Tuesday, June 22, 2010

ఇది ఒక వర్కింగ్ జర్నలిస్టు బ్లాగు....

హాయ్ ఫ్రెండ్స్....
నాపేరు విజయకుమార్.. ఈనాడు జర్నలిజం స్కూలు రెండో బ్యాచ్ (1992) విద్యార్థిని. నిజానికి 1989వ సంవత్సరం నుంచే జర్నలిస్టుగా ప్రస్థానం ప్రారంభించాను. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గపు కంట్రిబ్యూటర్ గా 1989 ఆగస్టు 30వ తేదీన జర్నలిజంలోకి అడుగు పెట్టాను. అంతకుముందు నాకు జర్నలిజం అంటే పెద్దగా పరిచయం లేదు.

కుటుంబ ఆర్థిక పరిస్థితులు, ఏదో ఒక ఉద్యోగం వెతుక్కోమని.. నన్ను దిక్కు దిక్కులకూ తరిమాయి. ఈక్రమంలో.. చిన్నా చితకా పనులు చేశాను. కానీ ప్రతినెలా జీతం వచ్చే స్థిరమైన ఉద్యోగం లేకుంటే.. మనం బతకడం కష్టమని అర్థమై పోయింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం చూసుకోకుండా.. ఏదో ఒకటి అంటూ.. ఉద్యోగం కోసం దేవులాడుతున్నప్పుడు.. ఈనాడు పత్రికలో కంట్రిబ్యూటర్ కావలెను అనే ప్రకటన వచ్చింది. దాన్ని చూసి.. కర్నూలులో వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్లా.

మా ఎమ్మిగనూరు సెంటర్ కోసం ఒక 30 మంది దాకా దరఖాస్తు చేసుకున్నట్లున్నారు. అందరికీ రాత పరీక్ష పెట్టారు. అంతమందిలో మనమెక్కడ.. అని మొక్కుబడిగా రాశాను. ఆశ్చర్యం.. మధ్యాహ్నానికి అప్పటి ఈనాడు కర్నూలు స్టాఫర్ రంగయ్య గారు (ప్రస్తుతం ఆంధ్రజ్యోతి సిటీ బ్యూరో చీఫ్)..నన్ను మెచ్చుకుంటూ.. నీ కాపీ చాలా బావుంది.. నువ్వు ఎన్నికయ్యావు.. ఎమ్మిగనూరు సెంటర్ వార్తలు ఈ క్షణం నుంచే రాయడం ప్రారంభించు.. అని చెప్పేశారు.

నాకు ఒక్కక్షణం మైండ్ బ్లాంక్ అయింది.. ఇక ఆక్షణంలో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం దొరికినంత ఆనందం వేసింది. ఇంజనీర్ కావాలని కలలు కన్న విజయకుమార్.. ఆవిధంగా జర్నలిస్టుగా రూపాంతరం చెందాడు. నేను ఎంచుకున్న రంగం.. వేసిన తొలి అడుగు మంచిదేనా.. నా జీవితాన్ని ముంచిందా..? వంటి ప్రశ్నలకు సమాధానాలు మున్ముందు దొరుకుతాయీ బ్లాగ్ లో.

ఇది నా స్వగతం.. కొంతమందికి నచ్చవచ్చు.. మరికొంతమందికి సుత్తి కొడుతున్న భావనా కలగ వచ్చు. అయితే.. ఒక జర్నలిస్టు వృత్తిగత, వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఉత్థాన పతనాలు ఉంటాయో.. చొరవ లోపిస్తే రాష్ట్రస్థాయి బ్రేకింగ్ న్యూస్ ఇచ్చి కూడా.. అనామక జర్నలిస్టుగా ఎందుకు ఉండిపోవాల్సి వస్తుందో.. పరిటాల రవీంద్ర, వైఎస్ రాజశేఖరరెడ్డి లాంటి వారి జీవితాలను దగ్గర నుంచి చూసీ.. యాధృచ్ఛికంగా వారిద్దరి మరణాలనూ కవర్ చేసిన ఒక జర్నలిస్టు మనోగతం ఎలాంటిదో.. ఒకటేమిటి ఇలాంటి ఎన్నో ఎన్నెన్నో విషయాలను ఇందులో చర్చించ దలచుకున్నాను. వీటిని చదివితే.. భావి జర్నలిస్టులు (కాణీ ఖర్చు లేకుండా) చక్కటి గుణపాఠాలను నేర్చుకోగలుగుతారన్నది నా సంపూర్ణ విశ్వాసం.

Thursday, June 17, 2010

పరిచయం

హాయ్ ఫ్రెండ్స్..

నేను విజయకుమార్.. పూర్తి వివరాలతో మరో పోస్టులో కలుస్తా.