Friday, November 26, 2010

భగవంతుడి మర్మాంగమే ధ్వజస్తంభం..!??



దేవాలయం అంటే నాలుగు చుట్టు గోడలు.. పైన ఓ కప్పు... అందులో రాతితో చేసిన ఓ విగ్రహం.. ఆ బొమ్మకు భక్తి ముసుగులోని కొందరు మూర్ఖులు ఆపాదించిన శక్తి అన్నది నాస్తికులమని చెప్పుకునే వారి భావన. వారి వాదన నిజమా..? ఆలయమంటే ఇంతేనా..?

కాదు.. ముమ్మాటికీ వారి భావన తప్పు.
ఆలయం అంటే.. సాక్షాత్తూ ఆ దేవదేవుడి నివాస స్థలం. స్వామి శరీరాకృతికి ప్రతిరూపం. ఆ సర్వోపహతుడి అంగాంగ విశిష్టతలను చాటే నిర్మాణ చాతుర్యం. (వాస్తు రీత్యా) ఆలయ నిర్మాణ రీతే చాలా విశిష్టమైనది.

దేహమే దేవాలయం. శరీరంలోని షడ్చక్ర స్థానాలు సాక్షాత్తూ భగవత్స్వరూపాలు. వీటిని ఆధీనంలో ఉంచుకుంటే.. జీవుడే దేవుడవుతాడు. ఆ షడ్చక్రాలు (ఆరు చక్రాలు) ఏంటో.. వాటికీ భగవంతుడికీ.. ఆ అంతర్యామి కొలువుండే ఆలయానికీ ఎలాంటి అనుసంధానముందో.. ఓసారి చూద్దాం.

సహస్రార చక్రము: (గర్భ గుడి)
జీవుడికి ఆధారమైన చక్రమిది. మస్తిష్కం (తలలోని మెదడు) పనిచేస్తేనే జీవుడు ఉన్నట్లు.. మెదడు పనిచేయకుంటే.. జీవుడు గాలిలో కలిసి పోయినట్లే. మస్తిష్కం.. జీవుడికే అంతటి కీలకమైనదైతే.. సమస్త జీవకోటిని సృష్టించి, పోషించే ఆ పరంధాముడి మస్తిష్కం మరెంతటి విశిష్టమైనదై ఉండాలి..? మస్తిష్కం.. బ్రహ్మ రంధ్రానికి దిగువన వేయి రేకులతో వికసించే పద్మం అన్నది ప్రాజ్ఞుల నమ్మిక. ఈ కమలం మాయతో ఆవరించి ఉంటుందని.. ఆత్మజ్ఞానాన్ని సాధించిన పరమహంసలు మాత్రమే దీన్ని పొందగలుగుతారన్నది హిందువుల విశ్వాసం. దీన్ని శివులు శైవస్థానమని, వైష్ణవులు పరమ పురుష స్థానమని, ఇతరులు హరిహర స్థానమనీ, దేవీ భక్తులు.. దేవీ స్థానమని పిలుచుకుంటారు. ఈ స్థానం పరిపూర్ణంగా తెలుసుకున్న మనుషులకు పునర్జన్మ ఉండదని కర్మ సిద్ధాంతం చెబుతుంది.

గర్భాలయం : శరీరంలో సహస్రారం ఎంతటి విశిష్టమైనదో.. ఆలయ నిర్మాణంలో గర్భగుడి కూడా అంతే విశిష్టమైనది. దీన్ని గర్భాలయం లేదా ముఖమంటపమని అంటారు. ఇది అత్యంత పవిత్రమైనది. పరమ యోగులు.. స్వామివారి కరుణ భాగ్యాన్ని పొందిన వారికి మాత్రమే ఇందులో ప్రవేశించే అర్హత వస్తుంది.

ఆజ్ఞా చక్రము: రెండోది ఆజ్ఞా చక్రం ఇది భ్రూ (కనుబొమల) మధ్య లో ఉంటుంది. ఈ చక్రము, రెండు రంగులతో కూడిన రెండు రేకులు (దళాలు) ఉండే కమలంలా ఉంటుందట. (ఇది కూడా గర్భాలయానికి సంబంధించిన అంశమే.)

విశుద్ధి చక్రము: (అంతరాలం)
మూడోది విశుద్ధి చక్రము. ఇది కంఠ స్థానంలో ఉంటుంది. ఈ చక్రం, తెల్లగా మెరిసిపోయే పదహారు రేకులతో కూడిన కమలంలా ఉంటుందట. ఇది ఆకాశతత్వానికి ప్రతీక అన్నది విశ్వాసం.
అంతరాలం : ఆలయ నిర్మాణంలో విశుద్ధి స్థానాన్ని అంతరాలంగా పిలుస్తారు. ముఖ మంటపాన్నీ మహా మంటపాన్నీ కలిపే స్థానమే అంతరాలం.

అనాహత చక్రము: (అర్ధమంటపం)
ఇది హృదయ (రొమ్ము) స్థానంలో ఉంటుంది. బంగారు రంగులోని పన్నెండు రేకులు గల కమలంలా ఉంటుందిట. ఇది వాయుతత్వానికి ప్రతీక.
అర్ధమంటపం : గర్భాలయానికి ముందు ఉండే మంటపాన్ని ముఖమంటపం లేదా అర్ధమంటపం అంటారు. భగవంతుడి శరీరంలో రొమ్మును ఇది ప్రతిబింబిస్తుంది.

