Tuesday, October 5, 2010

బొడ్డెమ్మను విస్మరించారెందుకో...!


తెలంగాణ సంస్కృతి.. ఈ ప్రాంత విశిష్ట పర్వం.. అనగానే వెంటనే గుర్తొచ్చేది బతుకమ్మ. విదేశీ నాగరికత మోజులో బతుకమ్మను అంతా మరచిపోతున్నారనుకుంటుండగా.. పరిస్థితిలో కొద్దిగా మార్పు వచ్చింది. ఈ సంబరం ఓ రెండేళ్ల నుంచి కొత్త ఊపిరి పోసుకుంటోంది. అయితే.. బతుకమ్మ వేడుకలు శ్రీకారం చుట్టుకునే ముందే.. నిమజ్జనమయ్యే మరో అమ్మవారు బొడ్డెమ్మ. మరెందుకో ఆ అమ్మవారికి మీడియాలో అంతగా ప్రాధాన్యత దక్కడం లేదు.

బొడ్డెమ్మ పూర్తిగా అవివాహిత యువతుల వేడుక. ఇది కూడా తొమ్మిదిరోజుల పండుగ. భాద్రపద మాసం బహుళ పంచమి రోజున బొడ్డెమ్మ ఉత్సవం ప్రారంభమవుతుంది. మహాలయ అమావాస్యకు ముందు రోజున వేడుక ముగుస్తుంది. అచ్చంగా బతుకమ్మ తరహాలోనే.. బొడ్డెమ్మనూ రంగురంగుల పూలతో రూపొందిస్తారు. సాయంత్రం వేళల్లో బొడ్డెమ్మను.. ఓ చోట ప్రతిష్ఠించి, దాని చుట్టూ పాటలు పాడుతూ తిరుగుతారు. పెళ్లీడుకొచ్చిన యువతులు మాత్రమే ఈ సంబరాన్ని జరుపుకుంటారు. ఇందులో పెళ్లయిన మహిళలెవరూ పాల్గొనరు. ఈ ఏడు కన్నెలుగా బొడ్డెమ్మను పూజిస్తున్నాం.. పై ఏడు వివాహితులుగా బతుకమ్మకు జోతలిడుతాం అంటూ అవివాహితులు మురిపెంగా చెబుతారు.

బొడ్డెమ్మ ఎవరు అంటే.. స్థానికంగా భిన్న కథనాలు వినిపిస్తాయి. కాకతీయుల నాటి నుంచీ బతుకమ్మకన్నా ముందే.. బొడ్డెమ్మను పూజించేవారని చెబుతారు. బొడ్డెమ్మ, బతుకమ్మ ఇద్దరూ అక్క చెల్లెళ్లని ఓ కథనం.. భూస్వాముల వేధింపులకు బలవన్మరణం పొందిన తల్లీబిడ్డలంటూ మరో కథనం ప్రచారంలో ఉంది.

ఈ కథల గురించి పక్కన పెడితే.. తెలంగాణలోని మారుమూలనున్న... ఈ ప్రాంత సంస్కృతి ఇంకా మిగిలి ఉన్న కొన్ని పల్లెల్లో.. బొడ్డెమ్మను ఇవాళ (05-10-2010) నిమజ్జనం చేశారు. రేపు మహాలయ అమావాస్య. ఎల్లుండి నుంచి బతుకమ్మ సంబురాలు మొదలవుతాయి. ఏదేమైనా.. ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే బొడ్డెమ్మకు బతుకమ్మ స్థాయిలో ప్రాచుర్యం దక్కక పోవడం ఒకింత బాధాకరం.

Sunday, October 3, 2010

మా అబ్బాయి ప్యారడీ రాశాడోచ్...

శనివారం ఉదయం.. దైనందిన కార్యక్రమంలో భాగంగా.. "ఈనాడు" పత్రికను చదివి పక్కన పెట్టేశాను. తర్వాత మా అబ్బాయి వికాస్‌ (తను పదో తరగతి చదువుతున్నాడు) ఈనాడు పత్రికను అందుకున్నాడు. అందులో "ఈతరం" స్లిప్‌ పేజీలో పవన్‌ కల్యాణ్ గురించిన చిలిపి బయోడేటా చదివి.. దాని స్ఫూర్తితో ఓ ప్యారడీ రాశాడు. కాస్త జంకుతూనే నా చేతికి ఇచ్చాడు. డ్యాడీ.. ఇదెలా ఉందో కాస్త చూసి చెప్పు అని బెరుకు బెరుగ్గా ఇచ్చాడు. (బహుశా అందులో ఏదైనా తప్పులు వెతుకుతాననో.. భాష విషయంలో తప్పు పడతాననో భయపడ్డట్లున్నాడు) చూశాక బాగానే ఉందనిపించింది. ఒకరిద్దరు స్నేహితులకు చూపితే, ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అందుకే దీనికి నాకున్న కొద్దిపాటి సర్కిల్‌లో.. కొంత ప్రాచుర్యం కల్పిస్తే బావుంటుందనిపించి, దీన్ని బ్లాగ్‌లో పెడుతున్నా.

