భావనతో అప్పుడు గుండెలనిండా ఊపిరి పీల్చాం. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి మూడో తేదీ ఉదయం దాకా అపురూపమైన, అనన్యమైన అనుభూతులను సొంతం చేసుకుని.. నాలుగో తేదీ ఉదయానికి హైదరాబాద్ లో విధులకు హాజరయ్యాను. నేను సాధించిన విజయంతో చికున్ గున్యా నొప్పులు గానీ.. అడవిలో పడ్డ బాధలు గానీ నాకు కనిపించలేదు. యధావిధిగా డ్యూటీకి హాజరవుతుంటే ఆశ్చర్య పోవడం అందరి వంతైంది. విజయం ఇచ్చే కిక్ అలాంటిది మరి.
పావురాల గుట్ట గుర్తుకొస్తోంది...
అయితే నాకు మాత్రం చాలా విచిత్రమైన అనుభవాలను మిగిల్చిన రోజు. ఓ మహానేత మరణం నాలోని మనిషిని వేదనకు గురిచేసినా.. జర్నలిస్టుగా.. నాకు ఒక పరిపూర్ణతను, సవాళ్లను అధిగమించేందుకు మరింత ఆత్మవిశ్వాసాన్ని.. మరెన్నో విశిష్టతలను మిగిల్చిన రోజది.
సెప్టెంబర్ 2, 2009 : ప్రజల కష్టసుఖాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు.. ముందస్తు సమాచారం ఇవ్వకుండా, గ్రామాలకు వెళ్లేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి రూపొందించుకున్నవిభిన్న కార్యక్రమం రచ్చబండ. సెప్టెంబర్ రెండో తేదీన చిత్తూరు జిల్లా అనుప్పల్లె గ్రామంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు.. హైదరాబాద్ నుంచి బయలుదేరారు. ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో.. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అదృశ్యమైంది.
అదే రోజు..
ఓ కేసు నిమిత్తం కోర్టుకు హాజరయ్యేందుకు తాడిపత్రి (అనంతపురం జిల్లా) లో ఉన్నాను. కేసు వాయిదా పడే సమయానికి వైఎస్సార్ అదృశ్యం విషయం తెలిసింది. అందరి మాదిరగానే.. ఎక్కడో ఓ చోట ల్యాండ్ అయివుంటారు లెమ్మని అనంతపురం వెళ్లాను. భోజనం అయ్యాక, టైమ్ పాస్ కోసం దగ్గర్లోని ఓ సినిమాకి వెళ్లాను. నా వెంట హెచ్ఎంటీవీ అప్పటి అనంతపురం రిపోర్టర్ చంద్రశేకర్ ను తీసుకు వెళ్లాను. సినిమా మధ్యలో ఉండగానే.. ఇంకా వైఎస్సార్ ఆచూకీ దొరకలేదని స్థానిక కాంగ్రెస్ నాయకుల నుంచి అతనికి ఫోన్ మీద ఫోన్ వచ్చింది. దీంతో ఇక సినిమాలో ఉండలేక, ఇద్దరం బయటకు వచ్చేశాం. హెచ్ఎంటీవీ జిల్లా కార్యాలయంలో కూర్చున్నాం. వార్తలు చూస్తున్నాం. అందరూ నల్లమల అడవులు, దాని పరిసరాలే కేంద్రంగా వైఎస్ ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు వార్తల్లో చెబుతున్నారు. నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది. రకరకాలుగా పరిభ్రమిస్తోంది.. సాయంత్రం ఐదు గంటలైంది... ఇక ఉండబట్టలేక పోయాను. అన్వేషణ సాగించాలని నిర్ణయించుకున్నాను.
అంతా గందరగోళం..