మణిపూరక చక్రము: (మహామంటపం)
నాభి (బొడ్డు) మూలంలో ఈ చక్రం ఉంటుంది. నీల వర్ణంలోని పది దళాలు (రేకులు) కలిగిన పద్మంలా ఉంటుంది. ఇది అగ్ని తత్వాన్ని ప్రతిఫలిస్తుంది.
ఆలయ నిర్మాణంలో... గొంతు నుంచి నాభి దిగువ దాకా మహా మంటపమే ఉంటుంది.

స్వాధిష్ఠాన చక్రము: (ధ్వజస్తంభం)
ఈ చక్రము లింగ (పురుషాంగం) మూలంలో ఉంటుంది. ఈ చక్రం సింధూర వర్ణం గల ఆరు దళాల కమలమట. ఇది జలతత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
ధ్వజస్తంభం : ఆలయ నిర్మాణ రీతిని అనుసరించి, మహా మంటపానికి ముందు ఈ స్తంభం ఉంటుంది. దేవుడి అంగమే ఈ ధ్వజస్తంభం. అంగ మొల వేలుపు అని శివుడికి పేరు. అంగ మొల అంటే, వస్త్రాలేమీ లేని కటి ప్రదేశం అని అర్థం. ధ్వజము అన్నా కూడా జెండా అని, మగ గురి అనీ అర్థాలున్నాయి. మగ గురి లో మగ అంటే.. మగటిమి అని, గురి అంటే లక్ష్యము అని అర్థం. నిజానికి ధ్వజము అంటేనే మగ (పుంసత్వపు) గురి అన్న అర్థముంది. ఏది ఏమైనా భగవంతుడి మర్మాంగ రూపమే ధ్వజస్తంభం అనడంలో సందేహం లేదు. ఆంజనేయుడి ధ్వజస్తంభానికి మండల కాలం పూజలు చేసి ప్రదక్షిణలు చేస్తే.. వివాహాది ఇష్ట కార్యసిద్ధి కలుగుతుందన్న విశ్వాసం కూడా ధ్వజస్తంభం విశిష్టతను చాటుతుంది.
మూలాధార చక్రము:
అన్ని నాడులకూ ఆధారమైన ఈ చక్రం గుద స్థానంలో ఉంటుంది. గుద స్థానానికి పైన, లింగ స్థానానికి కింద (గుద, లింగం రెంటి మధ్యలో) ఉంటుంది. ఎర్రటి రంగులోని నాలుగు దళాల కమలమిది. ఇందులోనే కుండలినీ శక్తి నిక్షిప్తమై ఉంటుందట.

మోకాలి స్థానం : స్వామి వారి రెండు మోకాళ్లు కలిసే స్థానం. ఇక్కడ ఓ గోపుర ద్వారం ఉంటుంది. దీన్ని దుర్గపుర ద్వారం అంటారు. (దుర్గ అంటే కోట, పురం అంటే పట్టణం అని అర్థం) అంటే ప్రజలు స్వామి దర్శనానికి చేరుకునేందుకు ఇది ప్రవేశ ద్వారం.

పాదాలు : ఇది మహాప్రాకార గోపుర స్థానం. (ప్రాకారం అంటే గుడి మొదలైన వాటి చుట్టూ ఉన్న గోడ అని అర్థం. మహా అంటే చాలా గొప్పగా (పటిష్టంగా) అని అర్థం. అంటే శత్రువులు కోటలోకి రాకుండా రాజులు ఎలా దుర్భేద్యమైన ప్రాకారాన్నినిర్మించే వాళ్లో.. గుడికీ, దుష్టశక్తులు ప్రవేశించకుండా ఈ మహాప్రాకార గోపురాన్ని నిర్మిస్తారు. మనం మహాప్రాకారం దాటి లోపలికి వెళుతుండగానే.. మన మనసుల్లోని అన్ని బాధలు, చెడు తలంపులకు కారణమైన... కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం అనే అరిషడ్వర్గాలన్నీ ప్రాకారం బయటే నిలిచిపోతాయి. అందుకే గుళ్లోకి వెళ్లగానే మన మనసు ప్రశాంతమై పోతుంది.
ఇదీ గుడి నిర్మాణం.. ఆ గుళ్లో భగవంతుడి శరీర స్థానాల విశిష్టతల గురించిన సమాచారం. కాబట్టి, ఇకమీదట గుడికి వెళ్లేటప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకుని, స్వామిని మనస్పూర్తిగా ధ్యానించండి. భగవంతుడి ఆశీస్సులు పొందండి. సర్వే జనాస్సుఖినో భవంతు.

Thursday, November 25, 2010

మా అబ్బాయి "సంకష్ట వ్రతం" చేస్తున్నాడు ఎందుకో..!

రాత్రి ఆఫీసులో స్టాఫ్‌ తక్కువగా ఉండడం.. ముఖ్యమంత్రి మార్పిడికి సంబంధించిన వార్తా కథనాలు రాయడం, రాయించాల్సి ఉండడంతో.. 24వ తేదీ రాత్రి ఆఫీసులోనే గడిపాను. 25వ తేదీ అంటే, నిన్న ఉదయం 8 గంటలకు, 10 గంటలకు ప్రాంతీయ వార్త బులెటిన్లు పూర్తి చేసి ఇంటికి వచ్చాను. అప్పుడు మా శ్రీమతి ఓ ఆశ్చర్యకరమైన విషయం చెప్పింది.