సచ్చినోడి చిలిపి బయోడేటా
పేరు : టెండూల్కర్
ముద్దుపేరు : సచ్చినోడు
ఇష్టమైన డ్రింక్‌ : బూస్ట్
మూడుంటే : ముంబై ఇండియన్‌
మరవనిది : క్రికెట్
వీలైతే.... : లెక్కలేనన్ని మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌లు
కుదిరితే... : పది వరల్డ్‌ కప్పులు
ఎక్కువగా చూసేది : అవార్డులు, రివార్డులు
ఫిలాసఫీ : ఇండియన్‌గా ఆడాలి...! ముంబై ఇండియన్‌గా ఆడించాలి..!!

ఇది ప్రపంచానికి అంత ప్రధానమైన విషయం కాక పోవచ్చు. కానీ, మా అబ్బాయి ఓ ప్యారడీ రాయడం అందులోనూ తెలుగు భాషలో రాయడం నాకు అలవిమాలినంత ఆనందాన్ని కలిగిస్తోంది. ఎందుకంటే.. నా తరంతోనే తెలుగు అంతరించి పోతుందేమోనన్న భయానికి, ఆంగ్లమాధ్యమంలో విద్యను అభ్యసిస్తోన్న నా తర్వాతి తరం ఇస్తున్న భరోసాలా ఈ ప్యారడీ అనిపించింది. అందుకే, దీనికి నేనింత ప్రాధాన్యతనిస్తున్నాను... గర్విస్తున్నాను.

Friday, October 1, 2010

నేర్చుకోవాల్సింది ఎంతుందో..!


ఒక్కోసారి ఏదైనా పదానికి అర్థం తెలుసుకుందామని ప్రయత్నించేటప్పుడు.. ఆ శోధన ఎక్కడెక్కడికో వెళుతుంటుంది. మొన్నీమధ్య వాగ్దానం (వాగ్ధానం కాదు) అన్న పదం మీద కాస్త శ్రద్ధ పెట్టాను. వాక్కును దానం చేయడం ఏంటి..? అసలు దానాల్లో ఈ వాక్కు ఎలా చేరింది..? అసలు దానాలు ఎన్ని రకాలు..? ఇలా ఆలోచిస్తే.. భలే సమాధానాలు దొరికాయి.

వాగ్దానం (వాగ్ధానం కాదు) = అంటే వాక్కును దానం చేయడం అని వివరణ
వాక్కు అంటే పలుకు అని అర్థం. (వాక్కు మూల రూపం వాకు)
పలుకును దానం చేయడం వాగ్దానం. దీన్ని 'మాట ఇవ్వడం' అన్న అర్థంలో వాడొచ్చు.
వాగ్దానం చేశారు అనే బదులు 'మాటిచ్చారు' అని రాస్తే సరిపోతుంది.