సాయంత్రం ఏడుగంటల ప్రాంతంలో.. హైదరాబాద్ లోని మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, నా చిరకాల మిత్రుడు ఎ.కె.సాగర్ కు ఫోన్ చేశాను. నేను హైదరాబాద్ తిరిగి రాకుండా.. అట్నుంచి అటే నల్లమల వెళతానని చెప్పాను. సాగర్ వెంటనే ఓకే చెప్పేశారు. (అంతకుముందు.. ఈటీవీలో పనిచేసినపుడు నాలుగు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించిన అనుభవం నాకుంది.. అందునా నేను పుట్టి పెరిగిన జిల్లా కర్నూలు. బహుశా దాన్ని దృష్టిలో ఉంచుకునో.. లేదా ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోరాదన్న స్వతస్సిద్ధ నైజం కారణంగానో.. నేను నల్లమల వెళ్లడానికి సాగర్ అంగీకరించి ఉంటాడనుకుంటా.) హైదరాబాద్ సెంట్రల్ ఆఫీసు ఒకే చెప్పగానే.. కర్నూలు జిల్లాలో పోలీసు శాఖలో పనిచేస్తున్న నా బాల్యమిత్రుడు టిఎ భరత్ కు ఫోన్ చేశా. జిల్లా పోలీసు యంత్రాంగం ఆలోచన.. వారి అంచనాలు తన ద్వారా తెలుసుకున్నా. అప్పుడు నాకు నిర్దిష్టమైన అవగాహన వచ్చింది. ఎక్కడికి వెళ్లాలో అర్థమైంది. వెంటనే ఆత్మకూరు బయలుదేరి వెళ్లా.
ఆత్మకూరులో ఉద్దండ పిండాలు..
అనంతపురంలో రాత్రి పది గంటలకు బయలుదేరి కర్నూలు జిల్లాలో నల్లమల అటవీ ప్రాంతం ప్రారంభమయ్యే ఆత్మకూరుకు సెప్టెంబర్ 3వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు చేరుకున్నారు. అప్పటికే మా సహచరుడు తిరుపతి బ్యూరో ఇంఛార్జి విశ్వనాథ్, కర్నూలు రిపోర్టర్ రాజకుమార్ అక్కడ DSNG వాహనాలతో లైవ్ లు ఇస్తున్నారు. వారితో ముచ్చటించాక వారికి కూడా వైఎస్ ఆచూకీ కి సంబంధించిన సమాచారం లేదని అర్థమైంది. నేను అక్కడికి చేరేటప్పటికి, తెలుగు ఛానళ్లే కాదు.. దేశంలోని ప్రముఖ టీవీ ఛానళ్ల రిపోర్టర్లు DSNG వాహనాలతో సిద్ధంగా ఉన్నారు. ఎవరికి వారు ఏవేవో ఊహాగానాలతో లైవ్ లు ఇస్తున్నారు. (పాపం వారిపై ఉండే ఒత్తిళ్లు అలాంటివి మరి..) అనంతపురంలో ఈటీవీ, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ గా పనిచేసిన అనుభవంతో.. వైఎస్ఆర్ వీర విధేయుడు, అనంతపురం జిల్లాకు చెందిన వ్యవసాయ మంత్రి రఘువీరారెడ్డితో మాట్లాడా.. ఆయనకూ సరైన సమాచారం లేదు. ఇంతట్లోపే తెల్లారింది.
అడవి తల్లి నమ్మి..
ఉదయం 8.45 నిముషాల ప్రాంతంలో.. మా కర్నూలు పోలీసు మిత్రుడు భరత్ కు మళ్లీ ఫోన్ చేశా. తను చెప్పిన విషయం విని కొద్దిసేపు మైండ్ బ్లాంక్ అయింది. "గాలింపు బృందాలు నల్లమల్ల అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ శకలాలు గుర్తించాయి.. హెలికాప్టర్ లో ప్రయాణించిన వారి దేహాలు ఛిద్రమై కనిపిస్తున్నాయట.." ఇదీ నా మిత్రుడు భరత్ చెప్పిన సమాచారం. మనిషిగా ఈ వార్త నన్ను బాధకు గురిచేసినా.. నాలో నిస్తేజం చొరబడకుండా.. నాలోని జర్నలిస్టు మేల్కోన్నాడు. చకచకా ముఖ్యమంత్రి మరి లేరు అన్న విషయాన్ని తక్షణమే సెంట్రల్ ఆఫీసుకు సమాచారం అందించాను. లైవ్ ఫోన్ ఇన్ ఇచ్చాను. ఆ విధంగా సిఎం మృతి వార్తను తొలుతగా హెచ్ఎంటీవీయే బ్రేక్ చేసింది. ఇంక వెనక్కు చూడలేదు. నా మిత్రుడు భరత్ అందించిన సమాచారం ప్రకారం.. తక్షణమే అడవుల్లోకి బయలుదేరాను..