మా అబ్బాయి వికాస్‌ (తను టెన్త్‌ క్లాస్‌ చదువుతున్నాడు) సంకట హర వ్రతాన్ని చేస్తానని చెప్పాడట. ఆమేరకు దేవుడి గదిలో.. విఘ్నేశ్వరుడి ప్రతిమ ముందు సంకల్పించుకుని.. మా ఆవిడ వారిస్తున్నా వినకుండా ఏమీ తినకుండా, లంచ్‌ బాక్స్‌ తీసుకోకుండా స్కూలుకి వెళ్లిపోయాడట. (ఈ వ్రతాన్ని చేసేవారు ఉదయాన్ని స్నానాదికాలు ముగించి, గణపతి ముందు కూర్చుని దీప, ధూపాలతో పూజించి, "రోజంతా ఉపవాసం ఉండి.. రాత్రికి సంకష్ట వ్రతాన్ని ఆచరిస్తా.." అని స్వామి ముందు సంకల్పించుకుంటారు. రాత్రి వేళ పూజ చేసి.. స్వామికి నివేదించిన పదకొండు కుడుములలో ఓ ఐదింటిని మాత్రమే తిని ఉపవాస దీక్ష విరమించి, నిద్రిస్తారు. ) మా అబ్బాయి ఈ వ్రతాన్ని చేస్తాననడం నాకు ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది. సాధారణంగా ఈ వయసులో పిల్లలు ఆటపాటలతో.. స్నేహితులతో సరదాగా గడిపేందుకు ఇష్టపడతారు. కానీ మా అబ్బాయి వ్రతాల వైపు ఆకర్షితుడవుతున్నాడేంటా అని ఆలోచించా. అయినా.. ఆకలికి తనెక్కడ తట్టుకుంటాడులెమ్మని సర్ది చెప్పుకున్నా.
ఆఫీసులో పని ముగించుకుని నిన్న రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చేసరికి, మా అబ్బాయి.. వాళ్లమ్మ (నా శ్రీమతి) ఇద్దరూ వ్రతాచరణలో హడావుడిగా ఉన్నారు. ఏదో ఆషామాషీగా అనుకున్నా గానీ.. మా అబ్బాయి సంకష్ట వ్రతాచరణ పట్ల నిజంగానే పట్టుదలతో ఉండడం అబ్బురపరిచింది. వికాస్‌ ముఖం కాస్త వడిలినట్లున్నా.. కాంతిమంతంగా ఉండడం కాస్త ఆలోచించేటట్లు చేసింది. ఏమైతేనేం.. తను, వాళ్లమ్మతో కలిసి దిగ్విజయంగా వ్రతాన్ని ఆచరించాడు.

పదో తరగతి చదువుతున్నాడు కదా..! ఒకవేళ పరీక్షలంటే భయపడి ఇలా వ్రతాల వైపు మొగ్గు చూపుతున్నాడేమో అని అనుమానం వేసింది. అదే విషయాన్ని మా అబ్బాయిని అడిగా.. నథింగ్‌ డూయింగ్‌ 550 మార్కులకు పైబడే వస్తాయి.. మరికాస్త చదివితే ఇంకొన్ని మార్కులు వస్తాయి.. అన్నాడు. (అది నిజమే) మరి ఈ వయసులో ఇంత కఠినమైన వ్రతాన్ని ఎందుకు మొదలు పెట్టావు..? అని ఆరా తీశా. జస్ట్‌ ఇదెలా ఉంటుందో చూద్దామనిపించింది.. చేశా దట్సాల్‌ అన్నాడు. ఎలా అనిపించింది..? అంటే.. బావుంది అన్నాడు.
మా అబ్బాయి వ్యవహారాన్ని పరిశీలించాక, ఈ తరం ఓ కొత్త విషయాన్ని తెలుసుకుంటే.. దాన్ని ప్రయోగాత్మకంగా రూఢీ చేసుకునేదాకా నిద్రపోరు కాబోలు అనిపించింది.
మా అబ్బాయి సంకట హర గణపతి వ్రతాచరణ తర్వాత చంద్రదర్శనం చేసుకుని త్వరగానే నిద్రపోయాడు. సో నేను మెయిల్స్‌ చెక్‌ చేద్దామని నెట్‌ ఓపెన్‌ చేశాను. సిస్టమ్‌ డెస్క్‌టాప్‌పైన పేరు పెట్టని ఓ unknown ఫోల్డర్‌ కనిపిస్తే ఓపెన్‌ చేశా. అందులో మా ఫ్యామిలీ ఫోటోలున్నాయి. బాగా పరిశీలించి చూస్తే.. మా అబ్బాయి ఆధ్యాత్మిక ధోరణిని చాటే మరికొన్ని సందర్భాలు.. ఫోటోల రూపంలో కనిపించాయి. వినాయక చవితి రోజున పూజ చేసినప్పటి ఫోటో, తన ఆరేళ్ల వయసులో.. నాతోపాటు అయ్యప్ప స్వామి దీక్ష చేసినప్పటి ఫోటోలు, తిరుమల వేంకటేశుని దర్శనానికి వెళుతున్నప్పుడు ప్రకృతిని ఆరాధిస్తూ.. అక్కడి అడవి జంతువుల పట్ల ఆదరణ కనిపిస్తున్న సందర్భానికి సంబంధించిన ఫోటోలు, తన పుట్టిన రోజున నేను ప్రెజెంట్‌ చేసిన పెంపుడు శునకం శాండీతో మా అబ్బాయి ఆటలకు సంబంధించిన ఫోటోలు.. ఇలా రకరకాల ఫోటోలు ఆ ఫోల్డర్‌లో కనిపించాయి. అంతేనా దసరా రోజున మా అమ్మగారికి పాదాభివందనం చేస్తూ.. ఆమెతో ఆప్యాయంగా ముచ్చటిస్తున్నప్పటి ఫోటో కూడా అందులో ఉంది.