దానం అంటే ఇవ్వడం :
ఆదానం అంటే పుచ్చుకోవడం

ఇక దానాలు ఎన్ని రకాలు..? అంటే దశదానాలు, షోడశ దానాలు ఉన్నాయని శబ్దరత్నాకరం వివరిస్తుంది అవేంటో ఓసారి చూద్దాం.
దశ (10) దానాలు :
1.గోదానం (= ఆవులను దానం ఇవ్వడం)
2.భూదానం, (= భూమిని దానంగా ఇవ్వడం)
3.తిల దానం, (= నువ్వుల దానం)
4.హిరణ్యదానం, (బంగారం దానం)
5.ఆజ్య దానం, (= నెయ్యి దానం)
6.వస్త్ర దానం, (= దుస్తుల దానం)
7.ధాన్య దానం, (= ధాన్యం దానం)
8.గుడ దానం, (= బెల్లం దానం)
9.రౌప్య దానం (= రౌప్యం అంటే రూప్యం. అంటే బంగారు లేదా వెండితో చేసిన నాణ్యం. స్థూలంగా దీన్ని ధనదానం అనవచ్చు)
10.లవణ దానం (= ఉప్పు దానం) (లవణాలు మళ్లీ మూడు రకాలు వాటి గురించి కింద వివరణ ఉంది.)
షోడశ (16) దానాలు :
1. గోదానం (= ఆవుల దానం)
2. భూదానం, (= భూమి దానం)
3. తిలదానం (=నువ్వుల దానం)
4.హిరణ్యదానం (=బంగారు దానం)
5.రత్నదానం (= రత్నాల దానం)
6.విద్యాదానం (= విద్య దానం)
7.కన్యాదానం (= అమ్మాయినిచ్చి పెళ్లి చేయడం)
8.దాసీదానం (= దాసీ జనాన్ని దానంగా ఇవ్వడం) (దాసి అంటే డబ్బిచ్చి కొన్న సేవకుడు/సేవకురాలు)
9.శయ్యాదానం (= పడకను దానంగా ఇవ్వడం)
10.గృహదానం (= ఇంటిని దానంగా ఇవ్వడం)
11.అగ్రహారదానం, (= పల్లెటూళ్లను దానంగా ఇవ్వడం)
12.రథదానం (= రథాన్ని దానం)
13.గజదానం (= ఏనుగులను దానం చేయడం)
14.అశ్వదానం, (= గుర్రాలను దానం చేయడం)
15.ఛాగదానం, (= జున్నుపాలు లేదా మజ్జిగ ను దానం చేయడం)
16 మహిషీదానం (= ఎనుము(గేదె)లను దానం ఇవ్వడం)

త్రిలవణాలు :

* లవణాలు మూడు రకాలు (త్రిలవణాలు) అని తెలుసుకున్నాం కదా. అవేంటో తెలుసుకుందాం.
1. సైంధవ లవణం
దీన్ని ఇందుప్పు అని అంటారు. ఇందుడు అంటే చంద్రుడు అని అర్థం. అంటే చంద్రుడిలా తెల్లగా ఉండే ఉప్పును సైంధవ లవణం అని చెప్పుకోవచ్చు.
2. బిడము
దీన్ని అట్టుప్పు అంటారు. (అట్టు+ఉప్పు). అట్టు అంటే ఆపూప విశేషం అంటుంది శబ్దరత్నాకరం. ఆపూపం అంటే పిండివంట. కాబట్టి పిండివంటల్లో వాడే ఉప్పును బిడము అని చెబుతారు.
3. రుచకము
దీన్ని సౌవర్చల లవణం అని అంటారు. ఇది ఒక దినుసు ఉప్పు అంటుంది శబ్దరత్నాకరం.

ఒక్క పదం గురించి శోధన మొదలు పెడితే.. ఎన్ని విషయాలు తెలిశాయో చూశారా..? అందుకే ప్రతి పదానికీ సరైన అర్థం కోసం వెతకాలి.. కొత్తకొత్త విశేషాలు తెలుసుకోవాలి. వాటిని సమర్థవంతంగా ప్రయోగించాలి. అప్పుడే భాష విస్తరిస్తుంది. ఏమంటారూ..!

Thursday, September 30, 2010

శభాష్ పోలీస్..


(అయోధ్యపై తీర్పు అనంతరం బెజవాడలో శాంతి కపోతాలు ఎగురవేస్తున్న హిందూ, ముస్లింలు)

హమ్మయ్య! మొత్తానికి పెద్ద టెన్షన్ పోయింది. అలహాబాద్‌ హైకోర్టు లక్నోబెంచ్‌ అయోధ్యలోని వివాదాస్పద స్థలంపై తీర్పు చెప్పింది. ఈ స్థలం రామజన్మభూమేనని.. బాబర్ చక్రవర్తి అక్కడ అంతకుముందున్న రామాలయాన్ని కూల్చేసి.. ఓ కట్టడాన్ని నిర్మించాడని తీర్పులో వెల్లడించింది. ఈ తీర్పు అనంతరం, చాలామంది గెలుపోటముల మీద చర్చ చేశారు. ఎవరు గెలిచారు..? ఎవరు ఓడారు..?

నేను మాత్రం ఈ వ్యవహారంలో గెలుపొందింది ఎవరంటే.. కచ్చితంగా పోలీస్ శాఖేనంటాను. రాష్ట్రంలో, (ముఖ్యంగా హైదరాబాద్‌లో) ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా, పోలీసు శాఖ అనుసరించిన వ్యూహం అభినందనీయం. ముందునుంచీ, అంటే సెప్టెంబర్ 20వ తేదీ నుంచే.. అన్ని జిల్లాల్లోనూ ఎస్పీలు చొరవ తీసుకుని, మత పెద్దలతో సమావేశాలు నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణ ఆవశ్యకతను చాటి చెప్పారు. అయోధ్య వివాదంలో అలహాబాద్‌ కోర్టు తీర్పు ఎలా వచ్చినా సంయమనం పాటించేలా అందరి మైండ్‌సెట్స్‌నీ మార్చారు. తీర్పు 24న కాకుండా, 30వ తేదీకి వాయిదా పడ్డా... పోలీసు శాఖ మతాల మధ్య సామరస్యాన్ని పెంపొందించే విషయంలో, ఎక్కడా ఉదాసీనత ప్రదర్శించలేదు.