చికున్ గున్యాను జయించిన పట్టుదల
నాకు చికున్ గున్యా సోకి అప్పటికి కేవలం నెల రోజులే అయింది. నొప్పులు ఏమాత్రం తగ్గలేదు. అడుగులు వేగంగా వేస్తే.. నొప్పి బాధిస్తోంది. అయినా.. నా సంకల్పం ముందు ఆ నొప్పులు బలాదూరే అయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ ఛాపర్ కుప్పకూలిన ప్రాంతానికి వెళ్లాలన్నదే నా ఏకైక లక్ష్యం. జర్నలిస్టులే కాదు.. వైఎస్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నల్లకాల్వ ప్రజలు, ఒకరేమిటి రాష్ట్రం నలుమూలల నుంచి ఆత్మకూరు వచ్చిన ప్రజలందరి లక్ష్యమూ అదే. అందుకే.. ఛాపర్ కూలిందని భావిస్తున్న ప్రాంతానికి పరుగులు ప్రారంభించారు. వాహనాల్లో వచ్చిన వారందరూ గాలేరు నది వద్దకు రాగానే నిలిచిపోయారు. ఉధృతంగా ప్రవహిస్తోన్న నది.. ముందుకు సాగనివ్వడం లేదు. ఒకరికొకరు ఆసరాగా చేసుకుని.. జాగ్రత్తగా అడుగులో అడుగు వేసుకుంటూ.. నదిలో మిట్ట, గట్టి ప్రాంతాలను చూసుకుంటూ ఎలాగోలా ఆవలి గట్టుకు చేరుకున్నాం. నది దాటేసరికి, వేల మంది కాస్తా వందల మంది అయ్యారు.
అసలు సమస్య అక్కడే..
గాలేరు నది ఆవలి ఒడ్డున జర్నలిస్టులు, అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు, వైఎస్ వీరాభిమానులు మాత్రమే అక్కడ మిగిలారు. బాధ్యత, అభిమానం ఈ రెండు భావనలు అందరినీ కనీసం మూడు కిలోమీటర్ల దూరం పరుగులు పెట్టించాయి. అయితే.. అడవి మధ్యలో శివాలయం ప్రాంతానికి వచ్చే సరికి అభిమానులు, అధికారులు నిలిచిపోయారు. ముందుకు సాగాలా వద్దా అని తర్జన భర్జన పడి.. ఇక ముందుకు సాగడం అసాధ్యమని నిర్ణయించుకుని వారు వెనుదిరగాలని నిర్ణయించుకున్నారు. అధికారులే ఆ నిర్ణయానికి వచ్చేసరికి, జర్నలిస్టు మిత్రుల్లో సగం మంది వారి బాటే పట్టారు. కొందరు జర్నలిస్టులం మాత్రమే.. ఎలాగైనా ఘటనాస్థలాన్ని చేరాలన్న స్థిర సంకల్పంతో ముందుకు సాగాం. ఆక్రమంలో, మరి రెండు కిలోమీటర్లు వెళ్లేసరికి ఇంకొంతమంది నిలిచిపోయారు. ఈ బృందంలో.. మా హెచ్ఎంటీవీ సభ్యులు కూడా కొంతమంది ఉన్నారు.
హెలికాప్టర్ లే దిక్సూచి..
దాదాపుగా పది కిలోమీటర్ల దూరం నడిచాం. నా వెంట, మా హెచ్ఎంటీవీ ఆత్మకూరు రిపోర్టర్ సత్యపీటర్, మా ఐటిడిఎ రిపోర్టర్ రాఘవేంద్ర, కర్నూలు అప్పటి ట్రైనీ రిపోర్టర్ చంద్ర, అనంతపురం సాక్షి రిపోర్టర్ సంతోశ్ మాత్రమే ఉన్నారు. ఓ ఐదారుగురు కాంగ్రెస్ కార్యకర్తలు మమ్మల్ని వెన్నంటి వస్తున్నారు. మేం పరుగులు ఆపలేదు.. వంకల్లో దిగుతున్నాం.. వాగులు దాటుతున్నాం... అలసిన గొంతుకను వాగునీటితోనే తడుపుకుంటున్నాం. పరిస్థితి ఎక్కే కొండ, దిగే కొండగా ఉంది. దారి తెలీదు. మార్గదర్శకులెవరూ లేరు. లక్ష్యం ఉందిగానీ.. దిశా నిర్దేశం లేదు. అయినా మడమ తిప్పరాదన్న భావనతోనే సాగాం. ఆ సమయానికి హెలికాప్టర్ శకలాలు గుర్తించిన హెలికాప్టర్లు, మృతదేహాలను తరలించేందుకు సన్నద్ధమవుతూ.. పావురాల గుట్ట పై భాగంలో చక్కర్లు కొడుతున్నాయి. సైన్యపు హెలికాప్టర్లను కొండపై నిశ్చలంగా నిలబడి ఉంటే.. అందులోంచి రోప్ ద్వారా సిబ్బంది దిగుతున్నారు. ఆ దృశ్యాలు మాకు కనిపిస్తున్నాయి. ఇక గమ్యం కనిపించింది. మళ్లీ ఉరుకులు పరుగులు.
