Monday, November 26, 2018


దుర్గగుడి ఫ్లైఓవర్ : రాష్ట్రానికి కేంద్రం వార్నింగ్
విజయవాడ : దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణంలో జాప్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. పనుల్లో జాప్యం వల్ల ఫ్లై ఓవర్  బడ్జెట్ అంచనా భారీగా పెరిగిపోతోందని కేంద్రం ఆగ్రహంగా ఉంది. అందుకే, కేంద్ర రోడ్డు, రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. ఇక ముందు ప్రాజెక్ట్ ఆర్థిక భారాన్ని మోయలేమని తేల్చేసింది. దీంతోపాటే, వంతెన నిర్మాణాన్ని వచ్చే సంవత్సరం మార్చి నాటికి పూర్తి చేసి తీరాలని హుకుం కూడా జారీ చేసింది.
తూతూ మంత్రం పనులే..!

విజయవాడ నగర వాసుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం
, రెండున్నర కిలోమీటర్ల మేర ఆరు వరుసల వంతెన, నాలుగు వరుసల దారి నిర్మాణాన్ని ప్రతిపాదించింది. దీనికోసం రూ.448.60 కోట్ల ఖర్చవుతుందని అంచనా వేసింది. కేంద్ర ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్‌తో, 2015 డిసెంబర్ 27న సోమా కన్ స్ట్రక్షన్ సంస్థ దుర్గగుడి ఫ్లై ఓవర్ పనులు మొదలు పెట్టింది. 2016 నాటికి పూర్తి కావాలన్నది తొలి లక్ష్యం. కానీ మూడేళ్లుగా ఫ్లైఓవర్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతునే ఉన్నాయి.
పదే పదే డెడ్‌లైన్‌లు :
సీఎం చంద్రబాబు దుర్గగుడి పైవంతెన పనులను చాలాసార్లు సమీక్షించారు. సుమారు 10 సార్లు డెడ్‌లైన్లు విధించారు. సీఎం సీరియస్ అయినప్పుడు ఒకటి రెండు రరోజులు పనులు వేగం అందుకోవడం, తర్వాత జోరు తగ్గడం పరిపాటిగా మారింది. ఇప్పటి వరకూ కేవలం 70 శాతం పనులు మాత్రమే పూర్తిచేయగలిగారు. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ పని చకచకా సాగుతుంటే, ప్రధానమైన దుర్గగుడి పైవంతెన పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న రీతిలో ఉన్నాయి. భారీ ప్రాజెక్టులు చేపట్టిన సోమ సంస్థ ఈ చిన్న ప్రాజెక్ట్ విషయంలో ఇంత జాప్యం చేస్తుండడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసహనంగానే ఉన్నాయి.
ట్రాఫిక్ సమస్య ఇంతింత కాదు
పోలీస్, రవాణా, నేషనల్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ 2015లో ఓ సర్వే ప్రకారం దుర్గగుడి మీదుగా నిత్యం 57 వేలకుపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీన్నిబట్టే బెజవాడలో ట్రాఫిక్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ రోజూ పరిపాటిగా మారింది. ఈసారైనా డెడ్‌లైన్ ప్రకారం ఫ్లైఓవర్‌ పనులు పూర్తయి, బెజవాడ ప్రజలకు ఊరటనిస్తాయో లేదో చూడాలి.

Wednesday, November 14, 2018

గురూ.. భలేగుందే..!



() ఈ చిత్రాన్ని చూస్తే చేయి తిరిగిన కళాకారుడు.. అద్భుతంగా గీసిన చిత్రం అనిపిస్తోంది కదూ.. కానే కాదు. అద్భుతంగా.. వినూత్నంగా వర్ణరంజితంగా ఉన్న ఈ మేఘాల సమూహం.. గురుగ్రహానికి చెందినది. నాసాకు చెందిన స్పేస్‌క్రాఫ్ట్‌ జూనో .. ఈ సుందర దృశ్యాన్ని గురు గ్రహానికి ఏడువేల కిలోమీటర్ల దూరం నుంచి.. క్లిక్‌ మనిపించింది. జోతిష శాస్త్రంలో 

Tuesday, January 30, 2018

ఆదర్శప్రాయుడు... మాణిక్‌సర్కార్‌



  • దేశంలోనే పేద ముఖ్యమంత్రి
  • బ్యాంకు ఖాతాలో 1520 రూపాయలు మాత్రమే
  • అఫిడవిట్‌లో వెల్లడి

త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌ సర్కార్‌.. దేశంలోనే అత్యంత నిరుపేద ముఖ్యమంత్రి. వినడానికి కాస్తంత విడ్డూరంగా
ఉన్నా... ఇది అక్షరాలా నిజం. ఆయన చేతిలో ఇప్పుడున్న నగదు కేవలం పదిహేను వందల రూపాయలు మాత్రమే. తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా.. నమ్మిన సిద్ధాంతాలకోసమే సంపాదనను ఖర్చు చేస్తోన్న ఆదర్శ రాజకీయవేత్త మాణిక్‌ సర్కార్‌.