వీటన్నింటినీ చూశాక.. నాలో ఓ రకమైన భరోసా కలిగింది. చెప్పొద్దూ.. ఉన్నది ఒక్కగానొక్క నలుసాయె.. ఎక్కడ చెడు స్నేహాల వైపు వెళతాడో అని నేనూ, నాభార్యా భయపడుతుంటాం. అది పటాపంచలై పోయింది. (మా అబ్బాయికి కావలసినంత స్వేచ్ఛనిచ్చాను. అలా అని విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించలేదు. చాలా పద్ధతిగా పెరిగాడు.. కానీ ప్రేమ ఎక్కువ ఉన్న చోట భయం
కూడా అంతేస్థాయిలో ఉంటుందంటారే.. ఆ ప్రకారం ఎక్కడ పాడై పోతాడో అన్న భయం ఎంత వద్దనుకున్నా మమ్మల్ని వెంటాడుతూనే ఉంటోంది. ) శ్రుతి మించని స్థాయిలో ఆధ్యాత్మిక ధోరణి ఉంటే.. పిల్లలు చెడు నడవడికకు దూరంగా ఉంటారన్నది నా ప్రగాఢ నమ్మకం. మా అబ్బాయి ఆ దిశగా సాగుతున్నాడు. మరి ఇంటర్‌, గ్రాడ్యు‍యేషన్‌ లలో కూడా ఇదే సత్ప్రవర్తనను కొనసాగిస్తే.. తను దారిలో పడ్డట్లే. తల్లిదండ్రులుగా మేము భరోసాగా ఉండొచ్చనుకుంటా.. ఏమంటారు..?

నోట్‌ : ఈ పోస్టుతో పాటు వేస్తున్న ఫోటోలు మా పద్నాలుగేళ్ల అబ్బాయి వికాస్‌ వివిధ సందర్భాల్లో తీయించుకున్న ఫోటోలు.

సిఎం గారూ... ఎందుకొచ్చిన తెలుగు తిప్పలు చెప్పండీ...



రాష్ట్ర 16వ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌ రెడ్డి గారికి.. పాపం ఒక్కసారిగా తెలుగు మీద ప్రేమ పొంగిపోయింది. పదవీ స్వీకార ప్రమాణాన్ని తెలుగు భాషలోనే చేస్తానని ఆయన అధికారులకు చెప్పారు. దీనికి తగ్గట్లుగా అధికారులు కూడా ప్రమాణ పత్రాన్ని తయారు చేసి ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న నాలాంటి అర్భకులకు.. హమ్మయ్య, ఈయన హయాంలో కాస్త తెలుగుకు మంచి రోజులు వచ్చేలా ఉన్నాయి అని అనిపించింది. కానీ, సిఎం గారు ప్రతిజ్ఞ చేసిన తీరు చూశాక.. ఆశలు ఆవిరై పోయాయి. అయ్యా కిరణ్‌కుమార్‌ రెడ్డి గారూ మీకెందుకొచ్చిన తెలుగు తిప్పలు చెప్పండీ.. ఎంచక్కా మీకు అనర్గళంగా వచ్చే ఆ ఇంగ్లీషులోనే గోడు పెట్టుంటే పోయుండేది అని అనాలనిపించింది..

ఇంతకీ కొత్త సిఎం గారు పలికిందేంటంటే..

బారత దేస..
(నాలుక తిరగలేదేమో..)
సార్వబౌమ్‌..అ..అధికారాన్ని,
(ఇక్కడా తడబాటే..)
అంక్‌..అంక్‌..అంతకర్త శుద్ధితో..
(ఏంటో ఏడుపొచ్చేస్తోంది.. మొత్తం అర్థాన్నే మార్చేశారు)
రాజద్వేషాలు లేకుండా
(రాజశేఖరరెడ్డిని ఇంకా మరిచినట్లు లేదు)
శాసనం..శాస్..శాసనాలను
(పాపం గజిబిజిగా ఉంది కాబోలు)
విదేయత
(కింద జఠ ఉంటుందని, అది విధేయత అని ఇంగ్లిష్‌ మీడియం వారికి తెలియాలని రూలు లేదుగా)
నాయం చేకూర్చుతానని
(న్యాయం కామోసు..)

సిఎం గారు చేయాల్సిన ప్రతిజ్ఞ అసలు రూపం :
" నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి అనే నేను, శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంత:కరణ శుద్ధితో నిర్వర్తిస్తానని, భయం గానీ, పక్షపాతం గానీ, రాగ ద్వేషాలు గానీ లేకుండా.. రాజ్యాంగాన్ని, శాసనాలనూ అనుసరించి, ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. "

ఇది కోడిగుడ్డుకు వెంట్రుకలు పీకే ఉద్దేశంతో రాసింది కాదు. ఎవరూ కోరక పోయినా.. తెలుగులోనే ప్రమాణం చేయాలని నిర్ణయించుకున్న సిఎం గారు, కనీసం ఆ ప్రమాణ పత్రాన్ని ముందుగా ఓసారి కూడా చదువుకోకుండా... తెలుగు భాషను, అంతలా పీకి పాకం పెడుతుంటే.. గుండెల్లో కళుక్కుమని.. ఈ ముక్కలు రాయాలనిపించింది. అంతే..! అయినా.. పోనీలెండి.. ఏదో మనమీద దయతో.. కిరణ్‌కుమార్‌రెడ్డి గారు.. మన తెలుగు భాషకు వీలైనంత ప్రాధాన్యతనిచ్చారని ఓ రవ్వ సంతోషిద్దాం. ఏమంటారు..?