ఇక 29వ తేదీ నుంచైతే.. పోలీసు శాఖ, రాష్ట్రాన్ని పూర్తిగా తమ గుప్పిట్లో తీసుకున్నట్లే కనిపించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రతి అడుగుకూ ఓ పోలీసును మోహరించారు. అలాగని మిగిలిన ప్రాంతాలనూ తేలిగ్గా ఏమీ తీసుకున్నట్లు లేదు.

30వ తేదీ తీర్పు వెలువడేంత వరకూ.. అందరినీ కలిపి సంయమనంగా ఉండాలని కోరిన పోలీసు అధికారులు, తీర్పు వెలువడ్డాక కూడా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తీర్పు వల్ల ఏదో ఓ వర్గం మనోభావాలు గాయపడే అవకాశం ఉందని భావించినట్లున్నారు. ఆ భావన బయటపడకుండా.. తద్వారా హింసాత్మక ఘటనలు చెలరేగకుండా, తీర్పు అనంతరం కూడా కొన్ని కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. తీర్పు వెలువడ్డ మరుక్షణం నుంచే.. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ శాంతి ర్యాలీలు, సమభావన సమావేశాలు నిర్వహించారు. ఇది సత్ఫలితాలనిచ్చిందనే చెప్పాలి.

ఇక యధావిధిగా జర్నలిస్టు మిత్రులు, ఈ తీర్పు విషయంలో.. మారని తమ బుద్ధిని యధేచ్ఛగా ప్రదర్శించారు. తీర్పుపై ఎలాంటి ముందస్తు వ్యాఖ్యలు చేయరాదని, తర్వాత కూడా దానికి సంబంధించిన చర్చలు నిర్వహించరాదని చేసిన సూచనలను స్వేచ్ఛగా ఉల్లంఘించేశారు. కొన్ని ఛానళ్లలో, ఏకంగా తీర్పుపైనే వ్యాఖ్యలు చేశారు. ఇవి చూసే కాబోలు.. హైదరాబాద్‌లోని పోలీసు బాసులు (ముఖ్యంగా నగర కమిషనర్ ఎ.కె.ఖాన్‌) ఛానళ్ల చర్చా కార్యక్రమాలపై ఆంక్షలు విధించారు. ఆయనే నేరుగా రంగంలోకి దిగడంతో.. దాదాపుగా అన్ని తెలుగు ఛానళ్లలో ఏడు గంటలలోపే చర్చా కార్యక్రమాలు పూర్తయ్యాయి. లేకుంటే, రాత్రంతా ఇదే అంశంపై రొదపెట్టి ఉండేవారు.. లేనిపోని సమస్యలకు కారకులయ్యేవారు.
మొత్తానికి, ఎన్నెన్నో భయాలు.. మరెన్నో అనుమానాలను పటాపంచలు చేస్తూ.. సెప్టెంబర్ 30వ తేదీ సాధారణంగానే గడిచిపోయింది. రాష్ట్ర ప్రజలను కొన్ని గంటల పాటు ఆందోళనలో ఉంచడం తప్ప ఈ రోజుకు మరెలాంటి ప్రయోజనమూ లేదు. మరెలాంటి ఇబ్బందులూ తలెత్తలేదు. దీనికి కచ్చితంగా పోలీసు శాఖనే అభినందించాలి. శభాష్.. పోలీస్.

మిత్రులారా సంయమనం పాటిద్దాం

అయోధ్యలోని రామజన్మభూమి, బాబ్రీ మసీదు స్థల వివాదంపై, అలహాబాద్‌ లక్నో బెంచ్ ఇవాళ‌ తీర్పు ఇవ్వబోతోంది.

