Wednesday, July 4, 2012

షుగర్‌ వ్యాధినీ తగ్గించొచ్చట...!


హైదరాబాద్‌లోని సీసీఎంబీ శాస్త్రజ్ఞులు.. జన్యు కణాలపై చేసిన పరిశోధనలు.. అనుకోకుండా.. షుగర్‌ వ్యాధి మూలాలను బయటపెట్టాయి. ఇన్సులిన్‌ అవసరం లేకుండానే.. షుగర్‌ వ్యాధిని కంట్రోల్‌ చేయడం కాదు.. ఏకంగా ఇతర వ్యాధుల మాదిరిగా నయం చేయవచ్చట. జీవుల్లోని 30 వేల జన్యువులు ఏ ఏ పనులు చేస్తాయో పరిశోధిస్తున్న సిసిఎంబీ శాస్త్రవేత్తలు.. తమ ప్రయోగాల ద్వారా.. డయాబెటీస్‌కి మందు కనుక్కోవచ్చని నిర్ధారించారు. WDR-13 అనే జన్యువుపై అధ్యయనంలో భాగంగా.. పదినెలల క్రితం ఓ కృత్రిమ ఎలుకను సృష్టించారు. ఆ చుంచులో WDR-13 జన్యువును తొలగించారు. అనూహ్యంగా.. WDR-13 జన్యువును తొలగించిన చుంచులో.. సాధారణ ఎలుకలకన్నా రెండింతల ఇన్సులిన్‌ పెరిగిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. మనుషుల్లోనూ ఇదే నాకౌట్‌ పద్ధతిని అమలు చేస్తే.. మధుమేహానికి అడ్డుకట్ట వేయవచ్చని సిసిఎంబీ శాస్త్రవేత్త డాక్టర్‌ సతీశ్‌కుమార్‌ నిర్ధారించారు.
తక్షణ ప్రయోజనం లేదు..!
సిసిఎంబీ శాస్త్రవేత్తల ప్రయోగ ఫలితం.. తక్షణమే మధుమేహ వ్యాధిగ్రస్థులకు ఉపయోగకరం కాదు. అయితే.. మందుల తయారీ సంస్థలు.. తమ జన్యు సిద్ధాంతాన్ని అనుసరించి ప్రయోగాలు చేస్తే.. త్వరలోనే డయాబెటిస్‌ నివారణకు మందు తయారు కావడం తథ్యమన్నది సిసిఎంబీ శాస్త్రవేత్తల నమ్మకం.
ఈ జన్యు ప్రొటీన్‌ పనితీరు చుంచుల్లోనూ.. మనుషుల్లోనూ ఇకే రీతిలో ఉండడం పరిశోధనల్లో కీలకాంశం. అయితే.. WDR-13 జన్యువును తొలగించిన కృత్రిమ ఎలుకలో కణాల సంఖ్య పెరుగుతూ పోతే మాత్రం అది ట్యూమర్‌కు దారి తీసే ప్రమాదం ఉంది. ఇలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ను కూడా దృష్టిలో ఉంచుకొని.. మందుల కంపెనీలు ప్రయోగాలు చేస్తే.. త్వరలోనే సత్ఫలితాలు రావొచ్చన్నది శాస్త్రవేత్తల నమ్మకం.
షుగర్‌ టెస్ట్‌ ఇక రూ.2
మధుమేహం వచ్చిందన్న బాధాకరమైన కబురు వినేందుకు ఇప్పుడు వందలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. మధుమేహ నిర్ధారణకు.. రక్త పరీక్షతో పాటు.. రకరకాల  టెస్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. రక్త పరీక్షకే వంద రూపాయల దాకా ఖర్చవుతోంది. ఇతరత్రా పరీక్షలు కలుపుకుంటే.. వెయ్యి దాకా అవుతోంది. ఈ పరీక్ష ఖర్చును భరించలేక బాధపడుతున్నవారికి త్వరలోనే ఉపశమనం కలగనుంది.   భారత వైద్య పరిశోధన మండలి - ఐసిఎంఆర్..... మధుమేహం కారణాన్ని అన్వేషించేందుకయ్యే ఖర్చును, తగ్గించే ప్రాజెక్టు చేపట్టింది. ఐసిఎంఆర్‌... శాస్త్రసాంకేతిక పరిశ్రమ పరిశోధన మండలి, ఐఐటి ఖరగ్‌పూర్‌, ప్రైవేట్‌ ఔషధ సంస్థలతో కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టు కింద కొత్త పరీక్ష విధానాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇది సఫలమైతే.. మన జేబులో రెండు రూపాయలుంటే చాలు.. మధుమేహ వ్యాధి వచ్చిందో లేదో తెలుసుకునే అవకాశం దక్కుతుంది. ఈ ఏడాది చివరినాటికల్లా ఈ కొత్త పరీక్షా విధానం సిద్ధమవుతుందని భావిస్తున్నారు. ఈ పరీక్ష అందుబాటులోకి వస్తే షుగర్‌ పేషెంట్లకు గొప్ప ఉపశమనం కలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రయోగాలు ఆశాజనకం
ఒకప్పుడు టైఫాయిడ్.. ఆ తర్వాత కలరా.. కొన్నాళ్లకు క్షయ.. కొంతకాలం క్రితం క్యాన్సర్‌.. ఇంకొన్నాళ్లకు ఎయిడ్స్‌.. ఇలా ఎప్పుడూ ప్రాణాంతంక వ్యాధులు పుడుతూనే ఉన్నాయి. కొన్నాళ్లు ప్రజల ప్రాణాలు హరించినా.. కొంతకాలానికి మన శాస్త్రవేత్తల ప్రయోగాలకు తలవంచుతూనే ఉన్నాయి. ఇప్పుడు బెంబేలెత్తిస్తున్న మధుమేహాన్ని కూడా మన శాస్త్రవేత్తలు తమ దారిలోకి తెచ్చుకోవడం ఖాయం. ఆ తియ్యని కబురు త్వరలోనే రావాలని.. ఆశిద్దాం.

2 comments:

  1. Yes, Good news....Its still under research.

    ReplyDelete
  2. మధుమేహం గురించి వ్రాస్తూ తీయని కబురంటే ఎలాగండీ!

    ReplyDelete