Wednesday, November 24, 2010

వైఎస్‌ సతీమణి ' విజయమ్మ' హోంమంత్రి..?


రోశయ్య రాజీనామాతో రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు తెరలేస్తోంది. కొత్త కొత్త వాదనలు వినిపిస్తున్నాయి. వీటిలో.. జగన్‌ మాతృమూర్తి, వైఎస్సార్‌ సతీమణి విజయమ్మకు హోంమంత్రి పదవి రానుందన్న వాదన ఒకటి.

ప్రస్తుత కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్‌ జగన్మోహనరెడ్డికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టాలన్నది ఆ వర్గం ఎమ్మెల్యేల ప్రధాన డిమాండ్‌. సిఎల్పీ సమావేశానికి ముందే.. ఈ వర్గం ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగానూ.. పరోక్షంగానూ విస్తృత స్థాయిలో చర్చించుకున్నారట. అవకాశం వచ్చింది కాబట్టి, జగన్‌ను ఎందుకు సిఎంను చేయరాదు..? అన్నది ఈ వర్గం ప్రశ్న. ఒకవేళ ఈప్రతిపాదనను అధిష్ఠానం తోసిపుచ్చేటట్లయితే.. జగన్‌ తల్లి, పులివెందుల ఎమ్మెల్యే విజయమ్మను హోంమంత్రి పదవిలో కూర్చోబెట్టాలన్న ప్రతిపాదనను జగన్‌ వర్గం తెరపైకి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఓదార్పు యాత్ర ద్వారా గానీ, మరో కార్యక్రమం ద్వారా గానీ.. ప్రజల్లో వైఎస్సార్‌పై సానుభూతిని ఎంతకాలం నిలిపి ఉంచగలమన్న అనుమానం జగన్ వర్గాన్ని పట్టి పీడిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్‌ ఉన్న కాలంలో.. ఆయన వీర విధేయులమంటూ చెప్పుకున్న కొందరు నాయకులు.. పదవుల కోసం.. జగన్‌ వర్గాన్నే విమర్శించడం, ఒకరకంగా జగన్‌ను అణగదొక్కేందుకు ప్రయత్నించడాలను ఈ వర్గం జీర్ణించుకోలేక పోతోంది. అందుకే.. రాష్ట్రంలో తక్షణం ఏదో ఒక కీలక పదవిని దక్కించుకోవాలని వీరు భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

హోంమత్రి పదవిని దక్కించుకోవడం ద్వారా పార్టీలోనూ, అనుయాయుల్లోనూ పట్టును నిలుపుకోవచ్చన్న భావన.. జగన్‌ వర్గంలో కనిపిస్తోంది. ఈ పదవితో పాటు.. మరికొన్ని మంత్రి పదవులనూ ఈ వర్గం ఆశిస్తోంది. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే.. శాసనసభా పక్షాన్ని చీల్చేందుకూ వెనుకాడేది లేదని వీరు హెచ్చరిస్తున్నట్లు తెలుస్తోంది.

మరి సిఎల్సీ అత్యవసర సమావేశం తర్వాత.. పర్యవసానాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

అనుకున్నదే అయింది..!



అనుకున్నదే అయింది... అసహనం పెరిగిపోయిన రోశయ్య రాజీనామా చేస్తారన్న నా అంచనాయే నిజమైంది. అత్యంత విషాదకర పరిస్థితుల్లో.. వైఎస్సార్‌ మరణించిన మర్నాడే రోశయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన ఖర్మ ఏమో గానీ.. పదవిలో కూర్చున్నప్పటి నుంచీ సమస్యలే సమస్యలు.

ముఖ్యమంత్రి కాగానే.. రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. కనీవినీ ఎరుగని రీతిలో కర్నూలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం పెద్దగా జరగలేదు కానీ, ఆస్తి నష్టం భారీగానే జరిగింది. దీనంతటికీ కారణం.. రోశయ్య నేతృత్వంలోని అధికార బృందం.. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిని దిగువకు విడుదల చేసే విషయంలో మీనమేషాలు లెక్కించడం.. ఆకారణంగానే బ్యాక్‌వాటర్‌ వెనక్కి తన్ని.. తుంగభద్ర నది ఉప్పొంగి కర్నూలును ముంచెత్తిందని ఆరోపణలు వచ్చాయి. ఆతర్వాత ప్రజలను ఆదుకోవడంలో కూడా రోశయ్య సర్కారు విఫలమైందని కర్నూలు జిల్లా వరద బాధితులను కదిలిస్తే అర్థమవుతుంది.
ఏదో ఆ గండం నుంచి గట్టెక్కామనుకునే లోపు.. ఫ్రీజోన్‌ అంశం తెరపైకి వచ్చింది. పోలీసు ఉద్యోగాల నియామకంలో.. హైదరాబాద్‌ ఫ్రీజోనే అని.. ఏ ప్రాంతం వారైనా ఇక్కడ పోలీసు ఉద్యోగాల్లో చేరవచ్చని హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో.. తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర భావన మరింత పెరిగింది. దీన్ని సొమ్ము చేసుకునేందుకు టిఆర్‌ఎస్‌ అధినేత చంద్రశేఖరరావు ఆమరణ నిరాహార దీక్ష ప్రకటన చేశారు. దీక్షకు అనుమతించకుడా.. రోశయ్య సర్కారు, కెసిఆర్‌ను మధ్యలోనే అరెస్టు చేసింది. ఇక అక్కడినుంచి తెలంగాణ అంశం రావణ కాష్ఠంలా రగులుతూనే ఉంది. ఈ గొడవ గడచిన పదకొండు నెలలుగా కొనసాగుతూనే ఉంది.