దేశమంతా తీవ్ర ఉద్విగ్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్కూళ్లు మధ్యాహ్నం వరకే పనిచేస్తున్నాయి.. ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న పిల్లల్ని పదిగంటలకంతా ఇళ్లకు పంపేయాలని పాఠశాలల యాజమాన్యాలు నిర్ణయించాయి. ఆమేరకు సిద్ధపడి బడికి రావాలని నిన్ననే పిల్లలకు చెప్పేశాయి. దాదాపు అన్ని విద్యా సంస్థల్లోనూ ఇదే పరిస్థితి.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కలెక్టర్లు, ఎస్పీలు సంయుక్తంగా సమావేశాలు ఏర్పాటు చేసి, రెండు మతాల పెద్దలను శాంతి సామరస్యతలకు కట్టుబడి ఉంటామని ఒప్పించారు! ఈనెల 24వ తేదీనే ఈ తీర్పు వెలువడుతుందని భావించిన అధికారులు, 21వ తేదీనుంచే ఈ సమావేశాలు నిర్వహించారు. అయితే తీర్పు వాయిదా కోరుతూ.. సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు కావడం.. దానిపై విచారించిన సుప్రీం పిటిషన్‌ను తోసిపుచ్చడం వల్ల.. తీర్పు వెలువడడంలో కాస్త జాప్యం ఏర్పడింది. దీంతో అధికారులు, నిన్న మళ్లీ హడావుడిగా అందరినీ సమావేశపరిచి, సుహృద్భావతను పెంపొందించాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి రోశయ్య, డిజిపి అరవిందరావు‌ ఒకరేమిటి అందరూ అన్ని సందర్భాల్లోనూ సంయమనం పాటించాల్సిన అవసరాన్ని చాటి చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు.. అయోధ్య వివాదంపై తీర్పు నేపథ్యంలో, ఇవాళ్టినుంచి మూడు రోజుల పాటు కొనసాగించాలనుకున్న తూర్పుగోదావరి జిల్లా పర్యటననూ రద్దు చేసుకుని, అందరూ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు.

బ్యూరోక్రాట్లు, మనం ఎంచుకున్న ప్రజాప్రతినిధులు ఇందరు చేస్తున్న విన్నపాన్ని జర్నలిస్టులుగా మనందరం మన్నిద్దాం. పెడధోరణులను విడిచి పెడదాం. ప్రతిరోజూ కన్నా మిన్నగా.. ప్రజాహితమే పరమావధిగా ఇవాళ మరింత బాధ్యతాయుతంగా పనిచేద్దాం. ఆవేశం అన్ని వేళలా అనర్థదాయకం. తెచ్చిపెట్టుకున్న, ప్రేరేపిత ఆవేశాలను పూడ్చిపెట్టేద్దాం. సహజసిద్ధమైన మన సౌభ్రాతృత్వాన్ని పరిమళింప చేద్దాం.

పుకార్లను విస్మరిద్దాం. సంయమనం పాటిద్దాం. శాంతిని కాపాడదాం.

Wednesday, September 22, 2010

మూడో స్థానానికి ఎదిగిన hmtv

ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. దాంతో పాటే.. మరింతగా పెరిగిన బాధ్యతా నన్ను అప్రమత్తం చేస్తోంది. ఈ ఆనందానికి కారణం.. తాజా రేటింగ్స్ లో హెచ్ఎంటీవీ మూడో స్థానానికి ఎగబాకడం ప్రధానమైనదైతే.. అందులో నా నేతృత్వంలో నడుస్తోన్న ప్రాంతీయ వార్త న్యూస్ బులెటిన్ రేటింగ్ 1.17 శాతం రావడం, మరో నాలుగు ప్రాంతీయ వార్త బులెటిన్లు ఛానెల్ టాప్-10 లో అగ్రభాగాన నిలవడం నాకు ఎనలేని సంతోషాన్ని కలిగిస్తోంది.

19 నెలల స్వల్ప వ్యవధిలో అంచెలంచెలుగా ఎదుగుతూ హెచ్ఎంటీవీ ఈ స్థాయికి చేరడం వెనుక, నేను నేతృత్వం వహిస్తున్న ప్రాంతీయ వార్త బులెటిన్ల పాత్రను విస్మరించలేము. ఈ స్థానం అంత సులువుగా ఏమీ దక్కలేదు. ఎంతోమంది అవిశ్రాంత కృషి.. అనునిత్యం శ్రమించడమే ఏకైక తత్వంగా సాగిన తీరు.. సమష్టితత్వం.. అన్నీ కలిస్తేనే ఈ అపూర్వ విజయం సిద్ధించింది.

ఇక నా విషయానికి వస్తే.. ముందునుంచీ, లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం.. దాన్ని సాధించేవరకూ.. నిద్రాహారాలు మాని పనిచేయడం నాకు ముందునుంచీ ఉన్న అలవాటు. ఇది ఈనాడు-ఈటీవీలలొ పని చేస్తున్నప్పటినుంచీ అలవాటైంది. గడచిన 23 సంవత్సరాలుగా ఇదే విధంగా లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం.. సాధించడం.. కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం.. ఇలా నా ప్రస్థానం సాగుతూ వస్తోంది.