హెలికాప్టర్ ఉన్న ప్రాంతానికి, మేమున్న ప్రాంతానికి ఓ కొండ మాత్రమే అడ్డుగా ఉన్నట్లు కనిపించింది. ఏమీ ఆలోచించకుండా ఆకొండ ఎక్కాం. ఎక్కాక గానీ తెలీలేదు.. ఛాపర్ కూలిపోయింది అక్కడ కాదని. మళ్లీ కొండ దిగి, ఆవలి కొండ ఎక్కడం ప్రారంభించాం. ఈ మధ్యలో, సాక్షి మిత్రుడు సంతోశ్ (తను నేను అనంతపురం ఆంధ్రజ్యోతి బ్యూరో ఇంఛార్జిగా పనిచేసినపుడు నాదగ్గర కంట్రిబ్యూటర్ లెండి) తెచ్చిన నాలుగైదు అరటిపళ్లలోంచి ఒక పండు ఇచ్చాడు. బాగా అలసిన నేను దాన్ని ఆబగా తినేశాను. అయితే ఆ తర్వాత దాహార్తి నన్ను ఎంతలా వేధించిందంటే.. నేను అక్కడే ప్రాణాలు విడుస్తానేమోనన్న ఆందోళన కలిగించింది. నడచి నడచి ఒంట్లోని శక్తి, నీరు చెమట రూపంలో వెళ్లిపోయింది. అయినా తప్పదు.. పరుగు ఆపలేదు.. నాకు అరటి పండిచ్చిన సంతోశ్.. దిగువకు రాలేనని అక్కడే నిస్సత్తువగా ఆగిపోయాడు. అతడికి ఉత్తేజాన్నిస్తూ ముందుకు సాగిపోయాను. వస్తున్నట్లు శబ్ద సంకేతాలు ఇచ్చాడు కానీ అతను నా వెంట రాలేదని కాస్త దూరం వెళ్లాక గానీ అర్థం కాలేదు. అప్పటికే నాకు దాహం తారాస్థాయికి చేరింది. ఇంకేం చేయాలో పాలుపోలేదు. పావురాల గుట్ట కొండ ఎక్కుతున్నాను. అన్నీ బండరాళ్లే. పరిశీలించి చూస్తే.. ఓ బండకు చిన్నపాటి గుంత ఉంది. అందులో ఓ రెండు టేబుల్ స్పూన్ పరిమాణంలో నీరు కనిపించింది. వెంటనే నోటిని ఆ బండకు కరిపించి నీటిని జుర్రేశాను. అవి వర్షపు నీరో.. ఆ ప్రాంతంలో సంచరిస్తున్న కోతుల మూత్రమో తెలీదు. ఆ సమయంలో నాకు నీటి రుచి కూడా తెలీలేదు. అప్పటికే నా జీన్స్ ప్యాంట్.. ముళ్ల కంపలకు తగులుకుని.. కొండ ఎక్కుతున్నప్పుడు తేడా వచ్చి చిరిగి పీలికగా మారింది. దాంతో ప్యాంటు విడిచి, నేను వేసుకున్న జెర్కిన్ నే ఆచ్ఛాదనగా చుట్టుకుని అలసటతో కూర్చున్నాను. నా వెంట ఉన్న మా హెచ్ఎంటీవీ బృంద సభ్యులు చంద్ర, రాఘవేంద్ర నాతోపాటే ఆగబోయారు. వద్దని వారించి ముందుకు వెళ్లమని చెప్పి ఓ పదినిముషాలు విశ్రాంతి తీసుకుని తిరిగి కొండ ఎక్కడం ప్రారంభించాను.
విషాదంలో ఆనందం..