డిసెంబర్‌ 9న చిదంబరం చేసిన ప్రకటన రోశయ్యకు కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైందన్న ఆ ప్రకటన.. సీమాంధ్రలో ఉద్యమానికి కారణమైంది. సమైక్యాంధ్ర భావనతో.. సీమాంధ్ర ప్రజలు ఉద్యమించారు. దీంతో.. తెలంగాణలోని ఆందోళనలు కాస్తా సీమాంధ్రకు మళ్లాయి. ఒక ప్రాంతానికి మద్దతుగా ఏనిర్ణయం తీసుకున్నా.. రెండో ప్రాంతం వారు గొడవకు దిగే పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది.
పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణకమిటీని వేసింది. తొలుత దీన్ని వ్యతిరేకించినా.. తెలంగాణరాష్ట్ర సమితి, కమిటీ పట్ల గౌరవంగానే వ్యవహరిస్తూ వచ్చింది. దీంతో.. కొంతకాలంగా ఉద్యమాల కాక తీవ్రత తగ్గింది.

ఓ నాలుగు నెలలు కాస్త ఊపిరి పీల్చుకున్న రోశయ్య సర్కారు.. ఈ కాలంలో, రాష్ట్ర ఆదాయాన్ని గణనీయంగా పెంచగలిగారు. మద్యం దుకాణాల వేలం ద్వారా.. అబ్కారీ శాఖకు టార్గెట్లు విధించి, గతంలో కనీవినీ ఎరుగని రీతిలో ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చి పెట్టారు. దీంతో పాటే... రిజిస్ట్రేషన్‌ ధరలు పెంచడం, ఆదాయపన్నుల రూపంలో.. ఇలా ఏ అవకాశం ఉన్నా వదలకుండా ఖజానాకు ఆదాయాన్ని పెంచారు. సహజంగానే, ఖర్చు విషయంలో.. రోశయ్య చాలా పొదుపును పాటించారు. రోశయ్యకు కాస్త బాగా ఉన్న కాలం ఏదంటే.. ఈ నాలుగు నెలలే.
ఈమధ్యలోనే ఆయనకు జగన్‌ గండం ఎదురైంది. ఓదార్పు యాత్ర పేరిట, జగన్‌... అధిష్ఠానాన్ని ధిక్కరిస్తున్నా ఏమీ చేయలేని అసమర్థత.. తరచూ తనకు వ్యతిరేకంగా సాక్షిలో వస్తున్న కథనాలు పెంచుతున్న అసహనం.. రోశయ్యలో శాంతాన్ని నశింప చేశాయి.
అధిష్ఠానం ఏదోలా పరిస్థితిని చక్కదిద్దుతుందిలే అన్న భావనతో ఉన్న సమయంలో.. మళ్లీ ఫ్రీజోన్‌ అంశం రోశయ్యకు గండంగా పరిణమించింది. ఎస్‌ఐ పరీక్షల రాత పరీక్ష నిర్ణయం విషయంలో రోశయ్య సర్కారు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. హైదరాబాద్‌లో పరీక్షలు నిర్వహించకుండా.. మిగిలిన ప్రాంతాల్లోనే పరీక్షలు జరుపుతామని ప్రకటించింది. పరీక్షలకు ఫ్రీజోన్‌ అంశానికి ఏమాత్రం సంబంధం లేదని నచ్చచెప్పే ప్రయత్నం ఫలించలేదు. పైగా, దీనికి రాజకీయ పార్టీలూ జత కలవడంతో.. పరిస్థితి మరింత జటిలమైంది. ఉస్మానియా విద్యార్థులు ఆమరణ దీక్షలకు దిగారు. పరిస్థితి తీవ్రరూపంలో దాల్చుతున్న తరుణంలో.. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, పరీక్షలు వాయిదా వేయించేందుకు సిఎంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఆ అసహనంలో.. సంయమనం కోల్పోయి.. విద్యార్థులను హుస్సేన్‌ సాగర్‌లో దూకమనండి అన్న అర్థం వచ్చేలా పరోక్ష వ్యాఖ్యలు చేశారు. దీంతో పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చింది. దీంతో రోశయ్య ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు. ఎస్‌ఐ పరీక్షలను అన్ని ప్రాంతాల్లోనూ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో సీమాంధ్రలో ఉద్యమం మొదలైంది.

వీటికి తోడు, వరంగల్‌లో కాంట్రాక్ట్‌ నర్సులు ఎంజిఎం ఆసుపత్రిలో వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి దాదాపు 36 గంటలు తిండీ తిప్పలు లేకుండా ఆందోళన చేశారు. దీంతో ప్రభుత్వ యంత్రాంగం దిగి వచ్చి.. వారి డిమాండ్ల పరిష్కారానికి హామీ ఇచ్చింది. ఈ ఘటన స్ఫూర్తినిచ్చిందని అనుకోను గానీ.. ప్రతివారూ డిమాండ్ల సాధన కోసం బిల్డింగులు, టవర్లు ఎక్కడం ప్రారంభించారు. పారా మెడికల్‌ సిబ్బంది, బిఇడి-2008 అభ్యర్థులు, ప్రభుత్వోద్యోగులు అందరూ రోశయ్య సర్కారును ముట్టడించారు.