ఈ సందర్భంగా.. 2009, సెప్టెంబర్ 3వ తేదీన పావురాల గుట్టపై రాజశేఖరరెడ్డి మరణించిన దృశ్యాలను తొలుతగా హెచ్ఎంటీవీకి అందించిన.. 'నాటి లక్ష్యం' కూడా ఇప్పుడు గుర్తొస్తోంది. రాజశేఖరరెడ్డి మరణించినట్లు రూఢీ అయ్యాక, హెచ్ఎంటీవీ సిఇఓ శ్రీ రామచంద్రమూర్తి గారికి ఆ విషయం చెప్పాను. దానికి సంబంధించిన ఫోన్ ఇన్ కూడా ఇచ్చాను. అప్పుడే మరోమారు శ్రీ మూర్తిగారితో ఫోన్ లో మాట్లాడుతూ.."sir, I am moving into forest.. definitely I will make those visuals first aired on hmtv" అని కచ్చితంగా చెప్పాను. అప్పటికే నేను చికున్ గున్యా నొప్పులతో బాధపడుతున్నాను. అయినా.. ఎలాగైనా విజువల్స్ సాధించాలన్న ఏకైక లక్ష్యంతో పంటిబిగువన అన్ని నొప్పులూ భరిస్తూ.. వ్యూహాత్మకంగా అక్కడికి చేరుకున్నాను. నేను ముందుగా రూపొందించుకున్న ప్రణాళిక ప్రకారం.. రాజశేఖరరెడ్డి మరణానికి సంబంధించిన దృశ్యాలు పంపి, first on hmtv అన్న మాటను నిలుపుకున్నాను. దేశంలోని అన్ని ముఖ్య ఛానెల్స్ హెచ్ఎంటీవీ దృశ్యాలనే యథాతథంగా వాడాయి.

లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం.. దాన్నిసాధించేందుకు ప్రయత్నించడం అన్న నా తత్వమే.. ఇప్పుడు హెచ్ఎంటీవీ ప్రాంతీయ వార్త బులెటిన్లు మంచి రేటింగ్ సాధించడానికి కారణమయ్యాయి. ఈ ప్రయత్నం విజయవంతానికి కూడా శ్రీ మూర్తి గారే కారకులు కావడం యాధృచ్ఛికమే. ఓ మూడు వారాల క్రితం (ఈ నెల ప్రారంభంలో) ప్రాంతీయ వార్త మంచి రేటింగ్ లో ఉంది అభినందనలు అని మూర్తి గారు అన్నారు. అప్పుడు, "ప్రాంతీయ వార్త బులెటిన్ 1.00 రేటింగ్ దాటాలి.. మన ఛానెల్ టాప్ టెన్ ప్రోగ్రామ్స్ లో కనీసం ఐదు స్థానాలు ప్రాంతీయ వార్త కే దక్కాలి.. ఆ తర్వాతే నేను సంతృప్తి చెందుతా" అని అన్నాన్నేను.

మాటైతే చెప్పాను గానీ.. ఆ రేటింగ్ సాధించడం ఎంత కష్టమో నాకు బాగా తెలుసు. అందుకే, లక్ష్య సాధనకు ప్రత్యేకంగా ఓ సెగ్మెంట్ ను ఎంచుకున్నా. ఉదయం పూట 8 గంటలకు ప్రసారం అయ్యే ప్రాంతీయ వార్త బులెటిన్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాను. దీనికోసం రీజనల్ డెస్క్ లోని సభ్యులను బృందాలుగా విడదీశాను. కాపీఎడిటర్లు రమేశ్, మృత్యుంజయ, జయశ్రీ లను మూడు బులెటిన్లకు బాధ్యులను చేశాను. నేను, ఓవరాల్ సూపర్విజన్ చేశాను. రమేశ్, మృత్యుంజయ లకు ఉదయం బులెటిన్లలో ఏయే వార్తలు ఏ రకంగా ప్రెజెంట్ చేయాలో సూచనలిచ్చి, ఆప్రకారం పక్కాగా వార్తలు ప్రసారం అయ్యేలా చూశా.