నేను విశ్రమిస్తున్న సమయంలో ముందుకు సాగిన మా రిపోర్టర్లు.. ఘటనా స్థలానికి నాకన్న పదినిముషాలు ముందుగా చేరారు. వెంటనే అంతకుముందే నేను చేసిన సూచన ప్రకారం, చకచకా అక్కడి దృశ్యాలను చిత్రీకరించారు. నేను వెళ్లేసరికి ఇంకా అక్కడ చిత్రీకరణ సాగుతోంది. అక్కడికి చేరుకున్న తొలి జర్నలిస్టుల బృందం మాదేనంటూ గ్రేహౌండ్స్ దళాలు ప్రశంసించాయి. ఆ ప్రశంసలు అందుకుంటూనే.. మా రాఘవేంద్రకు తీసుకోవాల్సిన విజువల్స్ కు సంబంధించి కొన్ని సూచనలు చేశాను. ఆ వెంటనే తొలి క్యాసెట్ ను తీసుకుని.. తెలిసిన అడ్డదారుల్లో వెంటనే నల్లకాల్వ చేరి.. విజువల్స్ ఎయిర్ చేయించమని ఆ కుర్రాడికి చెప్పాను. రాఘవేంద్ర చకచకా పరుగులు పెట్టాడు. ఆలోపు మా తిరుపతి బ్యూరో ఛీఫ్ విశ్వనాథ్, సత్యపీటర తో కలిసి అక్కడికి వచ్చాడు. మేమంతా దాదాపు ఓ రెండు గంటల పాటు అక్కడే ఉన్నాం. అక్కడి అన్ని దృశ్యాలనూ చిత్రీకరించాం. సాయంత్రం ఆరుగంటల కల్లా నా నేతృత్వంలోని బృందం తీసిన విజువల్స్ దేశవ్యాప్తంగా ఉండే వార్తా ఛానెళ్లలో ప్రసారం అయ్యాయి. మా హెచ్ఎంటీవీ ప్రతిష్టను దేశవ్యాప్తం చేశాయి. ఈ విషయం తెలిసి అడవిలోనే ఉన్న మేము పొందిన అనుభూతి మాటల్లో చెప్పలేం. అంతటి విషాదంలోనూ మాకు కొన్ని ఘడియల పాటు చెప్పలేంత ఆనందం కలిగింది.
మహా విషాదం..
నా జీవితంలో నేను చూసిన అత్యంత విషాదభరిత దృశ్యాల్లో పావురాల గుట్ట బీభత్సమే అగ్రభాగాన నిలుస్తుంది. మహానేతగా లక్షలాది మంది అభిమానాన్ని పొందిన వైఎస్ రాజశేఖరరెడ్డి, అనామకంగా ఓ కొండ గుట్టపై ఇలా ప్రాణాలు కోల్పోవడం ఎంత విషాదం. ఆయన పాదం ఓ చోట, గుండె మరో చోట, (ఆయన వేసుకున్న పంచె ఆధారంగా) చూసిన మా అందరి హృదయాలూ ద్రవించిపోయాయి. ఛాపర్ చెట్లకు కొట్టుకోగానే పేలి మంటలు రేగినట్లు.. కాలిన శరీర భాగాలు స్పష్టం చేస్తున్నాయి. పైగా మంటలు అంటుకోగానే.. వర్షం కురియడంతో శరీర భాగాలకున్న మంటలు ఆరిపోయాయి. దీంతో అక్కడ విపరీతమైన కమురు కంపు కొడుతోంది. వాసన కడుపులో తిప్పుతోంది. జనహృదయ నేతకు ఎలాంటి మరణం..? ఇదేనా విధి వైపరీత్యం..? చివరిక్షణాల్లో ఆయన ఏమి ఆలోచించి ఉంటారు..? ఘటనా స్థలం చూస్తే అది నిస్సందేహంగా ప్రమాదమే అనిపిస్తోంది... అయినా నాలోని జర్నలిస్టు కుట్రకోణం ఉందా అని కూడా పరిశోధన మొదలు పెట్టాడు. కుట్ర కోణానికి ఏ ఆధారాలూ లభ్యం కాలేదు. అంతా గందరగోళం. జర్నలిస్టుగా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించి నేను, విశ్వనాథ్, సత్యపీటర్ వెనక్కు తిరిగాం.
(గుర్తుకొస్తున్నాయి తొలి భాగం.. పావురాల గుట్ట నుంచి తిరిగి వస్తూ.. అడవిలో దారి తప్పి రాత్రంతా సంచరించిన మా అనుభవాలు రేపటి రెండో భాగంలో..)