వీటన్నింటి నేపథ్యంలో.. ఎంతో సహనంగా.. మీడియా మిత్రుడిగా ఉండే రోశయ్య, ఏకంగా మీడియా ప్రతినిధులమీద కూడా రుసరుసలాడడం మొదలెట్టారు. ఆయన ఏ సభకు వెళ్లినా అడ్డంకులు సృష్టిస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడం ప్రారంభించారు. ఇలాంటి ఘటనలతో 77 సంవత్సరాల వయసులో రోశయ్య ఆరోగ్యం కూడా క్షీణించి పోయింది.

దీనికి తోడు, సాక్షి ఛానల్‌లో సోనియా గాంధీకి వ్యతిరేకంగా కథనం ప్రసారమైందంటూ రాష్ట్ర కాంగ్రెస్‌లోని ఓ వర్గం గగ్గోలు మొదలుపెట్టింది. ఆ ఛానల్‌లోను, పత్రికలోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు మొదలయ్యాయి. వీటన్నింటి నేపథ్యంలో, జగన్‌ వర్గాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా రోశయ్య హడావుడిగా ఢిల్లీ వెళ్లారని భావించారు. అయితే.. అక్కడ ఏంజరిగిందన్న వివరాలు ఇప్పటికిప్పుడు తెలియడం లేదు గానీ.. రోశయ్యే తన పదవిని వదులుకోవాల్సి వచ్చింది. అలా ఓ కురువృద్ధుడు.. కాంగ్రెస్‌ సుశిక్షిత సైనికుడు అత్యున్నత పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇప్పుడు రోశయ్యలో, పదవి పోయిందన్న బాధ ఎక్కడో ఓ మూల ఉన్నా.. గొడవలను పరిష్కరించాల్సిన తలనొప్పి తగ్గిందన్న భావన, కాస్తంత ప్రశాంతతనిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Tuesday, November 23, 2010

రోశయ్యలో పెరుగుతోన్న అసహనం..!

రోశయ్య శాంతస్వభావం... మాటల చమత్కారం.. కనుమరుగై పోతున్నాయి. ఈ మధ్యకాలంలో ఆయన తీవ్ర అసహనంతో కనిపిస్తున్నారు. ముప్పిరిగొంటున్న సమస్యలు ఆయనకు శాంతిని దూరం చేస్తున్నాయి. ప్రాంతాలకు అతీతంగా, ఆయన ఎక్కడికి వెళ్లినా.. నిరసనలు చుట్టుముడుతున్నాయి. ఆయన ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నాక తొలి అర్ధ సంవత్సరం విపరీతమైన సమస్యలతో సతమతమయ్యారు. తర్వాత ఓ నాలుగు నెలలు కాస్తంత ప్రశాంతంగానే సాగింది. అయితే.. ఫ్రీజోన్‌, బిఇడి-2008 అభ్యర్థుల అంశాలపై రోశయ్య తీసుకున్న నిర్ణయాలు పరిస్థితులను దిగజార్చాయి. ఎస్‌ఐ రాతపరీక్షల నిర్వహణపై రోశయ్య ద్వంద్వ నిర్ణయం... రాష్ట్రంలో మళ్లీ విభజన చిచ్చును రాజేసింది. అది మొదలు, పారా మెడికల్‌ సిబ్బంది, ఉస్మానియా విద్యార్థులు, బిఇడి అభ్యర్థులు.. ఇలా ప్రతివారూ... ప్రభుత్వం మెడలు వంచేందుకు ఆత్మహత్యాయత్నాలకు దిగడం... ప్రభుత్వం బెంబేలెత్తి పోవడం ఆనవాయితీగా మారింది.
ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌లోనే... తనను వ్యతిరేకిస్తున్న జగన్‌ వర్గం తరచూ ఆటంకాలు సృష్టిస్తుండడం.. రోశయ్య చికాకుకు కారణమవుతోంది. సిఎం ఏ జిల్లాకు వెళ్లినా.. సభల్లో వైఎస్‌ను విస్మరిస్తున్నారంటూ.. జగన్‌ వర్గీయులు బహిరంగంగా విరుచుకుపడుతున్నారు. దీంతో.. రోశయ్యలో అసహనం బాగా పెరిగిపోతోంది. ఆవేశంతో ఊగిపోతున్నారు. తాజాగా, అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయం వద్ద కూడా ఆయన ప్రశాంతత భగ్నమై పోయింది. స్థానిక నాయకత్వాన్ని విస్మరించారంటూ.. ఆందోళనకు దిగిన కాంగ్రెస్‌ కార్యకర్తలపై రోశయ్య విరుచుకుపడ్డారు. అనూహ్యంగా ఆయన నోట రాజీనామా మాట కూడా దొర్లింది. అంతేకాదు.. అధికారులు నా మాట వినట్లేదు ఏం చేయమంటారు..? అని ప్రశ్నించారు. దీంతో అవాక్కవడం కాంగ్రెస్‌ కార్యకర్తల వంతైంది. మరి ఈ పరిస్థితుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ఎలా నడిపిస్తారో మన రోశయ్య గారు. రాష్ట్రానికి (ఉంటే గింటే.. ) ఆ భగవంతుడే దిక్కు.