ప్రతిరోజూ ఉదయాన్నే ఆరు గంటలకు ఆఫీసుకు వెళ్లేవాడిని. రాత్రి 9 లేదా 10 గంటల దాకా, బులెటిన్ల స్వరూపంపై ప్లాన్ వేసేవాడిని. ఇక ఉదయం 8 గంటల బులెటిన్ ను అయితే.. ఆమూలాగ్రం పరిశీలించే వాడిని. నేను అనుకున్న (జనం మెచ్చే) పద్ధతిలో ఏ వార్త లేకున్నా నిర్దాక్షిణ్యంగా తిరగరాసేవాడిని. వీడియో కోఆర్డినేటర్లుగా ఉన్న మీనేశ్, శంకర్, విశ్వనాథ్ లు ఎవరు షిఫ్టులో ఉన్నా.. పాపం 'అవ్వదు.. అసాధ్యం' అని చెప్పకుండా, హడావుడిగా ప్యాకేజీలు ఎడిట్ చేయించే వాళ్లు. మా ఎడిటర్లు కూడా ప్రాంతీయ వార్తలో ప్రసారం కావాల్సిన వార్తల ఎడిటింగ్ లో మరికొంత చలాకీగా పనిచేసేవాళ్లు. ఆ రకంగా, ఉదయం ఎనిమిది గంటల ప్రాంతీయ వార్త బులెటిన్.. అచ్చంగా (సంస్థ విధానాలకు అనుగుణంగా) నేను అనుకున్నట్లు ప్రసారం అయ్యేట్లు జాగ్రత్త తీసుకున్నాను. ప్రతి ప్రాంతానికీ సమ ప్రాధాన్యతనిచ్చేందుకే ప్రాధాన్యతనిచ్చా. ఈ విషయంలో పిసిఆర్ (ప్రొడక్షన్ కంట్రోల్ రూమ్) సిబ్బంది సహకారం బ్రహ్మాండం. అందుకే.. ప్రాంతీయ వార్త బులెటిన్ అందరికీ నచ్చింది. ఈ రేటింగ్స్ సాధించింది. హెచ్ఎంటీవీని మూడో స్థానంలో నిలిపింది.

ఈ విజయం అందుకోవడంలో సహకరించిన మా మిత్రులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకోక పోతే.. ఈ విజయానికి అర్థమే ఉండదు. అందుకే సహకరించిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ శుభ సందర్భంలో నాకు ఆనందమే కాదు.. ముందే చెప్పినట్లు పెరిగిన బాధ్యత కూడా అప్రమత్తం చేస్తోంది. ఈసారి కొత్త టార్గెట్ తో ముందుకు వెళుతున్నాను. మళ్లీ విజయం సాధిస్తానన్న గట్టి నమ్మకంతో సాగుతున్నాను. విష్ మి ఆల్ ది బెస్ట్.