త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్‌సర్కారు.. తనదైన విభిన్నశైలితో.. నేటి తరం రాజకీయ నాయకులకు ఆదర్శప్రాయుడిగా నిలుస్తున్నారు. ఒక్కసారి ముఖ్యమంత్రి పీఠం దక్కితేనే.. కొన్ని తరాలు కూర్చుని తిన్నా తరగని సంపదను కూడబెట్టే ఈ రోజుల్లో.. నమ్మిన సిద్ధాంతాలతోనే.. ముఖ్యమంత్రి హోదాలోనూ నిజాయితీతో.. స్వచ్ఛంగా.. జీవిస్తున్నారు మాణిక్‌ సర్కార్.

త్రిపుర రాష్ట్రానికి 1998లో తొలిసారి ఎన్నికైన మాణిక్‌ సర్కార్.. అప్రతిహతంగా ఐదు పర్యాయాలూ ఆ పదవిలో కొనసాగుతూనే ఉన్నారు. 2013 అసెంబ్లీ ఎన్నికల వేళ... ఆయన ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో.. తనవద్ద కేవలం తొమ్మిది వేల ఏడువందల రూపాయలు మాత్రమే నగదు ఉన్నట్లు వెల్లడించారు. తద్వారా.. అప్పట్లోనే.. దేశంలోనే పేద ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారు.

ప్రస్తుతం త్రిపుర రాష్ట్రంలో జరుగుతోన్న ఎన్నికల్లో మాణిక్‌సర్కార్‌ ధన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇదేసందర్భంలో.. ఆయన ఎన్నికల సంఘానికి తన ఆస్తుల వివరాలతో కూడిన అఫిడవిట్‌ను సమర్పించారు. అందులో.. తన బ్యాంకు ఖాతాలో 1520 రూపాయలు మాత్రమే ఉన్నట్లు వెల్లడించారు. అంటే, 2013 ఎన్నికల నాటితో పోలిస్తే.. ఆయన వద్దనున్న బ్యాంక్‌ బ్యాలెన్స్‌ గణనీయంగా తగ్గిపోయింది. అంటే గడచిన ఐదేళ్లలో ఆయన మరింత పేదవాడిగా మారిపోయారని అర్థమవుతోంది.

సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడిగా కూడా కొనసాగుతోన్న మాణిక్‌ సర్కార్.. ముఖ్యమంత్రిగా తనకు వచ్చే వేతనం 26వేల 315 రూపాయలను పార్టీ నిధుల కిందే జమ చేస్తూ వస్తున్నారు. తన జీవనానికి గాను, పార్టీ నుంచి ప్రతి నెలా 9వేల ఏడు వందల రూపాయలు పొందుతున్నారు. మాణిక్‌ సర్కార్‌ సతీమణి పాంచాలి భట్టాచార్జీ రిటైర్డ్‌ ప్రభుత్వోద్యోగి. ఆమె చేతిలో మాత్రం 20వేల నగదు ఉంది. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ రూపంలో వచ్చిన పన్నెండు లక్షల 15వేల రూపాయల నగదు ఆమె బ్యాంకు ఖాతాలో ఉంది.

మాణిక్‌సర్కార్‌ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ... అతి సాధారణవ్యక్తి మాదిరిగా జీవిస్తున్నారు. ఐదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మాణిక్‌ సర్కార్‌కు కనీసం మొబైల్‌ ఫోన్‌ కూడగా లేదు. బయటికి వెళ్లేప్పుడు, రిక్షాల్లోనూ.. రైల్వే జనరల్‌ కంపార్ట్‌మెంట్‌లలోనే ప్రయాణిస్తూ ఉంటారు. రాజకీయాలు అనగానే.. దోపిడికి దగ్గర దారి అని భావించే ఎందరో నాయకులకు.. మాణిక్‌ సర్కార్‌ నిబద్ధత.. జీవనశైలి నిస్సందేహంగా ఆదర్శప్రాయమే.