Saturday, October 23, 2010

తెలుగు హంతకులు...!!



మనం తెలుగోళ్లం.. దురదృష్టవశాత్తూ "తెలుగు భాష" హంతకులను ప్రోత్సహిస్తున్న వాళ్లం. మన భావ వినిమయ సాధనాన్ని ఖండఖండాలుగా చీల్చి చెండాడుతున్న వాళ్లం. ప్రాచీన భాష హోదా దక్కించుకుని దానికి గౌరవాన్ని ఇనుమడింప చేయాల్సిన తరుణంలో.. వ్యక్తిగత కక్షలు, కార్పణ్యాలతో అమృతతుల్యమైన శబ్దం "తెలుగు"ను విషపూరితం చేస్తున్న వాళ్లం.. అందుకే మనం తెలుగు వాళ్లం. కాకుంటే ఏంటి చెప్పండి.. తెలుగు లలిత కళాతోరణం పేరులో తెలుగును తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా మనకు చీమకుట్టినట్లయినా ఉందా..? అందుకే మనం తెలుగోళ్లం.

ఆత్మాభిమానం అంటే ఏంటో రుచి చూపించిన ఎన్టీఆర్‌ అంటే తెలుగు వాళ్లకు ఎందుకో అంత కచ్చ. " ఆర్‌ యు మదరాసీ" అన్న స్థాయి నుంచి ఆర్‌ యు ఫ్రమ్‌ ఆంధ్రప్రదేశ్‌ అన్న స్థాయికి తెలుగువారి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో పెంచిన ఎన్టీఆర్‌ను.. మరేలనో.. పదే పదే అవమానిస్తున్నారు. ఇవాళ మన భాషను, కేంద్రప్రభుత్వం ప్రాచీన భాషగా గుర్తించడం వెనుక... తెలుగుకు ఎన్టీఆర్‌ కల్పించిన విస్తృత ప్రాచుర్యం విస్మరించరానిది. అలాంటి తెలుగువాడికి పదే పదే అదే పనిగా అవమానం జరుగుతోంది. మొన్నటికి మొన్న హైదరాబాద్‌లో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయానికి.. రాజీవ్‌ గాంధీ పేరును పెట్టారు. ఎన్టీఆర్‌ పేరు పెట్టండ్రోయ్‌ అని ఎన్టీఆర్‌ అభిమానులు ఎంత గొంతు చించుకు అరచినా వినలేదు. సరే గొంతెండి పోయి వాళ్లే మౌనం పాటించారు. ఈ డిమాండ్‌ సహేతుకమే అయినా.. రాజకీయ రొచ్చులో మన రాయి వేయడం ఎందుకులే అని రాజీవ్‌ పేరుకే మిగిలిన వారూ మౌనంగా ఆమోద ముద్ర వేశారు.

ఇవాళ్టికివాళ మళ్లీ ఎన్టీఆర్‌ కలల సౌధం.. మానస పుత్రిక తెలుగు లలిత కళాతోరణం పేరును రాజీవ్‌గాంధీ లలిత కళాతోరణంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులనూ జారీ చేసేసింది. ఇదెక్కడి దారుణం స్వామీ..! తెలుగు లలిత కళా తోరణం.. ఎన్టీరామారావు మానస పుత్రిక. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల నిర్వహణ కోసం 1986లో కేవలం మూడంటే మూడు నెలల్లో... దీన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించారు. ఐదు వేల మంది ప్రజలకు ఏకకాలంలో కూర్చుని చూసేందుకు వీలుగా దీన్ని నిర్మించారు. ఇప్పుడేమో దాన్ని ఇండోర్‌ ఆడిటోరియం గా మారుస్తారంట. సంతోషమే.. మార్చుకోండి. అందులో తెలుగు పేరును తొలగించడం ఏంటి.?

పార్లమెంటు సభ్యుడు తిక్కవరపు సుబ్బిరామిరెడ్డి గారు సొంత నిధులతో లలిత కళాతోరణాన్ని అత్యాధునిక సదుపాయాలతో తీర్చిదిద్దుతారంట.. ఆ ఖర్చు చేసినందుకు గాను, తెలుగు లలిత కళాతోరణం పేరులో తెలుగును తొలగించి రాజీవ్‌గాంధీ పేరును పెట్టాలని కోరారట. అర్థం పర్థం ఉందా..?

విశాఖ రాజకీయాల్లో ఎన్టీఆర్‌ తనయ, ప్రస్తుత కేంద్ర మంత్రి పురంధ్రీశ్వరితో తిక్కవరపు గారికి రాజకీయ విరోధం ఉంది. 35 సంవత్సరాలుగా తాను స్థిరపడిపోయిన విశాఖలో, ఎక్కడినుంచో వచ్చిన పురంధ్రీశ్వరి ఎంపీగా గెలిచి.. అక్కడి స్థానాన్ని సుస్థిర పరచుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేని తిక్కవరపు వారు.. తరచూ పురంధ్రీశ్వరిని రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. ఈ క్రమంలో... పురంధ్రీశ్వరిపై పైచేయి సాధించేందుకే.. సుబ్బరామిరెడ్డి గారు, తెలుగు లలిత కళాతోరణంలో తెలుగును తొలగించే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానం కలుగుతోంది.

నేతలూ దయచేసి రాజకీయాలను పక్కన పెట్టండి.. తెలుగు భాషను హతమార్చాలనుకునే వారిపై పోరాడదాం.. తెలుగును బతికించుకుందాం. కలసి రండి.