Friday, September 17, 2010

సెప్టెంబర్ 24 : జర్నలిస్టులకు పరీక్షాదినం

ఈనెల 24 వ తేదీన జర్నలిస్టులకు పరీక్షాకాలం. ముఖ్యంగా ప్రసార మాధ్యమంలోని రిపోర్టర్లు, కాపీ ఎడిటర్లు అత్యంత జాగ్రత్తగా మెలగాల్సిన రోజది. ఎందుకంటే.. ఆరోజు, అతి కీలకమైన, అత్యంత సున్నితమైన అయోధ్య ధ్వంసం కేసులో తీర్పు వెలువడబోతోంది. మీడియా ఏమాత్రం అటూ ఇటూ ఊగిసలాడినా.. దేశం అగ్నిగుండం అయిపోతుంది. మీడియా ఆరోజు ఏ వర్గానికి కొమ్ము కాసినా, లేదా ఎవరి పక్షంగా వ్యవహరించినా... భావితరాలకు రక్తసిక్త చరిత్రే మిగులుతుంది. జర్నలిస్టులందరూ అత్యంత సంయమనం పాటించాల్సిన రోజది.
జర్నలిస్టులకు తమ పరిధులు, పరిమితులు తెలుసు. అయినా.. ఎందుకైనా మంచిదని, నేషనల్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్.. (ఎన్.బి.ఎ.) జర్నలిస్టు మిత్రులు, సెప్టెంబర్ 24వ తేదీన అనుసరించి తీరాల్సిన మార్గదర్శకాలను జారీ చేసింది. వాటిని అన్ని ప్రసార సంస్థలూ.. వాటిల్లో పనిచేసే జర్నలిస్టులు తు.చ. తప్పకుండా పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మండల స్థాయి విలేకరి నుంచి, ప్రసార సంస్థ సిఇఓ వరకు, అన్ని స్థాయుల్లోనూ అప్రమత్తత అవసరం.
ఎన్.బి.ఎ మార్గదర్శకాలను అన్ని ప్రసార మాధ్యమాలూ.. కచ్చితంగా పాటించి, దేశంలో హింస చెలరేగకుండా, బాధ్యతగా వ్యవహరిస్తాయని నమ్ముతున్నాను. ఎన్.బి.ఎ వెలువరించిన మార్గదర్శకాలతో కూడిన లేఖకు అనువాదాన్ని ఇక్కడ ఇస్తున్నాను.
* * * * *
16.09.2010
NBA ఎడిటర్లందరికీ,
విషయం : ఆసన్నమైన అయోధ్య తీర్పు
ఈనెల 24 వ తేదీన అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్.. అయోధ్య కేసులో తీర్పు వెలువరించనుంది. ఈ తీర్పును, దీనిపై అభిప్రాయ సేకరణలను ప్రసారం చేయడంలో మరింత జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నేషనల్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్.. అన్ని టీవీ ఛానెళ్ల యాజమాన్యాలు, ఎడిటర్లకు సూచిస్తోంది.
అయోధ్య అంశం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అంశం. ముఖ్యంగా ఈ కేసు తీర్పుకు సంబంధం ఉన్న ఏ వార్తను ప్రసారం చేయాల్సి వచ్చినా.. సంచలనానికి, ఆగ్రహావేశాలు పెరిగేందుకు, రెచ్చగొట్టే చర్యలకు, కవ్వింపు చర్యలకు అవకాశం ఇవ్వరాదు. వచ్చిన ప్రతి వార్తను రూఢీ చేసుకోవాలన్న ప్రాథమిక సూత్రాన్ని.. మరీ జాగ్రత్తగా అనుసరించాలి. వార్త ప్రసారం చేయాల్సి వస్తే.. అది ప్రజాప్రజయోజనాలను అనుసరించి మాత్రమే ఉండాలి. సమాజంలో మత సామరస్యాన్ని, లౌకిక భావాన్నిదెబ్బతీసేలా ఏవార్తా ఉండరాదు.
అత్యంత సున్నితమైన అయోధ్య అంశాన్ని దృష్టిలో ఉంచుకుని.. ఈ కేసులో హైకోర్టు తీర్పును రిపోర్ట్ చేసేటప్పుడు, ప్రతివారూ.. స్వీయ మార్గదర్శకాలు, నైతిక ప్రవర్తనా నియమావళిని అనుసరించి, సందర్భానుసారంగా వెలువరించిన ఈ అదనపు మార్గదర్శకాలనూ పాటించాలి. అంతేకాదు.. ఊహాగానాల ఆధారంగా, అవాంఛనీయ ఘటనలు తలెత్తేలా వార్తలు ప్రసారం చేయకుండా కచ్చితత్వాన్ని పాటించాలి.
ఈ అంశంలో అనుసరించాల్సిన కొన్ని అదనపు మార్గదర్శకాలు:
1. హైకోర్టు తీర్పునకు సంబంధించిన అన్ని వార్తలు, ఉన్నది ఉన్నట్లుగా, ఎలాంటి వ్యాఖ్యానాలు జోడించకుండా ప్రసారం చేయాలి.
2. తీర్పు వెలువడక ముందే, సంచలనాల, ఆవేశాగ్నులు రగిలించేలా, రెచ్చగొట్టేలా.. ఎలాంటి ముందస్తు ఊహాగానాల వార్తలను ప్రసారం చేయరాదు.
3. తీర్పునకు అనుగుణంగా.. బాబ్రీ మసీదు కూల్చినప్పటి దృశ్యాలను ఏ వార్తలోనూ ప్రసారం చేయరాదు
4. తీర్పు నేపథ్యంలో జరిగే ఆందోళనలు లేదా సంబరాలపై చిత్రించిన దృశ్యాలను ప్రసారం చేయరాదు
5. అత్యంత సున్నితమైన ఈ వార్తను రిపోర్ట్ చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా, ప్రసారంలోనూ.. వ్యాఖ్యలలోనూ కచ్చితత్వం ఉండేలా.. అత్యున్నత సంపాదక వర్గం స్థాయిలోనే, క్షుణ్ణంగా పరీక్షించి, ప్రసారానికి అనుమతులు ఇవ్వాలి.

ఎలాంటి హింసకు తావివ్వకుండా, ఈ మార్గదర్శకాలను ఎడిటర్లందరూ కచ్చితంగా అనుసరిస్తారని భావిస్తున్నాం. ఉల్లంఘనలకు కఠిన చర్యలు తప్పవు.

అన్నే జోసెఫ్
సెక్రెటరీ జనరల్, ఎన్.బి.ఎ (న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్)